ఈ ఖనిజం కోసం ప్రపంచవ్యాప్తంగా భూభౌతిక శాస్త్రవేత్తలు నిరంతరాన్వేషణలో తలమునకలవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ‘నేనున్నాన్నంటూ భారత్‌లోనే అది ప్రత్యక్షం కావటం దేశం సంబరాలు చేసుకోవాల్సిన సందర్భంగానే చూడాలి.. అందుకే జమ్మూ, కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో నాణ్యమైన లిథియం నిక్షేపాలున్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించినప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి లిథియం నిక్షేపాలు మన దేశంలో బయటపడటం ఇదేమీ మొదటిసారి కాదు. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలో కూడా లిథియం ఆచూకీ కనుక్కున్నారు.
అయితే ఆ నిల్వలు కేవలం 1600 టన్నులు మాత్రమే అని తేలడంతో సహజంగానే నిరుత్సాహపడ్డారు. కానీ ఇప్పుడు జమ్ములో బయటపడిన నిక్షేపాలు దాదాపు 60 లక్షల టన్నులు. అంటే ప్రపంచంలోనే ఓ నాలుగు చోట్ల మాత్రమే ఉన్న లిథియం నిల్వలతో సమానం అని తెలిసి సంతోషం పట్టలేకపోయారు. ఇంకా పూర్తి స్థాయిలో లిథియం క్వాలిటీ, నిల్వల గురించి కచ్చితమైన వివరాలు రాకముందే అత్యుత్సాహంతో దేశ ప్రజల ముందు ప్రకటన చేసారు. దాంతో దేశం సంతోషంతో పొంగిపోయింది. ప్రపంచం పర్యావరణ ఉపద్రవాన్ని ఎదుర్కుంటోంది. శిలాజ ఇంధనాలు రేపే కాలుష్యాలతో ప్రపంచం ప్రక్రుతి వైపరీత్యాలను ఎదుర్కుంటోంది. ప్రపంచాన్ని నడిపిస్తున్న శిలాజ ఇంధనాలు క్రమేపీ తరిగిపోతున్నాయని, పైగా వాటి వినియోగం కారణంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నదనీ అర్థమయ్యాక ప్రత్యామ్నాయాల కోసం ఆత్రుతపడటం మొదలైంది.
కాలుష్య కారకాలైన శిలాజ ఇంధనాలను ఉపయోగించకుండా ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉపయోగించేలా దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవీలకు సంబంధించిన వార్తలు, గ్రీన్ ఎనర్జీల గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాలు నడవాలంటే లిథియం అయాన్ బ్యాటరీలు అవసరం.. అవి తయారు కావాలంటే లిథియం అనే అరుదైన ఖనిజం కావాలి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజం పరిమిత స్థాయిలో ఉంది. పరిమిత దేశాలలో మాత్రమే లిథియం నిల్వలు ఉన్నాయి. లిథియం అరుదైన ఖనిజం..కేవలం అంతరిక్షంలో జరిగే పరిణామాల కారణంగా ఇది ఉత్పన్నమవుతుంది. అందుకే దీనిని కాస్మో మినరల్ అని కూడా అంటున్నారు. ఆ క్రమంలో ‘గ్రీన్ ఎనర్జీ’ పేరిట అనేక ఇంధనాలు ఉనికి లోకి వచ్చాయి. అయితే వీటికున్న పరిమితులను అధిగమించటంలో ఇంకా పూర్తి స్థాయి విజయం సాధ్యపడటం లేదు. ఈ సమయంలో లిథియం-అయాన్ బ్యాటరీ రూపకల్పనకు తోడ్పడగల పరిశోధన చేసినందుకు 2019 సంవత్సరానికి ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి రావటం ప్రత్యామ్నాయ ఇంధన వెతుకులాటలో కీలక మలుపు. ఆ పరిశోధనల పర్యవసానంగానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల రంగంలో ఊహించని అభివృద్ధి సాధ్యమైంది.
1991లో ఒక జపాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ లిథియం అయాన్ బ్యాటరీ అభివృద్ధి చేశాక కంప్యూటర్ ఎక్కడికైనా తీసుకెళ్లే ఉపకరణమైంది. అప్పుడప్పుడే వస్తున్న డిజిటల్ కెమెరాల సైజు గణనీయంగా తగ్గింది. సెల్‌ఫోన్‌ల ఆగమనంలో లిథియం అయాన్ బ్యాటరీ పాత్ర అసాధారణం. గత కొన్నేళ్లుగా విద్యుత్‌తో నడిచే వాహనాల తయారీ కూడా జోరందుకుంది. ఇంకా పేస్‌మేకర్లకూ, అంతరిక్ష నౌకలకూ, జలాంతర్గాములకూ లిథియం హైడ్రాక్సైడ్ కీలకం. ఇక బైపోలార్ వ్యాధి నివా రణకు తోడ్పడే ఔషధాల ఉత్పత్తిలో లిథియం కార్బొనేట్ ఎంతో అవసరమని ఇటీవల కనుగొన్నారు. 2020లో ప్రపంచ లిథియం వినియోగం కేవలం 56,000 టన్నులైతే అది ఇప్పటికే రెట్టింపు దాటింది. ఏటా ఆ వినియోగం 22 లక్షల టన్నులకు చేరుకోవచ్చని ఒక అంచనా. ‘తెల్ల బంగారం’గా పిలిచే లిథియంపై ఆధారపడటం ఎక్కువవుతున్న తరుణంలో దాని ఖరీదు కూడా పెరుగుతోంది.
