అంతరిక్షంపై గుత్తాధిపత్యంతో పాటు.. అన్ని దేశాలపై ఉపగ్రహాలతో నిఘాను ముమ్మరం చేస్తోందా…? ప్రపంచ అంతరిక్ష రంగ నిపుణులు, రక్షణ రంగ పరిశోధకుల ఆందోళనకు చైనా అంతరిక్షంలో ప్రవేశపెట్టే ఉపగ్రహాలే కారణమా…?
చైనా అంతరిక్ష ప్రయోగాల చరిత్ర ఏమిటి…? ఈ స్థాయిలో ఉపగ్రహాల ప్రయోగాలకి డ్రాగన్ కంట్రీకి నిధులు ఎక్కడివి…? అంతరిక్షంపై ఆధిపత్యం చెలాయించడమే చైనా లక్ష్యమా…? అంతరిక్షంలో వరుస పెట్టి శాటిలైట్లు ప్రయోగిస్తున్న చైనా.. అసలు ప్లాన్ ఇదేనా??

అగ్రరాజ్య హోదా కోసం తహతహలాడుతున్న చైనా… తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు అన్ని రంగాల్లో విపరీతంగా శ్రమిస్తోంది. ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రాబల్యమున్న వివిధ అంశాల్లో కాలు మోపి ఉనికి చాటుకోవాలని యత్నిస్తోంది. ఇటీవలి కాలంలో అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. యూఎస్‌ఎస్‌ఆర్ కుప్పకూలక ముందు వరకు అమెరికాతో ఇదే తరహా పోటీ చూపేది. అయితే సోవియట్ పతనానంతరం ప్రపంచం ఏక ధ్రువ ప్రపంచంగా మారిపోయింది. సోవియట్ వదిలి వెళ్లిన ఖాళీని పూడ్చేందుకు చైనా రంగంపైకి వచ్చింది. ఈ క్రమంలో అంతరిక్ష
ప్రయోగాల పరంగా చైనా జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతోంది.. 2030 నాటికి మార్స్‌పైకి ఉపగ్రహాన్ని పంపి శాంపిళ్లను తీసుకువస్తామని చైనా ప్రకటించింది..
డ్రాగన్ కంట్రీ ప్రపంచదేశాల్లో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలు చేస్తోంది.. ముఖ్యంగా తన విదేశాంగ విధానంతో కుట్రలు, కుతంత్రాలతో వ్యూహాలు పన్ని.. వీలైనన్ని దేశాలను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. మరోవైపు.. అంతరిక్షంలోనూ తానే మేటి అని నిరూపించుకునేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.. అంతరిక్షంపై తన గుత్తాధిపత్యాన్ని పెంచుకోవడం కోసం.. అన్ని దేశాలపై ఉపగ్రహాలతో నిఘాను ముమ్మరం చేస్తోంది.. గత ఏడాది అక్టోబరు నుంచి చైనా తన శాటిలైట్ల ప్రయోగాలను వేగవంతం చేసింది. ఈ ఆర్నెల్లలో ఏకంగా 35
ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇవన్నీ లో – ఆర్బిట్ శాటిలైట్లే… భూమికి సమీపంలో ఉండే కక్ష్యలోనే తిరుగుతుంటాయి. అంటే.. ఏ దేశంపైనైనా అత్యంత సమీపం నుంచి నిఘాను కొనసాగిస్తున్నట్లే అవుతుంది.
ఈ శాటిలైట్లన్నీ హై రిజల్యూషన్ చిత్రాలను చైనాకు చేరవేస్తాయి. ఇలా ఇప్పటి వరకు అంతరిక్షంలో చైనాకు చెందిన 400కు పైగా లో- ఆర్బిట్ ఉపగ్రహాలు ప్రపంచ దేశాలపై నిఘాను పెట్టాయి.
చైనా లో- ఆర్బిట్ ఉపగ్రహాలను వరుసపెట్టి ప్రయోగిస్తుండడం పట్ల అగ్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి. వ్యవసాయ పరిశోధనలు, ఇంటర్నెట్ సేవల కోసమే ఈ ప్రయోగాలని చైనా చెబుతున్నా.. రక్షణ రంగ నిపుణులు మాత్రం, చైనా పరమార్థం వేరే ఉందని స్పష్టం చేస్తున్నారు. అందుకు కారణం.. 400కు పైగా లో -ఆర్భిట్ ఉపగ్రహాల్లో 347 చైనా సైన్యం పరిధిలో ఉన్నాయి. ఉపగ్రహాలపై సైన్యం అజమాయిషీ ఉందంటే.. కచ్చితంగా అవి నిఘా కోసం వినియోగిస్తున్నవేనని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భారత్, అమెరికా సహా.. పలు దేశాల్లో చైనా నిఘా బెలూన్ల ఉదంతాన్ని
గుర్తుచేస్తున్నారు. అంతేకాదు.. యుద్ధాలంటూ వస్తే, ఒకప్పటిలా సైనిక బలం ఉన్నవారిదే విజయం అని చెప్పలేమని, ఇప్పుడు స్పేస్‌పై పట్టున్న దేశాలదే విజయం అని చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు. అందుకే రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో.. రష్యా తొలుత ఉక్రెయిన్ ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసి, వాటిని ధ్వంసం చేసిందని వివరిస్తున్నారు. లో- ఆర్బిట్ ఉపగ్రహాలు అణు యుద్ధాల్లో కీలక భూమిక పోషిస్తాయని, ఇప్పుడు చైనా ఆ కోణంలోనే ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలను ప్రయోగిస్తోందని ఆరోపిస్తున్నారు.
