HomePoliticsతెలంగాణలో బీజేపీ క్షేత్రస్థాయిలో పట్టు బిగిస్తోందా..?

తెలంగాణలో బీజేపీ క్షేత్రస్థాయిలో పట్టు బిగిస్తోందా..?

  • గ్రామ గ్రామాల్లో పాగాకు ప్లాన్ సిద్ధం చేస్తోందా..?
  • వరుస పర్యటనలతో కేంద్ర నాయకత్వం సైతం వ్యూహం పన్నుతోందా..?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. ఒక పంచాయితీ తీరిందని అనుకునే సమయానికి ఇంకొకటి తెరపైకి వస్తుంది. క్రమంగా సఖ్యత
లోపించి డైరెక్ట్ ఎటాక్ కే దిగుతున్నారు హస్తం నేతలు. ఢిల్లీ నుంచి పెద్దలు రావడం.. సర్దుబాటు కార్యక్రమాలు చేయడం కామన్ అయిపోయింది.
కానీ, వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని కాన్ఫిడెంట్ గా చెబుతుంటారు ఆ పార్టీ నేతలు.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉందనేది రాజకీయ పండితుల వాదన. కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు.. రేవంత్ సొంత మైలేజ్ కోసమే తాపత్రయపడుతున్నారని విమర్శిస్తుంటారు. బీజేపీలో కూడా బండి సంజయ్ ని అలాగే టార్గెట్ చేస్తున్నవారు ఉన్నారని అనుమానిస్తున్నారు విశ్లేషకులు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చింది.

మాస్ డైలాగులతో, భారీ సభలతో ఆయన పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. ఈయన కూడా రేవంత్ మాదిరి సొంత అజెండా కోసమే తాపత్రయపడుతున్నారని కాషాయ వర్గాల్లో ఓ చర్చ ఉంది. ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ కూడా బండికే మైలేజ్ తీసుకొచ్చింది. గ్రామగ్రామాన పార్టీ బలోపేతం అంతగా జరగలేదని కమలనాథులు చర్చించుకుంటున్న పరిస్థితి.

పైగా ఈటల లాంటి ఉద్యమ నాయకుడిని పార్టీలో ఎదగనివ్వకుండా చేస్తున్నారనే టాక్ ఉంది. కాంగ్రెస్ లాగే బీజేపీ కూడా గ్రూపులుగా విడిపోయిందని.. కాషాయ నేతలు కూడా వాళ్ల మాదిరిగానే ఈసారి అధికారం తమదేనని చెబుతున్నారని రెండు పార్టీలను పోల్చి చెబుతున్నారు రాజకీయ పండితులు. అయితే.. కాంగ్రెస్ అగ్రనాయకత్వంలా చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా బీజేపీ పెద్దలు ముందుగానే గ్రహించి అన్నీ సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.

అందుకే తెలంగాణ కేంద్రంగా వరుస సమావేశాలు, టూర్లు పెట్టుకుని అప్పుడప్పుడు పార్టీ నేతలకు క్లాస్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. పాదయాత్రలు చేసి వ్యక్తిగత ఇమేజ్ లు పెంచుకోవడం కన్నా.. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని తాజాగా స్పష్టం చేసినట్లుగా వివరిస్తున్నారు విశ్లేషకులు. ఇకపై గ్రామ, గ్రామానికి వెళ్లాలని స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ లు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం వంటి వాటితో దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.

  • ప్రధాని మోడీ, అమిత్‌ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించనున్నారు..

ఇదే సమయంలో నేతల కొరతను అధిగమించేందుకు ఇతర పార్టీల్లోని వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో.. అసంతృప్త నేతలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఫిబ్రవరి నుంచి చేరికలపై మరింత ఫోకస్ ఉంటుందని తెలుస్తోంది. ఈలోపు ఎలాంటి విభేదాలు లేకుండా బండి నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా అందరూ సఖ్యతతో గ్రామగ్రామానికి పార్టీని తీసుకెళ్లాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహంచాలని నిర్ణయించారు. అలాదే 119 నియోజక వర్గాల తెలంగాణలో 9 వేల శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 56 బూత్‌ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది. ప్రతి గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.

