అందుకే వరుస జిల్లాల పర్యటనలు, అభివృద్ధి పనులు చేపడుతున్నారా..?
నోటితో చెప్పిన ప్రతి విషయాన్నీ నొసటితో కాదనడం కేసీఆర్ కు బాగా తెలిసిన విద్య. అందుకే ఆయన ముందస్తు ప్రశక్తే లేదని ఇటీవలి కాలంలో
ఎన్నిమార్లు ఉద్ఘాటించినా రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా నమ్మకం కనిపించలేదు.
ఇంత గట్టిగా చెబుతున్నారు కనుక ముందస్తు ఖాయం అన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమైంది. అందుకు తగ్గట్టుగానే కేసీఆర్ జిల్లాల కార్యాలయాలు, కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాల స్పీడ్ పెంచారు. ఆ సందర్బంగా ఏర్పాటు చేసే సభలలో వరాల జల్లులు కురిపించడంతో మాటు మరో మారు టీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలన్న విజ్ణప్తులూ చేస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచే ఢిల్లీ పీఠానికి గురిపెట్టానంటున్నారు. అందుకోసం తనను తెలంగాణలో గెలిచించాలని కోరుతున్నారు.
పాలమూరులో కేసీఆర్ పర్యటన మొత్తం ఎన్నికల సందడినే స్ఫురింపచేసింది. ఆ సందర్భంగా ఆయన మాటలన్నీ ఎన్నికలను టార్గెట్ చేసే ఉన్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఉద్దేశాన్నే చాటాయి. జాతీయ వ్యూహాన్ని మార్చి పూర్తిగా తెలంగాణ ఎన్నికలపైనే దృష్టి పెట్టిన కేసీఆర్ హామీలు, అభివృద్ధి పనులపై కాన్ సన్ ట్రేట్ చేయడానికి డిసైడైపోయారని అంటున్నారు.

ముందస్తు ప్రసక్తే లేదని ప్రకటించిన కేసీఆర్ అందుకు పూర్తి భిన్నంగా ఎన్నికల సన్నాహాలలో నిమగ్నమైపోయారన్న చర్చరాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత కేసీఆర్ ముందస్తు ఉండదని నోటితో చెబుతూనే.. తెరవెనుక ముందస్తు సన్నాహాలు మొదలెట్టేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ పరంగా శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే కాదు… పాలన పరంగా కూడా కేసీఆర్ దూకుడు పెంచారు. పాలమూరుతో ప్రారంభించి.. డిసెంబర్ లో పలు జిల్లాలలో కూసీఆర్ పర్యటనలకు షెడ్యూల్ రెడీ చేసుకున్నారు.
యదాద్రి పవర్ ప్లాంట్ పర్యటన, మెట్రో విస్తరణ, సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించడం, అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి కసరత్తు, సొంత స్థలాలు ఉన్న వారికి ఆర్థిక సాయం ఇలా ఇంత కాలం పట్టించుకోకుండా వదిలేసిన పథకాలను పట్టాలు ఎక్కించనున్నారు. ఇక ఒక్కటొక్కటిగా ఉద్యోగ
నోటిఫికేషన్లు సైతం ఒక్కొక్కటి జారీ చేస్తున్నారు.
హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు కూడా పదును పెడుతున్న కేసీఆర్ స్పీడ్ ను చూస్తుంటే ముందస్తు తథ్యమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలతో పార్టీలో జోష్ పెంచుతుంటే మరో వైపు మంత్రి కేటీఆర్ గ్రేటర్ పరిధిలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు వరుస ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరిన్ని కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
ముందస్తు ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలోనే ముందస్తు ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతోంది. అయితే ముందస్తు తేదీపై మాత్రమే భిన్న వాదనలు
వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశం అవుతోంది.
ఈ సమావేశాలలోనే ముందస్తు ప్రకటన చేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. ఒక వేళ ఈ అసెంబ్లీ సమావేశాలలో ముందస్తు ప్రకటన లేకుంటే మరో రెండు నెలల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అంత వరకూ వేచి ఉండి.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ముందస్తు ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మార్చి లోగా ముందస్తు ప్రకటన ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.

అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల మధ్యలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన ప్రసంగాలు, ప్రకటనల ద్వారా ఒక వైపు ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ ను రగులుస్తున్నారనీ, అదే సమయంలో మరో వైపు విపక్షాలను ముఖ్యంగా బీజేపీని తెలంగాణ ద్రోహిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ప్రజలు హామీ ఇస్తే దేశ రాజకీయాల్లోకి వెళ్తామని సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు.ప్రశ్నించినందున తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మోదీ అన్నారని మండిపడ్డారు.
మీరు నాతోరండి.. నేను మీతో ఉంటా.. అందరం కలిసి దేశ రాజకీయాల్ని మార్చేద్దామని పిలుపునిచ్చారు. కేంద్రం వల్ల తెలంగాణ సర్కార్‌కు మూడు లక్షల కోట్ల నష్టం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్డీపీ ఇంకా పెరిగి ఉండేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మహబూబ్ నగర్ ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా మారుతోందని, అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయని.. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ ఒక్కటే పూర్తి కావాల్సి ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అడ్డం పడుతోందని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయదు కానీ కాళ్లలో కట్టెలు పెడతారని మండిపడ్డారు. తెలంగాణలో అద్భుతమైన ప్రగతి సాధించామని.. బీఆర్ఎస్ ద్వారా
దేశం మొత్తాన్ని తెలంగాణ తరహాలో అభివృద్ది చేసుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. గతంలో జిల్లాల పర్యటనల్లో కూడా కేసీఆర్ ఇదే రీతిన
ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలు తనకు అండగా ఉంటే దేశ రాజకీయాల్లో ప్రభావం చూపుదామని పిలుపునిస్తున్నారు. దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు దాదాపు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో టీఆర్ఎస్ కీలక నేతలపైన సీబీఐ, ఈడీ కన్నేసాయి.
దూకుడు మీదున్న బీజేపీకి అడ్డుకట్ట వేయాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మార్గమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే వీలైనంత త్వరగా ముందస్తుకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సంక్రాంతి తర్వాత ఏ క్షణాన్నయినా అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన లేదు. అయితే మునుగోడు ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ మదిలో ముందస్తు ఆలోచన వచ్చినట్టు సమాచారం. మునుగోడు ఉపఎన్నిక సమయంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో కూడా షిండే తరహా స్కెచ్ ను బీజేపీ వేసిందనే ఆరోపణలున్నాయి. అంతేకాక ఢిల్లీ లిక్కర్ స్కాం లో టీఆర్ఎస్ కీలక నేతలపైన సీబీఐ, ఈడీ కన్నేసాయి.
టీఆర్ఎస్ నేతలను ఇరుకించి లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అదే సమయంలో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేసీఆర్ సర్కార్ ను పడగొట్టేందుకు బీజేపీ వ్యూహం రచించిందనే వార్తలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో మునుగోడు ఉపఎన్నికలో గెలుస్తామని బీజేపీ చాలా గట్టిగా భావించింది.
అయితే అక్కడ ఆ పార్టీ బోల్తా పడడంతో కాస్త మెత్తబడింది. ఇప్పుడు డీలా పడిన బీజేపీని మరింత వెనక్కు నెట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ ఆగితే ఈలోపు బీజేపీ రాష్ట్రంలో పలువురు నేతలను తమవైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ ఛాన్స్ బీజేపీకి ఇవ్వకూడదనుకుంటున్నారు.
అందుకే బీజేపీకి ఊపిరాడనివ్వని సమయంలోనే ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇప్పటికీ సంస్థాగతంగా బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను లాక్కోవడం ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్. తగినంత సమయం ఇస్తే బీజేపీ కచ్చితంగా ఈ పని చేస్తుంది.
అందుకే ఆ సమయం ఇవ్వకుండా ముందే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఏమైనా విభేధాలు ఉంటే..
పరిష్కరించుకోవడానికి ఆత్మీయ సమావేశాలు పెట్టుకోవాలనికేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. మండలాల వారీగా పార్టీ కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాల
కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిల కోసం జాబితాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించారు. ఇవన్నీ మార్చిలోపు పూర్తవుతాయని అంచనా వినిపిస్తుండడంతో, కేసీఆర్ మార్చి నాటికి ఎన్నికలకు రెడీ అయిపోతారు. బడ్జెట్ పెట్టిన తర్వాత ఆయన అసెంబ్లీని రద్దు చేయవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
మరి కేసీఆర్ ముందస్తు వ్యూహం ఎటువంటి ఫలితాన్నిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.