Homeఆంధ్ర ప్రదేశ్ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఇచ్చిన గడువు పూర్తవుతోందా..?

ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఇచ్చిన గడువు పూర్తవుతోందా..?

టిక్కెట్లు ఎవరికి.. అన్న విషయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ క్లారిటీ ఇవ్వనున్నారా..? ఈనెల రెండోవారంలో ఈ అంశంపై కీలక ప్రకటన రానుందా..? ఇదే వార్త ఇప్పుడు వైసీపీ నేతల్లో టెన్షన్ పెట్టిస్తోందట.

సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేల పని తీరుపై రకరకాలుగా సర్వేలు ..

ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఇచ్చిన గడువు పూర్తవుతోందా.. గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చెప్పనున్నారు.. అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల రెండో వారంలో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇచ్చిన జగన్ వచ్చే సమావేశంలో ఎలా రియాక్ట్ అవుతారన్న అంశం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేల పని తీరుపై రకరకాలుగా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇంచుమించు ప్రతి రోజు ఏదో ఒక సర్వే రిపోర్ట్ సీఎం దగ్గరకు వస్తోంది. పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పని తీరును ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో తీసుకుంటున్న సీఎం ఈ వ్యవహరాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు గడప గడపకు తిరుగుతున్నారు.

ప్రతి ఇంటికి వెళ్లాలని సీఎం ఇచ్చిన ఆదేశాలతో ప్రతి గడప ను టచ్ చేస్తున్నారు. తలుపుతట్టి మరి ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.కొన్నిచోట్ల నిరసనలు, కొన్నిచోట్ల పొగడ్తలతో రకరకాల అభిప్రాయల సేకరణతో గడప గడప కార్యక్రమం జరుగుతోంది.

కొంతమంది ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికి, సీఎం జగన్ వద్దకు రిపోర్ట్ లు వెళుతున్న క్రమంలో అందరూ ఎప్పుడో ఒకప్పుడు గడప గడప కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

పార్టీని, ప్రభుత్వాన్ని కలుపుకొని ముందుకువెళితేనే వచ్చే ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించవచ్చన్నది జగన్ అభిప్రాయం. అందులో భాగంగానే 175 సీట్ల టార్గెట్ ను జగన్ ప్రకటించారు. అదే టార్గెట్ ను ఎమ్మెల్యేలకు పెట్టి, విజయమే అంతిమంగా పని తీరు ఉండాలన్న స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా గడప గడపలో పాల్గొనక తప్పడంలేదు.

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ ఇప్పటికే సమావేశం నిర్వహించారు. తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయం వేదికగా 175 నియోజకవర్గాల్లోని ఇంఛార్జ్ లు, ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం అయ్యారు. అదే సమావేశంలో ఎమ్మెల్యేలు గడప.. గడపకు ప్రభుత్వం జరుగుతున్న తీరుపై జగన్ సమీక్షించారు.

ఒక్కో ఎమ్మెల్యే రోజులో ఎన్ని గంటలు, గడప గడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ప్రజలకు దూరంగా ఎన్ని రోజులు ఉన్నారు, అనే విషయాలను జగన్ ప్రతి
ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఎమ్మెల్యేలు ఆశ్చర్యానికి గురయ్యారు. గడప.. గడప పేరుతో మెక్కుబడిగా ప్రజల్లోకి వెళ్ళి మార్నింగ్ వాక్ తరహాలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఎమ్మెల్యలు ఎవరనే విషయాలను కూడా జగన్ నవ్వుతూనే అదే సమావేశంలో తెలియజేశారు.

దాదాపుగా 27మంది ఎమ్మెల్యే లపై జగన్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అందులో రోజా, కొడాలి నానితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర లాంటి నేతలు ఉండటం కొసమెరుపు.

ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. ఎవరికి టికెట్లు.. ఎవరికి ఇక్కట్లు

ఇక మరోసారి అత్యంత కీలకమయిన ఈ సమావేశాన్ని వచ్చే వారంలో నిర్వహించేందుకు జగన్ రెడీ అవుతున్నారు. త్వరలో సీఎం జగన్ ఎమ్మెల్యేలతో కీలక సమీక్షా సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. ఈ సమీక్షలో ఎమ్మెల్యేల తాజా పరిస్థితిని మరోసారి జగన్ స్వయంగా సమీక్షిస్తారు.

ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. ఎవరికి టికెట్లు.. ఎవరికి ఇక్కట్లు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీలో ఇప్పటికే ప్రచారం మెదలైంది. సీఎం ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేలకు గడప గడపకు కార్యక్రమానికి పెద్దగా టైం కూడా ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.

ఎందుకంటే 2023 లో అంతా ఎన్నికల మూడ్ ఉంటుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత నుంచి ఇక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉండడంతో ఈ నెలలో ఎమ్మెల్యేలతో జరిగే సమావేశం కీలకం కానుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆశావహులు కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు మెదలుపెట్టారని అంటున్నారు.

ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ చేపట్టిన సర్వేలో సీనియర్ ఎమ్మెల్యేలు వెనుకబడినట్టు తెలియడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. 175 నియోజకవర్గాలను టార్గెట్ చేసినట్టు ఇటీవల జగన్ ప్రకటిస్తూ వచ్చారు.

కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు సీనియర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలియడం మింగుడుపడడం లేదు. 175 స్థానాలను పక్కనపెట్టి.. ఇప్పుడున్న స్థానాలను నిలబెట్టుకోవడం ఎలా అన్నదానిపై జగన్ ఫోకస్ పెట్టారు. అందుకే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తున్నారు. పనితీరు బాగాలేని వారిని పిలిచి మరీ మెరుగుపరచుకోవాలని ఆదేశాలిస్తున్నారు. లేకుంటే మార్పు అనివార్యమని సంకేతాలిస్తున్నారు.

అభ్యర్థుల కంటే పార్టీయే ముఖ్యమని అవసరమైతే ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకుంటానని ఇప్పటికే పలుమార్లు జగన్ హెచ్చరికలు పంపారు. ఇప్పటికే 3,4 సార్లు అవకాశమిచ్చిన జగన్ ఇప్పుడు ఫైనల్ లీస్టు రూపొందించారు. అయితే అందులో అనూహ్యంగా కొందరు సీనియర్లు, పేరుమోసిన నాయకులే ఉండడం జగన్ ను కలవరపరుస్తోంది. దీంతో అసలు సీఎం ఏం చెప్పబోతున్నారు? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోనని పార్టీలో చర్చ నడుస్తోంది.

ఇప్పుడున్న సిట్టింగులలో ఎంతమంది టిక్కెట్లు దక్కించుకుంటారు? ఎంతమంది సీట్లు కోల్పోతారు? అన్నది పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వంతో పాటు పార్టీలో కీలక మార్పులు చేసిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు మదింపుపై పడ్డారు. వచ్చే ఎన్నికల్లో టిaక్కట్ల విషయంలో ఒక అంచనాకు వచ్చారు.

దీంతో సిట్టింగుల్లో ఎంత మందికి సీట్లు దక్కుతాయో .. ఎంత మంది ని పక్కన పెడుతారోననేది పార్టీలో ఉత్కంఠo పెంచుతోంది.

ఈ ఏడాది ఉగాది నుంచి ఇప్పటివరకూ వర్క్ షాపుల పేరిట ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు, కీలక నాయకులతో జగన్ మూడుసార్లు సమావేశమయ్యారు. రెండు నెలల కిందట జరిగిన సమావేశంలో ఏకంగా 27 మంది సిట్టింగులు వెనుకబడి ఉన్నారని పేర్లతో సహా ప్రస్తావించారు. పార్టీ కార్యక్రమాల్లో వెనుకబడ్డారని.. గడపగడపకు కార్యక్రమంతో బలం పెంచుకోవాలని సూచించారు.

అయితే ఆ 27 మందిలో ఎంతమంది బలం పెంచుకున్నారు? జగన్ చేతికి అందిన నివేదికలు ఏమిటి? అందులో ఎంతమందికి మొండి చేయి
చూపుతారోనని పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది.

వారిలో కొందరు పనితీరు మెరుగుపరచుకున్నారని తెలుస్తోంది. కానీ ప్రధానంగా నాలుగు జిల్లాలో 11 మంది పనీతిరు మరీ తీసికట్టుగా ఉందని.. అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారని టాక్ అయితే ప్రచారంలో ఉంది. ఎమ్మెల్యేల పనితీరు, సామాజిక సమీకరణలు, ప్రజా మద్దతు, ప్రత్యర్థి పార్టీల బలాబలాలు, ప్రభుత్వంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల సానుకూలత తదితర అంశాలపై సర్వే చేయిస్తున్నారు.

ఈ సమాచారం మేరకు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల వారే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు తాజా మంత్రులు సైతం ఉన్నట్టు సమాచారం. సిట్టింగ్ స్థానాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు.

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే కొంతమంది సిట్టింగులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. అయితే ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనివార్యంగా మారింది.

అందుకే వర్కుషాపులో నేరుగా కొందరికి అల్టిమేట్ ఇస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీంతో సిట్టింగుల్లో ఎంత మందికి సీట్లు దక్కుతాయో .. ఎంత మంది ని పక్కన పెడుతారోననేది పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి..ప్రతీ నియోజకవర్గం విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

టీడీపీ సిట్టింగ్ లకే సీట్లు ఖరారు చేయటంతో, గతంలో ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన, ప్రస్తుతం ఆ నియోజవర్గాల్లో ఇంఛార్జ్ లు గా ఉన్న వారి విషయంలో మాత్రం జగన్ సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక సీట్లు దక్కని వారికి పార్టీలో మరో విధంగా గుర్తింపు ఇస్తామని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లోనూ ముగ్గురికి సీట్ల కేటాయింపుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆరు నెలల ముందే టికెట్లు ప్రకటిస్తానని సీఎం స్పష్టం చేయడంతో, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సీట్లు దక్కేదెవరికి.. దక్కనిదెవరికి అన్నది ఇప్పుడు పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది.

వీరి విషయంలో జగన్ మరోచాన్స్ ఇస్తారా? లేకుంటే ఈ వర్కుషాపులో తేల్చేస్తారా? అన్న ప్రచారమైతే పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

Must Read

spot_img