HomePoliticsచంద్రబాబు తెలంగాణలో పావులు కదుపుతున్నారా..?

చంద్రబాబు తెలంగాణలో పావులు కదుపుతున్నారా..?

ఖమ్మంలో బాబు సభ .. ఏపీలో ప్లస్ కానుందా.. ఏపీలో మద్ధతు కోసమే .. చంద్రబాబు .. తెలంగాణలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి సభ సక్సెస్ తో బీజేపీ ఏం చేయనుందన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు.. పదవి, అదికారం కోసం మిత్రులను పక్కన పెడతారు. శత్రువులను చేరదీస్తారు. ఇదే సమయంలో శత్రువుకు శత్రువు మిత్రుడు.. అనే ఫార్ములాను రాజకీయంగా తమ అవసరానికి అనుగుణంగా వాడుకుంటారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నారు.

తెలంగాణ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి తాను దగ్గర కావాలనుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీతో యుద్ధం చేస్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసు తెరపైకి తెచ్చి తెలంగాణ నుంచి బాబును ఆంధ్రాకు తరిమేశారు కేసీఆర్‌. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను ఉమ్మడి శత్రువుగా చూపి బీజేపీతో మైత్రి చేయాలనుకుంటున్నారు.

తెలంగాణలో సరైన క్యాడర్‌ లేని బీజేపీని అధికారంలోకి తేవడానికి సహకరించి.. ఆంధ్రాలో మళ్లీ తాను అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మంలో బాబు బలప్రదర్శన చేశారన్న అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది. గతంలో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు టీడీపీని పూర్తిగా యాక్టివ్‌ చేయించి పొత్తులు పెట్టుకోవాలని అధిష్టానానికి సూచించారు.

అయితే మరోవర్గం నేతలు టీడీపీతో పొత్తును ఇష్టపడలేదు. మరోవైపు చంద్రబాబునాయుడికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు అవసరంగా మారింది. ఎందుకంటే రానున్న ఏపీ ఎన్నికల్లో వైఎస్‌.జగన్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదని బాబుకు తెలుసు. కేంద్రం నుంచి సహకారం ఉంటేనే ఎదుర్కోగలుగుతామని ఆయన భావిస్తున్నారు.

ఇంకోవైపు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా టీడీపీతో పొత్తు కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో చంద్రబాబు బలాన్ని నరేంద్రమోదీ, అమిత్‌షా వద్ద తక్కువ చేసి చూపించిన వర్గానికి మింగుడు పడని రీతిలో ఖమ్మంలో సభ నిర్వహించామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఒకరకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనుకూలవర్గంగా ఉన్న బీజేపీ నేతలు కూడా దీనిపై సంతోషంగా ఉన్నారు.

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బహిరంగసభకు ప్రజలు పోటెత్తారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబు ర్యాలీగా వెళుతుంటే తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయారు.

అదే సమయంలో గులాబీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. బాబు సభపై మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ, కేసీఆర్‌ తనయ కవిత స్పందించడమే ఇందుకు నిదర్శనంగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఖమ్మం సభ విజయవంతం కావడంతో చంద్రబాబు తాను అనుకున్న లక్ష్యం చేరారు. ప్రస్తుతం ఈ విషయం బీజేపీ ఢిల్లీ పెద్దలకు చేరింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుతో కలిసి పనిచేసేలా పార్టీ అధిష్టానంలో కదలిక తీసుకురాగలిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలు జరగొచ్చని భావిస్తున్నారు. బీజేపీకి నాయకుల బలం లేకపోవడంతో ముందస్తు ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావచ్చని బీఆర్ఎస్‌ వ్యూహంగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీ కుమ్ములాటలు మాని ఎన్నికలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు.

బీఆర్‌ఎస్‌ బలం రోజురోజుకు తగ్గుతోందని అంచనా వేస్తున్న బీజేపీ తెలంగాణలో అధికారం కోసం ఎదురు చూస్తోంది. సింగిల్‌గా వెళితే అధికారం దక్కుతుందన్న నమ్మకం లేదు.

ఏదో ఒక ఆసరా అవసరమవుతోంది. ఆ ఆసరాను తాను ఇస్తానంటోంది టీడీపీ. తెలుగుదేశం తెలంగాణాలో తన బలాన్ని నిరూపించుకుంటున్న క్రమంలో ఆ పార్టీ గురించి బీజేపీ ఢిల్లీ పెద్దలలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ తరహాలో చంద్రబాబు తెలంగాణ రాజకీయంపై దృష్టిసారిస్తారని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలెవరూ ఊహించలేదు.

కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితి చేయడంతో తెలంగాణలో మళ్లీ పునరుజ్జీవం పొందాలని బాబు ప్లాన్ వేశారు. రేపు తెలంగాణలో టిడిపి పోటీ చేసినప్పటికీ కెసిఆర్ వారించలేని పరిస్థితి.. అందుకే ఏకంగా నిన్న ఖమ్మంలో భారీ ఎత్తున సభ నిర్వహించారు. తెలంగాణకు అధ్యక్షుడైన తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ కి కూడా ఒక మంచి ఎక్స్పోజర్ కావాలి కాబట్టి ఈ సభను సవాల్ గా తీసుకొని భారీ ఎత్తున ఖర్చుపెట్టి విజయవంతం చేశారు.

అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు గెలవాలి అంటే బలమైన కూటమి అవసరం. అందుకే భారతీయ జనతా పార్టీకి దగ్గర కావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ టిడిపి పోటీ చేస్తే ఓట్లను చీల్చేస్తుంది. దీనివల్ల భారతీయ జనతా పార్టీకి తీవ్ర నష్టం. ఇది జరగకూడదు అంటే టిడిపి బిజెపికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.

అలా జరగాలి అంటే ఏపీలో టిడిపికి బిజెపి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంకేతాలు పంపేందుకే చంద్రబాబు తెరపైకి తెలంగాణలో పోటీ చేసే అంశాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఖమ్మంలో జరిగిన మీటింగ్ లోనూ విమర్శలు చేయలేదు. కేవలం తాను చేసిన పనులను చెప్పుకున్నారు.

తెలంగాణ రాజకీయాలకు చంద్రబాబు నాయుడు దూరంగా ఉండొచ్చు, ఏపీ లో పరిస్థితి అసలు బాగొలేకపోవచ్చు.కానీ అపర చాణక్యుడిగా అతనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరు తక్కువ కాలేదని తాజా ఖమ్మం సభ నిరూపిస్తోంది. తెలంగాణలో కెసిఆర్ అధిపత్యం హరించే అవకాశం ఒక్క బిజెపికే ఉంది. ఈ రాష్ట్రంలో ఎలాగైనా తమ ప్రభుత్వం స్థాపించాలన్నదే వారి ఏకైక లక్ష్యం.

ఇక వారు కాంగ్రెస్ కంటే బలోపేతంగా ఉన్నప్పటికీ సొంత బలం ఏమాత్రం సరిపోదు అన్న సంగతి వారికీ తెలుసు. ప్రస్తుతం జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ ను ఢీకొట్టాలి అంటే కమల దళం వారి బలాన్ని రెట్టింపు చేసుకోవాలి. టిడిపిని తెలంగాణలో యాక్టివేట్ చేసి పొత్తు పెట్టుకోవాలని కొందరు బిజెపి నేతలు చూస్తున్నారు కానీ మరికొందరికి మాత్రం అది ఏ మాత్రం ఇష్టం లేదు.

ఇలా రెండు వర్గాల మధ్య సతమతమవుతున్న ఢిల్లీ బిజెపి అధిష్టానానికి చంద్రబాబు ఖమ్మం సభ ద్వారా ఖచ్చితమైన సంకేతాలు పంపారు. ఊహించిన విధంగానే తెలంగాణలో 8 ఏళ్ల తర్వాత బాబు నిర్వహించిన సభకు జనం పోటెచ్చారు. 1000 కారులతో చంద్రబాబు వెళ్తుంటే తెలంగాణ మొత్తం తలెత్తి చూసింది. ఈ రకమైన ఆదరణ బిజెపికి ఎంతైనా అవసరమేనని విశ్లేషకులు సైతం అంటున్నారు.

దీంతో ఇక రానున్న ఎన్నికల్లో అటు ఏపీతోపాటు ఇటు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా అధిష్టానం బుర్రలో ఒక ఆలోచన వచ్చినట్లు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట దాటి ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిలేని పరిస్థితి. కెసిఆర్ కు కూడా ప్రజాబలం తగ్గింది. ఇప్పుడు వీటిని తమ అనుకూలతలుగా మార్చుకొని బిజెపి తమ బలం రెట్టింపు చేసుకొని పుంజుకోవాలని ఆశిస్తోంది.

బీజేపీ తెలంగాణలో కూడా తమ కోటను కట్టుకోవాలంటే చంద్రబాబు లాంటి పునాది ఎంతైనా అవసరం. ఇక రానున్న రోజుల్లో రాజకీయం స్పీడు పెరగనుంది అని కచ్చితంగా అర్థమవుతుంది. ఏదేమైనా చంద్రబాబు తాజా సభ తర్వాత తెలంగాణలో రాజకీయం మొత్తం మారిపోయింది. మరోవైపు ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే చంద్రబాబు తెలంగాణకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

తాజా పరిణామాలతో బాబు ఖమ్మం సభ .. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిందనే చెప్పవచ్చు. దీంతో చాలా తొందరలోనే బీజేపీ టీడీపీతో పొత్తుకు సై అనే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి.

మరి దీనిపై మోదీ, షా ద్వయం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img