Homeక్రీడలుక్రికెట్భారత మహిళా క్రికెట్ నాకౌట్ దశను దాటడం లేదా..?

భారత మహిళా క్రికెట్ నాకౌట్ దశను దాటడం లేదా..?

భారత మహిళా క్రికెట్ నాకౌట్ దశను దాటడం లేదా..? వరుసగా మూడు టీ 20 ప్రపంచ కప్ లోనూ ఇంటి దారి పట్టిందా..? టైటిల్ దరిదాపుల్లోకి వస్తూనే, బోల్తా పడుతుండడం చర్చనీయాంశంగా మారిందా..? అసలు వరుస ఓటములకు కారణమేంటి..? మహిళా టీం ఓటమికి సరైన కోచ్, ట్రైనింగ్ లేకపోవడమే కారణమా..? బ్యాటింగ్, బౌలింగ్ లోనూమహిళా క్రికెటర్లు రాణించకపోవడంపై క్రీడాభిమానులు ఏమంటున్నారు..?

డబ్ల్యూపీఎల్ .. భారత మహిళా జట్టుకు .. వరంలా మారిందా..? అయినప్పటికీ మహిళా ఆటగాళ్లు .. నాకౌట్ దశను దాటలేకపోతున్నారా..? దీనిపై క్రీడాభిమానులు, నిపుణులు ఏమంటున్నారు..? దీనివల్ల క్రికెట్ మహిళా టీంపై ఎటువంటి ప్రభావం చూపించనుంది..? అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నా.. నాకౌట్ దశ ను దాటలేకపోవడం చర్చనీయాంశమవుతోంది.

2018 సెమీఫైనల్‌.. 2020 ఫైనల్‌.. 2023 సెమీఫైనల్‌. ఇలా వరుసగా మూడు టీ20 ప్రపంచక్‌పల్లోనూ కీలక దశలో భారత మహిళల జట్టు ఇంటిదారి పట్టింది. కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్‌ ఓటమి కూడా దీనికి అదనం. టైటిల్‌ దరిదాపులకు వస్తూనే బోల్తా పడుతుండడం హర్మన్‌ప్రీత్‌ సేనకు అలవాటుగా మారుతోంది. దీంతో నాకౌట్‌ మ్యాచ్‌ల్లో గెలిచే సత్తా జట్టుకు లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదారేళ్ల క్రితం వరకూ భారత మహిళల క్రికెట్‌ జట్టు గెలుపోటములను ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ 2017 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత పరిస్థితి ఎంతగానో మారింది. ఆ టోర్నీలో రన్నర్‌పగా నిలవడంతో దేశంలో మహిళల క్రికెట్‌ రూపురేఖలే మారాయి. ప్రస్తుత జట్టులో
స్టార్‌ క్రీడాకారిణులకు కొదువ లేకున్నా.. ఇప్పటికీ ఐసీసీ టైటిల్‌ మాత్రం ఊరిస్తూనే ఉంది. తాజా టీ20 ప్రపంచకప్‌ సెమీస్ లో గెలుపు అంచుల వరకు వెళ్లి కూడా నిరాశే ఎదురైంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ అనూహ్య రనౌట్‌ జట్టు ఫలితాన్ని మార్చేసింది.

2017 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత 2018 టీ20 వరల్డ్‌కప్‌ సెమీ్‌సలో ఇంగ్లండ్‌పై, 2020 టీ20 వరల్డ్‌కప్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్స్‌లో ఆసీస్‌ చేతిలోనే ఓడడం గమనార్హం. ప్రస్తుత మెగా టోర్నీలో భారత ప్రదర్శన స్థాయికి తగ్గట్టుగా లేదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో పాక్‌ జట్టు భారత బౌలర్లను సులువుగా ఎదుర్కొని 149 పరుగులు చేయగలిగింది. అలాగే విండీస్ తో మ్యాచ్‌లో 119 పరుగుల ఛేదన కోసం 18.1 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బౌలర్లు ఫర్వాలేదనిపించినా.. బ్యాటింగ్‌లో మంధాన, రిచా మినహా అంతా విఫలమయ్యారు. అలాగే ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో వరుణుడు అడ్డుపడకపోయుంటే పరిస్థితి ఏమయ్యేదోనన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి బలహీన బౌలింగ్‌లోనూ మంధాన ఒక్కతే రాణించింది.

