ఇప్పటికే ఆర్థికంగా దివాళా తీసి.. సంక్షోభంలో చిక్కకుంది పాకిస్తాన్.. అయినప్పటికీ.. ఆ దేశ నాయకులు వారి అణ్వాయుధ సామర్ధ్యం గురించే చేసే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి..ఇటీవల పాకిస్తాన్ ఒక అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన దేశమనే విషయాన్ని భారత్ మరచిపోకూడదని.. ఆ దేశ మంత్రి హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి.. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగానే ఉంది. ఆర్థికంగా పీకల్లోతూ కష్టాల్లో మునిగిన పాకిస్తాన్ లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
భారత్ కు హెచ్చరికలు జారీ చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటి..?
ఆర్థికంగా దివాళా తీస్తూ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి జారుకుంటోన్న పాకిస్థాన్‌కు చెందిన ప్రధానమంత్రులు, మంత్రులు తమ దేశ అణ్వాయుధ సామర్థ్యం గురించి చేసే వ్యాఖ్యలు కలకలం రేపుతుంటాయి. ప్రధానమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు,తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అడపాదడపా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారని పరిశీలకులు చెబుతున్నారు.
పాకిస్థాన్ఒక అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశమనే విషయాన్ని భారత్ మరచిపోరాదని ఆ దేశ మంత్రి, అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు షాజియా తాజాగా హెచ్చరించారు. దీనిపై రగడ మొదలైంది. అకస్మాత్తుగా ఆమె అణ్వస్త్రాల గురించి ఎందుకు మాట్లాడారనేది అంతు చిక్కదు. అంతే కాదు తమ అణ్వస్త్ర హోదా మౌనంగా ఉండటానికి కాదని కూడా ఆమె బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
పాక్‌లో ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికార పీఎంఎల్‌ఎన్‌కు బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మద్దతుంది. పాకిస్థాన్ తెహ్రీక్ ఎఇన్సాఫ్ పార్టీ మైనార్టీలో పడిపోవడంతో ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే రాజీనామా చేసి ప్రస్తుత సంకీర్ణ సర్కారుకు వ్యతిరేకంగా భీకరంగా పోరాడుతున్నారు. ఈ తరుణంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ పాక్ పరిస్థితి దారుణంగానే ఉంది.
ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం రాబోతోందని హడలిపోతుండగా…. పాకిస్థాన్ లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో మునిగిన పాకిస్థాన్ లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల ప్రభావంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. కూరగాయలు, పాలు, పెట్రోల్ ధరలు భరించలేనంతగా ఉన్నాయి.
అదే సమయంలో భారత్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ మెరుగవుతోంది. కోవిడ్ సమయంలోనూ భారత్ సమర్థంగా డీల్ చేసింది. ప్రస్తుతం తయారీ రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ పుంజుకుంటోంది. ప్రపంచ దేశాల్లో భారత్ తన ప్రతిష్టను పెంచుకుంటోంది. జీ20 సహా అనేక కీలక కూటముల నేతృత్వ బాధ్యతలు కూడా భారత్ కు వచ్చాయి. పెట్టుబడులను ఆకర్షించడంలోనూ భారత్ ముందుంది. ప్రపంచమంతా భారత్ ను ఆశాజనకంగా చూస్తోంది.
దేశీయంగా కూడా భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. జమ్మూకశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేసి పరిస్థితులు చక్కదిద్దుకుంటోంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. అక్రమ చొరబాట్లను అరికట్టింది.అంతర్జాతీయంగా భారత్ మెరుగైన స్థానాల్లోకి చేరుకుంటుండగా పాకిస్థాన్ అన్ని రంగాల్లోనూ నేలచూపులే చూస్తోంది. ఉగ్రవాదానికి ఊతమీయడంతో పాటు ఉగ్రవాద సంస్థలకు నిధులివ్వడం, ఉగ్రవాద నేతలకు ఆశ్రయమిచ్చి రక్షణ కల్పించడం ద్వారా పాకిస్థాన్ అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది.
ఈ పరిస్థితుల్లోనూ భారత్ తో యుద్దానికి పాక్ సై అంటుందా…?
పాకిస్థాన్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశమని, అలాంటి బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాలు కూడా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవలే కాలిఫోర్నియాలో వ్యాఖ్యానించారు.దీంతో పాక్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ అంతర్జాతీయంగా భారత్ కు పేరు ప్రతిష్టలు పెరిగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అకస్మాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఊచకోతకు కారకుడంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిపై భారత్ ధీటుగా జవాబియ్యడంతో ఆయన పార్టీకే చెందిన షాజియా తమ దేశం ఒక అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశమనే విషయాన్ని భారత్ మరచిపోరాదని హెచ్చరిస్తున్నారు.
తమది అత్యంత బాధ్యతాయుతమైన అణ్వస్త్ర దేశమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. తమకు అత్యంత సురక్షితమైన న్యూక్లియర్ కమాండ్ ఉందని మాజీ ప్రధాని ఇమ్రాన్ చెప్పారు. 2019 పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమైనప్పుడు కూడా భారత్‌తో యుద్ధానికి సిద్ధమని నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. పుల్వామా, బాలాకోట్ కంటే పీఓకేలో భారత్ పెద్ద చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటోందని నాడు ఇమ్రాన్ వణికిపోయారు. అల్లాకు తప్ప మరెవరికీ తలవంచబోమంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా 13,080 అణ్వాయుధాలుండగా…భారత్ వద్ద 156 అణ్వాయుధాలు… పాకిస్థాన్ వద్ద 165 అణ్వాయుధాలు.. చైనా వద్ద 350 అణ్వాయుధాలున్నాయి. పాకిస్థాన్‌లో అణ్వాయుధాల నియంత్రణ మిలిటరీ చేతిలో ఉండటం ఎప్పటికైనా భారత్‌కు ప్రమాదమేనని నిపుణులు సూచిస్తున్నారు. అయితే భారత్ జోలికొస్తే ప్రపంచ పటంలో తమ దేశమనేదే ఉండదని పాక్ నేతలకు, సైన్యానికి స్పష్టంగా తెలుసని పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాక్ నేతలు చేసే ప్రకటనలను పెద్ద సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మొదటగా అణ్వాయుధాలను ఉపయోగించబోం అనే పాలసీని సమీక్షిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన హెచ్చరిక కూడా పాక్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పీఓకే భారత్‌దే అంటూ రాజ్‌నాధ్ చేస్తున్న ప్రకటనలు కూడా వారికి సవాల్‌గా మారుతున్నాయి. సర్జికల్ దాడులతో ఉలిక్కిపడేలా చేసిన మోదీ పీఓకే కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని పాక్ నేతలు, సైన్యాధికారులు అనుమానిస్తున్నారు.
తమ స్వదేశంలో పరిస్థితిని చక్కదిద్దుకోవడం చేతకాని నేతలు సైతం తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయంటూ భారత్ కు హెచ్చరికలు చేస్తున్నారు.. ఇది వారి దేశ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు మాత్రమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.. చింతచచ్చినా పులుపు చావలేదనే సామెత పాక్ కు సరిగ్గా సరిపోతుందేమో..