ప్రతి శక్తి కేంద్రానికి ప్రముఖ్‌ను నియమించారు. బూత్‌ స్థాయిలో ఎలక్షన్‌ ఇంజనీరింగ్‌ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి. ఫిబ్రవరి నుంచి ప్రతి రోజూ ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.

ఫిబ్రవరిలో ప్రధాని మోదీ, హూంమంత్రి అమిత్‌ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఏ పదవిలోనూ లేని పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి ప్రజాబలం కలిగిన నేతల విషయంలో వ్యతిరేకత ప్రభావం ఉండదని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే 5 విడతల పాదయాత్ర పూర్తిచేశారు. దీంతో పార్టీకి ఊపు వచ్చింది. ఈ క్రమంలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని హైకమాండ్‌ నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసింది.

నియోజకవర్గ స్థాయిలో బలపడలేదని తేలడంతో గ్రామ, గ్రామానికి వెళ్లాలని ప్రోగ్రాం రూపొందించి నేతలు ఇచ్చింది. బూత్‌ స్థాయిలో ఎలక్షన్‌ ఇంజనీరింగ్‌ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి. ఫిబ్రవరి నుంచి ప్రతిరోజూ ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్త్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.

  • తెలంగాణలో కొంత దూకుడు ప్రదర్శించిన బీజేపీ, ఇప్పడు వ్యూహం మార్చింది..

ఒకటి రెండు చోట్ల భారీ బహిరంగ సభలు నిరహించడం వలన అంతగా ప్రయోజనం ఉండదని పార్టీ నాయకులు గుర్తించారు. అందుకే రూట్ మార్చి ఉరూరా సభలు , సమావేశాలు, నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లేదా ఇతర జాతీయ నాయులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించి భారీ బహిరంగ సభలు నిర్వహించడం వలన, పార్టీకి కొత్త జోష్ వస్తుంది. అందులో సందేహం లేదు.

అయితే, ఓట్ల లెక్కల దగ్గర కొచ్చేసరికి లెక్క మారుతుందని బీజేపే నాయకత్వం గుర్తించింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విషయం తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయి రోడ్డెక్కిన
తర్వాత, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ బలం మరింత పెరిగిందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.

అయితే రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నా జాతీయ నాయకుల భుజాల మీద నుంచి ఓటరుకు గురి పెట్టినా అంతగా ప్రయోజనం ఉండదని అందుకే నేరుగా ఓటరు ఇంటి తలుపు తట్టాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. అలాగని జాతీయ నేతల పర్యటనలు పబ్లిక్ మీటింగ్స్ ఉండవా అంటే, ఉంటాయి, కానీ, ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి, స్థానిక సమస్యలకు జాతీయ పరిష్కారాలపై చర్చించడంపై దృష్టిని కేద్రేకరించాలనే నిర్ణయంతో బీజేపీ కొత్త ప్రణాళికను సిద్డం చేసినట్లు చెపుతున్నారు.

ఇపుడు రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యామ్నాయం బీజేపీ అని అంతా అంగీకరిస్తున్నారు. చివరకు జైరాం రమేష్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని ఒప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కమల దళం ఇక క్షేత్ర స్థాయిలో బలపడాలన్న ఆలోచనకు వచ్చింది. అందుకే.. గ్రామ, గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంది.

ముఖ్య నాయకుల పాదయాత్రలు, బస్సు యాత్రల సంగతి ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో సిట్టింగ్, మాజే ఎమ్మెల్యేలతో పాటు, నియోజక వర్గ స్థాయి నేతలు పెద్ద ఎత్తున పార్టీ చేరతారని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు పార్టీ రాష్ట్ర నాయకత్వ మార్పు, కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి మరొకరికి స్థానం కల్పించే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటుగా, 2024 లోక్ సభ ఎన్నికలో 12 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునే వ్యూహంతో కమల దళం కదులుతోందని అంటున్నారు. అయితే, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తొలిగించి ఆ బాధ్యతలను ఈటల రాజేందర్ కు అప్పగించే విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది.

మరి బీజేపీ ఏమేరకు పట్టు నిరూపించుకుంటుందో.. తేలాలంటే, వేచి చూడాల్సిందే.

Must Read

spot_img