HomePoliticsమళ్ళీ సమైక్యాంధ్ర సాధ్యమా? కేసీఆర్ సైలెంట్ ఎందుకు?

మళ్ళీ సమైక్యాంధ్ర సాధ్యమా? కేసీఆర్ సైలెంట్ ఎందుకు?

మళ్లీ తెరపైకి సమైక్య రాష్ట్ర వాదన వినిపిస్తోంది. దీన్ని వైసీపీ సలహాదారు సజ్జల వినిపించగా, దీనిపై .. టీ నేతలు ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు.. అయితే వైసీపీ దోస్తీ కారుపార్టీ మాత్రం సైలెంట్ గానే ఉంది.. దీంతో ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద కథే ఉందన్న వార్త .. హాట్ టాపిక్ గా మారిందట.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. దీనికి జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అగ్గి రాజేస్తే.. మరో సీనియర్ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ పెట్రోల్ పోశారు. ఈ మంటల్లో తెలంగాణ ఆవేశ ప్రజాప్రతినిధులు అప్పుడే ఫైరింగ్ షురూ చేశారు. దీంతో సామరస్యంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మరో సమైక్య రాష్ట్ర లొల్లి షూరూ అయ్యింది. 60 ఏళ్ల పోరాటం ఫలితంగా తెలంగాణ వచ్చింది.

అప్పుడెప్పుడో 1960వ దశకంలో మొదలైన తెలంగాణ ఉద్యమ వేడి 2014లో స్వరాష్ట్రం ఏర్పాడ్డాక చల్లారింది. ఇందుకోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడింది. పాలకులు ఎవరైనా సరే.. ఎలా పాలించినా సరే.. రాష్ట్రం కోసం ఒక్కతాటిపైకి వచ్చిన సకల జనులు సమ్మె చేసి సాధించుకున్నదే తెలంగాణ రాష్ట్రం. సమైక్యాంధ్ర కోసం ఏపీ వాసులు ఎన్ని ఉద్యమాలు.. కుట్రలు చేసినా ఎదురించి పోరాడిన ఉద్యమాల నేల ఇదీ.. రాజకీయ కారణాలో లేక పోరాట ఫలితమే ఉమ్మడి ఏపీ విడిపోయి తెలంగాణ, అవిభాజ్య నవ్యాంధ్రగా ఏర్పడ్డాయి.

ఇక్కడితో కథ సుఖాంతం అయ్యిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.. ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ తేనెతుట్టెను కదిపారు. సమైక్య ఆంధ్ర మరోసారి కావాలని సంచలన కామెంట్స్ చేశారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానం. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారు. ఏపీని కలుపేసే ఏ అవకాశాన్ని మేం వదులుకోం. ఏపీ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ వైసీపీ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుందని సంచలన కామెంట్స్ చేశారు.

జగన్ కు రైట్ హ్యాండ్ అయిన సజ్జల చేసిన ఈ కామెంట్స్ దుమారం రేపాయి. ఇది జగన్ కామెంట్ గానే అందరూ భావిస్తారు. ఆయన కొత్తగా సమైఖ్యాంధ్ర వాదన లేవనెత్తడం అందరిలోనూ అనుమానాలు పెంచింది. దీనికి ఏపీ వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పెట్రోల్ పోశారు. మరింతగా మంట రాజేశారు. అయితే దీనివెనుక పెద్ద వ్యూహమే ఉందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ తెలంగాణ కలిసే పరిస్తితి వస్తే స్వాగతిస్తాం.. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఒకవేళ వైసీపీని అడిగితే రెండు రాష్ట్రాలు కలవాలని చెప్తాము. రాష్ట్ర విభజన అంశంపై ఇప్పటివరకూ పోరాడుతున్నాం.. చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవన్నీ రావాలంటూ మరింతగా ఈ వివాదాన్ని రాజేశారు. ఇక సమైఖ్యాంధ్ర అంటూ వైసీపీ వ్యూహం ప్రకారం వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ భగ్గుమంది. ఇన్ని బలిదానాలతో, ఆందోళనలతో సాధించుకున్న తెలంగాణ మళ్లీ ఆంధ్రతో కలవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

అందుకే కాంగ్రెస్ మాజీ ఎంపీ, నాడు పార్లమెంట్ లో తెలంగాణ కోసం పోరాడిన పొన్నం ప్రభాకర్ దీనిపై భగ్గుమన్నారు. సజ్జల వ్యాఖ్యలు చూస్తే మళ్లీ తెలంగాణ మీద దాడి జరిగే కుట్ర జరుగుతోందని అనిపిస్తోందని.. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి తప్ప.. తెలంగాణలో రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక ఆఖరుకు ఆంధ్రా కూతురు.. జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కూడా మళ్లీ ఏపీ, తెలంగాణ కలవడాన్ని తప్పుపట్టింది. ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణను ఏపీని కలపడం అసాధ్యం. విడిపోయిన రాష్ట్రాలను ఎలా కలుపుతారు.. మీరు రెండు రాష్ట్రాలను కలపడం కాదు.. మీ ఏపీ అభివృద్ధి కోసం పోరాటం చేయండి..

