కవితకు ఉమెన్స్ డే సందర్భంగా ఈడీ నోటీసులు జారీ చేయడంతో .. తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఇక కవిత అరెస్ట్ తప్పదన్న టాక్ వేళ .. నెక్ట్స్ ఏం జరగనుందన్నదే హాట్ టాపిక్ గా మారాయి. కవిత అరెస్ట్ తప్పదా..? ఒకవేళ అరెస్టయితే, కేసీఆర్ ఏం చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ చేరుకున్నారు. హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ తనకు సమయం కావాలని ఆమె రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. పదిహేనో తేదీ తర్వాత హాజరవుతానని చెప్పారు. దీనిపై ఈడీ అధికారుల నుంచి ఎలాంటి స్పందనలేదు. ఈడీ నోటీసులు జారీ అయిన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‌కు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అంతకు ముందు .. ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలుచెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందాల్సిన పని లేదని.. మహిళా రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటాన్ని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాను యధావిధిగా కొనసాగించాలని కేసీఆర్ కవితకు సూచించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడుదామని… భారత రాష్ట్ర సమితి.. పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత కవిత ఢిల్లీ బయలుదేరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్ తో ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది . ఈ దీక్ష కోసమే కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈడీ స్పందించకపోతే కవిత విచారణకు హాజరయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. విచారణకు సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తే కేసు క్లిష్టంగా మారుతుంది. అయితే ఈడీ స్పందించి.. గడువు ఇస్తే.. మహిళా రిజర్వేషన్ల అంశంపై ధర్నా తర్వాత ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఒక వేళ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే తెలంగాణలో భారీ ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. తమ మద్దతుదారులైన ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతోనే నిరసనలు చేయించే అవకాశం ఉందని చెబుతున్నారు. మంగళవారమే రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేసిన ఈడీ .. రిమాండ్ రిపోర్టులో ఆయనను కవిత బినామీగా తేల్చారు. ఈ విషయాన్ని రామచంద్ర పిళ్లై ఒప్పుకున్నారని పేర్కొన్నారు. దీంతో కవిత విషయం సంచలనంగా మారింది.
ఒక్క రోజులోనే కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.
గతంలో సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసినప్పుడు కవిత .. మొదట విచారణకు గడువు కోరారు. తర్వాత ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు కానీ తేదీ చెప్పలేదు. ఇంత వరకూ పిలువలేదు. ఈడీ మాత్రం ఈ సారి నేరుగా నోటీసులు జారీ చేసింది. ఇంటికొచ్చి ప్రశ్నిస్తామనే వెసులుబాటు ను కూడా కల్పించలేదు. ఢిల్లీకి రావాలని ఆదేశించింది. కవితను అరెస్ట్ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. ఇప్పటి వరకూ జరిగిన అరెస్టుల్ని బట్టి చూస్తే, ఆ అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసులో ప్రధానంగా సిసోడియా, కవితనే సూత్రధారులని మిగతా వారంతా పాత్రధారులన్నట్లుగా ఈడీ , సీబీఐ అధికారులు ఇప్పటికే వివిధ రకాల రిమాండ్ రిపోర్టులు చార్జిషీట్ల ద్వారా వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ స్కాంపై దర్యాప్తు చేస్తూండగా.. ఈడీ మాత్రం.. మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతోంది. ఈ రెండు వేర్వేరు కేసులవుతాయి.
ఆరు నెలల కిందట ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి సీబీఐ కేసు నమోదు చేసినప్పుడు అసలు సీబీఐ కాకుండా బీజేపీ నేతలు ఎక్కువగా మాట్లాడారు. మొదట సిసోడియాను తర్వాత కవితను టార్గెట్ చేశారు. అసలు లిక్కర్ స్కాం ఢిల్లీది కాబట్టి సిసోడియా పేరు వినిపించిందని అనుకోవచ్చు. కానీ అప్పట్లో ఢిల్లీ బీజేపీ నేతలుకూడా తామే దర్యాప్తు పూర్తి చేసేశామన్నట్లుగా ప్రకటనలు చేశారు. లిక్కర్ క్వీన్ కవిత అనే హ్యాష్ ట్యాగ్ ను దేశవ్యాప్తంగా వైరల్ చేశారు. అప్పట్లోనే ఇది రాజకీయ కుట్ర అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బీజేపీ నేతలు సైడ్ అయిపోయారు. దర్యాప్తు సంస్థలు మెల్లగా పని మొదలు పెట్టాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకూ కవిత పేరును ప్రతీ రిమాండ్ రిపోర్టు.. చార్జిషీటులో చెబుతున్నారు. కానీ ఇంత వరకూ ఆమెను నిందితురాలిగా చేర్చలేదు. ఓ సందర్భంలో కోర్టుతోనే ఆమెపై సాక్ష్యాలున్నాయని చెప్పించేలా చేశారు. ఎప్పటికప్పుడు అరెస్ట్ అనే లీకులు ఇస్తూనే ఉన్నారు.