చైనా ఇప్పుడు అంతరిక్షంపై గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందని అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. అర్ధ దశాబ్దం అంటే 2027 కల్లా 13,500 లో- ఆర్బిట్ ఉపగ్రహాల ప్రయోగమే చైనా లక్ష్యంగా గుర్తించినట్లు చెబుతున్నాయి. అదే గనక జరిగితే.. యావత్ భూమండలం చైనా నిఘా పరిధిలోకి వస్తుందని, ఏ దేశాన్నైనా శాసించే స్థితికి చైనా చేరే ప్రమాదముందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా లో -ఆర్బిట్ శాటిలైట్ల సాయంతో ఉక్రెయిన్ పక్కగా రష్యా సైనికుల జాడను తెలుసుకుని, దాడులు జరుపుతోందని గుర్తుచేశారు. అందుకే.. రష్యా
వైపు ఎక్కువగా సైనిక నష్టం ఉందని చెబుతున్నారు.
అంతరిక్షరంగంలో అమెరికాను అధిగమించేలా చైనా ప్రణాళికలు చేస్తోందని స్వయంగా పెంటగాన్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
చైనాతో అమెరికా పోటీపడాల్సి వస్తోందని పెంటగాన్‌కు చెందిన ‘స్టేట్ ఆఫ్ ద స్పేస్ ఇండస్ట్రియల్-బేస్ రిపోర్ట్-2022’ స్పష్టం చేసింది. లేకుంటే.. అమెరికా గగనతలానికి ‘చైనా గ్రహణం’ పడుతుందని హెచ్చరికలు చేసింది. 2045కల్లా చైనా అంతరిక్ష రంగాన్ని శాసిస్తుందని ఆ నివేదిక అంచనా వేసింది. ఇప్పటి వరకు ప్రపంచదేశాలను శాసిస్తోన్న అమెరికానే తలదన్నేలా చైనా అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రవేశపెడుతుందంటే.. అది ఖచ్చితంగా భవిష్యత్ లో
ప్రపంచదేశాలకు పెనుముప్పుగా మారే అవకాశం ఉంది.. అంతేకాదు.. అంతరిక్షంపై చైనా ఆధిపత్యం సాధిస్తే.. ప్రపంచదేశాలను తన కనుసైగలతో శాసిస్తుందనడంలో సందేహం లేదు. డ్రాగన్ కంట్రీ ఇతర దేశాలపై పట్టుసాధించేసేందుకు ఇప్పటికే చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్షంపై పట్టు సాధిస్తే.. ఇక ప్రపంచదేశాలకు తీవ్ర సమస్యలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రక్షణ రంగ నిపుణులు..
ప్రస్తుతం భూమిపైన అమెరికా, చైనాల మధ్య ప్రచ్ఛన్న పోరు నడుస్తోంది. దీన్ని అంతరిక్షంలోకి తీసుకుపోవాలని చైనా భావిస్తోంది. రాబోయే రోజుల్లో అంతరిక్షంపై ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికాకు భిన్నంగా అంతరిక్ష దౌత్య మార్గం ద్వారా ఆధిపత్యం సాధించాలని చైనా యోచిస్తోంది. ఇందులో భాగంగా తన స్పేస్ ప్రోగ్రామ్స్‌లో ఇతర దేశాలకు అవకాశాలు ఇస్తోంది. చైనా నిర్మించే స్పేస్ స్టేషన్ పూర్తయితే… ఇతర దేశాల వ్యోమగాములకు అవకాశాలు కల్పించడం ద్వారా పటిష్టమైన అంతరిక్ష దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలన్నది చైనా భావనగా ఆ దేశానికి చెందిన చైనా
డైలీన్యూస్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇది చైనాకు మంచి ప్రజాసంబంధాల వారధిగా పనిచేస్తుందని తెలిపింది. అంతరిక్ష దౌత్యంలో భాగంగా చిన్న దేశాలకు కృత్రిమ ఉపగ్రహాలను నిర్మించి ఇవ్వడం, తన దగ్గర ఉన్న ఉపగ్రహ డేటాను ఆయా దేశాలతో పంచుకోవడం వంటి చర్యలను చైనా చేపట్టింది. అయితే ఇలాంటి ఆధిపత్య పోరు కన్నా గతంలో సోవియట్, అమెరికా కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించినట్లు చైనా, అమెరికా సంయుక్తంగా పనిచేయడం ప్రపంచం అంతటికీ మేలు చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2021లో చైనా అంతరిక్ష ప్రదర్శనల్లో అదరగొట్టింది. కానీ ఇప్పటికీ అంతరిక్షంపై అమెరికా ఆధిపత్యమే నడుస్తోంది. ప్రస్తుతం భూమి చుట్టూ దాదాపు 4,500 కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతుంటే వాటిలో 2,700 ఉపగ్రహాలు అమెరికాకి చెందినవే ఉన్నాయి. అటు చైనా ఉపగ్రహాల సంఖ్య దాదాపు 400 మాత్రమే. అమెరికా వద్ద అత్యంత శక్తివంతమైన రాకెట్లున్నాయి. ఇటీవల కాలంలో చైనా అంతరిక్షంపై పెట్టుబడులను పెంచుతూ వచ్చింది. 