పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఎన్ఐఏ మళ్లీ సోదాలు ఎందుకు చేపడుతోంది..? నిషేధిత సంస్థపై మళ్లీ దాడుల వెనుక ఏం జరుగుతోంది..? దక్షిణాదిలో బాంబు పేలుళ్ల వెనుక .. పీఎఫ్ఐ హస్తమే .. కారణమా..?
నిషేధం విధించినా, ఉగ్రవాద మద్ధతును .. పీఎఫ్ఐ కొనసాగిస్తోందా..? తాజా బాంబు పేలుళ్ల వెనుక .. ఈ సంస్థ హస్తముందా..? అందుకే మళ్లీ పీఎఫ్ఐ సంస్థలపై, కార్యకర్తలపై ఎన్ఐఏ నిఘా పెట్టిందా..?
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జాతీయ దర్యాప్తు సంస్థ మరోసారి దాడులు నిర్వహిస్తోంది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. పీఎఫ్‌ఐ ఆఫీస్ బేరర్లు, సభ్యులు, ఇతర కార్యకర్తల ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతోపాటు అక్రమ నిధుల కేసులో తిరువనంతపురం, కొల్లాం, పటానంతిట్ట, ఎర్నాకుళం, అళప్పుజ, మళప్పురం జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇప్పటికే వంద మందికిపైగా పీఎఫ్‌ఐ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, పీఎఫ్‌ఐపై నిషేధం తర్వాత మరో పేరుతో తిరిగి సంస్థను స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఆ సంస్థకు చెందిన కొందరు కీలక వ్యక్తుల స్థావరాలను టార్గెట్ చేసుకుంది ఎన్ఐఏ. కేరళలోని ఎర్నాకులంలో నిషేధిత పీఎఫ్‌ఐ నేతలకు సంబంధించిన 8 ప్రత్యేక కార్యాలయాల వీరు కేంద్రంగా ఈ దాడులు సాగుతున్నాయి. తిరువనంతపురంలో 6 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. పీఎఫ్ఏ కేరళలో 2006 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది 2009 సంవత్సరంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే రాజకీయ ఫ్రంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. కేరళలో స్థాపించబడిన ఛాందసవాద సంస్థ క్రమంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో తన శిబిరాన్ని విస్తరించింది. లేటెస్టుగా మంగళూరు బ్లాస్ట్, అంతకుముందు కోయంబత్తూరులో పేలుడు మిస్టరీని ఛేదించిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలుస్తున్నాయి. టెర్రర్ తీగ లాగితే పీఎఫ్ఏ డొంక కదులుతోందని నిఘా వర్గాల సమాచారం.
కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ, నేషనల్ డెపలప్‌మెంట్ ఫ్రంట్ సంస్థల కలయికతో 2006లో PFI పురుడు పోసుకుంది. మైనారిటీల హక్కుల కోసం పోరాడే సంస్థగా తనను తాను అభివర్ణించుకునేది ఈ సంస్థ. అయితే ఈ సంస్థ తరచు సంఘ విద్రోహ, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో హైదరాబాద్‌తో పాటు దేశంలో పలుచోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడి నిషేధానికి గురైన ఇండియన్ ముజాహిదీన్ దాని మాతృ సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ అని పిలిచే సిమి, ఈ రెండు కాలక్రమంలో రూపాంతరం చెంది, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు PFI గా మారాయని 2012లో కేరళ ప్రభుత్వం ప్రకటించింది. PFI కార్యకర్తల వద్ద మారణాయుధాలు, బాంబులు, గన్ పౌడర్, తుపాకులు, కత్తులను పలుమార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థకు తాలిబాన్, అల్‌ఖైదా లాంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా మంగళూరు బ్లాస్ట్‌తో మరోసారి PFI పేరు తెర పైకి వచ్చింది.
కోయంబత్తూరు, మంగళూరు బ్లాస్టులతో తాజా రివెంజ్ దాడుల వెనుక ఈ నిషేధిత సంస్థ హ్యాండ్ ఉందని నిర్ధారణ అయింది.