మన దేశం 2020-21లో రూ. 173 కోట్ల విలువైన లిథియంను దిగుమతి చేసుకోగా, ఆ ఏడాదే మరో 8,811 కోట్ల రూపాయల విలువైన లిథియం అయాన్ బ్యాటరీలు కొనుగోలు చేసింది. నిరుడు ఈ వ్యయం దాదాపు రెట్టింపయింది. రాగల సంవత్సరాల్లో ఇదింకా పెరగటం ఖాయం. కనుకనే లిథియం నిల్వల కోసం అన్వేషణ సాగిస్తూనే ఉంది. గత అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘా లయల్లో 20 ప్రాజెక్టులు ప్రత్యేకించి లిథియం కోసమే పనిచేస్తున్నాయి.
ఇవిగాక మూడు ప్రభుత్వ రంగ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో ఖనిజ్ బిదేష్ ఇండియా(కబిల్) పేరిట ఒక సంస్థ ఏర్పడి ఆస్ట్రేలియా, అర్జెంటీనా లిథియం గనుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూ, కశ్మీర్‌లో అపారంగా లిథియం నిక్షేపాలున్నట్టు వెల్లడికావటం దేశంలో ఉత్సాహం ఉరకలెత్తించేదిగానే ఉంటుంది. ప్రపంచంలో భారీయెత్తున లిథియం నిల్వలున్న దేశం బొలీవియా అయితే…ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న చిలీ, ఆస్ట్రేలియా, చైనాల తర్వాత మనమే ఉండబోతున్నాం.. జమ్ము లిథియం నిల్వలు అనుకున్న స్థాయిలో వెలికితీయగలిగితే మన లిథియం అవసరాలన్నీ తీరిపోతాయి.
రాశిలో అమెరికా కన్నా కూడా మనం ఎక్కువే. ఈ నిక్షేపాల నాణ్యతనూ, వాస్తవ వినియోగ సామర్థ్యాన్నీ మరిన్ని పరీ క్షల తర్వాతగానీ పూర్తిగా నిర్ధారించలేమన్నది శాస్త్రవేత్తల మాట.
ఇందుకు రెండేళ్ల సమయం పడుతుంది. అంతా సవ్యంగా ఉందనుకున్నాక ఉత్పత్తి మొదలుకావడానికి మరో అయిదారేళ్ల కాలం ఎదురుచూడక తప్పదు. చాలా పెద్ద ఎత్తున భూమిని తవ్వాల్సి ఉంటుంది. నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతా పర్యావరణ హితంగా జరగటం సాధ్యమయ్యే పనేనా? అని పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిక్షేపాలు బయటపడిన ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో ఉంది.
ఇప్పటికే మానవ నిర్మిత డ్యాములు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు భూమి సమతుల్యతను, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయి. ఇప్పుడు లిథియం తవ్వకాలు మొదలుపెడితే ఆ ప్రాంతం పెద్ద ఎత్తున కోతకు గురవుతుంది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ఎన్ని లాభాలున్న పర్యావరణపరంగా వచ్చే ప్రమాదాల గురించి శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు చేస్తున్న హెచ్చరికలు గాల్లో కలసిపోతున్నాయి. వాటిని బేఖాతరుచేసి దశాబ్దాలుగా జలవిద్యుత్ ప్రాజెక్టులూ, ఇతర నిర్మాణాలూ చేపట్టిన పర్యవసానంగా ఉత్తరాఖండ్‌లోని జోషీ మఠ్ పట్టణం ఎలా కుంగిపోతున్నదో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.
భూకంప ముప్పు వల్ల హిమాలయ పర్వత ప్రాంతాలు అత్యంత సున్నితమైనవిగా చెబుతున్నారు. లిథియం నిక్షేపాల వెలికితీత ఆ ముప్పును మరింత పెంచేలా మారకూడదు. ఉక్కు తెరల వెనక కాలక్షేపం చేసే చైనాలో లిథియం వెలికితీత వల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే అక్కడ పారిశ్రామిక అభివ్రుద్దిని మాత్రమే చేస్తారు. ఆ పరిశ్రమల కాలుశ్యాల వల్ల ప్రపంచానికి ఎంత నష్టం జరిగినా చైనా దానిని పట్టించుకోదు. అంతే కాదు..అగ్రరాజ్యం సభ్యరాజ్యంగా చెప్పుకునే దక్షిణ అమెరికా దేశాల్లో జనం ఎదుర్కొంటున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఒక టన్ను లిథియం ఉత్పత్తికి 22 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. దీంతో లిథియం వెలికితీత కోసం చిలీ, బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో స్థానికంగా ఉన్న జలవనరులన్నీ హరించుకుపోతున్నాయి.
నేల, చెట్టూ, చేమా దెబ్బతింటున్నాయి. దాంతో స్థానిక ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా పర్యావరణాన్ని కాటేసే లిథియంకు బదులు తక్కువ నష్టం ఉండే ఇనుము, సిలికాన్ వంటి లోహాలపై దృష్టిపెట్టాలన్న డిమాండ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంది. ఏది ఏమైనా జమ్మూ, కశ్మీర్ లిథియం నిక్షేపాల విషయంలో భారత్ కూడా ఆచితూచి అడుగేయటం అన్ని విధాలా శ్రేయస్కరం అని అంటున్నారు పర్యావరణ వేత్తలు.