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దంటూ షర్మిల సైతం ప్రస్తుతం ఇక్కడ రాజకీయం చేస్తుండడంతో ఈ రాష్ట్రానికే మద్దతు పలికింది. తెలంగాణ, ఏపీ విడిపోయి ఎవరి సంసారం వాళ్లు చేసుకుంటున్నారు. ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. ఎవరి పాలన.. ఎవరి అభివృద్ధి వారు చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో వైసీపీ పద్ధతి ప్రకారం మళ్లీ రెండు రాష్ట్రాలు కలపాలన్న వాదన తెరపైకి తెచ్చింది. వివాదాన్ని రాజేసింది. తెలంగాణ భగ్గుమంది. ఇప్పటికైతే వైసీపీ జిగ్రీ దోస్త్ అయిన టీఆర్ఎస్ దీనిపై స్పందించలేదు. సజ్జల వ్యాఖ్యలను తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తుండగా, జాతీయ పార్టీ అధినేతగా మారిన తెలంగాణ సీఎం కేసిఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ సజ్జల వ్యాఖ్యలపై నోరు మెదకపోవడం, అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేయకపోవడంపై ఆసక్తికరంగా మారుతోంది.

ఇదంతా చూస్తుంటే.. వైసీపీది పెద్ద స్కెచ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ దివాళ తీసిందని వార్తలు వస్తున్నాయి. కేంద్రం నిధులు వెనక్కి తీసుకోవడంతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వ ప్రతిష్ట మంటగలవకుండా వైసీపీ బ్యాచ్ వ్యూహాత్మకంగా రెండు రాష్ట్రాలు కలపాలన్న వాదనను తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది.

ఇదే ప్లాన్ వర్కవుట్ చేస్తే తెలంగాణ నేతలు భగ్గుమని లొల్లి చేస్తారని.. తమ ప్రభుత్వ వైఫల్యం కనిపించదన్న ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ మాయలో తెలంగాణ నేతలు పడిపోయారు. ఇప్పటికే కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ టాపిక్ ను విజయవంతంగా డైవర్ట్ చేసిందనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలు ఏ రాష్ట్రానికా రాష్ట్రం అభివృద్ది చెందేందుకు తమ తమ ప్రణాళికలతో ముందుకు పోతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్ళీ సమైక్య నినాదం ఎత్తుకుంటున్నారు ఏపీ నాయకులు. అది జరగదని తెలిసీ తమ రాజకీయ స్వార్దాల కోసం రెండు రాష్ట్రాలను కలుపుతామంటూ వాగ్దానాలు చేస్తున్నారు.

దీనిపై తెలంగాణలో నాయకులు విరుచుకపడుతున్నారు. సజ్జల కామెంట్లు తెలంగాణలో వేడిని రగిలించాయి. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు భ‌ట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ లు సజ్జలపై మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలకోసమే సజ్జల ఇలా మాట్లాడుతున్నారంటూ ద్వజమెత్తారు. మళ్ళీ సెంటిమెంట్లు రగిల్చే కుట్రలో భాగంగానే సజ్జల ఇలాంటి వ్యాఖ్యలు చేశారని భ‌ట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు భట్టి. విభజన అన్నది అయిపోయిన అధ్యాయమని, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడటం అసాధ్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలు వింటూ ఉంటే మళ్ళీ తెలంగాణ పై దాడికి కుట్రపన్నారనే అనుమానాలు కలుగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మళ్ళీ తెలంగాణలో రాజ్యాధికారం కోసం ఏపీ నాయకులు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పచ్చగా ఉన్న రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య మూడు రాజధానుల పేరుతో చిచ్చు పెట్టి చలి కాచుకుంటున్న వైసీపీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం లేదని సొంత నేతలే చెప్పుకోలేని విధంగా తిడుతూంటే.. వింత వాదనతో తెరపైకి వచ్చింది. ఇప్పుడు సజ్జల ఈ అసందర్భ సమైక్యవాదం ఎందుకంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శల నుంచి దృష్టి మళ్లించడం కోసమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రాన్ని అన్ని విధాలుగా.. పడుకోబెట్టేసి.. చివరికి అటు తెలంగాణకు భయపడి.. ఇటు కేంద్రానికి భయపడి.. ఏపీ ప్రయోజనాలు మొత్తాన్ని తాకట్టు పెట్టేసిన జగన్ అండ్ కో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం పేరుతో మరో కొత్త నాటకానికి తెర లేపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందు తెలుగు రాష్ట్రాలను కాదని.. జగన్, షర్మిలను కలపాలని సోషల్ మీడియాలో సజ్జలపై సెటైర్లు వినిపిస్తున్నాయి.

మరి వైసీపీ వ్యూహం కాయా, పండా అన్నదే చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img