Homeఅంతర్జాతీయంటర్కీకి సాయంగా భారత్.. ప్రత్యేక విమానంలో బయలుదేరిన NDRF

టర్కీకి సాయంగా భారత్.. ప్రత్యేక విమానంలో బయలుదేరిన NDRF

ఆపదలో ఉన్నప్పుడే స్నేహితుడెవరో శత్రువెవరో తేటతెల్లం అవుతుంది. వరుస భూకంపాలతో తల్లడిల్లిపోతున్న తుర్కియేకు మేమున్నామంటూ స్నేహ హస్తం అందించింది భారత్. భూకంప విలయం గురించి తెలియగానే ప్రధాని మోది.. తుర్కియే అధ్యక్షుడు ఎర్దవాన్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. తెలపడమే కాదు వెంటనే భారత్ నుంచి సదరు సాయం ప్రస్తుతం తుర్కియేకు చేరుకుని పనిచేస్తోంది..

వరుస భూకంపంతో అతాలకుతలమైన టుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్‌ కోసం భారత్‌కు చెందిన తొలి ఎన్డీఆరెఫ్ టీమ్‌ నిన్న ఉదయమే అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంది.టీమ్‌లో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది, ముగ్గురు సీనియర్‌ అధికారులు ఉన్నారు. వీరికి ఇలాంటి వ్యవహారాలలో అపారమైన అనుభవం ఉంది. వీరి వెంట్ భూకంప శిధిలాలలో చిక్కుకుపోయినవారిని గుర్తించే డాగ్ స్క్వాడ్ కూడా వెళ్లింది. రక్షణ చర్యల్లో తర్ఫీదు పొందిన శునకాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన సామాగ్రిని కూడా వారితో తుర్కియే చేరుకుంది. వాటిలో ఔషధాలు, డ్రిల్లింగ్‌ మెషిన్‌లు, కటింగ్‌ మిషన్‌లు లాంటి అన్ని అత్యవసర సామాగ్రి ఉన్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మీడియాకు వెల్లడించారు.

ఢిల్లీలోని తుర్కియే రాయబార కార్యాలయం కూడా భారత్‌ పంపిన తొలి ఎన్డీఆరెఫ్ టీమ్‌ భూకంప కల్లోలిత ప్రాంతానికి చేరుకుందని ప్రకటించింది. కాగా, ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి 50 మందితో కూడిన మరో ఎన్డీఆరెఫ్ బృందం కూడా తుర్కియేకు బయలుదేరింది. అయితే ‘నిజమైన స్నేహితుడికి అర్థం భారత్‌’ అంటూ ధన్యావాదాలు తెలిపింది టర్కీ. కనివినీ ఎరుగని రీతిలో 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించి టర్కీని ఓ ఊపు ఊపేయడంతో దిక్కు తోచని పరిస్థితిలో పడింది తుర్కియే. ఎందుకంటే ఇప్పటికే ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పాకిస్తాన్ తో పోటీ పడుతోంది. అత్యధిక ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు భూకంపం కూడా దానికి తోడవడంతో తుర్కియే మృత్యు ఘోషతో విషాదమయంగా మారింది.

కోలుకోలేని బాధలో ఉన్న టర్కీకి సరైన సమయంలో భారత్‌ స్నేహ హస్తం చాపింది. అర్జంటుగా కావల్సిన నిధులను అందించింది. అలాగే టర్కీకి అవసరమయ్యే రెస్క్యూ, వైద్య బృందాలను పంపింది. దీంతో భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్‌ సునెల్‌ న్యూఢిల్లీకి కృతజ్ఞతలు తెలుపుతూ..ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా.. టర్కిష్‌ భాషలోనూ, హిందీలోనూ ‘దోస్త్‌ కారా గుండె బెల్లి ఒలూర్‌’ అనే సామెతను ప్రస్తావిస్తూ..భారత్‌కి చాలా ధన్యవాదాలు అని అన్నారు. ఆ వ్యాఖ్యకు అర్థం ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు’ అని. నిజానికి తుర్కియే మన దేశంపై గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ తో కలసి విషం కక్కుతోంది. కశ్మీరు గురించి అవసరం లేని జోక్యం చేసుకుని భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలన్నీ చేసింది.

కానీ ఆపదలో చిక్కుకున్న తుర్కియేను ఆదుకునే ప్రయత్నం చేసింది భారత్. విషయం తెలియగానే విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌..ఢిల్లీలోని టర్కీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతిని, మానవతావాద మద్దతును కూడా ఆయన తెలియజేశారు. అంతేగాదు రిపబ్లిక్‌ ఆఫ్‌ టర్కీ ప్రభుత్వ సమన్వయంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ వైద్య బృందాలు, సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ టీమ్‌ల తోపాటు రిలీఫ్‌ మెటీరియల్‌ను టర్కీకి పంపాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అలాగే తక్షణ సహాయక చర్యలపై చర్చించేందుకు సౌత్‌ బ్లాక్‌లో ప్రధాని ప్రిన్సిపాల్‌ సెక్రటరీ పీకే మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేబినేట్‌ సెక్రటరీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు హాజరయ్యాయి.

అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ మరోసారి భారత్ విషయంలో తన దుర్భుద్ధిని చాటుకుంది. తుర్కియే , సిరియాకు సాయం చేసే విమానాలను తమ దేశ గగనతలంపై అనుమతించలేదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే అన్నట్లుగా పాకిస్థాన్ వ్యవహరించింది. ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నా.. పాకిస్థాన్ తాజాగా వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. తుర్కియే, సిరియాకు సాయం చేసేందుకు మంగళవారం తెల్లవారుజామున టర్కీకి వెళ్తున్న భారత వైమానిక దళానికి చెందిన విమానాలకు పాకిస్థాన్ తన గగనతలం నుంచి వెళ్లేందుకు పాక్ నిరాకరించింది. దాంతో అవి చుట్టూ తిరిగి తుర్కియే చేరుకోవాల్సి వచ్చింది. దీంతో పాక్ పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే టర్కీ చేరుకున్న భారత బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి.

Must Read

spot_img