Homeజాతీయంభారత్, పాక్ మధ్య ఘర్షణ రేగుతున్నా..పరిష్కారం దొరకడం లేదా..?

భారత్, పాక్ మధ్య ఘర్షణ రేగుతున్నా..పరిష్కారం దొరకడం లేదా..?

సింధూ నదీ జలాల పంపకంపై భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం .. తలెత్తింది. 1960లో ఏర్పాటైన ఒప్పందంలో మార్పుల కోసమే భారత్ .. తాజాగా నోటీస్ జారీ చేసింది. దీంతో అసలు పంపకాల లెక్కేమిటి..? డీల్ నోటీసుకు కారణమేంటి..? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ నోటీసులపై పాక్ ఏవిధంగా రెస్పాండ్ అవుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.

దేశ విభజన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దులతో పాటు జల వివాదాలు పీటముడిగా ఉన్నాయి. దశాబ్దాలుగా ఇరు దేశాలూ ఘర్షణ పడుతున్నా సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. ఓవైపు కశ్మీర్.. మరోవైపు సింధు జలాల ఒప్పందం విషయంలో ఇరు దేశాలూ తమ వాదనలకు పరిమితమవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. అయితే, దీనిపై పాక్ వైఖరితో ఇంకా వివాదం జటిలమవుతోంది. సింధు నదీ జలాలపై భారత్, పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది.

ఇరు దేశాల మధ్య విబేధాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాదికి నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సింధు జలాల ఒప్పంద కమిషనర్ల ద్వారా జనవరి 25న ఈ నోటీసు పంపినట్లు తెలిపాయి. ఈ ఒప్పందం అమలుపై పాక్‌
మొండి వైఖరి కారణంగానే నోటీసు పంపించాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సింధు నదీ జలాల ఒప్పంద స్ఫూర్తితో అమలు చేసే విషయంలో భారత్‌ ఎల్లప్పుడూ కృతనిశ్చయంతో, బాధ్యతతో వ్యవహరిస్తోంది.

కానీ, ఒప్పందం నిబంధనలు, అమలుకు పాక్ చర్యలు ఆటంకం కలిగిస్తున్నాయి.. ఫలితంగా ఒప్పందాన్ని సవరించుకునేందుకు భారత్‌ ఇప్పుడు బలవంతంగా నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఒప్పందానికి సంబంధించిన నోటీసు పంపడంతో 90 రోజుల్లోగా భారత్, పాక్‌ మధ్య చర్చలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాదు, గత ఆరు దశాబ్దాల్లో నేర్చుకున్న పాఠాలతో ఈ ఒప్పందాన్ని సవరించుకునే వీలు లభించినట్టవుతుంది. కిషన్‌గంగా, రాట్లే జల విద్యుత్‌ ప్రాజెక్టుల విషయంలో విభేదాల పరిష్కారానికి చర్చలను గత ఐదేళ్లుగా పాక్‌ నిరాకరిస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే భారత్‌ ఈ నోటీసును పంపాల్సి వచ్చిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కిషన్‌ గంగా, రాట్లే ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. వాటి పరిశీలనకు తటస్థ నిపుణులు అవసరమని 2015లో పాకిస్థాన్ అభ్యర్థించింది. అయితే ఆ తర్వాత ఏడాదే వెనక్కి తీసుకుంది. మధ్యవర్తిత్వ న్యాయస్థానం తమ అభ్యంతరాల్ని పరిష్కరించాలని ప్రతిపాదించింది. కానీ, పాక్‌ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్.. ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణులకు అప్పగించాలని ప్రపంచ బ్యాంక్‌కు విన్నవించింది.

ఈ వివాదంపై 2016లో స్పందించిన ప్రపంచ బ్యాంకు.. ఇరు దేశాల అభ్యర్థనలను నిలిపివేసింది. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించాలని సూచించింది. అయితే, పాక్‌ ఒత్తిడి చేయడంతో ఇటీవల తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రపంచ బ్యాంకుప్రారంభించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత్‌.. ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలు చేపట్టడం సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని మండిపడింది. ఇలాంటి ఉల్లంఘనల కారణంగానే ఒప్పందం సవరణకు నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

దేశ విభజన అనంతరం సింధు నదీ జలాల వివాదానికి పరిష్కరించుకునేందుకు భారత్‌, పాక్‌ మధ్య 1960 సెప్టెంబరు 19న ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై నాటి భారత ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్‌ ఖాన్‌ సంతకాలు చేశారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. దీనిలో సింధు, జీలం, చీనాబ్‌ పాక్‌కు, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులు భారత్‌కు దక్కాయి. 2 దేశాల మధ్య సహకారం కొనసాగేలా సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు.

