అక్కడ అధికారులు దుస్తులు విప్పేసి వేడి వేడి పొగలు కక్కే సౌనా బాత్ చేస్తూ ఆ గదిలోనే తమ రెండు దేశాల మధ్య సమస్యలపై చర్చిస్తారు. వినడానికి వింతగా ఉంది కదూ.. మరి అంత వేడి ఉక్కబోత వాతావరణంలో ఏం గుర్తుంటుంది..ఏం చర్చిస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అది మరెక్కడో కాదు. ఫిన్లాండ్ దౌత్యాధికారులు తమ అంతర్జాతీయ పాలసీలపై చర్చలు, సమస్యల పరిష్కారంపై రిలాక్స్డ్గా మాట్లాడుకోవడానికి సౌనా గదులను ఉపయోగించుకోవడం చాలాకాలంగా జరుగుతోంది. ఆవిరి స్నానాలు చేయడానికి నిర్మించే గదులని సౌనాలు అంటారు. సావ్నాలలో కూర్చుని అంతర్జాతీయ అంశాలు చర్చించుకోవడం ఫిన్లాండ్ దౌత్యాధికారులకు మొదటి నుంచి వస్తూన్న అలవాటు ఆనవాయితీగా చెబుతున్నారు.
ఫిన్ లాండ్ అనగానే అందరికీ ఓ విషయం బాగా గుర్తుకువస్తుంది. ప్రపంచానికి మొబైల్ ఫోన్ పరిచయం చేసిన నోకియా కంపెనీ ఉద్భవించింది ఫిన్ లాండ్ లోనే. అక్కడి ఓ అందమైన సెలయేరు పేరైన నోకియానే తమ మొబైల్ కంపెనీకి పెట్టుకుంది నోకియా. ఆ విషయం పక్కనబెడితే.. దౌత్యం అనేక రూపాల్లో జరుగుతుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే సమావేశాలు, అత్యున్నత స్థాయి సంప్రదింపులు, శిఖరాగ్ర సమావేశాలు ఖరీదైన ఆతిథ్యాలు వంటివన్నీ దౌత్యంలో వివిధ మార్గాలుగా ఉంటాయి. కానీ ఫిన్లాండ్ దౌత్యం మాత్రం వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది.
వారు దాన్ని తమ రహస్య ఆయుధంగా కూడా చెప్తుంటారు. అది దుస్తులు విప్పి సాగించే దౌత్యం అని అంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న ఫిన్లాండ్ ఎంబసీలో చాలాకాలంగా సావ్నా సొసైటీ ఉంది. గత ఏడాది లండన్లోని ఫిన్లాండ్ ఎంబసీలోనూ ఇలాంటిది ఏర్పాటుచేశారు. ‘సౌనా దౌత్యం’లో భాగంగా ఫిన్లాండ్ దౌత్యాధికారులు తాము ఎవరితో సమావేశం కావాలని అనుకుంటున్నారో వారిని ఆహ్వానిస్తారు. పరిచయాలు, పలకరింపులు అయిన తరువాత మద్యం తాగుతారు.
ఆ తరువాత మహిళా అధికారులు మొదట సౌనాలోకి వెళ్లి దుస్తులు తీసేసి ఆవిరి స్నానం చేస్తారు. వారి తరువాత మగవారు వెళ్తారు. ఈ తంతు అంతా పూర్తయిన తరువాత బయటకు వచ్చి అంతా ఒకచోట చేరి డ్రింక్ చేస్తూ తింటారు. దీన్ని నేక్డ్ నెట్వర్కింగ్ అని పిలవండి.. ఇంకేదైనా అనండి.. కానీ, ఇది మాత్రం ఇరు పక్షాల మధ్య సానుకూలతలను పెంచడమ కాకుండా మంచి ఫలితమిస్తుందని ఫిన్ లాండ్ అధికారులు అంటున్నారు. ‘సౌనా అనేది ఫిన్లాండ్కు చెందిన పాత ఆచారం. వారి జీవన విధానంలో ఇది భాగంగా కొనసాగుతోంది’ ఈ విధానం వల్ల తెలియని వ్యక్తుల మధ్య స్నేహం పెంచుకోవడం, పరస్పర విశ్వాసం ఏర్పరుచుకోవడం కోసం పనిచేస్తుందని వారంటున్నారు.
