Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయ మహిళా దినోత్సవం..!!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం..!!!

ఏడాది కోసారి ఆనవాయితీగా వచ్చే ఓ రోజునే మరోసారి జరుపుకోబోతున్నాం..ఆకాశంలో సగం..అన్నింటా సగం’ అంటూ మహిళల పట్ల ఆ ఒక్కరోజు గౌరవభావం ప్రకటించడం చేస్తుంటాం.. అలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసలా రోజు ఎలా పుట్టుకువచ్చిందో అన్నవిషయాలను గురించి తెలుసుకోవాలి. నిజానికి అత్యంత ప్రాచీన కాలం నుంచే పురుషాధిక్య ప్రపంచం మహిళలను దూరం పెట్టిందనడంలో సందేహం లేదు. మహిళలకు ఎటువంటి హక్కులు ఉండేవికావు. కానీ పోరాడితే పోయేది లేదు బానిస సంకెళ్లు తప్ప అనే పిలుపు మహిళల్లో చైతన్యస్ఫూర్తిని రగిలించింది. పురుషాధ్యికత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఈనాటికి కూడా పోరాటాలు చేయక తప్పడం లేదు .

ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపుట్టుకమీద అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. దుర్భర దుస్థితుల నుంచి పోరాటం స్ఫూర్తితో పుట్టింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రంలోని చికాగో నగరంలో ప్రారంభమైన మహిళా దినోత్సవం ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మహిళల పోరాటంలోంచి కార్మిక ఉద్యమం నుంచి పుట్టిందీ మహిళా దినోత్సవం.. మహిళలు తమ బాధలు, సమస్యలను చర్చించుకోవడానికి, నలుగురితో పంచుకోవడానికి ఒక రోజు ఉండాలని నిర్ణయించారు మహిళలు. ఆ రోజును మహిళా దినోత్సవంగా ప్రకటించారు. తొలిసారి అమెరికాలోని చికాగోలో మహిళా దినోత్సవానికి 1908లోనే బీజాలు పడ్డాయి.

మహిళలకు పనిగంటలు, పనికి తగిన వేతనం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. వారి డిమాండ్లతో అమెరికాలోని సోషలిస్టుపార్టీ 1909వ సంవత్సరంలో ఫిబ్రవరి 28న జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌’ సదస్సులో క్లారా జెట్కిన్ ఈ ప్రతిపాదన చేశారు.

17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అలా కొన్ని దేశాలు మినహయిందిచ చాలా దేశాలలో మహిళలకు ఓటుహక్కు, సమానహక్కు సాధించడానికి ఇలాంటి సమావేశాలు నాందిపలికాయి. 1911 మార్చి 19న 10 లక్షల మందికి పైగా ఆస్ట్రియా, డెన్మార్క్‌, స్విట్జర్లాండ్‌ దేశంలో మహిళలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ఓటుహక్కు, ప్రభుత్వ పదవులు కావాలని డిమాండ్‌ చేశారు. ఉపాధిలో లింగ వివక్షను వ్యతిరేకించారు. అమెరికాలో మాత్రం ప్రతి ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1913లో తొలిసారిగా రష్యన్‌ మహిళలు ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని జరిపారు. మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను ఒక్కో దేశంలో ఒక్కో పద్దతిలో చేశారు. కానీ ఎవరు ఎటువంటి పద్ధతిలో పోరాటాలు చేసినా అవన్నీ మహిళల హక్కుల కోసమే జరిగాయి.

1914 నుంచి చాలా దేశాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహిళల పోరాటాలతో సాధించిన విజయాలను ఒకసారి చూస్తే.. 1814లో జర్మనీలో మహిళా దినోత్సవం నిర్వహించి ఓటుహక్కు కావాలని తీర్మానం చేశారు. కానీ వారెంత పోరాటం చేసినా 1918 వరకు మహిళలకు అక్కడ ఓటుహక్కు లభించలేదు. 1917లో(గ్రెగెరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం మార్చి8న ‘సెయింట్‌ పీటర్‌బర్గ్‌ మహిళలు మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలో ఆహార కొరత నివారించాలని డిమాండ్ చేశారు. అదే రోజున వస్త్ర పరిశ్రమలోని మహిళా శ్రామికులు అధికారుల హెచ్చరికలను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి..హక్కుల కోసం నినాదాలు చేశారు. మార్చి 8న అధికారిక సెలవుగా ప్రకటించడానికి బోల్షెనిక్‌, అలెగ్జాండర్‌,కొలెవ్టైల్‌లు వ్లాదిమిర్‌ లెనిన్‌ను ఒప్పించారు. కానీ అది 1965 నాటి దాకా అమల్లోకి రాలేదు.

