Homeతెలంగాణబీజేపీ ఎన్నికల నగారా మ్రోగనున్న వేళ దూకుడు పెంచుతోందా..?

బీజేపీ ఎన్నికల నగారా మ్రోగనున్న వేళ దూకుడు పెంచుతోందా..?

బీజేపీ ఎన్నికల నగారా మ్రోగనున్న వేళ దూకుడు పెంచుతోందా..? అందుకే తెలంగాణ మిషన్ చేపడుతోందా.? ముఖ్యంగా టీ కాంగ్రెస్ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తోందా.?

తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలని, అవినీతి సీఎం కెసీఆర్ ను ఫాం హౌస్‌కే పరిమితం చేయాలని, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. ఇప్పటికే దూకుడు పెంచింది. తాజాగా ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక్కలెక్క అన్నట్లుగా మిషన్‌ తెలంగాణ షురూ చేసింది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేరికల ప్రళయం రానుందని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంటున్నారు కమలనాథులు. దక్షిణాదిన పాగా వేయాలన్న బీజేపీ లక్ష్యం దశాబ్దాలుగా నెరవేరడం లేదు. బీజేపీని ఇన్నాళ్లూ దక్షిణాది ప్రజలు ఉత్తరాది పార్టీగానే పరిగణించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణ భారత దేశంలో పాగా వేయడానికి ఇదే మంచి తరుణమని భావిస్తోంది.

ఇందుకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని వూహ్యకర్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమలోనే తెలంగాణలో బీజేపీ దూకుడు చూపిస్తోంది. రాష్ట్రంపై ఫోకస్‌ చేస్తున్న బీజేపీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం మిషన్‌ తెలంగాణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పే పనిలో పడింది.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్న పరిస్థితి ఉంది. ఒకపక్క ప్రజాక్షేత్రంలో విభిన్న కార్యక్రమాలతో ముందుకు సాగుతూనే, బీజేపీ మరోపక్క ఆపరేషన్‌ ఆకర్ష్‌ అంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన నాయకులను ఆకర్షించే పనిలో పడింది. త్వరలో బీజేపీలోకి చేరికల ప్రళయం రాబోతుందని తాజాగా ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీల నుంచి కీలక నాయకులను ఆకర్షించే పనిలో పడింది అనే అంశంపై అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. పార్టీలలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను ఇప్పటి నుండే సెట్‌ చేసే పనిలో ఉంది. దీనికోసం బలమైన నాయకులకు పార్టీలోకి ఆకర్ష అంటుంది. తెలంగాణలో బీజేపీలో చేరికలను వేగవంతం చేయాలని అధిష్టానం ఆదేశించింది.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ ఈమేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

బలమైన నేతలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉంటే వారికి భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు.80 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని తెలిపిన ఆయన వారి కంటే బలమైన నేతలు ఎవరైనా వస్తామంటే, పార్టీలో చేర్చుకుందామని సూచించారు. 40 నియోజకవర్గాలలో బలమైన నాయకులు కావాలని, అటువంటి నాయకులను లక్ష్యంగా చేసుకొని వారికి సీటు ఇచ్చే విషయంలో విశ్వాసం కల్పించాలని తెలిపారు. కానీ సీటు వారికే అన్నది మాత్రం కన్ఫామ్‌ చేయలేమని పేర్కొన్నారు.

బీజేపీలో అత్యదిక చేరికలు కాంగ్రెస్‌ నుంచే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని, టికెట్‌ హామీ కోసమే ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్‌ తెలిపారు. బీఆర్‌ఎఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని వేచిచూసే ధోరణి
అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందని, ఇతర పార్టీల్లోని నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరాలని భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దేశంలో కాంగ్రెస్‌ బలహీనపడిందన్న ఈటల రాష్ట్రంలోనూ అంతర్గత కలహాలతో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా దెబ్బతిందన్నారు. కాంగ్రెస్‌ సీనియర్లు బీజేపీ వైపు చూస్తున్నారని బాంబు పేల్చారు.