హాయిగా స్నానాలు చేసి మద్యం సేవించి కడుపు నిండుగా భోజనం చేసాక..’నిజాయితీగా మాట్లాడుకోవడానికి ఇది మంచి వాతావరణం ఏర్పడుతుంది.. అక్కడ అందరూ దుస్తులులేకుండానే ఉంటారు. అందరూ అదే స్థితిలో ఉన్నప్పుడు ఎవరికీ వారి హోదాలు గుర్తుకు రావు. అప్పుడు విషయంలోకి వెళ్లి నిష్కల్మశంగా మాట్లాడుకోవచ్చు అని అంటున్నారు. ఆవిరి స్నానంతో వేడెక్కి చెమటలు పట్టడం వల్ల శరీరమంతా రిలాక్స్ అవుతుంది. ఆందోళనలు తగ్గి, నమ్మకం కుదిరి సత్సంబంధాలు ఏర్పడడానికి వీలవుతుంది.
అయితే, ఈ సౌనా దౌత్య సమావేశాల్లో కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటిస్తారు. ఆవిరి స్నానపు గదిలోకి వెళ్లగానే అక్కడ ఒక టవల్ ఉంటుంది. దాన్ని బమ్ టవల్ అంటారు. సావ్నాలో కూర్చున్నప్పుడు వేడి తగలకుండా ఉండేందుకు దీన్ని కట్టుకోవచ్చు. ఆడవాళ్లంతా ఒకసారి.. మగవాళ్లంతా ఒకసారి వేర్వేరుగా ఇందులో ఆవిరి స్నానం చేస్తారు. ఇందులో ప్రవేశించినప్పడు 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగా ఉంటుంది. అందులోకి వెళ్లిన కాసేపటికే ఒళ్లంతా చెమటలు పడతాయి. కొద్దిసేపటికే అందరి మధ్య హద్దులు చెరిగిపోయి చర్చలు మొదలుపెట్టారని చెప్పారు.
అయితే ఈ సౌనా దౌత్యం అన్ని దేశాల మధ్య వీలు కాకపోవచ్చు. కొన్ని దేశాల ప్రజలు అందరి ముందు నగ్నంగా కనిపించడానికి ఇష్టపడరు. కానీ, ఇక్కడ మాత్రం అలాంటిదేమీ లేదని.. ఎవరైనా అసౌకర్యంగా ఫీలవుతున్నారా అని అడిగినప్పుడు అందరూ లేదనే చెప్పడం విశేషం. యూరోపియన్ యూనియన్ కోసం లండన్లో దౌత్యాధికారిగా పనిచేస్తున్న ఫ్రెడరికో బియాన్సీ మాట్లాడుతూ.. తాను ఈ అనుభవాన్ని చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. సాధారణ సమావేశాలలో అయితే నలగని దుస్తులు కోటూ బూటూతో మొబైల్ ఫోన్ పట్టుకుని కాకుండా ఇది భిన్నంగా ఉందన్నారు.
ఒంటి మీద దుస్తులు ఉండవు కాబట్టి సమావేశంలో మన వస్త్రధారణ, ఆహార్యం ఎలా ఉందనే ప్రశ్నే రాదు. అర్ధనగ్నంగా ఉండడం వల్ల మిగతా విషయాలపై దృష్టిపెట్టకుండా కేవలం చర్చించుకునే విషయం మీదే దృష్టి పెడతామని చెబుతున్నారు. గతంలో ఉన్నతస్థాయి దౌత్య చర్చలు కూడా సౌనాలోనే జరిగిన సందర్భాలున్నాయి.