ఇక సెమీస్ లో ఆస్ట్రేలియా జట్టు నాకౌట్‌ మ్యాచ్‌లు ఎలా ఆడాలో చూపించింది.

భారత బౌలర్లు 7.50 ఎకానమీ రేట్‌తో పరుగులిచ్చుకున్నారు. ఇక ఫీల్డింగ్‌ వైఫల్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. పేలవ ఫీల్డింగ్‌తో కనీసం 25-30 పరుగులు అదనంగా సమర్పించుకున్నారు. వీరికి యో యో టెస్టు పెడితే ఎవరూ గట్టెక్కలేరనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అటు నిజమైన చాంపియన్‌ ఆట ఎలా ఉంటుందో ఆసీస్‌ చూపింది. మ్యాచ్‌ చేజారుతున్న దశలో అద్భుత ఫీల్డింగ్‌తో విలువైన పరుగులను కట్టడి చేసింది.ఎన్‌సీఏ నుంచి తాత్కాలిక కోచ్‌లను తీసుకొచ్చి మహిళల జట్టుకు పని చేయించడం బీసీసీఐకి అలవాటుగా మారింది. మెగా టోర్నీకి రెండు నెలల ముందుగా రమేశ్‌ పొవార్‌ను చీఫ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పించారు. అలాగే బౌలింగ్‌ కోచ్‌గా ట్రాయ్‌ కూలీ, బ్యాటింగ్‌ కోచ్‌గా కనిట్కర్‌ను నియమించారు. కానీ టీమ్‌ భవిష్యత్‌ కోసం సుదీర్ఘ కాలం పాటు రెగ్యులర్‌ కోచ్‌లు ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే జట్టు క్రికెటర్ల బలాబలాలపై వారికి అవగాహన వస్తుంది. నిజానికి పొవార్‌ అంత విజయవంతం కాలేకపోయినా.. మరీ టోర్నీకి రెండు నెలల ముందే తీసేయడం సరైన చర్య అనిపించుకోదు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌తో విభేదాల కారణంగా అతడికి ఉద్వాసన పలికారు.

అందుకే జట్టును నడిపించేందుకు కెప్టెన్‌కు అసాధారణ పవర్‌ను ఇవ్వకూడదని మాజీలు చెబుతున్నారు. మరో 18 నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే బలహీనతలను సరిదిద్దుకోవడంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో సెమీస్‌ ఓటమిని ఇప్పట్లో మర్చిపోలేమని భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. ఒంటి చేత్తో విజయం వైపు తీసుకెళుతున్న దశలో తను రనౌట్‌ కావడం భారత్‌ విజయావకాశాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే.

