Homeఅంతర్జాతీయంప్రపంచ ఆయుధాల సరఫరాదారుగా భారత్..!

ప్రపంచ ఆయుధాల సరఫరాదారుగా భారత్..!

భారత్ దేశీయంగా​ తయారుచేసిన మల్టీ బ్యారెల్ రాకెట్​ లాంఛర్​ పినాకను తొలిసారి అంతర్జాతీయంగా విక్రయించనుంది. అజర్​బైజాన్​ చేతిలో భారీగా నష్టపోయిన ఆర్మేనియాకు పినాకను సరఫరా చేయనుంది..

ఇప్పటికే పలుదేశాలకు భారత్ దేశీయంగా తయారు చేసిన ఆయుధాలను ఎగుమతి చేస్తోంది.. తాజాగా ఆర్మేనియాకు పినాకను సరఫరా చేసేందుకు సిద్దమైంది.. త్వరలోనే ప్రపంచ ఆయుధ సరఫరాదారుగా భారత్ మారనుందా…? నిపుణులు ఏమంటున్నారు..?

భారత్ దేశీయంగా​ తయారుచేసిన మల్టీ బ్యారెల్ రాకెట్​ లాంఛర్​ పినాకను తొలిసారి అంతర్జాతీయంగా విక్రయించనుంది. అజర్​బైజాన్​ చేతిలో భారీగా నష్టపోయిన ఆర్మేనియాకు పినాకను సరఫరా చేయనుంది.. ఇప్పటికే బ్రహ్మోస్​ను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది భారత్.. 40 రోజులకు పైగా సాగిన యుద్ధంలో అజర్​బైజాన్​ చేతిలో ఓడిపోయిన ఆర్మేనియాకు.. భారత్ రూ.2400 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించనుంది.

దీంతో భారత్​​ సరఫరా చేసిన ఆయుధాలపైనే ఆర్మేనియా ఆశలు పెట్టుకుంది. అయితే ప్రపంచ దేశాలకు ఆయుధాలను విక్రయించడం భారత్​కు ఇదేం మొదటిసారి కాదు. కానీ ఆర్మేనియాకు ఎగుమతి చేయడం భారతదేశ విదేశాంగ విధానానికి నిజంగా ఒక ప్రత్యేకమైన క్షణం. రెండు దేశాల మధ్య జరిగే ఘర్షణల విషయంలో భారత్.. ఏనాడూ ఒక పక్షానికి మద్దతు ప్రకటించలేదు. అయితే, భారత దేశానికి ఎప్పుడూ దెబ్బతీయాలని చూసే దాయాది దేశం పాకిస్థాన్​ పక్షాన అజర్​బైజాన్​ చేరడం వల్ల భారత్‌కు అర్మేనియాతో వ్యూహాత్మక సంబంధాలు నెరపవలసిన అవసరం వచ్చిపడింది.

ఆర్మేనియాకు భారత్​ విక్రయిస్తున్న ఆయుధాల్లో ముఖ్యమైనది మల్టీ బ్యారెల్ రాకెట్​ లాంఛర్​ పినాక. డీఆర్​డీవో అభివృద్ధి చేసిన ఈ మల్టీ బ్యారెల్​ రాకెట్​ లాంఛర్​ సిస్టమ్.. కేవలం 44 సెకన్లలో 75 రాకెట్లను పేల్చడం ద్వారా వెయ్యి మీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పు గల ప్రాంతాన్ని భస్మీపటలం చేయగలదు.

ఆర్మేనియాకు ఆయుధ సరఫరా చేయనున్న భారత్​.. తన సొంత ప్రణాళికలు కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. అజర్‌బైజాన్, పాకిస్థాన్, తుర్కియేల మధ్య మైత్రి వృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్​ తన సొంత ప్రయోజనాల కోసం ఆర్మేనియాతో ఒప్పందం కుదుర్చుకుందని అంటున్నారు. ఉక్రెయిన్​తో యుద్ధంలో రష్యా తలమునకలై ఉండడం వల్లనే ఆర్మేనియాకు భారత్​ ఈ ఆయుధ వ్యవస్థలన్నింటినీ పంపనుందని అభిప్రాయపడుతున్నారు.

