Homeఅంతర్జాతీయం‘కౌగిలింత’ కో రోజు

‘కౌగిలింత’ కో రోజు

  • ఆవులను కౌగలించుకోవడం అనేది .. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా థెరపీగా మారుతోంది..
  • దీనివల్ల మానసిక ప్రయోజనాలు ఉన్నాయని సైతం పలు ప్రయోగాలు వెల్లడిస్తున్నాయి..
  • దీంతో ఈ విధానం ప్రపంచ దేశాల్లోనూ ఆచరణీయంగా మారుతోంది..
  • అయితే ఈ అంశంపై భారత ప్రభుత్వం ప్రకటన చేయడం చర్చనీయాంశమవుతోంది..

కౌ హగ్గింగ్ .. ఇప్పుడు ఓ ట్రెండ్ గా మారింది. దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నా.. దీన్ని కేంద్రం వాలంటైన్స్ డేకు ప్రత్యామ్నాయంగా నిర్వహించాలనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చలు సాగుతుండడంతో, సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆవులను కౌగలించుకోవడం కొత్త వెల్‌నెస్ ట్రెండ్‌గా మారింది. దీని వల్ల అనేక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీని పట్ల ఆకర్షణ పెరుగుతోంది.మేక యోగా నుంచి శబ్దాల స్నానం వరకు ప్రపంచంలో మానసిక, శారీరక ఆరోగ్య చికిత్సలకు కొదవలేదు. శరీరాన్ని, మనసును, ఆత్మను ప్రశాంతంగా ఉంచుకోవడానికి వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు. కొన్ని బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. భారత జంతు సంక్షేమం బోర్డ్ తాజాగా.. ఫిబ్రవరి 14వ తేదీన కౌ హగ్ డే గా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.

ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. కౌ హగ్గింగ్ అనేది ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యంలో ఉంది. నెదర్లాండ్స్‌లో కొత్తగా వచ్చిన ‘ఆవు కౌగలింత’ మానసికోల్లాసాన్ని కలిగిస్తోందని, పెదవులపై చిరునవ్వు పూయిస్తోందని అభ్యాసకులు అంటున్నారు. డచ్‌లో “కోయ్ క్నుఫెలెన్”
అంటే అక్షరాలా “ఆవును కౌగలించుకోవడం” అని అర్థం. మానవులు, జంతువులను కౌగలించుకుంటే పొందే మానసిక ప్రశాంతత స్వాభావికమన్న భావన నుంచి ఈ ప్రాక్టీస్ వచ్చింది.

ఆవులను కౌగలించుకోవాలనుకునేవాళ్లు గోశాలలకు వెళ్లి, అక్కడున్న ఆవులన్నీ పరీశీలించి, ఒక ఆవును ఆనుకుని గంట, రెండు గంటలు కూర్చుంటారు. ఆవు శరీర ఉష్ణోగ్రత, మెల్లగా కొట్టుకునే గుండె, భారీ శరీరం.. మనసుకు సాంత్వన చేకూరుస్తుందని, ఆవు వీపుపై రాస్తూ, దానికి జారబడి కూర్చోవడం, దాని చేత నాకించుకోవడం అన్నీ చికిత్సలో విధానాలే. ఆవును కౌగలించుకుంటే శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుందని, దానివల్ల ఒత్తిడి తగ్గుతుందని, సానుకూల దృక్పథం ఏర్పడుతుందని విశ్వసిస్తున్నారు. సామాజిక బంధాలు ఏర్పడినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది.

సాధారణంగా పెంపుడు జంతువులను కౌగలించుకోవడం లేదా వాటి నుంచి ఎమోషనల్ సపోర్ట్ తీసుకోవడం మానవులకు పరిపాటి. ఇదే పెద్ద జంతువులను కౌగలించుకుంటే ఆ ప్రభావం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ ఆరోగ్యకరమైన కాలక్షేపం గ్రామీణ డచ్ ప్రాంతాల్లో ఒక దశాబ్దం క్రితం మొదలైంది. ఇప్పుడు ఇది డచ్ మొత్తం ఒక ఉద్యమంలా పాకింది.

మానవులను ప్రకృతికి, గ్రామీణ జీవనానికి దగ్గర చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. నేడు, రోటర్‌డామ్, స్విట్జర్లాండ్, అమెరికాలో కూడా గోశాలలు ఆవు కౌగలింత సెషన్లు నిర్వహిస్తున్నాయి. ఇది మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ కౌగలింతల ప్రహసనం ఆవులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుండవచ్చు.

2007లో అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నల్‌లో వచ్చిన ఒక అధ్యయనంలో.. ఆవులకు మెడ, వీపు భాగాలలో రుద్దినప్పుడు విశ్రాంతి పొందిన సూచనలు కనిపించాయని, ఒళ్లు విరుచుకుని, చెవులు వెనక్కు వాల్చి సేదతీరినట్టు కనిపించాయని తేలింది. పశువులతో హృదయపూర్వక బంధంమనుషులనూ సేద తీరుస్తుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే, గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నంగా హిందువులు విశ్వసిస్తారు. ఆవును దర్శించి పనులు మొదలుపెడితే ఎంతో శుభశకునమని బలంగా నమ్ముతారు. అయితే ఈ వైదిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై పాశ్చ్యాత్య పోకడల ప్రభావం పెరిగిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వాలెంటైన్స్‌ డే జరుపుకుంటున్న ఫిబ్రవరి 14న ‘కౌ హగ్‌ డే’గా నిర్వహించాలని కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది. భారతీయ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జీవన మనుగడ, పశుసంపద, జీవవైవిద్యానికి గోవు వెన్నెముక అని అందరికీ తెలుసు.