సీఎం తీరు రుచించని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని సంచలన ప్రకటన
చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీలు, వేలాదిమంది సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వంపై మంటతో ఉన్నారని పేర్కొన్న ఈటల రాజేందర్, త్వరలో గ్రామాల్లో చేరికల ప్రళయం రాబోతుందని తెలిపారు. దీనిపై చర్చలు కూడా జరుపుతున్నామని పేర్కొన్నారు. తాజాగా ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలతో త్వరలో బీజేపీ వివిధ పార్టీల నుంచి బలమైన నాయకులకు చేర్చుకుంటుందా? ఏ పార్టీ నాయకులకు బీజేపీ షాక్‌ ఇస్తుంది అన్న చర్చ జోరుగా జరుగుతోంది. పార్టీ పరిస్థితిపై సమీక్ష చేస్తే.. అసలు 90 నియోజకవర్గాల్లో.,. కనీసం 30 చోట్ల కూడా బలమైన అభ్యర్థులు లేనట్లుగా తేలింది. బీజేపీలో చేరేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో సీనియర్ నేతలకు టిక్కెట్లపై భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు.

ఇప్పటికే పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ మేరకు చేరికల కమిటీకి సందేశం ఇచ్చారు. పార్టీలో చేరుతామని వచ్చే వారికి.. టిక్కెట్ హామీ ఇద్దామని.. ఈ విషయాన్ని పార్టీ అగ్రనేతలతోనే చెప్పిద్దామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరే వారు తగ్గిపోయారు. ఇటీవలి కాలంలో బీజేపీకి ఊపు వచ్చినప్పటికీ.. బలమైన అభ్యర్థులు మాత్రం కనిపించడం లేదు.

2023 చివరిలో జరగనున్న ఎన్నికల కోసం… మిషన్ 90లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నరాు. ఏడాది పాటు చేయనున్న కార్యక్రమాలు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అంశాలపై కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇప్పటి నుండే ప్రజల్లో ఉండాలని కమలం పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజా అజెండాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. పార్టీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ ప్రధానంగా తెలంగాణపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల పరిణామాలతో ఆయన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీని ఓడించడాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అసంతృప్తి ఎక్కువగా ఉంది. సీనియర్లు నేతలు పార్టీని ధిక్కరిస్తున్నారు. ఈ కారణంగా అలాంటి నేతల్లో నియోజకవర్గాల్లో పట్టు ఉన్న నేతలను ఆకర్షించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మిషన్ 90లో సక్సెస్ సాధించాలంటే.. ఖచ్చితంగా వలసలు అవసరం అని బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు వస్తే టిక్కెట్ హామీ ఇస్తామని చెబుతున్నారు.

ఎంత మంది వస్తారో కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం అప్రమత్తమయ్యారు. సీనియర్ నేతలు పార్టీ వీడకుండా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్
ప్రారంభించారు. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే జాతీయ నాయకులు హైదరాబాద్ చేరుకొని వ్యూహాలను రచిస్తున్నారు. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయాలనే అజెండాతో ముందుకెళ్తున్నారు. వచ్చే ఏడాది పాటు రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టి అధికారం దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం సరికొత్త వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఏడాది పాటు చేపట్టబోయే కార్యక్రమాలను క్యాలెండర్ రూపంలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. దీనికి బీజేపీ మిషన్ 90 తెలంగాణ 2023 అని పేరు పెట్టి రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అంటే 2023 సంవత్సరంలో రాష్ట్రంలోని 90 స్థానాలే గెలుపు లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఇప్పటి నుండి ప్రజల్లో వుంటూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించనున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి అధికారం చేజిక్కించుకోవడం దీని ప్రధాన లక్ష్యం.

మరి రాష్ట్రంలో మిషన్ 90 అజెండా ఏ మేరకు పని చేస్తుంది? ఈ మిషన్ 90 ఎంతమేరకు కాషాయ పార్టీకి కలిసొస్తుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Must Read

spot_img