మరోవైపు తను రనౌటైన విధానం స్కూల్‌ అమ్మాయి తప్పిదంలా ఉందన్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ కామెంట్‌పై హర్మన్‌ స్పందించింది. అది ఆయన ఆలోచనా విధానానికి నిదర్శనమని, తాము పరిణతి చెందిన క్రికెటర్లమేనని సమాధానమిచ్చింది. ఓవైపు… గత 6 ప్రపంచకప్పుల్లో 5 ట్రోఫీలు గెలిచిన జట్టు. మరోవైపు… ఒక్కసారైనా మెగా టోర్నీని గెలుచుకోవాలని ఆరాటపడుతున్న జట్టు. స్టార్లతో నిండి ప్రపంచ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న జట్టు ఒకటైతే… సమష్టి ఆటే బలంగా పోటీకి సై అంటోంది మరో జట్టు. ప్రపంచకప్ గెలవాలన్న సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలనే ధ్యేయంతో ఉన్న భారత జట్టుకు అసలైన సవాల్ ఆస్ట్రేలియా రూపంలో ఎదురైంది. 2020లో టైటిల్
కు దగ్గరగా వచ్చిన భారత మహిళల జట్టును ఫైనల్ లో ఆస్ట్రేలియా ఓడించింది. అయితే ఇప్పుడు ఆ గండం సెమీస్ లోనే ఎదురైంది. వరల్డ్ కప్ ను అందుకోవాలనే కలను నెరవేర్చుకోవాలంటే ముందు ఆస్ట్రేలియా కొండను ఢీకొట్టాల్సిందే. ప్రపంచ మహిళల క్రికెట్లోనే ఆస్ట్రేలియా బలమైన జట్టు. గత రికార్డులు, ప్రదర్శన, చరిత్ర ఏది చూసుకున్నా ఆస్ట్రేలియా జట్టు ఫేవరెట్ అనడంలో సందేహంలేదు. మరోవైపు ఈ మెగా టోర్నీలో భారత్ సెమీస్ గండాన్ని ఎదుర్కొంటోంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఐదో సారి
సెమీఫైనల్ కు చేరుకుంది. అయితే 2020లో తప్ప ఒక్కసారి కూడా ఫైనల్ కు వెళ్లలేదు. 2020లోనూ ఇంగ్లండ్ తో సెమీస్ వర్షం కారణంగా రద్దవటంతో గ్రూపులో అగ్రస్థానం కారణంగా తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో అన్ని మ్యాచులు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంతో నాకౌట్ కు చేరుకుంది. అయితే భారత్ మాత్రం తడబడుతూనే సెమీస్ కు వచ్చింది. గ్రూప్ దశలో ఇంగ్లండ్ తో ఓడిన భారత్.. మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది.

సెమీస్ లో ఆస్ట్రేలియా జట్టును ఓడించాలంటే భారత్ శక్తికి మించి పోరాడాల్సిందే.

సమష్టిగా సత్తా చాటితేనే డిఫెండింగ్ ఛాంపియన్ పై పైచేయి సాధించవచ్చు. గతేడాది డిసెంబర్లో జరిగిన టీ20 టోర్నీలో ఆసీస్ పై సూపర్ ఓవర్ లో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపు మన అమ్మాయిలకు కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్నిచ్చేదే. ఇప్పుడు మళ్లీ అదే ప్రదర్శన పునరావృతం చేయాలి. బ్యాటింగ్ లో స్మృతి మంధాన, రిచా ఘోష్ ల పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. వీరిద్దరూ ఇప్పటివరకు ఈ టోర్నీలో నిలకడగా రాణించారు. కెప్టెన్హర్మన్ ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ లు తమ సత్తా మేరకు రాణించాల్సి ఉంది. బౌలింగ్ లో జోరుమీదున్న రేణుకాసింగ్ ఠాకూర్ కీలకం కానుంది. అలాగే దీప్తి శర్మ, ఇతర బౌలర్లు కూడా సమష్టిగా సత్తాచాటాలి. ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు భారత్ 30 టీ20లు మ్యాచ్ లు ఆడింది. అందులో 7 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా 22 గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఈ రెండు జట్లు 5 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. అందులో టీమిండియా 2 విజయాలు సాధించగా.. ఆసీస్ మూడింట్లో నెగ్గింది. 2013లో ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ను ఓడించిన భారత్ టైటిల్ నెగ్గింది. కానీ ఆతర్వాత భారత్ కు నిరాశ తప్పడంలేదు. సుమారు పదేండ్లుగా ప్రతి ఏడాది పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ సెమీస్, ఫైనల్స్ వరకు చేరుకుంటున్నా తుది అడుగు మాత్రం సరిగ్గా వేయలేకపోతోంది. తాజాగా టోర్నీ ఆసాంతం బాగా ఆడి టైటిల్ మీద ఆశలు రేపిన హర్మన్‌‌ప్రీత్ కౌర్ సేన.. సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో మరోమారు భారత అభిమానుల గుండె పలిగింది.

చివరి అంకం వరకు పట్టు బిగించిన మహిళా జట్టు సెమీస్ లో బొక్కబోర్లా పడడం ఫ్యాన్స్ ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఈసందర్భంగా క్రీడాకారులు .. సైతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి కారణమేమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img