మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ దారెటు అన్న చర్చ సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. హర్షకుమార్ .. వైసీపీలోకి జంప్ అన్న టాక్ .. గోదావరి జిల్లాల్లో చర్చనీయాంశమవుతోంది
ఇక హర్షకుమార్ వైసీపీలోకి చేరడం లాంఛనమే అన్న సంకేతాలు
గోదావరి జిల్లాల్లో రాజకీయం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. ప్రత్యర్థి పార్టీల ఎత్తులు చిత్తు చేస్తూ రాజకీయాలు చేస్తుంటారు నేతలు. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, రాజ్యసభ సభ్యుడు, వైసీపీ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఇద్దరూ కలిసి మంతనాలు జరిపారు.
ఇక హర్షకుమార్ వైసీపీలోకి చేరడం లాంఛనమే అన్న సంకేతాలు విపినిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు చేపట్టిన హర్షకుమార్ అమలాపురం ఎంపీగా రెండు సార్లు పోటీచేసి గెలుపొందారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా హర్షకుమార్‌కు పేరుంది.
అదే సమయంలో కాపు, శెట్టిబలిజ తదితర సామాజిక వర్గాల్లోనూ హర్ష కుమార్‌కు మంచి సంబంధాలున్నాయి. ఇతర పార్టీల్లో ఉన్న చాలా మంది హర్షకుమార్‌కు గతంలో అనుయాయులుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లో పిసిసి పదవి దక్కలేదనే అసంతృప్తితోనే ఆయన..వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారని తెలిసింది. హర్షకుమార్ మూడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. అమలాపురం నుంచి విజయం సాధించారు.
ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు. 2014 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీకి మద్ధతు తెలిపారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు. 2019 ఎన్నికల ముందు ఆయన టీడీపీలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి అమలాపురం సీటు ట్రై చేశారు. కానీ అప్పటికే అమలాపురం పార్లమెంట్ సీటులో బాలయోగి వారసుడు హరీష్ ఉన్నారు. దీంతో ఆయనకు సీటు దక్కలేదు.
ఇక ఏం చేసేది లేక..2019 ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కాస్త యాక్టివ్ గానే పనిచేస్తున్నారు.. ఇక ఇటీవల పిసిసి అధ్యక్షులని మార్చారు. ఈ క్రమంలో ఆయన పదవి ఆశించారు. కానీ అధిష్టానం..శైలజానాథ్‌ని తప్పించి గిడుగు రుద్రరాజుకు పదవి ఇచ్చారు. దీంతో హర్షకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రధాన పార్టీల అధ్యక్షులు అగ్రకులాలకు చెందిన వారే అని, కాంగ్రెస్ కూడా అలాగే పదవి ఇచ్చిందని, దళితులు అధ్యక్షులుగా ఉండకూడదని చెప్పి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ కాంగ్రెస్‌కు దూరం జరిగారు. అయితే ముందస్తు నగారా నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అమలాపురం పార్లమెంట్ అభ్యర్ధిగా వైసీపీ తరపున హర్షకుమార్ పోటీచేసే అవకాశాలున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌తో భేటీ అయినట్లు తెలిసింది. పరిస్తితులని బట్టి ఆయన వైసీపీలోకి వెళ్తారని సమాచారం. అమలాపురం పార్లమెంట్ సీటు అడుగుతున్నట్లు తెలిసింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక బోటు ప్రమాదంపై ప్రశ్నించారని చెప్పి..హర్షకుమార్‌ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైలులో ఉంచారు.
అమలాపురం పార్లమెంట్అభ్యర్ధిగా వైసీపీ తరపున హర్షకుమార్ పోటీచేసే అవకాశాలున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. హర్షకుమార్ కూడా ఇదే కోరుకుంటున్నట్లు, అదే విధంగా తమ కుమారులకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అమలాపురంలో పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ తరపున దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్ మాధూర్ రంగంలో ఉన్నారు.