చైనాలో 1922 నుంచి మహిళా దినోత్సవాన్ని ప్రకటించినా దానిని సగం సెలవు రోజుగా ప్రకటించింది డ్రాగన్ దేశం. 1977 తర్వాత ఈస్టర్న్ కంట్రీస్ లో మహిళా దినోత్సవానికి ప్రత్యేకత వచ్చింది. మహిళల హక్కులు, ప్రపంచ శాంతి దినంగా మార్చి 8ని ప్రకటించాలని పిలుపువచ్చింది. అమెరికా 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది. కాగా..ఇన్ని పోరాటాలు చేసినా..ఇన్ని త్యాగాలు చేసినా ఇంకా మహిళల సాధికారత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండటం దృరదృష్టకరం. మహిళ కోసం వారి హక్కుల కోసం ఓ రోజును సాధించుకోవటానికి ఆనాటి మహిళా మణులు చేసిన పోరాటాలు ఎన్నో ఎన్నోన్నో.. దిశను..నిర్ధేశాన్ని వారే రచించుకున్నారు.

మహిళా దినోత్సవాన్ని సాధించుకోవడానికి పలు దేశాల్లోని మహిళలు దశాబ్దాలుగా పోరాటాలు చేయాల్సి వచ్చింది. మహిళలు అంతరిక్షం నుంచి కుటుంబం దాకా సాధించిన ప్రగతి ఒక్క రోజులో సాధ్యం కాలేదు. ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న విజయంగా ఈ రోజు గురించి చెబుతారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిలిచిన మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు. మహిళా దినోత్సవం జరుపుకోవటం ప్రారంభమై 100ఏళ్లు దాటినా ఇంకా మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులు కూడా వారికి దక్కడం లేదు. ఇది నిజంగా విచారకరమని అంటున్నారు విశ్లేషకులు. బాలికలు, మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్య ఏదో ఓ చోట ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. భారత రాజ్యాంగం మహిళలకు ఎన్నో హక్కులు కల్పించింది. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గవాటి గురించి చూద్దాం.. వారసత్వంలో సమాన వాటా హక్కు వారి ప్రథమ హక్కుగా చెబుతున్నారు. హిందూ వారసత్వ చట్టం 1995 ప్రకారం వారికి సోదరులతో సమానంగా ఆస్థి హక్కులు ఉంటాయి. కానీ వాటి అమలు జరగడం లేదు.

లింగ నిర్ధారణ పరీక్షల చట్టం 1994 ప్రకారం భ్రూణ హత్యల నిరోధక హక్కు మహిళలకు లేదు. వారు స్వంతంగా ఆలోచించి తీసుకునే ఈ హక్కు ఇంట్లో పెద్దవారి ఆలోచనల మేరకే జరుగుతుంటుంది. గృహ హింస నిరోధక హక్కు మాత్రం ఇప్పుడు ప్రతీచోటా అమలు జరుగుతోంది. అయితే గృహ హింస నిరోధక చట్టం 2005ను మహిళలు దుర్వినియోగపరుస్తున్నారనే విమర్షలు కూడా ఉన్నాయి. అయితే ఈ హక్కు మహిళలకు బ్రహ్మాండంగా పనికి వస్తోందని మహిళలు చెబుతున్నారు. ఇకపోతే ప్రసూతి ప్రయోజనాల హక్కు..అంటే ప్రసూతి ప్రయోజనాల హక్కు 1961 చట్టం ప్రకారం ప్రభుత్వాలు కొన్ని పథకాలను అమలుచేయడాన్ని అన్వయించుకోవచ్చు. లీగల్‌ సర్వీస్‌ అథారిటీ 1987 సెక్షన్‌ 12 ప్రకారం కోర్టులు మహిళలకు న్యాయ సహాయ హక్కు కల్పిస్తోంది. గోప్యత హక్కు విషయంలో సి.ఆర్‌.పి.ఎఫ్‌ సెక్షన్‌ 12 వారికి రక్షణగా ఉంటోంది.

అలాగే..ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల హక్కు విషయానికొస్తే ‘జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌ అన్నది వారికి వరంగా మారింది., అరెస్టు కాకుండా సి.ఆర్‌.పి.ఎఫ్‌ సెక్షన్‌ 46 ప్రకారం రక్షణ లభించేలా చేసింది. పోలీసు స్టేషన్‌కి వెళ్లకుండా వుండే హక్కు ‘సి.ఆర్‌.పి.ఎఫ్‌ సెక్షన్‌ 160’ ద్వారా లభిస్తోంది. పురుషులతో సమాన వేతన హక్కు కూడా ‘ఈక్వల్‌ రెమ్యునరేషన్‌ చట్టం 1976 ప్రకారం వచ్చింది. పని ప్రదేశాల్లో వేధింపులకు అడ్డుకట్ట వేయడం విషయంలో‘లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 వారికి రక్షణ చక్రంలా పనిచేస్తోంది. ప్రైవసీ విషయంలో పేరు చెప్పకుండా వుండే హక్కును ‘సి.ఆర్‌.పి.ఎఫ్‌- సెక్షన్‌ 228 ఎ’ కల్పిస్తోంది. ఇవీ ప్రధానంగా మహిళలకు ఇన్న పన్నెండు హక్కులు..వీటిని పన్నెండు ఆయుధాలుగా వాడుకుని తమపై జరుగుతున్న అన్యాయాలను మహిళలు ఎదుర్కోవచ్చు. అయితే వీటిపై అవగాహన లేని కారణంగా ఇన్ని హక్కులు రాజ్యాంగం కల్పించినా సమాజంలో స్త్రీల పరిస్థితులు అధ్వాన్నంగానే వున్నాయి.

Must Read

spot_img