ఆ దేశం చాందస విధానాలతో విభేదిస్తూండటంతో సైన్యం వారిని అణచివేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోంది. అది ఎంత వరకు వచ్చిందంటే హిజాబ్ ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై విషం ప్రయోగించడానికి కూడా అక్కడి సైన్యం వెనుకాడటం లేదు. తాజాగా వందలాది మంది బాలికలకు అలాంటి విష ప్రయోగం జరిగిందని వార్తలు వస్తున్నాయి.. ఇరాన్‌లో వందలాది మంది విద్యార్థినులపై విషప్రయోగం జరిగిందని సమాచారం. ఎందుకంటే ఇరాన్ , ఆఫ్ఘనిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది.
ఆయా దేశాల్లోని పాలకులు మహిళలు, బాలికల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇరాన్ లో బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారిపై విషప్రయోగం చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఇరాన్ మంత్రి యునెస్ పనాహీ స్వయంగా వెల్లడించారు. గతేడాది నవంబరు చివరి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ విష ప్రయోగం ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు చెప్పారు. ‘ఖోమ్ పాఠశాల్లో చాలా మంది బాలికలపై విషప్రయోగానికి పాల్పడుతున్నారు. బాలికల పాఠశాలను మూసివేసి, వారిని విద్యకు దూరం చేసేందుకే ఇలా చేస్తున్నారు.
కొందరు కుట్రపూరితంగానే ఇలా చేస్తున్నట్టు గుర్తించాం. విద్యా సంస్థలను ముఖ్యంగా మహిళలు చదివే పాఠశాలను మూసేయాలనే దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఇలాంటి కేసులు వందలాదిగా నమోదయ్యాయి. బాధిత బాలికల్లో కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. విషప్రయోగం కారణంగా బాలికలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు’ అని మంత్రి చెప్పినట్టు ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ తెలిపింది. అయితే ఈ కుట్ర వెనుక ఎవరున్నారన్న విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే ఈ ఘటనలో ఇంతవరకు ఎలాంటి అరెస్టు చోటుచేసుకోలేదని తెలుస్తోంది. కాగా, విషప్రయోగం కారణంగా అస్వస్థతకు గురైన బాలికల తల్లిదండ్రులు ఫిబ్రవరి 14న ఖోమ్ నగర గవర్నర్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు.

కొన్ని దశాబ్దాలుగా అమెరికా డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ భారీగానే పతనమవుతోంది. 1979లో ఇస్లామిక్ విప్లవం సమయంలో డాలరుకు 100 రియాల్స్ వద్ద ట్రేడ్ అయిన ఇరానియన్ కరెన్సీ.. క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2015లో జరిగిన న్యూక్లియర్ ఒప్పందం తర్వాత ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేశారు. ఆ సమయంలో ఇరాన్ కరెన్సీ విలువ అమెరికా డాలరుకు 32,000 రియాల్స్‌గా ఉంది. తాజాగా అక్కడ హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఎక్కువ కావడంతో పాశ్చాత్య దేశాల ఆంక్షలు మొదలయ్యాయి. ఇలా గత ఆరు నెలల కాలంలో ఇరాన్ కరెన్సీ విలువ 60శాతం పతనమైంది. గత ఆగస్టులో 3లక్షల రియాల్స్‌గా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారానికి 5లక్షల రియాల్స్‌కు చేరువైంది. తాజాగా మరింత దిగజారి 6లక్షల రియాల్స్‌తో అత్యంత కనిష్ఠానికి చేరుకుంది.
మరోవైపు ఇరాన్‌లో 2021 జనవరిలో 41.4గా ఉన్న ద్రవ్యోల్బణం రేటు ప్రస్తుతం 53.4శాతానికి చేరినట్లు అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం తమ కరెన్సీని భారీగా ఖర్చుచేయాల్సి వస్తోంది. అయితే, మనీలాండరింగ్‌తో ఇరాన్, సిరియా దేశాలకు అక్రమంగా నగదు తరలివెళ్లడం వల్లే ఇరాన్‌కు డాలర్ల బదిలీపై అమెరికా ఆంక్షలు విధిస్తోందని అక్కడి బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. పరిస్థితులు మరికొంతకాలం ఇలాగే కొనసాగితే అక్కడి పౌరులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదనే భయాలు మొదలయ్యాయి. ఇలా భారీ స్థాయిలో కరెన్సీ విలువ పడిపోతోన్న నేపథ్యంలో అక్కడి పార్లమెంటు అత్యవసరంగా సమావేశమై చర్చించినట్లు సమాచారం. ఇదిలాఉంటే, ఇరాన్ అధికారిక కరెన్సీ రియాల్. కానీ, అక్కడి ప్రజలు స్థానిక అవసరాల కోసం తోమాన్‌ను వినియోగిస్తారు.