Homeజాతీయందేశంలో ఉపాధి అవకాశాలు పెంపు...

దేశంలో ఉపాధి అవకాశాలు పెంపు…

ఆటబొమ్మల ఎగుమతిలో ఇండియా పవర్‌హౌస్‌గా మారుతోంది. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయి ఎదిగింది భారత్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేకిన్ ఇండియా ద్వారా ప్రగతి సాధించిన రంగాల్లో బొమ్మల తయారీ ఒకటి. ఒకప్పుడు మన దేశంలోకి బొమ్మలు ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి అయ్యేవి. కానీ, మేకిన్ ఇండియా ఫలితంగా బొమ్మల్ని ఇక్కడే తయారు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు దేశంలో బొమ్మల అమ్మకాలు సాగించడమే కాకుండా.. కంపెనీలు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి.

భారత్‌ దేశంలో తయారీ రంగంలో శక్తివంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా పథకాన్ని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 25, 2014న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మేకిన్ ఇండియా ప్రొగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద మేకిన్ ఇండియా కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆధునిక స్వతంత్ర భారత అభివృద్ధిని చేపట్టేందుకు ఈ స్కీమ్ కట్టుబడి ఉంది. మేకిన్ ఇండియా కార్యక్రమం భారతీయ తయారీ కంపెనీలలోకి విదేశీ మూలధనాన్ని ఆహ్వానిస్తోంది. ఇది దేశంలో ఉపాధి అవకాశాలను పెంచి, భారత్‌ను గ్లోబల్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చుతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను భారత్‌లోనే వీటిని ఉత్పత్తి చేసుకునేలా తయారీ సంస్థలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. అంతేకాక మేడిన్ ఇండియా ప్రొడక్టులను మాత్రమే భారతీయులు వాడేలా ఇది ప్రజలకు సహకరిస్తోంది.

దేశంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, ఇతర దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ఎక్కువగా మనీని ఖర్చు చేయాల్సినవసరం లేకుండా, మన దేశంలోనే ఉత్పత్తిని పెంచడం, పెట్టుబడులకు సురక్షితమైన గమ్యాన్ని ఏర్పాటు చేయడమే మేకిన్ ఇండియా వెనుకున్న ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంతో భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుంది. మేకిన్ ఇండియాలో భాగంగా ఇండియా తయారు చేసిన ఆట వస్తువులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. నిన్న, మొన్నటి వరకు ప్రపంచ కర్మాగారంగా పేరొందిన చైనాపై మనం ఎక్కువగా ఆధారపడే వాళ్లం. ఆటవస్తువులు, బొమ్మల మార్కెట్ ను చూస్తే మొత్తం డ్రాగన్ మయమే. కానీ కొంత కాలంగా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో చైనా నుంచి ఆట వస్తువులు దిగుమతి చేసుకునే భారత్.. ఇప్పుడు దేశీయంగా తయారవుతున్న బొమ్మలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో దేశీయ బొమ్మల ఎగుమతులు..వేయ్యి 17 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2021-22లో మొత్తం ఎగుమతులు 2వేల 601 కోట్లకు చేరాయన్నారు. 2013-14 ఏప్రిల్-డిసెంబర్ లో 167 కోట్ల ఎగుమతులు జరగ్గా.. గతేడాది ఇదే సమయానికి 6 రెట్లు పెరిగినట్లు పేర్కొన్నారు. దేశీయంగా బొమ్మల తయారీ, ఎగుమతులనుప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. నాణ్యత లేని చైనా వస్తువుల దిగుమతులను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. 2018, 19లో 2,960 కోట్ల విలువైన బొమ్మలు భారత్‌ లోకి దిగుమతి అయ్యాయి. వోకల్ ఫర్ లోకల్ లో భాగంగా.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆటవస్తువుల తయారీకి మోడీ సర్కారు ప్రోత్సాహం అందిస్తోంది. తద్వారా 2021-22 నాటికి దిగుమతి 70 శాతం తగ్గి 870 కోట్లకు పరిమితమైంది.

గతేడాది ఏప్రిల్-ఆగష్టు వరకు బొమ్మల ఎగుమతుల్లో 636 శాతం వృద్ధి సాధించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2013లో ఇదే సమయంతో పోలిస్తే ఈ వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో మన దేశంలో బొమ్మలకు ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. మన దగ్గర వీటి తయారీకి కావాల్సిన ముడి సరుకు, టెక్నాలజీ, డిజైనింగ్ నైపుణ్యం, సిబ్బంది వంటి వనరులు తక్కువగా ఉండేవి. అందుకే ఇక్కడ తక్కువగా బొమ్మలు తయారయ్యేవి. విదేశాల నుంచే ఎక్కువగా తెచ్చుకునే వాళ్లం.

