అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికన్ డాలర్ దే హవా.. ప్రపంచదేశాల్లో దాదాపు 95 శాతం అమెరికన్ డాలర్ ను బేస్ చేసుకుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. గ్లోబల్ కరెన్సీగా ఉన్న అమెరికన్ డాలర్ క్రమంగా గత వైభవాన్ని కోల్పోతున్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యంపై అమెరికా డాలర్ ఆధిపత్యం ఎప్పుడు మొదలైంది..? డాలర్‌తో వాణిజ్యం జరపకుండా తమదేశ సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోందా..? భవిష్యత్తులో డాలర్ ప్రభ తగ్గడం ఖాయమేనా..?
అంతర్జాతీయ వాణిజ్యం అంటే మనకు టక్కున గుర్తొచ్చేది అమెరికన్ డాలర్. ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ 95 శాతం దేశాలు అమెరికన్ డాలర్‌ను బేస్ చేసుకుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ ట్రెండ్ మనం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా గ్లోబల్ కరెన్సీగా ఉన్న అమెరికన్ డాలర్ గత వైభవాన్ని కోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా, భారత్ లాంటి దేశాల కరెన్సీ అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే దిశగా దూసుకు వెళ్తుండడంతో… అమెరికన్ డాలర్ ప్రభ తగ్గిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. డాలర్‌కు వ్యతిరేకంగా తమ దేశ సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ దేశాల జాబితాలో ఇప్పుడు భారతదేశం కూడా చేరింది. ప్రస్తుతం 20 దేశాలు భారతదేశంతో రూపాయి ఆధారంగా అంతర్జాతీయ వాణిజ్యాన్ని జరిపేందుకు సిద్ధపడ్డాయి.
ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో యూఎస్ డాలర్లే 60 శాతానికి పైగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్జాతీయ రుణాలు, సెక్యూరిటీలకు సంబంధించిన లావాదేవీల్లో దాదాపు 70 శాతం అమెరికన్ డాలర్లలోనే కొనసాగుతున్నాయి. ఇక విదేశీ కరెన్సీల ఎక్స్చేంజి మార్కెట్లలో అన్ని కరెన్సీలను కలుపుకున్నా కూడా అమెరికన్ డాలర్ల ట్రేడింగే అత్యధికంగా ఉంటుంది. ఇది దాదాపు 90 శాతం ఉండొచ్చని అంచనా. అయితే ఈ పరిస్థితి మున్ముందు మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. డాలర్‌పై ఆధారపడటం మానేసి, సొంత కరెన్సీలను పటిష్టం చేసుకోవాలని చాలా దేశాలు భావిస్తున్నాయి. ఈ మేరకు తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ కరెన్సీ స్థానాన్ని అమెరికన్ డాలర్ కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. అమెరికన్ డాలర్ పతనం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికన్ డాలర్ ప్రభ తగ్గడం గత సంవత్సరం రష్యా.. ఉక్రెయిన్ మీద దురాక్రమణ ప్రారంభించినప్పటి నుంచి వేగవంతమైంది. క్రిమియా ఆక్రమణ నేపథ్యంలో 2014లోనే దీనికి బీజం పడినప్పటికీ.. గత ఏడాది కాలంగా ఇది మరింత పుంజుకున్నట్లు కనిపిస్తుంది. 2014లో చైనాతో చేతులు కలిపిన రష్యా.. అమెరికన్ డాలర్‌కు వ్యతిరేకంగా వాణిజ్య ఒప్పందాలను చేసుకుంది. అయితే ఈ ఒప్పందం ఆ రెండు దేశాలకే పరిమితం అవడంతో గత ఎనిమిదేళ్ల పాటు అమెరికన్ డాలర్ ప్రభ కొద్దిమేరకే తగ్గుతూ వచ్చింది. ఆనాటి ఒప్పందం కారణంగా రష్యా, చైనా మధ్య జరిగే అన్ని వ్యాపార లావాదేవీలు మారక ద్రవ్యంగా రష్యన్ రూబుల్, చైనా యువాన్ల వినియోగం మొదలైంది. రష్యా తన విదేశీ మారక ద్రవ్య నిల్వలో అధిక శాతం చైనా యువన్ కరెన్సీని సమకూర్చుకోవాలని కూడా ఆనాడు నిర్ణయించింది. దాంతో ఎనిమిదేళ్ల కాలంలో రష్యా విదేశీ మార్గద్రవ్య నిలువల్లో యువాన్ పర్సంటేజ్ 60 శాతాన్ని దాటింది. ఈ మేరకు రష్యా ఆర్థిక శాఖ గతంలో వెల్లడించింది. రష్యాతో ఒప్పందం తర్వాత ఇలాంటి ఒప్పందాన్నే చైనా.. బ్రెజిల్‌తోను చేసుకుంది.
లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన బ్రెజిల్‌తో చైనా చేసుకున్న ఒప్పందం కారణంగా డాలర్ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించింది. 2022లో చైనా, బ్రెజిల్ దేశాల మధ్య 15 వేల కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. డాలర్ యూరోపియన్ పౌండ్‌కు బదులుగా తమ దేశాల కరెన్సీలోనే వ్యాపారం కొనసాగించాలన్న ఏకైక ఎజెండాతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖలు, ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు ఇటీవల ఒక అధికారిక సమావేశాన్ని కూడా నిర్వహించాయి. తాజాగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం మితిమీరి పోతూ ఉండడంతో భారతదేశం
కూడా అప్రమత్తమయింది. తమ రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆవిష్కరించే దిశగా చర్యలు మొదలు పెట్టింది భారత ప్రభుత్వం. అనేక దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయన్ని వెతుకుతున్న తరుణంలో యూరోపియన్ పౌండ్, డాలర్లకు ధీటుగా రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చలామణి చేసేందుకు అడుగులు వేగవంతం చేసింది.
రూపాయిని మారక విలువగా వినియోగించేందుకు వీలుగా ఆర్బీఐ.. రష్యా, శ్రీలంకతో పాటు మరో 18 దేశాల్లోని 60 బ్యాంకులు ఓస్ట్రో అకౌంట్లను ఓపెన్ చేసింది. ఆ 20 దేశాలతో నేరుగా భారత రూపాయి, వారి కరెన్సీతో నేరుగా వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఆర్బీఐ ఈ ఓస్ట్రో అకౌంట్లను ప్రారంభించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ వెల్లడించారు. రూపాయితో వ్యాపారం చేయడానికి ఒప్పుకున్న దేశాల్లో బ్రిటన్, రష్యా, మలేషియా, శ్రీలంక, సింగపూర్, న్యూజిలాండ్, ఇజ్రాయిల్, ఫిజి, ఓమన్, జర్మనీ, మయన్మార్, బోల్స్‌వానా, గయానా, మారిషస్, టాంజానియా, కెన్యా, ఉగాండా దేశాలు ఉన్నాయి. భారతదేశం తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తున్న అంతర్జాతీయ ఆర్థికవేత్తలు భవిష్యత్తులో భారత రూపాయి అంతర్జాతీయ మార్కెట్‌లో అతి ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యంగా అవతరించబోతుందని అంచనా వేస్తున్నారు.
అమెరికా వాల్ స్ట్రీట్‌కు చెందిన ఆర్థికవేత్త నౌరియల్ రుబినీ భారత రూపాయి భవిష్యత్తులో విదేశీ మారక ద్రవ్యాల్లో కీలకపాత్ర వహించబోతుందని ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే, అంతర్జాతీయ విపణిలో అమెరికన్ డాలర్ పెత్తనం ఎప్పుడు మొదలయ్యింది అన్నది ఆసక్తికరం. రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకున్న అమెరికా తమ డాలర్ ప్రాభవాన్ని గణనీయంగా పెంచుకుంది. బ్రెట్టన్ వుడ్ ఒప్పందంతో అమెరికన్ డాలర్ ఆధిపత్యం మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కుదేలైన అనేక దేశాలు ముఖ్యంగా యూరప్ దేశాలు అనేక ఉత్పత్తుల కోసం అమెరికా పై ఆధారపడాల్సి వచ్చిన సందర్భంలో ఈ ఒప్పందం జరిగింది. ఇది అమెరికాకు విశేషంగా లభించిందనే చెప్పాలి. వాణిజ్య ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలనే విషయమై ఐక్యరాజ్యసమితి ద్రవ్య ఆర్థిక సదస్సును అమెరికా న్యూ హాంప్షన్లో బ్రెట్టన్ వుడ్‌లో నిర్వహించింది. ఈ సమావేశంలో 44 దేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో అంతర్జాతీయంగా బంగారు ధరలను డాలర్ విలువకు జత చేస్తూ ఒప్పందం చేసుకున్నాయి. దాంతో ఇతర కరెన్సీల విలువను డాలర్ మారక విలువ కోసం ఈ ఒప్పందం ప్రాతిపదిక అయింది.
