Homeఅంతర్జాతీయంయుద్ధ్ అభ్యాస్ పై చైనా వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

యుద్ధ్ అభ్యాస్ పై చైనా వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

తమ దేశ సరిహద్దుల్లో జరుగుతోన్న విన్యాసాలపై చైనాకు వీటో పవర్ లేదని వ్యాఖ్యానించింది. ఉల్లంఘనల ఆరోపణపై .. చైనా వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది.

భారత్ సరిహద్దుల్లో యుద్ధ్ అభ్యాస్ .. విన్యాసాలపై చైనా దుందుడుకు తనాన్ని ప్రదర్శిస్తోందా..?

అసలు యుద్ధ్ అభ్యాస్ పై చైనా ఎందుకు టెన్షన్ పడుతోందన్నదే ఆసక్తికరంగా మారింది.

భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న 18వ విడత యుద్ధ అభ్యాస్ సైనిక ప్రదర్శనను చైనా వ్యతిరేకించడాన్ని భారత్ తిప్పికొట్టింది. ఇలాంటి విషయంలో మూడో దేశానికి తాము వీటో అధికారం ఇవ్వలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చైనా లేవనెత్తినట్లు 1993, 96 సరిహద్దు నిర్వహణ ఒప్పందాలు ఈ మిలిటరీ ప్రదర్శనకు వర్తించవని భారత విదేశాంగ ప్రతినిధి అరిందం బాగి స్పష్టం చేశారు. 2020, మేలో చైనా బలగాలు చేసిన ఉల్లంఘనలను గుర్తు చేసుకోవాలన్నారు. చైనా సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో భారత్, అమెరికా యుద్ధ అభ్యాస్ప్రారంభించాయి. ఈ 18వ ఎడిషన్‌ వినాస్యాలను ఉత్తరాఖండ్‌లోని ఔలీలో నిర్వహిస్తున్నారు. చైనాను ఎదుర్కోవడంలో సన్నద్ధం అయ్యేందుకు భారత్-చైనాకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి. ఎత్తైన పర్వతాలు, తీవ్ర చలి ఉండే వాతావరణంలో 15 రోజుల పాటు ఈ సంయుక్త విన్యాసాలు జరుగుతాయని భారత ఆర్మీ ప్రకటించింది. ప్రతి ఏడాది భారత్‌-అమెరికా నిర్వహించే ఈ సంయుక్త విన్యాసాల్లో యుద్ధ వ్యూహాలు, సంసిద్ధత వంటి పలు అంశాలతో పాటు విపత్తుల సమయంలో ప్రతిస్పందించాల్సిన తీరు, ఇతర విషయాలపై ఇరు దేశాలు దృష్టిపెడతాయి. గత ఏడాది ఈ సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరిగాయి.

ప్రస్తుతం జరుగుతున్న విన్యాసాల్లో అమెరికా సైన్యంలోని సెకండ్‌ బ్రిగేడ్‌ తో పాటు ఇండియా నుంచి 11వ అసోం రెజిమెంట్‌ దళాలు పాలు పంచుకుంటున్నాయి. కాగా, ఈ విన్యాసాలపై చైనా స్పందిస్తూ.. సరిహద్దు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని చెప్పుకొచ్చింది. అయితే, చైనా వ్యాఖ్యలపై భారత్‌ దీటుగా సమాధానం ఇచ్చింది. భారత అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విధంగా చైనా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పింది. భారత్‌-అమెరికా చేపట్టనున్న సైనిక విన్యాసాలు.. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నదన్న చైనా వ్యాఖ్యలను భారత్‌ తోసిపుచ్చింది. ద్వైపాక్షిక ఒప్పందాలపై ఎటువంటి ప్రభావం చూపదని పునరుద్ఘాటించింది. ఈ విషయంలో చైనా అనవసరపు ఆందోళనకు గురికానక్కరలేదని వ్యాఖ్యానించింది.

యుద్ధ్‌ అభ్యాస్ విన్యాసాలు నిర్వహిస్తోన్న ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతం భారత్‌-చైనా సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, సీనియర్‌ కల్నల్‌ టౌన్‌ కెఫీ మాట్లాడుతూ… చైనా-భారత్‌ సమస్యపై ఏ రూపంలోనైనా మూడో పార్టీ జోక్యాన్ని మేము గట్టిగా వ్యతిరేకిస్తాంమని పేర్కొన్నారు. సంబంధిత దేశాల సైనిక సహకారం, ముఖ్యంగా విన్యాసాలు, శిక్షణా కార్యకలాపాలపై ఏ మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోకూడదని, బదులుగా ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను కాపాడుకోవడంలో సహాయపడాలని వ్యాఖ్యానించారు. 1993,1996లో చైనా, భారత్‌ చేసుకున్న ఒప్పందాల ప్రకారం.. వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలోని ఉన్న ప్రాంతాల్లో ఒకరిపై మరొకరు వ్యతిరేకంగా సైనిక విన్యాసాలు చేయడానికి ఎవ్వరికీ అనుమతి లేదని చెప్పారు.