1960లో ఫిన్లాండ్ ప్రచ్ఛన్న యుద్ధ నాయకుడు యురో కెకొనెన్ అప్పటి సోవియట్ యూనియన్ నేత నికిటా కృశ్చేవ్ను ఒక రాత్రంతా సావ్నాలో ఆవిరి స్నానానికి తీసుకెళ్లి చర్చలు జరిపారు.. ఫిన్లాండ్ను పశ్చిమ దేశాలతో కలిసేందుకు అనుమతించాలని ఆయన్ను ఒప్పించారు. 2005లో వ్లాదిమిర్ పుతిన్ హెల్సింకీలో పర్యటించినప్పుడు కూడా అప్పటి ఫిన్లాండ్ అధ్యక్షురాలి భర్తతో కలిసి సౌనాలోనే చర్చించారు. ఆ తరువాత పుతిన్ దాన్ని అద్భుతమైన అనుభవంగా అభివర్ణించారు. మరి ఈసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఈ తరహాలో చర్చలు జరిపితే ఎలా ఉంటుందోనని చమత్కరిస్తున్నారు విశ్లేషకులు. అయితే ప్రతీ పది సంవత్సరాలకు ఒకసారి పాత విధానాలు అప్డేట్ అవుతుండటం సహజంగా జరిగిపోతుంటుంది. అలాంటి ప్రభావమే సౌనా దౌత్యంపైన కూడా పడుతోంది.
ఇప్పుడు సావ్నా దౌత్యం సాంస్కృతిక కలయికలా మారిపోయిందని చెప్తున్నారు వాషింగ్టన్ డీసీలో సావ్నా నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఫిన్లాండ్ దౌత్యాధికారి సనా. ప్రస్తుతం మా దేశం నుంచి పుట్టుకు వచ్చిన సౌనాదౌత్య విధానం చాలా పాపులర్. సౌనా సొసైటీలో చేరడానికి అందరూ టికెట్ కోరుకుంటున్నారు. వాషింగ్టన్లో అన్ని దేశాలకూ రాయబార కార్యాలయాలున్నాయి. నెలలో ఓ శుక్రవారం 25 మందిని మాత్రమే ఇందులోకి అనుమతించగలం. అంతకు మించి ఏర్పాట్లు చేయాలంటే అది మామూలు స్పా కార్యక్రమంగా మారిపోతుంది. అందుకే అంతకన్నా ఎక్కువగా నిర్వహించాలని అనుకోవడం లేదు ఫిన్ లాండ్ అధికారులు. ఒక విషయం మాత్రం అందరికీ ముందే స్పష్టం చెప్పేస్తారు. అదేమిటంటే.. ‘ఫిన్లాండ్ సౌనాలు లైంగిక కార్యకలాపాలకు ఉద్దేశించిన ప్రదేశాలు ఏమాత్రం కావు.
ఇవి ప్రతి ఒక్కరికీ సురక్షితమైన ప్రదేశాలుగానే ఉంటాయి. ప్రతీదీ సూక్ష్మంగా గమనించబడుతుంది. ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా, గౌరవప్రదంగా ఉండేలా చూడటం వల్లే ఇప్పటికీ ఇది సక్సెస్ ఫుల్ గా కనొసాగుతోంది. అయితే ప్రతీదీ ఫిన్ లాండ్ సౌనా దౌత్యంతో పరిష్కారం లభించదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల వ్యక్తులు, ఆ దేశ అంతర్యం అంతుపట్టనిదిగా ఉంటుంది. చెప్పడం ఒకటి చేయడం మరొకటిగా ఉండే చైనా లాంటి దేశాలతో ఈ తరహా దౌత్యం ఏమాత్రం సూట్ కాకపోవచ్చు. పైగా ఇలాంటి వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని మోసం చేస అవకాశం కూడా ఉంటుంది. ఇది కేవలం జెంటిల్మెన్ షిప్ తో వ్యవహరించే వ్యక్తులకోసం ఉద్దేశించిందే అనడం కొసమెరుపుగా భావించవచ్చు..