రష్యా అభ్యర్థన మేరకే ఆర్మేనియాకు భారత్ ఆయుధాలు సరఫరా చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ…. భవిష్యత్తులో భారత్​ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మారనుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2022లో వివిధ దేశాలకు రూ.13 వేల కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించాలని భారత్​ భావిస్తోంది. ఆయుధ ఎగుమతుల ద్వారా వచ్చే రెండేళ్లలో రూ.35 వేల కోట్లను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఏడాది జనవరిలో బ్రహ్మోస్​ క్షిపణిని విక్రయించేందుకు ఫిలిప్పీన్స్​తో భారత్​ ఒప్పందం చేసుకుంది​. కొత్త ఆర్డర్ల కోసం మలేసియా, వియత్నాం, ఇండోనేసియాతో సంప్రదింపులు జరుపుతోంది. దీని ద్వారా 2025 నాటికి బ్రహ్మోస్​ ఏరోస్పేస్​ కంపెనీ 5 బిలియన్ల డాలర్లు ఆర్జించాలని భావిస్తోంది.

ప్రస్తుతం భారత్.. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు స్వదేశీ సైనిక పరికరాలను విక్రయిస్తోంది.

ఆయుధాల ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నపాటి పరిశ్రమ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబానీ, అదానీ, టాటా గ్రూప్​ వంటి పెద్దపెద్ద సంస్థలకు మాత్రమే కాకుండా చిన్నపాటి పరిశ్రమలను కూడా కేంద్రం అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అందులో ఎక్కువగా రష్యా నుంచే భారత్​ దిగుమతి చేసుకుంటోంది. రష్యాకు చెందిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోళ్ల విషయంలో భారత్​పై కాట్సా చట్టం కింద చర్యలు తీసుకుంటామని అమెరికా బెదిరించింది. ఆ తర్వాత నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. రష్యా నుంచి భారత్​ను వేరుచేయడానికి అమెరికా పలు విధాలుగా ప్రయత్నిస్తోంది.

కానీ, రష్యాపై భారత్​ ఆధారపడాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భారత్​లో ఉన్న యుద్ధ విమానాల్లో 61 శాతం రష్యానే సరఫరా చేసింది. అంతే కాకుండా లైసెన్సు ప్రాతిపదికన ఏకే-203 ఆయుధాలు​, టీ-90, టీ-72 ట్యాంకులను భారత్​ దేశీయంగా తయారు చేస్తోంది. వాటి విడిభాగాల కోసం భారత్​.. రష్యాపైనే ఆధారపడింది. ఈ.నేపథ్యంలో అమెరికాతో సహ పలు దేశాలు కోరుకుంటున్నట్లుగా రష్యా నుంచి భారత్​ దూరం కావడం సాధ్యం కాదని చెబుతున్నారు.

ఆత్మ నిర్భర్ భారత్… అంతకు ముందు మేక్ ఇన్ ఇండియా.. జన బాహుళ్యంలోకి బాగా చొచ్చుకుపోయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవచించిన పదబంధాలివి. స్వతంత్రం వచ్చిన తర్వాత దశాబ్ధాల పాటు భారత దేశాన్ని అభివ‌ృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే సంబోధించేవారు. ఈ దశను దాటి.. ఎప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా మన భారతం పేరు పొందుతుందా అని వేచి చూసిన వారిలో ఎంతో కొంత ఆశ రేకెత్తించిన నినాదాలివి.

మేక్ ఇన్ ఇండియా పేరిట సూది నుంచి పెద్ద జంబో జెట్ల దాకా మన దేశంలోనే తయారు చేయాలన్న ప్రతిపాదన ముందుకు తెచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇందులో చాలా వరకు సానుకూల ఫలితాలు సాధించారని చెప్పేందుకు మన దేశంలో సొంతంగా తయారు చేసుకుంటున్న ఆయుధాల శాతం పెరగడమే నిదర్శనం.

నిజానికి ప్రపంచ దేశాల్లో ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి..

అయితే, దేశీయంగా మిస్సైళ్ళ దగ్గర్నించి తుపాకుల దాకా వరల్డ్ క్లాస్ ఉత్పత్తి సంస్థలకు మన దేశం నుంచే విడి భాగాలు వెళుతూ వుంటాయి. అంతే భారత్ పంపే విడి భాగాలతో మిస్సైళ్ళు, జెట్ ఫ్లైట్స్, రైఫిళ్ళు వంటివి తయారు చేసి మనకే విక్రయించేవి కొన్ని దేశాలు. అసాల్ట్‌ రైఫిల్‌ నుంచి బాలిస్టిక్‌ మిసైల్స్‌ వరకు ప్రపంచంలోని అత్యుత్తమ ఆయుధ వ్యవస్థలకు భారతీయ పరిశ్రమలు విడి భాగాలను సరఫరా చేస్తుంటాయి.

