Homeఅంతర్జాతీయంభారత రూపాయి వాణిజ్యం..!

భారత రూపాయి వాణిజ్యం..!

ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ కరెన్సీలు అయిన డాలర్, పౌండ్ ల ద్వారానే వాణిజ్యపరమైన చెల్లింపులు జరుగుతున్నాయి.. మరికొన్ని దేశాలు వస్తు మార్పిడి పద్దతిని అమలు చేస్తున్నాయి.. అయితే… భారత కరెన్సీ రూపాయి లలో అంతర్జాతీయ చెల్లింపులు జరపాలని పలుదేశాలు భారత్ ను కోరడం ఇప్పుడు రూపాయి బలపేతం అవుతోందా అనే చర్చకు దారితీసింది..

అమెరికా డాలర్ ను డామినేట్ చేసి.. భారత కరెన్సీ రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపబడటం సాధ్యమయ్యే పనేనా..? అమెరికా సహా పలు అగ్రదేశాలు రూపాయిని అంతర్జాతీయంగా గుర్తించి.. చెల్లింపులకు అంగీకరిస్తాయా..? రూపాయిల్లో చెల్లింపులు జరపాలను భారత్ ను కోరుతున్న దేశాలేవి..?

పోరు నష్టం పొందు లాభం అని పెద్దలు ఉరికే అనలేదు. ఇప్పుడు ఈ సామెత భారత రూపాయికి కలిసి వస్తోంది.. డాలర్ మారకంతో పోలిస్తే జీవితకాల కనిష్టాన్ని ఎదుర్కొంటున్న రూపాయికి.. ఇప్పుడు కొత్త జీవతత్వాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అన్ని బాగుంటే అంతర్జాతీయ కరెన్సీగా భారత రూపాయి ఎదిగే రోజులు ఎంతో దూరంలో లేవు.

ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.. ఇతర దేశాల్లోని సంక్షోభం భారత్ కు వరంగా మారుతోంది.. ఇప్పటికే రష్యా, శ్రీలంక, మారిషస్ దేశాలలో రూపాయిల్లోనే ఆర్థిక లావాదేవీలకు మార్గం సుగమం అయింది.. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్, తజకిస్తాన్, క్యూబా, లగ్జెం బర్గ్, సూడాన్, గల్ఫ్, ఆఫ్రికన్ దేశాల మధ్య కూడా చెల్లింపులు రూపాయల్లో జరగనున్నాయి. ఆ దేశాలు కూడా రూపాయిల్లో చెల్లింపులకు అనుమతి ఇవ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను
కోరుతున్నాయి..

ప్రపంచంలోని చాలా దేశాల్లో రూపాయిల్లోనే లావాదేవీలు జరిగితే… భారత రూపాయి కూడా అంతర్జాతీయ కరెన్సీ అవుతుంది.. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి బలోపేతం కావడమే కాదు.. భారతదేశ వాణిజ్య లోటు కూడా తగ్గుముఖం పడుతుంది. వివిధ దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి కదా.. అందుకు ఆయా దేశాల ఎగుమతి, దిగుమతి దారుల మధ్య చెల్లింపులు జరుగుతుంటాయి.. భారతదేశంలో రూపాయి, రష్యాలో రూబుల్, చైనాలో యెన్ ఇలా రకరకాల కరెన్సీలు ఉంటాయి.

వాటి మధ్య చెల్లింపులు దాదాపు అసాధ్యం.. అందుకే డాలర్, పౌండ్, తదితర అంతర్జాతీయ కరెన్సీల ద్వారా ఇప్పటి వరకు ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. మరికొన్ని దేశాలు వస్తు మార్పిడి పద్ధతిని అమలు చేస్తున్నాయి.. ఉదాహరణకు ఇరాన్.. భారత్ కు చమురు పంపిస్తే… భారత్ నుంచి వారికి
గోధుమలు పంపిస్తోంది..

ఇటీవల రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది.. కొన్ని నెలలు గడుస్తున్నా.. ఆ యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది.. దీంతో రష్యాతో వాణిజ్యం పై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. వెంటనే రష్యా భారతదేశానికి అతి తక్కువ ధరకు చమరు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది.. అయితే ఆంక్షల కారణంగా డాలర్లలో చెల్లింపులకు అవకాశం లేకపోవడంతో… వోస్ట్రో ఖాతాల ద్వారా రూపాయలు_ రూబుల్స్ లోనే వాణిజ్యం చేయాలని భారత్, రష్యా నిర్ణయించాయి..