ఒక డాలర్ విలువ ఒక ఔన్స్ బంగారంతో సమానమైంది. ఔన్స్ అంటే 31.10 గ్రాములు. 1970లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్ విలువను బంగారు ధరకు జతచేయడాన్ని రద్దు చేసినప్పటికీ.. అప్పటికే డాలర్ నిల్వలు అన్ని దేశాల్లో పెరిగిపోయి గ్లోబల్ కరెన్సీగా అమెరికన్ డాలర్ అవతరించింది. పనామా, ఎల్సాల్వెడార్, జింబాబ్వే లాంటి 11 దేశాలు ఇప్పటికీ అమెరికన్ డాలర్ని తమ దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి చేస్తున్నాయి. డాలర్ శక్తి సామర్థ్యంతో రెచ్చిపోయిన అమెరికా అనేక సందర్భాల్లో ఆ డాలర్‌ని ఆయుధంగా వాడుకుంది. ఉక్రెయిన్‌లో అంతర్భాగమైన క్రిమియాను 2014లో రష్యా ఆక్రమించుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో రష్యా నిల్వచేసిన 64 వేల కోట్ల డాలర్లను అమెరికా జప్తు చేసింది. రష్యా విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఇది సగానికి పైగా ఉంది. అలాంటి ప్రయోగమే వివిధ సందర్భాల్లో ఆఫ్గానిస్తాన్, ఇరాన్, వెనుజులా వంటి దేశాలపై అమెరికా ప్రయోగించింది. అమెరికా అంశాలను ఉల్లంఘించిన బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధించింది.
2022 జనవరిలో బ్రిక్ దేశాల సదస్సు డాలర్ కు ఆల్టర్నేట్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, దక్షిణాఫ్రికా, చైనా లాంటి కీలక దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం అమెరికాకు పెద్ద షాక్. అయితే అంతకంటే పెద్ద షాక్ అమెరికాకు మిత్ర దేశమైన సౌదీ అరేబియా ఇచ్చింది. చమురు వ్యాపారంలో డాలర్‌కు ఇతర కరెన్సీల వినియోగంపై చర్చకు తాము సిద్ధమని సౌదీ అరేబియా చేసిన ప్రకటన అమెరికాకు పెద్ద షాక్. అంతర్జాతీయంగా చమురు వ్యాపారం దాదాపు అమెరికన్ డాలర్ల లోనే జరుగుతుంది. అందుకే కొన్ని సందర్భాలలో అమెరికన్ డాలర్‌ను పెట్రో డాలర్‌గా కూడా పిలుస్తారు. చమురు ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలిచే సౌదీ అరేబియా ఇతర కరెన్సీలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టినట్లేనని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. భారత్, రష్యాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడు అమెరికన్ డాలర్లలో కాకుండా రూపీ, రూబుల్ కరెన్సీల్లో జరుగుతుంది. భారతీయ సంస్థలు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న దిగుమతులకు ఇప్పుడు రూపాయి, రూబుల్ చెల్లింపులు జరుపుతున్నాయి.
అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి చెక్ పడింది అని చెప్పడానికి కొన్ని గణాంకాలు ఆధారంగా నిలుస్తున్నాయి. 1999లో చాలా ప్రపంచ దేశాల్లోని విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో 70 శాతానికి పైగా అమెరికన్ డాలర్ ఉండేది. ప్రస్తుతం 2023 మార్చి నాటికి ఇది 59 శాతానికి పడిపోయినట్లుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది. భవిష్యత్తులో భారత్, రష్యా చైనా లాంటి దేశాలు చాలా దేశాలతో నేరుగా తమ కరెన్సీలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుని దాన్ని కచ్చితంగా అమలు చేస్తే అమెరికన్ డాలర్ పతనం ఖాయమని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనా
వేస్తున్నారు. ఇదే జరిగితే భారత్ రూపాయి విలువ పెరిగి, అమెరికన్ డాలర్ విలువ పతనం అవడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి..
ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం కొనసాగిస్తోన్న అమెరికన్ డాలర్‌ను కాకుండా తమ దేశ కరెన్సీలతోనే ఇతర దేశాలతో వాణిజ్యం చేసేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిణామాలతో వాణిజ్యరంగంలో అమెరికా డాలర్ పతనం అయ్యే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.