ఈ క్రమంలో ఆయుధరంగంలో స్వావలంభన సాధించడం కోసం మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. దీని కోసం ఆయుధ దిగుమతుల నిబంధనలను కఠినతరం చేశారు. ఈ చర్యతో దేశీయంగా ఆయుధాల తయారీ ఊపందుకుంది. అదే సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలు 33 శాతం తగ్గిపోయాయి.

సాయుధ దళాల నవీనీకరణకు గత ఐదేళ్లలో 304 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఇందులో 190 ఒప్పందాలు దేశీయ సంస్థలతోనే జరిగినట్లు భారత ప్రభుత్వం తెలిపింది..

గత సంవత్సరం ఆగస్టులో 101 రకాల ఆయుధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న ఏడేళ్లలో దేశీయ ఆయుధ పరిశ్రమలతో కేంద్రం 4 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరే అవకాశం వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఆయుధాల విలువ ఒక లక్షా 30 వేల కోట్ల రూపాయల చొప్పున ఉండగా, నౌకాదళానికి చెందిన ఆయుధాల విలువ ఒక లక్షా 40 వేల కోట్ల రూపాయలుంటుందని అంఛనా.

అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భారత్ రష్యాతో ఎక్కువగా స్నేహ సంబంధాలు నెరిపినందువల్ల భారత్ కు ముఖ్య ఆయుధ సరఫరాదారుగా ఆ దేశం వుండేది. ఆ తర్వాత అమెరికాతోను సఖ్యత నెలకొన్న తర్వాత ఇరు దేశాల నుంచి భారత్ ఆయుధాలను కొనుగోలు చేసేది. అయితే.. గత అయిదేళ్ళుగా దేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రభావం పెరిగిపోవడంతో.. ఆయుధాల సరఫరా తగ్గి.. రష్యా ఆయుధ మార్కెట్‌పై పెను ప్రభావం పడింది. ఈ విషయాన్ని రష్యా ఆయుధ మార్కెట్‌ని అనాలిసిస్ చేసిన స్వీడన్ సంస్థ స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక వెల్లడించింది.

భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిని పెంచుకుంటోంది..

రష్యా ఆయుధాలపై ఆధార పడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి సంక్లిష్ట నిబంధనల కారణంగానే రష్యా నుంచి భారత్‌ ఆయుధ దిగుమతులు 54 శాతం వరకు తగ్గిపోయాయని స్టాక్‌హోం నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఫ్రాన్స్ నుంచి భారత్‌కు ఆయుధాల ఎగుమతులు పెరిగాయని స్టాక్‌హోం నివేదికలో పేర్కొన్నారు.

భారత్‌ 2019లో రక్షణ రంగానికి 71.1 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు ఎస్‌ఐపీఆర్‌ఐ 2020 ఏప్రిల్‌లో వెల్లడించింది. దీంతో రక్షణరంగ వ్యయంలో అమెరికా, చైనా తరువాత భారత్‌ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది.

ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ అంశాన్ని కూడా స్టాక్‌హోం తాజా నివేదికలో వెల్లడించింది. గత పదేళ్ళ కాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా తన వాటాను 32 నుంచి 37 శాతానికి పెంచుకున్నట్లు పేర్కొంది. 2016-20 మధ్య అమెరికా 96 దేశాలకు కీలక ఆయుధాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. మొత్తం ఎగుమతుల్లో 47 శాతం మధ్య ఆసియా దేశాలకే జరిగాయి.

అమెరికా ఆయుధ ఎగుమతుల్లో ఒక్క సౌదీ అరేబియా వాటానే 24 శాతం ఉన్నట్లు స్టాక్‌హోం రిపోర్టు పేర్కొంది. అమెరికా ఆయుధ ఎగుమతులు భారీగా వృద్ధి చెందడంతో ప్రధాన పోటీదారు అయిన రష్యాకు అందనంత ఎత్తుకు చేరుకుంది. అదే సమయంలో రష్యా, చైనా ఆయుధ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు ఈ నివేదిక వివరించింది.

ప్రపంచదేశాల నుంచి ఆయుధాల దిగుమతులను క్రమంగా తగ్గించుకుంటోంది భారత్.. ఈ క్రమంలోనే ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిని పెంచుకుంటోంది.. రానున్న కాలంలో ప్రపంచ ఆయుధ సరఫరాదారుగా భారత్ నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Must Read

spot_img