రష్యాతో వాణిజ్యానికి 12 వోస్ట్రో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది.. తొలుత ఈ ఏడాది జూలైలో భారత్ లో బ్రాంచ్ లు ఉన్న రష్యాలోని ప్రముఖ బ్యాంకులైన ఎస్ బేర్ బ్యాంక్, వీటీబీ బ్యాంకులు వోస్ట్రో ఖాతాలు తెరిచాయి..

అమెరికా, యూరప్ దేశాల నుంచి ఆంక్షల భయంతో వోస్ట్రో ఖాతా తీరిచేందుకు ఎస్బీఐ తొలుత నిరాకరించింది. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుంది.. ప్రస్తుతం భారత్, రష్యా మధ్య 12 వోస్ట్రో బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. పీకల లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన శ్రీలంకకు వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు తగినంత విదేశీ మారక ద్రవ్యం లేదు..

ఈ నేపథ్యంలో రూపాయల్లో అంతర్జాతీయ చెల్లింపులు జరుపుతామని, తమ దేశంలో విదేశీ కరెన్సీగా రూపాయికి అనుమతి ఇవ్వాలంటూ భారతదేశానికి శ్రీలంక విజ్ఞప్తి చేసింది.. దీంతో ఐదు వోస్ట్రో ఖాతాలు తెరిచేందుకు శ్రీలంకకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.. అంటే ఈ ప్రకారం పదివేల డాలర్లు అంటే దాదాపు 8.2 లక్షల వరకు శ్రీలంక పౌరులు రూపాయల రూపంలో తమ వద్ద ఉంచుకోవచ్చు. అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ల బదులు రూపాయిల్లోనే పరస్పరం చెల్లింపులు చేసుకోవచ్చు..

కోవిడ్, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆఫ్రికన్ దేశాల్లోనూ డాలర్లకు కొరత ఏర్పడింది..!

దీంతో అవి కూడా రూపాయిల్లోనే చెల్లింపులు చేయాలని భావిస్తున్నాయి.. ప్రతి ఏటా ఈజిప్ట్ నుంచి 3,520 మిలియన్ డాలర్లు, అల్గేరియా నుంచి 1000 మిలియన్ డాలర్లు, అంగోలా నుంచి దాదాపు 2,700 వందల మిలియన్ డాలర్ల వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటుంది.. పొరుగున ఉన్న బంగ్లాదేశ్
నుంచి కూడా 2000 మిలియన్ డాలర్ల సరుకులు దిగుమతి చేసుకుంటుంది.

అయితే చెల్లింపులకు సంబంధించి తమ వద్ద ఆ స్థాయిలో డాలర్లు లేనందువల్ల రూపాయల్లో లావాదేవీలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని ఆయా దేశాలు కోరుతున్నాయి.

వివిధ దేశాలతో రూపాయిల్లో మారకం ఇప్పుడు కొత్త కాదు.. 1960 ల్లోనే ఖతార్, యూఏఈ, కువైట్, ఒమన్ దేశాలతో రూపాయిలోనే లావాదేవీలు జరిగేవి.. తూర్పు యూరప్ దేశాలతో కూడా భారత్ కు ఇటువంటి ఒప్పందమే ఉండేది.. అయితే కారణాలు తెలియదు గాని… ఈ విధానానికి మధ్యలోనే చరమగీతం పాడారు. అయితే రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలని భావిస్తున్న భారత్.. ఆయా దేశాలకు అనుమతి ఇచ్చేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాణిజ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు డాలర్లు లేని దేశాలతో రూపీ మారకం చేయాలని ఈ ఏడాది జూలై నుంచే భారత్ పావులు
కదుపుతోంది.. ఇప్పుడు దానిని వేగవంతం చేస్తోంది.. భారత దేశానికి యూఏఈ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి.. దాంతో ఆ దేశంతో రూపీ చెల్లింపుల విధానం దిశగా ఆర్బీఐ ఇప్పటికే విధాన పత్రాన్ని తయారు చేసింది.. ఇరుదేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు దీనిపై చర్చలు జరుపుతున్నాయి.

కోవిడ్ వ్యాప్తికి ముందు ఆ తర్వాత ప్రపంచదేశాల పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన.. ఇతర సమస్యలతో తీవ్ర ఇబ్బందుల్లో పలు దేశాలు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు అంగీకరించాలని భారత్ ను కోరడంతో రూపాయికి కొత్త జీవతత్వాలు కలిగే అవకాశాలు ఏర్పడుతున్నాయి..

Must Read

spot_img