  • సహజ సిద్ధంగా తల్లిలాంటి పోషణ శక్తి, మనుషులను ధనవంతులుగా మార్చే గుణం ఉంది కాబట్టి ఆవును కామధేనుగా, గోమాతగా పిలుస్తుంటాం..

అయితే పాశ్చాత్య సంస్కృతి కారణంగా వైదిక సంపద్రాయాలు ప్రమాదంలో పడ్డాయి. పాశ్చాత్య నాగరికత మోజులో పడి భౌతిక సంస్కృతి, వారసత్వాన్ని విస్మరిస్తున్నాం. అందుకే విస్తృత ప్రయోజనాలున్న గోవును కావలించుకోవడం ద్వారా భావ సంపద వృద్ధి చెందుతుంది. తద్వారా వ్యక్తిగత, సామూహిక సంతోషం పెరుగుతుందని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ‘కౌ హగ్‌ డే’పై సానుకూల, విమర్శలతో ఈ అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతుండగా.. గో ప్రేమికులు మాత్రం ఈ నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తున్నారు. ఆవును అప్యాయంగా హత్తుకుంటే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. చాలా రోగాలు దూరమవుతాయని విశ్వసిస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా బీపీ, శ్వాస సంబంధిత వ్యాధులతోపాటు పలు రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు.

ఇక జంతువులకు దగ్గరగా ఉన్నప్పుడు సెరోటోనిన్ లాంటి న్యూరోట్రాన్స్‌మిటర్లు విడుదలవుతాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కేరింగ్ నిపుణులు చెబుతున్నట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ ఎన్‌జీవో గతేడాది దేశంలో తొలి ఆవు కౌగిలింత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆవులను స్పృశించడం, కావలించుకోవడం, పక్కనే కూర్చోవడం, ఆవులకు జాగ్రత్తలు తీసుకోవడం వంటి యాక్టివిటీలు జరుగుతుంటాయి. ఈ
తరహా కేంద్రాలు ఇప్పటికే అమెరికా, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, యూకే వంటి దేశాల్లోనూ ఉన్నాయి.

ఈ కేంద్రాల ద్వారా రోగాలు నయమవుతాయని అక్కడివారు విశ్వసిస్తున్నారు. ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’పై భిన్న వాదనలు, చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఈ పరిణామం గోసంరక్షణకు మరింత సానుకూలమవుతుందని గో ప్రేమికులు విశ్వసిస్తున్నారు. ప్రతి ఏడాది ‘కౌ హగ్ డే’ నిర్వహణ కారణంగా జనాల్లో గోమాత సంరక్షణ, విశిష్టత పట్ల అవగాహన పెంపుకు తోడ్పడుతుందని విశ్వసిస్తున్నారు. బారసాల, నామకరణం, సీమంతం, గృహప్రవేశం వంటి కార్యక్రమాల్లో గోమాతలకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని బలంగా నమ్ముతున్నారు.

మొత్తంగా దేశంలో గోసంరక్షణకు ఈ పరిణామం ప్రయోజనకరంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. గోవులు ఇతర మూగజీవులను ప్రేమించడం భారత సాంస్కృతిలో ఒక భాగం. హిందువులు ఆవును గోమాత అంటూ పూజిస్తూ ఉంటారు. పూజ అయితే చేస్తారు కాని ఆవు ప్రాముఖ్యత చాలా మంది హిందువులకు
తెలియదనే చెప్పాలి. హిందులు పరమపవిత్రంగా పూజించే ఆవులో ఎన్నో అద్బుతమైన గుణాలు ఉన్నాయి. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని గుర్తించారు.

ప్రతి రోజు ఆవును ఒక అయిదు నుండి పది నిమిషాల పాటు కౌగిలించుకుని దాని శ్వాసను పరిశీలిస్తూ గాఢంగా శ్వాసించినట్లయితే ఒత్తిడి అనేది దూరం అవుతుందని ప్రయోగం ద్వారా నిరూపితం అయ్యింది. హాలెండ్‌ వాసులు దీనిని ఇప్పటికే వాడుకలోకి తీసుకు వచ్చారు. కౌ హగ్గింగ్‌ ప్రస్తుతం హాలెండ్‌ లో ట్రెండ్. కొన్ని గో షాలల్లో టికెట్లు పెట్టి మరీ జనాలను రప్పిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ థెరపీకి మంచి పేరు వస్తున్న కారణంగా అంతా కూడా దీనికి మొగ్గు చూపుతున్నారు. ఇండియాలో కూడా ఇలాంటిది మొదలుకానుందని, దీనికి కేంద్రమే శ్రీకారం చుట్టిందని నిపుణులు అంటున్నారు.

హిందూ సమాజంలో గో సేవ సాధారణమైన ప్రక్రియే కాబట్టి.. గోవు కౌగిలింత .. పెద్దగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు సైతం చెబుతున్నారు. దీంతో ఈ అంశంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడం విశేషం.

Must Read

spot_img