ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా నిలుస్తోందా..? దీనికి కారణమేంటి..? మరీ ముఖ్యంగా మోడీ సర్కార్ చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ పథకం వేళ .. దిగుమతులపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోతోందా..? ఇంతకీ భారత్ దిగుమతుల్లో దూకుడుకు కారణమేంటి..? దీనిపై రక్షణ నిపుణులు చెబుతున్నదేమిటి..? మరి దిగుమతులకు అడ్డుకట్ట వేయగలమా .. లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది.
భారత్ .. ఆది నుంచి దిగుమతులపైనే ఆధారపడుతుండడం, సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ దిగుమతులు తగ్గడం లేదని సిప్రీ నివేదిక వెల్లడిస్తోంది. అదే సమయంలో గతం కన్నా దిగుమతులు తగ్గినా, దూకుడు మాత్రం తగ్గలేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో మేకిన్ ఇండియా .. రక్షణ రంగంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోందన్న చర్చ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ దూసుకుపోతోంది. 2013-17తో పోలిస్తే 2018-22లో ఈ దిగుమతులు 11 శాతం మేర తగ్గాయి.
అయినప్పటికీ కూడా ఇతర దేశాలతో పోల్చితే భారత్ ఆయుధ దిగుమతుల్లో మళ్లీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. రక్షణ కొనుగోళ్ల ప్రక్రియలో సంక్లిష్టత, భిన్న
సరఫరాదారుల నుంచి సమీకరణకు ప్రయత్నాలు, స్వదేశీ డిజైన్లకు ప్రాధాన్యం వంటి వాటి వల్లే ఆయుధ దిగుమతి తగ్గుదలకు కారణం అవుతున్నాయి. స్టాక్‌హోం
ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) తన తాజా నివేదికలో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 2018-22లో ప్రపంచంలో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా అమెరికా కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలు ఉన్నాయి.

సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచలోనే 8 వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా పాకిస్థాన్ ఉంది. అయితే 2018-22 కాలంలో ఆ దేశ అస్త్ర దిగుమతులు 14 శాతం తగ్గాయి. ప్రధానంగా చైనా నుంచే వీటిని కొంటోంది. 013-17తో పోల్చినప్పుడు 2018-22లో ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతులు 44 శాతం పెరిగాయి. 2018-22లో ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతుల్లో 30 శాతాన్ని భారత్ అందుకుంది. దీంతో అమెరికాను తోసి మన దేశానికి రెండో అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఫ్రాన్స్ నిలిచింది. మొదటిస్థానంలో రష్యా ఉంది. అయితే ఆ దేశం నుంచి భారత్‌కు అందుతున్న ఆయుధాలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్‌లో రష్యా ఎగుమతులు తగ్గుతుండగా ఫ్రాన్స్ వాటా పెరుగుతోంది.
భారత్‌లో ఆయుధాల తయారీకి పెద్దపీట వేయడంతో ఈ బడ్జెట్‌లో భారత ఆయుధాల కొనుగోలుకు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఖరారు చేశారు. భారతదేశ ఆయుధాల కొనుగోలు తగ్గడానికి కారణం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని, దీని కింద భారత ప్రభుత్వం ఆయుధాల్లో స్వయం సమృద్ధి సాధించడంపై దృష్టి సారిస్తోందని నివేదికలో వెల్లడైంది. గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలలో భారతదేశం ఆయుధాలలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ముఖ్యమైన అడుగులు వేసింది.