ముందుగా కవితకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి.. వారిని అప్రూవర్లుగా మార్చడమో తిరుగులేని సాక్ష్యాలను సేకరించడమో చేశారు. కవిత మాజీ పీఏ అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లై ముగ్గురూ కవితకు బినామీలేనని ఈడీ చెబుతోంది. ఏ ఆధారాలు లేకుండా ఇలా ఏకపక్షంగా కోర్టులో ప్రకటించడానికి అవకాశం ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో నగదు బదిలీ అయిన ఖాతాలు ఇతర వ్యవహారాలను ఈడీ, సీబీఐ పక్కాగా రెడీ చేసుకున్నాయి. అనుకున్నది అనుకున్నట్లుగా దర్యాప్తు సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాయి.
ఎక్కడా తొందరపడటం లేదు. ఈ కేసు మొదట బయటపడినప్పుడు అంతా రాజకీయ కుట్ర అనే అభిప్రాయం బలంగా ఉంది.
కానీ సీబీఐ, ఈడీలు వ్యూహాత్మకంగా చేస్తున్న అరెస్టులు.. కోర్టుల ముందు చెబుతున్న విషయాలతో నిజంగానే స్కాం జరిగిందన్న అభిప్రాయాన్ని జనాల్లోనూ కల్పించగలిగారు. మొదట లిక్కర్ స్కాంతో తనకేం సంబంధం అని వాదించిన కవిత.. కేంద్రంపై పోరాడుతున్నందునే కేసులు పెడుతున్నారని వాదించడం ప్రారంభించారు. కవిత అరెస్ట్ ఆలస్యం కావొచ్చేమో కానీ.. ఈ కేసులో కవితకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. రాజకీయంగా ఆమె కార్నర్ అవుతున్నారు. లిక్కర్ స్కాంలో ఓ మహిళా నేత అరెస్ట్ కావడం. .. అదీ ఓ ముఖ్యమంత్రి కుమార్తె కావడం ఖచ్చితంగా సంచలనమే అవుతుంది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు.. తమపై రాజకీయ ఒత్తిడి లేదని నిరూపించడానికి చేయాల్సినదంతా చేస్తున్నారు. వారిని ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు కవిత చేతుల్లోనే ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమెన్స్ డే రోజు ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇష్యూపై ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చలు కొనసాగుతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు.
కవిత అరెస్ట్ తప్పదా..? ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి..? అనేదానిపై చర్చించుకుంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి కూతురును అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి..? ఈ విషయంలో కేసీఆర్ తర్వాత స్టెప్ట్ ఏంటి..? ఎప్పటి నుంచో కేంద్రాన్ని ఢీకొంటున్న కేసీఆర్.. మరింత రెచ్చిపోనున్నారా..? ప్రతిపక్ష పార్టీల అధినేతలను, బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకులను కలుపుకొని వెళ్తారా..? ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయిన వారితో, విచారణను ఎదుర్కొంటున్న వారితో మాట్లాడే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారా..? అనే చర్చలు సాగుతున్నాయి. మరీ దీనిపై బీజేపీ, కాంగ్రెస్ ఎలా స్పందిస్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే అన్ని పార్టీలు ఈ విషయాన్ని చాలా నిశితంగా.. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ప్రెస్ మీట్లలో ఇదే అంశంపై ఎలా మాట్లాడాలనే దానిపైనా ఒకటికి, పది సార్లు చర్చించిన తర్వాతే నాయకులు స్పందించనున్నారని తెలుస్తోంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో ఏది పడితే అది మాట్లాడి పరువు పొగొట్టుకోవడం కంటే అన్ని తెలుసుకున్న తర్వాతే స్పందించాలని భావిస్తున్నారు.
మరి కవిత నెక్ట్స్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.