చైనా ఆరోపణలపై మండిపడ్డ భారత్ .. స్పష్టమైన కౌంటర్ ఇచ్చిందా..?

ఇరు దేశాధినేతలు చేసుకున్న ఏకాభిప్రాయానికి, సంబంధిత ఒప్పందాలకు భారత్‌ కచ్చితంగా కట్టుబడి ఉంటుందని, ద్వైపాక్షిక మార్గాల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించడంలో తన నిబద్ధతను సమర్థిస్తుందని, సరిహద్దుల్లో ఆచరణాత్మకంగా శాంతి, సుస్థిరతను కాపాడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. అయితే దీనిపై విదేశాంగ ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్బి .. ధర్డ్‌ పార్టీ సూచనలేంటో తనకు అర్థం కాలేదని అన్నారు. అమెరికా-భారత్‌ సైనిక విన్యాసాలు పూర్తిగా భిన్నమైనవని, అది చైనాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కానీ, ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించినట్లుగా ఉండవని అన్నారు. కెఫీ ఎందుకు అలా అన్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అమెరికా, భారత్ దేశాల సైన్యాల మధ్య అత్యుత్తమ అభ్యాసాలు, వ్యూహాలు సాంకేతికతలు – విధానాలను పరస్పరం మార్చుకునే లక్ష్యంతో ప్రతి ఏటా భారత్, అమెరికాల మధ్య ట్రైనింగ్ గా యుధ్ధ అభ్యాస్ నిర్వహిస్తున్నారు. గతేడాది అక్టోబర్ లలో అమెరికాలోని జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్ రిచర్డ్సన్ అలస్కాలో నిర్వహించారు. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఇరు దేశాల సైనికులు కలిసి పని చేస్తారు. ఉమ్మడి ట్రైనింగ్ లో మానవతా సహాయం, విపత్తు సహాయ కార్యకలాపాలపై కూడా దృష్టి పెడుతుంది.

ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు రెండు దేశాలకు చెందిన దళాలు వేగంగా సమన్వయంతో సహాయక చర్యలను ప్రాక్టీస్ చేస్తాయి. రెండు సైన్యాల వృత్తిపరమైన నైపుణ్యాలు, అనుభవాల నుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు జాగ్రత్తగా ఎంచుకున్న అంశాలపై కమాండ్ పోస్ట్ ఎక్సర్సైజ్ఎక్స్పర్ట్ అకడమిక్ డిస్కషన్లు నిర్వహించబడతాయి. ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ పరిధిలో సమీకృత యుద్ధ సమూహాల ధృవీకరణ, ఫోర్స్ మల్టిప్లైయర్లు, నిఘా గ్రిడ్ల స్థాపన పనితీరు కార్యాచరణ, లాజిస్టిక్ల ధ్రువీకరణ, పర్వత యుద్ధ నైపుణ్యాలు, ప్రమాదాల తరలింపు, ప్రతికూల భూభాగ వాతావరణ పరిస్థితులలో పోరాటం, వైద్య సహాయం ఉన్నాయి. రెండు సైన్యాలు తమ విస్తృత అనుభవాలను నైపుణ్యాలను పంచుకోవడానికి సమాచార మార్పిడి ద్వారా వారి సాంకేతికతను మెరుగుపరచుకోవడానికి ఈ ట్రైనింగ్ దోహదపడుతుంది

యుద్ధ ఇంజినీరింగ్, యూఎస్‌ఏ ప్రతిదాడి వ్యూహాలు, సమాచార కార్యకలాపాలు సహా పోరాట నైపుణ్యాల మార్పిడి, విన్యాసాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. కాగా చైనా సరిహద్దుకు కేవలం 100 కి.మీల దూరంలో ఉత్తరాఖండ్ లో ఇలా అమెరికా-ఇండియా సైన్యాల శిక్షణపై చైనా మండిపడుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నామని పేర్కొంది. 1993,1996లో భారత్‌, చైనా మధ్య జరిగిన ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. మరోవైపు ఈ ఒప్పందాలను ఉల్లంఘించిన చైనా 2020 మేలో లడఖ్‌లోని గాల్వాన్‌ లోయ వద్ద భారీగా సైనికులను మోహరించింది. కీలకమైన సైనిక స్థావరాలను ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. దీంతో సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో భారత్‌, చైనా పోటాపోటీగా సైనిక బలగాలను మోహరించాయి. అయితే అనంతరం పలు దఫాలుగా జరిగిన సైనిక చర్చల్లో భాగంగా బలగాలను వెనక్కి మళ్లించాయి. ఈ విషయాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు భారత్, అమెరికా విన్యాసాలపై చైనా వ్యాఖ్యలు సహేతుకం కాదని భారత్ స్పష్టం చేసింది.

రెండేళ్లుగా భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది.