2019లో కూడా వైసీపీ అభ్యర్థి చింతా అనురాధకు గట్టిపోటీ ఇచ్చారు. ఈసారి హరీష్ మాధూర్ గెలిచేందుకు చాలా అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనురాధపై అధిష్టానం అంతగా గురిగా లేకపోవడం, ఆమె కూడా ఈ సారి ఎమ్మెల్యే టికెట్టుపై ఆసక్తిని కనపరచడంతో వైసీపీ తరపున అమలాపురం ఎంపీ అభ్యర్థిగా జీవీ హర్షకుమార్ బరిలోకి దింపే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో దళితుల్లో హర్షకుమార్కు మంచి పట్టుంది. హర్ష కుమార్ మాల సామాజికవర్గానికి చెందినవారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో మాలల ప్రాబల్యం ఎక్కువ. కాపు సామాజికవర్గంతో సమానంగా ఉన్నారు. ఓ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు. ఈ వ్యవహారంలో దళిత సంఘాల నుంచి హర్షకుమార్ భారీగానే విమర్శలు ఎదుర్కొన్నారు.
అయితే విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే వివిధ ఉద్యమాల్లో పాల్గొని ఉండటం, దళిత స్పృహ, దూకుడుగా వ్యవహరించగల స్వభావం ఇవన్నీ ఉండటంతో వైసీపీ
హర్షకుమార్ ను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ను హర్షకుమార్ దగ్గరకు పంపిందని అంటున్నారు.
బంధువుల సమస్యకు సంబంధించి పాత మిత్రుడు హర్షకుమార్ ను కలిసినట్లు బోస్ చెబుతున్నప్పటికీ అసలు విషయం అది కాదని అంటున్నారు. ఈసారి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం గట్టిగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో వైసీపీ ముందు జాగ్రత్త చర్యగా వివిద సామాజికవర్గాల్లో కీలక నేతలను ఆకర్షిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో దళిత నేతల్లో ప్రముఖంగా ఉన్న హర్షకుమార్ ను తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుందని చెబుతున్నారు.
అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది
ఎన్నికలు దగ్గర పడే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి మారే జంప్ జిలానీల హవా మొదలైంది. ఈ నేపథ్యంలోనే అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో హర్ష కుమార్ భేటీ కావడం ఆ పుకార్లకు ఊతమిస్తోంది.
పార్టీలోకి హర్ష కుమార్ ను సుభాష్ చంద్ర బోస్ ఆహ్వానించారని, హర్షకుమార్ వైసీపీలో చేరడం లాంఛనమే అని ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే జీవీ వైసీపీలో చేరికపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అధికారపార్టీ వైసీపీకి చెందిన సోషల్
మీడియాలో ఈ విషయమై మిశ్రమ స్పందన కనబడుతోంది.
ఎప్పుడైతే యాక్టివ్ అయ్యారో అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తునే ఉన్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మరింత దూకుడుగా మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి అంటే లోకల్‌గా జరిగే ఘటనలకు కూడా డైరెక్టుగా జగన్నే నిందిస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే హఠాత్తుగా కాంగ్రెస్‌కు జీవీ రాజీనామా చేసి తొందరలోనే వైసీపీలో చేరనున్నారనే ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారానికి కారణం ఏమిటంటే జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జీవీతో భేటీ అవ్వటమే. మామూలుగా అయితే వీళ్ళిద్దరి దారులు వేర్వేరు. అలాంటిది జీవీతో పిల్లి భేటీ అయ్యారంటేనే కచ్చితంగా రాజకీయ చర్చలే అయ్యుంటాయనే ప్రచారం పెరిగిపోతోంది. వీళ్ళిద్దరి మధ్య రాజకీయ చర్చలేముంటాయి? హర్షను వైసీపీలోకి ఆహ్వానించటం మినహా పిల్లికి వేరే అవసరమేమీలేదనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి.
ఈ విషయంపైనే సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనబడుతోంది. కొంతమందేమో వైసీపీలో జీవీ చేరుతారన్న విషయమై తీవ్రంగా విభేదిస్తున్నారు. ఇంతకాలం తిట్టిన హర్షను జగన్ ఎలా చేర్చుకుంటారని నెటిజన్లు నిలదీస్తున్నారు. మరికొందరేమో వైసీపీకి బ్యాడ్ టైమ్ స్టార్టయ్యిందంటున్నారు. కొంతమందేమో జగన్ నిర్ణయం మంచిదే అని అభినందిస్తున్నారు. మొత్తానికి వైసీపీలో జీవీ చేరుతారనే ప్రచారంపై నెగిటివ్ స్పందనలే ఎక్కువగా
కనబడుతున్నాయి.
అయితే, మొన్న మొన్నటివరకు జగన్ ను దళిత ద్రోహి అంటూ తీవ్ర స్థాయిలో బూతులు తిట్టి విమర్శించిన హర్ష కుమార్…వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.