2013 ఏప్రిల్‌లో కేరళలోని కన్నూరులో PFI నిర్వహించిన ట్రైనింగ్ క్యాంప్‌పై పోలీసులు దాడులు నిర్వహించి 21మందిని అరెస్ట్ చేశారు. వాళ్లను నుంచి బాంబులు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు ప్రముఖుల పేర్లు ఉన్న హిట్ లిస్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. తాజా దాడుల్లో నిషేధిత పీఎఫ్ఐ కి చెందిన విలువైన సమాచారాన్ని ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఉగ్రవాదం, హత్యల వంటి వివిధ నేరాల కింద అరస్టైన పీఎఫ్ఐ కార్యకర్తలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్ఐఏ ఈ దాడులు చేపట్టింది. గతంలో పీఎఫ్‌ఐలో క్రియాశీలక కార్యకర్తలుగా ఉన్న నాయకుల ప్రాంగణాలపై ప్రత్యేకంగా దాడులు జరిగాయి. నిషేధం తర్వాత అనేక మంది పీఎఫ్‌ఐ నాయకుల కార్యకలాపాలను ఎన్‌ఐఏ ట్రాక్ చేస్తోందని, వారిలో చాలా మంది ఎర్నాకులం, అలప్పుజ, మలప్పురం, తిరువనంతపురంలోని వివిధ ప్రాంతాల్లో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందిందని వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. ఈ దాడుల్లో భాగంగా నిధుల బదిలీలను ట్రాక్ చేయడానికి ఎన్ఐఏ బృందం కొంతమంది అనుమానితుల బ్యాంక్ ఖాతా వివరాలను కూడా సేకరిస్తోంది. జాతీయ స్థాయిలో ముస్లిం వర్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనకబడిన వారికి సాధికారత కల్పించేందుకు ఓ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో పలు ముస్లిం సంస్థలు ఏకమై 2006లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గా అవతరించాయి. పీఎఫ్‌ఐగా ఏర్పడిన కొద్ది కాలానికే ఆ సంస్థ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రధానంగా.. మణిపూర్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు వ్యాపించింది.
కేరళ, కర్ణాటక, తమిళనాడులో పీఎఫ్ఐ బలమైన ఉనికిని కలిగి ఉంది. దీనికింద సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, విద్యార్థి విభాగమైన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ వుమెన్స్ ఫ్రంట్, రెహబ్ ఇండియా ఫౌండేషన్‌తో పాటు ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ వంటివి అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఉగ్రవాద చర్యలు సహా అనేక మంది వ్యక్తుల హత్యలలో PFI కార్యకర్తల హస్తం ఉన్నట్లు ఎన్‌ఐఏకు సమాచారం అందడంతో ఈ దాడులు చేస్తోంది.
2021 నవంబర్‌లో కేరళలో హత్యకు గురైన సంజిత్, 2019లో తమిళనాడులో వీ రామలింగం, 2021లో కేరళలో నందు హత్య, 2016లో తమిళనాడులో శశికళ కుమార్ హత్యలతో పీఎఫ్ఐ కార్యకర్తలకు సంబంధమున్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఇటీవలి దాడుల్లో, NIA కొన్ని పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఆ పరికరాలను పరిశీలించిన తర్వాత PFI నాయకులు అల్ ఖైదాతో టచ్‌లో ఉన్నారని తెలిసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లక్ష్యంతో ఈ హత్యలు జరిగాయని హోం మంత్రిత్వ శాఖ అంతకుముందు పేర్కొంది. ప్రజల మదిలో భయాందోళనలు సృష్టించేందుకు నేరపూరిత చర్యలు చేపట్టారని ఎంహెచ్‌ఏ పేర్కొంది. దేశంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఆ ఉత్తర్వులను వెంటనే అమల్లోకి తెచ్చింది. పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే ఆ సంస్థపై ఈ నిషేధం విధిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో కారణంగా పేర్కొన్నారు. ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థ కార్యాలయాలు సహా సభ్యుల ఇళ్లపై వరుస సోదాలు నిర్వహించింది. ఎన్ఐఏ పలువురు పీఎఫ్ఐ లీడర్లను అరెస్టు కూడా చేసింది. అణగారిన వర్గాల సాధికారతే తమ లక్ష్యం అని పీఎఫ్ఐ చెప్పుకుంటున్నా .. అతివాద ఇస్లాంను పీఎఫ్ఐ ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ, ఐబీ లాంటి కేంద్ర భద్రతా సంస్థలు మాత్రం ఆరోపిస్తున్నాయి. పీఎఫ్‌ఐపై పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలు, 2020 ఢిల్లీ అల్లర్లు, యూపీ హాథ్రాస్ దళిత బాలిక గ్యాంగ్ రేప్ వ్యవహారంలో కుట్రకు పీఎఫ్ఐ ఆర్థికంగా మద్దతు ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.
అణగారిన వర్గాల సాధికారత స్థానంలో అతివాద ఇస్లాంను పెంచి పోషించడమే ఈ సంస్థ లక్ష్యంగా ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..