ప్రపంచంలో రోజురోజుకూ పెరుగుతున్న కొత్త టెక్నాలజీతో కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. కష్టం ఖర్చు కాకుండా సమయం వృధా కాకుండా వేగంగా అనుకున్న పని క్షణాల్లో పూర్తయ్యే విధంగా కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. సామాన్యుడు మొదలుకొని పెద్దపెద్ద కంపెనీల్లో పనిచేసే వర్కర్లు వరకు సులువుగా పని చేసేందుకు ఆధునిక పరికరాలను వాడుతున్నారు. దీంతో సమయం ఆదా అవ్వడంతో పాటు ఒక మనిషి చేసే పనిగంటలు పెరుగుతున్నాయి.
అదే విధంగా మారుతున్న కాలానుగుణంగా పేదవారు సైతం తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త టెక్నాలజీతో సమానంగా కొత్తకొత్త యంత్రాలను రూపొందిస్తున్నారు. అయితే ఇది ఆర్థిక పరిపుష్టితో ఉన్న దేశాలలో కనిపిస్తుంది. కానీ ఆఫ్రికా లాంటి పేద దేశాలలో అలా సాధ్యం కాదు.. ఉన్నంతలో సర్దుకుపోవాల్సి ఉంటుంది. అక్కడే క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఎందుకంటే మనం వింటుంటాం..అవసరం నూతన ఆవిష్కరణాలను వెలికితెస్తుంది.
అందుకే ‘నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్..’అంటారు. అంటే అవసరం నూతన ఆవిష్కరణాలకు తల్లిలాంటిదని అర్థం. ఈరోజటి ఇండెప్త్ లో ఓ రెండు దేశాలలో ప్రజలు తమ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రయాణసాధనాలను చూద్దాం.. ఆ ప్రాంతాల పరిస్థితులను బట్టి తమకున్నంతలో స్రుష్టించుకున్న ఈ రెండు ప్రయాణ మాధ్యమాలు అక్కడ సూపర్ పాపులారిటీని సంపాదించుకున్నాయి సంపన్నదేశాలలో మెట్రో రైళ్లు, బులెట్ ట్రెయిన్లు దూసుకుపోతుంటే ఆఫ్రికా లాంటి పేదదేశాలలో మాత్రం ఇవే వారి అవసరాలను తీరుస్తున్నాయి.
జనం జీవనాడులుగా మారుతున్నాయి. వారి నిత్యజీవిత అవసరాలను తీరుస్తున్నాయి. రవాణా సౌకర్యాలు సరిగ్గా ఉన్నప్పుడు అభివ్రుద్ది ఆకాశం వైపు దూసుకుపోతుంది. అయితే అత్యాధునిక రవాణా సౌకర్యాలు లేని చోట జనానికి ఇవే సాయపడుతున్నాయి.
- కొత్త టెక్నాలజీతో కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి..
మొదట వచ్చేది చుకుడూ.. చుకుడూ అంటే ఓ రెండు చక్రాల రవాణా వాహనం..అచ్చం చిన్న పిల్లలకు నడక నేర్పించేందుకు మనం చూసిన మూడు చక్రాల తోపుడు బండిలాగే ఉంటుంది. కాకపోతే ఇది రెండు చక్రాలపై నడుస్తుంది. చుకుడూ ని నడిపించడానికి చుక్క ఇంధనం అవసరం లేదు. సెంట్రల్ ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ చుకుడూ ఎంత పాపులర్ అంటే..చుకుడూ లేనిదే అక్కడ తెల్లవారదంటే అతిశయోక్తి కాదు.
నిజానికి కాంగో పేద దేశం..అక్కడి ప్రజలకు వేగంగా దూసుకుపోయే రవాణా అన్నది కలలో మాటగానే ఉంటుంది. ఇప్పట్లో వారికి అది సాధ్యం కాదు..అందుకే వారి అవసరాలకోసం వారే తమకు తోచిన విధంగా ఉపకరణాన్ని స్రుష్టించుకున్నారు. ఆ ఉపకరణమే ‘చుకుడూ’..తయారీకి తప్ప ఆ తరువాత పెద్దగా ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక్కసారి తయారు చేసిన తరువాత మూడేళ్లపాటు నిక్షేపంగా ఉపయోగపడుతుంది.