2020 నాటికి ఈ రంగానికి చైనా సుమారు 890 కోట్ల డాలర్ల నిధులు కేటాయించింది. కానీ అదే సమయంలో అమెరికా అంతరిక్ష ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు ఏకంగా 4,800 కోట్ల డాలర్లు కావడం విశేషం. అమెరికాలో స్పేస్ ఎక్స్‌లాంటి పలు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షరంగ సంస్థలు ప్రభుత్వానికి దీటుగా అంతరిక్ష ప్రాజెక్టులు
చేపడుతున్నాయి. చైనాలో అంతటిస్థాయి ప్రైవేటు అంతరిక్ష కంపెనీలు ఏర్పడలేదు.
1970లో చైనా తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఆ తర్వాత చైనాలో కల్చరల్ రివొల్యూషన్‌తో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పటికి అమెరికా, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్,జపాన్‌లు మాత్రమే చెప్పుకోదగిన స్థాయిలో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించాయి. గత పదేళ్లలో చైనా 200కుపైగా రాకెట్లు ప్రయోగించింది. ఇప్పటికే చంద్రుడిపై శిలల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు చాంగె-5 మిషన్‌ను చైనా చేపట్టింది. చంద్రుడి ఉపరితలంపై చైనా జెండాను ఎగురవేసింది. కావాలనే అమెరికా జెండా కంటే పెద్ద జెండాను అంతరిక్షంలోకి చైనా పంపించింది.షెంఝౌ-14 ప్రయోగంతో కలిపి మొత్తంగా చైనా 14 మంది వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించింది. అమెరికా, సోవియట్ యూనియన్ లు ఈ రేసులో చాలా ముందున్నాయి.
అయితే, చైనాకు కొన్ని ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. 2021లో ఒక చైనా రాకెట్ అంతరిక్షంలో నియంత్రణ కోల్పోయి అట్లాంటిక్ సముద్రంలో కుప్పకూలింది. 2020లోనూ రెండు రాకెట్ ప్రయోగాలు విఫలమయ్యాయి.
చైనా అంతరిక్ష ప్రయోగాల కోసం 3,00,000 మంది పనిచేస్తున్నట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ జిన్‌హువా వెల్లడించింది. నాసా కోసం పనిచేస్తున్న వ్యోమగాముల కంటే ఇది 18 రెట్లు ఎక్కువ. చైనీస్ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్‌ను 2003లో ఏర్పాటు చేశారు. మొదట్లో దీని వార్షిక బడ్జెట్ 300 మిలియన్ల డాలర్లు. అయితే, 2016లో అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులను చైనా ఆహ్వానించింది. ప్రస్తుతం ఏడాదికి 1.5 బిలియన్ డాలర్లు ప్రైవేటు పెట్టుబడులు వచ్చినట్లు చైనా మీడియా పేర్కొంది. ఉపగ్రహ సాంకేతికత అభివృద్ధిపై చైనా ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్లు, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, వాతావరణ అంచనాలపై దృష్టిసారిస్తోంది.
అయితే, చైనా ప్రయోగిస్తున్న చాలా ఉపగ్రహాలను సైనిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలపై నిఘా పెట్టడం, దీర్ఘశ్రేణి క్షిపణులకు నావిగేషన్ వ్యవస్థల కోసం వీటిని ప్రయోగిస్తున్నారు. దీంతో చైనా అంతరిక్షంలో ప్రవేశపెట్టే ఉపగ్రహాలతోనే ప్రపంచానికి ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది..
డ్రాగన్ కంట్రీ అంతరిక్షంలో ఆధిపత్యం పొందేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది.. ఉపగ్రహాల నిఘాతో ప్రపంచదేశాలను తన గుప్పిట్లో తీసుకుని వాటన్నింటిని తన కనుసన్నల్లోనడిపించాలనేదే చైనా ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి.. చూడాలి. చైనా.. రానున్న కాలంలో అంతరిక్షంలో అగ్రరాజ్యంగా ఎదుగుతుందో లేదో.. ……………………………………….