Homeఅంతర్జాతీయంఇండో రష్యా క్రూడ్ రిలేషన్..

ఇండో రష్యా క్రూడ్ రిలేషన్..

రష్యా నుంచి భారత్ కు వస్తున్న చమురు గురించి అమెరికాతో సహా యూరప్ దేశాలకు ఎక్కడలేని జెలసీ ఏర్పడింది. ఎంత ధరపెట్టినా దొరకని చమురును తక్కువ రేటుతో భారత్, చైనాలకు సరఫరా చేస్తున్నరష్యాపై పీకల్లోతు ఆగ్రహంగా ఉన్నాయి సదరు దేశాలు. అయితే ఆపద సమయంలో రష్యా తన మిత్రదేశాల వెంటే ఉండటం కొత్త విషయమేం కాదు. తాజాగా రష్యాపై జీ7 దేశాలు విధించిన ప్రైస్ క్యాప్ ను భారత్ వ్యతిరేకించడంపై రష్యా హర్షం వ్యక్తం చేసింది..

ఆపద సమయంలో రష్యా తన మిత్రదేశాలకు అండగా ఉంటుంది. దానిని ఎటువంటి కష్ట సమయంలోనైనా నిలబెట్టుకుంటుంది. అలాగే ఎన్నో సందర్భాలలో భారత్ వెంటే అండగా నిలిచింది. తాజాగా రష్యా విక్రయించే చమురు ధరలపై జి-7 దేశాలు ఆంక్షలు విధించడాన్ని భారత్‌ వ్యతిరేకించింది. దీనిపై రష్యా హర్షం వ్యక్తం చేస్తూ చౌక ధరలో చమురు కొనుగోళ్ళను కొనసాగించేందుకు మరింత సహకారం అందించనుంది.

ఇందుకు భారీ సామర్ధ్యం ఉన్న ఓడల నిర్మాణం, లీజుల విషయంలో భారత్‌కి సహకరిస్తామని ముందుకు వచ్చింది. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యా చమురు విక్రయాలపై ఆంక్షలు విధించాయి. చమురు ఉత్పత్తి చేసే ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు సుముఖంగా లేవు.

దీంతో ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపధ్యంలో భారత్‌ వంటి చిరకాల మైత్రిగల దేశాలకు చమురును విక్రయించేందుకు రష్యా సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన దేశాన్ని గతంలోనూ ఎన్నోసార్లు రష్యా ఆదుకుంది. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోరాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలు విధించినప్పుడు కూడా ఇలాగే ఆదుకుంది. అలాగే, గల్ఫ్‌ యుద్ధం సమయంలో కూడా మన దేశానికి రష్యా చమురు విషయంలో అండగా నిలిచింది.

ఈ కారణంగానే ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యా తో తెగతెంపులు చేసుకోవాలని అమెరికా, దాని మిత్ర దేశాలుఎంత ఒత్తిడి చేసినా మన దేశం తటస్థ వైఖరినే అనుసరించింది. రష్యాపై ఆంక్షల విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాలపై ఓటింగ్‌ విషయంలో తటస్థంగా వ్యవహరించింది.

ఈ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మన దేశాన్ని సుతిమెత్తగా హెచ్చరించారు. అయినా మన దేశం బైడెన్ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. రష్యా నుంచి భారీ డిస్కౌంట్‌తో మన దేశం చమురు కొనుగోలు చేసింది. ప్రచ్చన్నయుద్ధం సమయంలో కూడా రష్యా, అమెరికాల మధ్య ఎన్ని తగాదాలున్నా, మన దేశానికి అవసరమైన ముడి చమురు, యుద్ధ సామగ్రి సరఫరా విషయంలో రష్యా ఉదారంగానే వ్యవహరించింది.

అలాగే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కి శాశ్వత సభ్యత పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లోవ్రోవ్‌ స్పష్టం చేశారు.గతంలో చాలాసార్లు ఈ విషయంలో రష్యా మనకు బాసటగా నిలిచింది. అమెరికాను లెక్కచేయకుండా క్షిపణి నిరోదకవ్యవస్థలను అమ్మకం జరిపింది.

తాజాగా ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాన్నిఉదహరిస్తూ ఎవరినీ రెచ్చకొట్టకుండా భారత్‌ సంయమనంతో వ్యవహరిస్తోందనీ, పెద్ద మనిషి తరహా లో సలహాలిస్తోందనీ, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ పరిపక్వతకు ఇది నిదర్శనమని అన్నారు. అంతేకాక, భారత్‌ గతంలో జరిగిన యుద్ధాల సమయాల్లో కూడా ఇదే విధమైన సంయమన వైఖరిని అనుసరించిందని ఆయన అన్నారు.

భద్రతా మండలిలో భారత్‌ వంటి పరిపక్వత గల దేశాలుంటే అసలు పరిస్థితులు యుద్ధాల వరకూ రానేరావు. భద్రతా మండలిలో తనకు గల సభ్యత్వాన్ని చైనా ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ద్వారా దుర్వినియోగం చేసుకుంటోంది. చమురు వాణిజ్యం విషయంలో కూడా అమెరికా అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడంలో భారత్‌ ఎంతో సంయమనంతో వ్యవహరిస్తోంది.

అమెరికా అనుసరిస్తున్న విధానాల వల్లనే ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గిస్తామని ప్రకటించాయి..!

చమురు నిల్వలను వీలైనంత ఎక్కువ సేకరించి అధిక ధరకు అమ్ముకోవడం అమెరికాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఈ విషయంలో చాలా కాలంగా అమెరికాను వర్ధమాన దేశాలు విమర్శిస్తున్నాయి. అయితే, ఒపెక్‌ దేశాల్లో అతి సంపన్న దేశమైన సౌదీ అరేబియాతో అమెరికా మైత్రిని కొనసాగిస్తూ తన అవసరాలమేరకు చమురును సేకరిస్తోంది. అభివృద్ధి చెందుతున్న, వర్ధమాన దేశాల ప్రయోజనాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా వ్యవహరిస్తోంది.

జి-7 దేశాల ప్రైస్ క్యాప్ నిర్ణయం వెనుక అమెరికా హస్తం ఉంది.ఈ విషయం రష్యాకు తెలుసు. అందుకే, భారత్‌కి చమురు విషయంలో ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేస్తామని మరోసారి భరోసా ఇచ్చింది.

Must Read

spot_img