ఆపై చిన్న చిన్న మెయింటెయినెన్స్ చేస్తే మరింత కాలం నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. గట్టిగా ఉండే కర్రతో చేసిన ఈ ద్విచక్రవాహనం ఎక్కువగా కాంగో దేశంలోనూ, ఫిలిప్పీన్స్ లోనూ కనిపిస్తుంది. చుకుడూ టూ వీలర్ ను కాంగోలోని తూర్పు ప్రాంతంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఒకప్పుడు భారతదేశంలో ప్రతి మధ్యతరగతి వ్యక్తి సైకిల్ ను ఎలా ఉపయోగించారో అదే విధంగా కాంగో దేశంలో ఈ చుకుడు వాహనాన్ని జనం ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.
ఇది రెండు చక్రాల సైకిల్ కన్నా ఆటో ట్రక్కు మోసేంత బరువును తేలికగా మోస్తుంది. ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తుంది. దాంతో సరుకుల రవాణాకు పనికిరావడంతో పాటు సామాన్యులకు ఉపాది కలిపిస్తోంది. అయితే ఎత్తైన ప్రదేశాలలో మాత్రం మరో మనిషి సహాయం అవసరమవుతుంది. దిగువ ప్రాంతంలో అయితే చుకుడూ ఆపరేటర్ కూడా దానిపైనే ప్రయాణం చేసే వీలుండటం ఈ వాహనం ప్రత్యేకత.
- చుకుడు వాహనాన్ని ఎలా తయారు చేస్తారన్నది ఆసక్తి కరంగా ఉంటుంది..!
చుకుడు వాహనాన్ని పూర్తి చెక్కతో తయారు చేస్తారు. దీనికి రెండు చెక్క చక్రాలు కూడా ఉంటాయి. ఆ చెక్క చక్రాలకు టైర్ లాంటి రబ్బర్‌ను చుడతారు. స్కూటర్ కు ఉన్నట్టే దీనికో హ్యాండిల్ ఉంటుంది. ఇది నడిపే వ్యక్తి ఒక కాలును వాహనం పైన ఉంచుతాడు. మరో కాలుతో నెట్టుకుంటూ చుకుడూను ముందుకు తోస్తూ నడిపిస్తాడు. వెనుక చక్రం బ్రేక్ వేయడానికి వీలయ్యేలా ఏర్పాటు ఉంటుంది.
దాన్ని కాలితో నొక్కిపడితే ఆ చుకుడు వాహనం ఎంత వేగంతో ఉన్నా ఇట్టే ఆగిపోతుంది. చుకుడు వాహనాన్ని గట్టిగా ఉండే యూకలిఫ్టస్ కలపతో తయారు చేస్తారు. వీల్ ట్రెడ్స్ కోసం పాత టైర్లను ఉపయోగిస్తారు. ముందు చక్రం వెనుక చక్రం కన్నా పెద్దగా ఉంటుంది. ఒక కాలును పైన ఉంచి మరో కాలుతో నెట్టుకుంటూ నడిపిస్తారు. చుకుడూ తయారీకి ఒకటి నుంచి మూడు రోజులు సమయం పడుతుంది.
ఈ వాహనాల సామర్థ్యం రెండు, మూడు సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. చుకుడూ వాహనం పరిమాణం 6.50 అడుగుల పొడవు ఉంటుంది. 1000 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. అతిపెద్ద చుకుడూ 800 కేజీల బరువును కూడా ఇట్టే మోయగలదు. చిన్న పిల్లలు వాడుకునే చుకుడును మూడు గంటల్లో నిర్మిస్తారు. డైమెన్షనల్ కలపతో పాటు మార్కెట్లో లభించే హార్డవేర్ మెటీరియల్ తోనూ దీన్ని తయారు చేయవచ్చు.