సింధు నదీజలాల ఒప్పందం అన్నది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారతదేశం, పాకిస్తాన్ ల నడుమ ఏర్పడ్డ నీటి పంపిణీ ఒప్పందం. పాకిస్తాన్
నదులు భారతదేశంలో మొదట ప్రవహిస్తూండడంతో ఒప్పందం భారతదేశాన్ని నీటిని సాగు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు వినియోగించుకోమంటూనే నదులపై భారతీయ నిర్మాణాలు చేయదగ్గవి, చేయరానివేమిటో నిర్ధారించింది.

సింధునదీ పరీవాహక ప్రాంతపు నదుల జన్మస్థానం భారత దేశం కావడంతో భారతదేశం .. పాకిస్తాన్‌లో కరువు, కాటకాలు సృష్టించగలదనీ, ప్రత్యేకించి యుద్ధ సమయంలో చేస్తుందనీ పాకిస్తాన్‌కు ఉన్న భయాల వల్ల ఈ ఒప్పందం ఏర్పడింది. 1960లో ఒప్పందం అమలులోకి వచ్చిన నాటి నుంచి, భారత దేశం, పాకిస్తాన్లు జలాల గురించి యుద్ధంలోకి వెళ్ళలేదు. అనేక విభేదాలు, వివాదాలు ఒప్పందం పరిధిలోని న్యాయపరమైన పద్ధతుల్లోనే పరిష్కరించుకున్నారు. నిపుణులు కొన్ని సాంకేతిక నిర్దేశాలను నవీకరించి, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఒప్పందపు పరిధిని విస్తరించాలనడం ఎలావున్నా, ప్రస్తుతం
ప్రపంచంలోనే ఈ ఒప్పందం అత్యంత విజయవంతమైన నీటి పంపకం ఒప్పందంగా పేరొందింది.

ఒప్పందపు నిబంధనలకు అనుగుణంగా భారతదేశం మొత్తం సింధు నదీ జలాల్లో 20% మాత్రమే ఉపయోగించుకోగలుగుతుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామని ప్రతిపాదిస్తూ భారత్‌ పాకిస్థాన్‌కు నోటీసు జారీ చేసింది. ఐడబ్ల్యూటీ విషయంలో భారత్‌-పాక్‌ మధ్య చాలా కాలం నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. 2017 నుంచి 2022 వరకు ఐదుసార్లు శాశ్వత ఇండస్‌ కమిషన్‌ సమావేశాలు జరిగినప్పటికీ ఈ అంశంపై చర్చించేందుకు పాక్‌ నిరాకరించింది.

లద్దాఖ్‌లో భారత్ అనుమతించిన జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. పాకిస్తాన్ అధికారుల ప్రతినిధి బృందం ఒకటి మార్చి 23, 24 తేదీల్లో రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చింది. ఇది శాశ్వత సింధు కమిషన్ 116వ సమావేశం. గత కొన్నేళ్లుగా భారత-పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఏ గొడవ వచ్చినా, సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలనే విషయం తెరపైకి వస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని నదీజలాల అంతర్జాతీయ పంపకానికి ఒక విజయవంతమైన ఉదాహరణగా చెబుతుంటారు.

భారత్-పాకిస్తాన్ 60 ఏళ్ల క్రితం ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్య కార్గిల్‌తో కలిపి మూడు యుద్ధాలు జరిగాయి. కానీ, ఎంత పెద్ద సమస్యలు వచ్చినా ఈ ఒప్పందం చెక్కుచెదరలేదు. వ్యతిరేక గళాలు వినిపించినా ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం పడలేదు. ఉరీ తీవ్రవాద దాడి, పుల్వామా దాడులు జరిగినప్పుడు కూడా.. భారత్ సింధు నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని ఊహాగానాలు సాగాయే కానీ అలా జరగలేదు.

ఈ ఒప్పందం నిబంధనల ప్రకారం ఎవరైనా, ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోడమో లేదంటే మార్చడమో కుదరదు. రెండు దేశాలు కలిసి చర్చించుకుని, ఈ సంధిలో మార్పులు చేయవచ్చు లేదా ఒక కొత్త ఒప్పందం చేసుకోవచ్చు. అందులో వియన్నా ఒప్పందం లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ 62 ప్రకారం, పాకిస్తాన్ మాకు వ్యతిరేకంగా తీవ్రవాద గ్రూపులను ఉపయోగిస్తోందని చెప్పి, భారత్ ఈ ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు. మౌలిక పరిస్థితుల్లోమార్పులు ఉంటే, ఏ ఒప్పందాన్నైనా రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పింది. సింధు నది పరివాహక ప్రాంతం దాదాపు 11.2 లక్షల కిలోమీటర్లు వ్యాపించి ఉంది.

Must Read

spot_img