2018-19లో దాదాపు రూ.2,960 కోట్ల విలువైన బొమ్మల్ని మన దేశం దిగుమతి చేసుకుంది. పైగా ఈ బొమ్మలు నాణ్యత ఉండేవి కావు. మన ప్రమాణాలకు దూరంగా ఉండటమే కాకుండా ఇవి అంత సురక్షితమైనవి కావు. వీటి తయారీలో హానికర కెమికల్స్, రంగులు వంటివి వాడేవాళ్లు. అందుకే విదేశాల నుంచి దిగుమతులు తగ్గించి, ఇక్కడే వీటిని తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే దిగుమతి సుంకాన్ని 20 నుంచి 60 శాతానికి పెంచింది. దిగుమతి చేసుకునే ప్రతి బొమ్మ మన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిబంధనలు మార్చింది.

ప్రతి బొమ్మ శాంపిల్‌ను అధికారులు పరిశీలించి, పరీక్షించిన తర్వాతే దిగుమతికి అనుమతిస్తున్నారు. అలాగే బొమ్మల తయారీ పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నారు. రాయితీలు, మానవ వనరులు, మార్కెటింగ్ వంటి విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తోంది. మూడేళ్లుగా బొమ్మలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తోంది. దీంతో దేశీయంగా బొమ్మల తయారీ ఊపందుకుంది. భారీ స్థాయిలో బొమ్మలు తయారవుతుండటంతో విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి కంపెనీలు.

గతేడాది జూలైలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, భారత దేశంలో స్థానిక తయారీదారులు కు మంచి ప్రోత్సాహం లభించింది. గడచిన మూడేళ్లలో ఆట బొమ్మల ఎగుమతులు 61 శాతం పెరిగాయి, దిగుమతులు 70 శాతం తగ్గిపోయాయి. మూడు చక్రాల సైకిళ్ళు, స్కూటర్లు, పెడల్ కార్లు, వీడియో గేమ్ కన్సోల్స్, మెషీన్స్, పండుగలు, కార్నివాల్, ఇతర వినోద వస్తువుల దిగుమతులు బాగా క్షీణించాయి.

2018-19 ఆర్థిక సంవత్సరంలో 371 మిలియన్ డాలర్ల విలువైన ఆట బొమ్మలను దిగుమతి చేసుకోగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 110 మిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. అంటే దిగుమతుల్లో 70.35 శాతం క్షీణత కనిపించింది. మూడు చక్రాల సైకిళ్లు, స్కూటర్లు, పెడల్ కార్ల దిగుమతులు ఇదే కాలంలో 304 మిలియన్ డాలర్ల నుంచి 36 మిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. 2020-21లో దిగుమతి చేసుకున్న మొత్తం ఆట బొమ్మల్లో చైనా ఉత్పత్తులు 71 శాతం ఉండేవి, 2021-22లో మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 62 శాతానికి తగ్గింది.

అయితే 2013తో పోలిస్తే 2022లో బొమ్మల ఎగుమతి 636 శాతం పెరిగినట్లు కేంద్రం చెప్పింది. ప్రస్తుతం మేడిన్ ఇండియా అనే కాకుండా.. మేడ్ ఫర్ వరల్డ్ అనే కాన్సెప్ట్‌తో మన దేశంలో బొమ్మల తయారీ సాగుతోందని కేంద్రం వెల్లడించింది. బొమ్మల దిగుమతులను నిరుత్సాహపరిచే లక్ష్యంతో.. ఫిబ్రవరి 2020లో దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 20 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. ఈ ఏడాది దానిని 70 శాతానికి విస్తరించింది. దేశీయంగా తయారీ, ఎగుమతులను పెంచేందుకు గాను.. ఉత్పత్తి ఆధారిత ఆర్థిక ప్రోత్సాహకాలను అమలు చేస్తోంది. తయారవుతున్న ఆటవస్తువులు భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలంటూ 2020లో ఆదేశాలు జారీ చేసింది. భారత్‌ కు ఎగుమతి చేసే వాటికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది

కాలంతో పరుగులు పెడుతున్న భారత్ ఆట బొమ్మల విషయంలో మరింత జోరు చూపిస్తోంది. దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదగం శుభపరిణమం. ఇలానే భారత్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.. ఇది ఇవాళ్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుసుకుందాం

Must Read

spot_img