అయితే నాణ్యత పెంచుకునే కొద్దీ ఖరీదు పెరుగుతూ పోతుంది. దీనిపై అన్ని రకాల సరుకులను రవాణా చేస్తున్నారు. కట్టెలు, బస్తాలు, పెద్దపెద్ద కర్ర మొద్దులు, ఇంటి సామాగ్రి, ఐరన్ పనిముట్లు, మంచినీళ్లు కిరాణా సరుకులను సులువుగా రవాణా చేయవచ్చు. మన దేశంలో ఆటో రిక్షాలపై ఆధారపడి ఎలా జీవనం సాగిస్తున్నారో కాంగో దేశంలోనూ చాలా మందికి చుకుడూ ఓ రిక్షా లాగా ఉపయోగపడుతూ జీవనోపాది కల్పిస్తోంది.
ఇక ఆఫ్రికాలోని కామరూన్ మరో చోట హై కెపాసిటీ మోటర్ సైకిల్ ను మాడిఫై చేసి కనీసం 8 మందికి మోటార్ సైకిల్ ద్వారా టాక్సీ సౌకర్యం కల్పిస్తున్నారు. చాలా తేలికగా బండెడు సామానుతో పాటు జనం వీటిలో ప్రయాణిస్తున్నారు. తక్కువ ఖర్చుతో టాక్సీ అవసరాలు తీరుస్తుండటంతో పాటు వందలాది మంది బైకర్స్ కు ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే వీటిని చూడటం కాస్త భయంగానే ఉంటుంది.
హెల్మెట్ పెట్టుకున్న బైక్ డ్రైవర్ సేఫ్ గానే ఉంటాడు కానీ వెనక ఉన్నఎనిమిది మంది ఆడా మగా జనం రెండు చేతుల్లో సామాన్లయితే ఉంటాయి కానీ హెల్మెట్ పెట్టుకోవడం కనిపించదు. పెద్ద శబ్దంతో ఆఫ్రికాలోని దుమ్ము రేగిపోయే రోడ్లపై రైలింజన్లలా దూసుకుపోతుంటాయి. వాహనంపై ఎనిమిది మంది జర్నీ చేయడం లారీ, కార్లలోనూ అనుమతించడం జరగదు. కానీ కామరూన్ లో అంతే..బలిష్టంగా కనిపించే మోటర్ సైకిల్ మూడు మీటర్ల పొడవుంటుంది.
అంటే పదడుగులన్నమాట. రెండు మోటర్ సైకిల్ చాసిస్ లను జోడించడం, వాటికి సరైన విధంగా సస్పెన్షన్ కలుగజేయడం చాలా ముఖ్యం. ఈ పనులను లోకల్ కామరూన్ మెకానిక్ లు ఆడుతూ పాడుతూ చేస్తుంటారు. అలా వాటిని పునర్నిర్మాణం చేయడంతో బైక్ టాక్సీలు రోడ్డుపైకి వస్తాయి. రోడ్డు పైకి రాగానే వారికి ప్రయాణీకులు కూడా సిధ్దంగా ఉంటారు. ఎందుకంటే ఈ బైకులే కామరూన్ ప్రాంతంలో జనానికి బాగా నచ్చే పాపులర్ ప్రయాణసాధనం.
వీటినే స్ట్రెచ్ బైక్ లని కూడా అంటారు. రైతులు తమ ధాన్యాన్ని సమీప గ్రామాలకు సరఫరా చేయడానికి కూడా వీటినే ఉపయోగిస్తున్నారు. ఈ జైంట్ బైకుల వల్లే తమ ఉత్పత్తులను మంచి చేటుకు అమ్ముకుంటున్నామని అంటున్నారు రైతులు. కార్లు ఇతర వాహనాలు పోలేని చోట్లకు ఇవి తేలికగా వెళుతుంటాయి. కాలి బాట ఉంటే చాలు ఇవి దూసుకుపోతాయి. మిగిలిన వాహనాలకు అది సాధ్యం కాదు. అక్కడి ప్రభుత్వాలు మంచి రోడ్లు వేస్తాయన్న నమ్మకాలు వారు పెట్టుకోలేదు.
ఆ కచ్చా దారుల్లోనే తమ అవసరాలను ఇలా తీర్చకుంటున్నారు. అందుకే మనం ముందు చెప్పుకున్నాం. అవసరం మనిషికి కొత్త ఉపాయాలను నేర్పిస్తుంది.