గల్వాన్ ఘటన తరవాత…ఇది తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికీ ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటూ రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు యుద్ధ సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు చేయడం ఉత్కంఠను మరింత పెంచుతోంది. చైనాను పరోక్షంగా హెచ్చరించేందుకు భారత్‌ ఈ వ్యూహంతో ముందుకెళ్తోందా అన్న వాదనా వినిపిస్తోంది. డ్రాగన్‌ కుయుక్తులకు గట్టి బదులు చెప్తామని భారత్ ముందు నుంచి చెబుతూనే ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అందుకు ఇండియా రెడీ అవుతున్నట్టే అనిపిస్తోంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ కమాండర్లను హుటాహుటిన పిలిచి మీటింగ్ పెట్టారు. తూర్పు లద్దాఖ్ వద్ద ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అత్యున్నత స్థాయిలో అన్ని వ్యూహాలూ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

భారత సైన్యంపై, వారి నాయకత్వంపై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని, ఎలాంటి ఆపరేషన్లు చేపట్టేందుకైనా మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. దీంతో సరిహద్దుల్లో మోహరింపులు వాయువేగంతో సాగుతున్నాయి. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవలే చైనా ఆర్మీకి చెందిన జాయింట్ ఆపరేషన్స్ కమాండ్హెడ్‌క్వార్టర్స్‌ని సందర్శించారు. ఆ సందర్భంగా “సైన్యానికి శిక్షణ కఠినతరం చేయండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి” అని అక్కడి ఉన్నతాధికారులకు సూచించారు. సైన్యం అంతా ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇరు దేశాల్లో వినిపిస్తోన్న సైనిక సూచనలు .. సరిహద్దుల్లో ఉద్రికత్తలను పెంచుతున్నాయని సైనికు నిపుణులు, అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాలతో సరిహద్దుల్లో అప్రమత్తత పెరిగింది. అదేసమయంలో భారత్, చైనా అంశంలో జోక్యం చేసుకోవద్దని చైనా .. అమెరికాకు వార్నింగ్ఇ చ్చిందన్న పెంటగాన్ నివేదిక సైతం సర్వత్రా హీట్ ను పెంచేసిందని విశ్లేషులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు భారత్-ఆస్ట్రేలియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఇరుదేశాలు ఆస్ట్రా-హింద్ 2022 పేరిట సైనిక విన్యాసాలు ప్రారంభించనున్నారు. ఇవి వచ్చే నెల 11 వరకు కొనసాగుతాయి. ఈ ఇరుదేశాలకు చైనా నుంచిముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ విన్యాసాలు జరుగుతుండడం గమనార్హం. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆర్మీకి చెందిన 13వ బ్రిగేడ్ 2వ డివిజన్ ఆర్మీ ఇప్పటికే రాజస్థాన్ చేరుకుంది. భారత బృందంలో డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. ఈ సంయుక్త సైనిక విన్యాసాల వల్ల భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని, ఇరుదేశాల మధ్య అవగాహన, పరస్పర సహకారం అందించుకోవడానికి తోడ్పడుతాయని ఇరుదేశాలు అభప్రాయపడుతున్నాయి. ఆర్మీ విన్యాసాలు కాకుండా, భారత్, ఆస్ట్రేలియాలు క్రమం తప్పకుండా సంయుక్తంగా వైమానిక, నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తుంది. అంతేకాకుండా యుఎస్, జపాన్ లతో భారత్ నౌకాదళ విన్యాసానాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సరిహద్దుదేశాలతో ఎప్పడు కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు క్వాడ్ దేశాలు గట్టి సవాల్ విసిరాయి.

ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనాను దీటుగా ఎదుర్కొంటామని చాటి చెప్పాయి. చైనా సైనిక, ఆర్ధిక పరిధిని సమతుల్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ విన్యాసాలు చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. పసిఫిక్ రీజియన్‌లో చైనాకు చెక్ పెట్టేందుకు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాయి. అయితే, మలబార్ విన్యాసాల లక్ష్యం పట్ల చైనా అనుమానాలు వ్యక్తం చేసింది. ఇండో పసిఫిక్ రీజియన్‌లో తన ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ దేశాలన్నీ చేతులు కలిపినట్లు భావిస్తోంది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు ఈ విన్యాసాలు దోహదపడతాయని, అందుకు విరుద్ధంగా ఉండవని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికాపై డ్రాగన్కం ట్రీ విరుచుకుపడింది. ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వంతో అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించింది. తాజాగా యుద్ధ్ అభ్యాస్ పైనా చైనా చేస్తోన్న
విమర్శలకు భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

గాల్వాన్ ఘటన వెనుక చైనా సైనికుల ఉల్లంఘన ఉందన్న బాగ్చి.. భారత్, అమెరికా విన్యాసాలపై చైనాకు మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు.
అయితే చైనాకు చెక్ పెట్టేలా క్వాడ్ దేశాల సైనిక విన్యాసాలే .. కారణమన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో
మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img