భారతదేశంలో తయారయ్యే ఆయుధాల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించడం, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడం, అనేక ఆయుధాల కొనుగోలుపై నిషేధం వంటివి ఉన్నాయి. భారత్‌లో ఆయుధాల తయారీకి పెద్దపీట వేశారు. అందులోభాగంగా ఈ బడ్జెట్‌లో భారత ఆయుధాల కొనుగోలుకు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారు. విశేషమేమిటంటే, గత మూడేళ్లలో, దానిలో నిరంతర పెరుగుదల ఉంది. మూడేళ్ల క్రితం భారత్‌లో తయారయ్యే ఆయుధాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు బడ్జెట్‌లో 51 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, వచ్చే ఏడాది దాన్ని 70 వేల కోట్ల రూపాయలకు, ఆపై 84 వేల కోట్ల రూపాయలకు పెంచారు. ఇప్పుడు అది లక్ష కోట్ల రూపాయలకు పెరిగింది. 2018-19లో రక్షణ బడ్జెట్‌లో విదేశీ కొనుగోళ్లు 46 శాతం నుంచి 36.7 శాతానికి తగ్గాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజత్భ ట్ తెలిపారు. 2024-25 సంవత్సరం నాటికి లక్షా 75 వేల కోట్ల రూపాయల విలువైన భారతీయ ఆయుధాలను కొనుగోలు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు ఎగుమతులను 35 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నివేదికలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రష్యా ఆయుధాలపై భారత్ ఆధారపడటం తగ్గింది. రష్యా నుంచి భారత్ ఆయుధాల దిగుమతులు 37 శాతం తగ్గాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. దీని కారణంగా రష్యా ఆయుధాల ఎగుమతులు కూడా తగ్గాయి. అలాగే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా ఆయుధాలను కొనుగోలు చేసేందుకు అమెరికా మిత్రదేశాలు ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా, ఆయుధ ఉత్పత్తిలో భారత్ సాధించిన స్వావలంబన ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న మన దేశం 42 దేశాలకు ఎగుమతి చేసే స్థితికి ఎలా చేరుకుంది? అన్నది కీలకంగా మారింది. 2004 నుంచి 2014 వరకూ భారత ఆయుధ దిగుమతి ఏటేటా ఎలా, ఎందుకు పెరుగుతూ పోయింది? ఎంత పెరిగింది? 2014 తర్వాత గడచిన ఏడేళ్ల కాలంలో ఆయుధ సామాగ్రి దిగుమతి తగ్గి, ఎగుమతులు ఎలా పెరిగాయి? అన్నది చర్చనీయాంశమవుతోంది.
భారత రక్షణ శాఖ విధాన పరమైన నిర్ణయాలను అనుసరించి ఆయుధ సేకరణ, ఉత్పత్తి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అయితే 2004-2014 వరకూ దేశీయ ఆయుధ ఉత్పత్తి కన్నా విదేశీ ఉత్పత్తిపై ఎక్కువగా ఆధారపడటం, దశాబ్దకాలం పాటు ప్రతి ఏటా దిగుమతి వ్యయం పెరగటం జరిగింది. ఈ పదేళ్ల కాలంలో ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే 2వందల హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 14శాతం ఆయుధ దిగుమతి చేసుకున్న దేశంగా నిలిచింది. చైనా కన్నా మూడు రెట్లు ఎక్కువగా కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరాపై స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 2014, మార్చిలో విడుదల చేసిన నివేదికలో ఆయుధ సంపత్తి దిగుమతుల్లో భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ల కన్నా ముందుందని పేర్కొంది.
ఆ దేశాల కన్నా మూడు రెట్లు అధికంగానే ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకుందనీ, అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. చైనా, పాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ నివేదిక ప్రకారం భారత్ భారీ ఆయుధాల దిగుమతులు 2004-08తో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో 111 శాతం, పాకిస్థాన్ దిగుమతులు 119 శాతం పెరిగాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 7 నుంచి 14 శాతానికి పెరిగింది. ఇలా భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధ సంపత్తిలో 75 శాతం విక్రయించి రష్యా ప్రథమ స్థానంలో నిలవగా, 7 శాతం సరఫరాతో అమెరికా రెండో స్థానంలో ఉంది.
భారత్‌కు ఆయుధాల విక్రయంలో అమెరికా రెండో స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. అదే కాలంలో పాకిస్థాన్ ఆయుధ సంపత్తిలో 27 శాతం అమెరికానే అందించడం గమనార్హం. అయితే చైనా మాత్రం భారత ఉపఖండంలో ముఖ్యమైన ఆయుధాల విక్రయదారుగా వ్యవహరిస్తోంది. పాకిస్థాన్ ఆయుధాల దిగుమతుల్లో 54 శాతం, బంగ్లాదేశ్ ఆయుధాల దిగుమతుల్లో 82 శాతం సరఫరా చేసింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయుధరంగంలో స్వావలంభన సాధించడం కోసం మేకిన్ ఇండియా పథకం ద్వారా దేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఆయుధ దిగుమతుల నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో గడచిన ఐదేశ్లలో భారత్ ఆయుధ దిగుమతులు 33 శాతం తగ్గాయి. సాయుధ దళాల ఆధునీకరణకు గడచిన ఐదేళ్లలో 304 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో 190 ఒప్పందాలు దేశీయ సంస్థలతోనే జరిగినట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
దేశ రక్షణలో కీలకమైన హై టెక్నాలజీ ఆయుధాలను దిగుమతి చేసుకోక తప్పడం లేదన్నది కేంద్ర రక్షణ శాఖ వాదన. అందుకే మేకిన్ ఇండియాతో దేశీ పరిశ్రమలకు ఊతం ఇస్తూనే, దిగుమతులకు పచ్చ జెండా ఊపుతోందని నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.