ఆ జిల్లాలో జనసేనకు లెక్కలేనంత జనసైనికులు ఉన్నారు.. ఏ కార్యక్రమం చేపట్టినా ఉప్పెనలా ముందుకొస్తారు.. కానీ నడిపించే వారు మాత్రం
లేరు. జిల్లా అంతటా వెతికినా కేవలం ముగ్గురు నలుగురు నాయకులు మాత్రమే కనిపిస్తారు. వారే పార్టీకి అన్నీ తామై నడిపిస్తున్నారు.
ఎన్నికల్లో పొత్తులు ఉన్నా లేకున్నా.. ప్రధాన పార్టీలపై పోటీకి సై అంటున్నారు. అధినేత ఆర్డర్ ఇస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమంటున్నారు. పోటీలో ఉన్నది టీడీపీనా.. వైసీపీనా కాదు.. ఎగరాల్సిందే పవన్ జెండా అంటున్నారు.. ఇంతకీ అంత బలంగా వెళ్తున్న ఆ నేతలెవరు.. వారి బలమేంటి..?
జనసేన పార్టీకి బాగా బలం ఉండి.. పార్టీ వీక్ గా ఉన్న ప్రాంతం.. అనంతపురం జిల్లా. అదేంటబ్బా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. ఇందులో ఓ నిజం దాగుందని విశ్లేషకులే కాదు .. కాస్తంత జిల్లా రాజకీయాలు తెలిసిన వారు కూడా అదే అంటారట. ఇంతకీ అదేంటంటే, జనసేన అంటే పవన్ కళ్యాణ్కు … ఆయనకు అనంతపురం జిల్లాలో లెక్కలేనంత అభిమానం ఉంది. కానీ జనసేన పార్టీ మాత్రం వీక్ గా ఉంది. దీనికి అధినేత ఫోకస్ చేయకపోవడమో, లేక నేతలు సరిగా యాక్టీవ్ గా లేకపోవడం కానీ కారణాలు అయి ఉండొచ్చు. కానీ ఇలాంటి ప్రాంతంలో నలుగురు నేతలు మాత్రంపార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు.
జిల్లాలో అన్ని నియోజకర్గాలపై ఫోకస్ చేస్తూ పార్టీకి ఊపిరి పోస్తున్నారు. అధినేత ఎప్పుడో మూడు నెలలకో నాలుగు నెలలకో ఒకసారి వచ్చినా.. పార్టీ కార్యక్రమాలను మాత్రం వీరు బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది.. మధుసూదన్ రెడ్డి.
ధర్మవరం మండలం రేగాటిపల్లికి చెందిన మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
రాయలసీమలో ఆయన చాలా బలంగా ఉన్న నేత. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న నాయకుడు.
ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చినా.. ఆయన సేవా కార్యక్రమాలతో జనాలకు దగరయ్యారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి, పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ లాంటి బలమైన నేతలతో పోటీ పడుతూ రాజకీయాలు చేస్తున్నారు. అయితే పార్టీ సంస్థాగతంగా లేకపోవడం వలన 2019 ఎన్నికల్లో తన ప్రభావం చూపించకలేకపోయారు. కానీ ఈసారి బలంగా ధర్మవరం నుంచి బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈసారి వదిలే ఛాన్సే లేదంటూ తన పట్టు బిగిస్తున్నారు. తనకు పోటీగా అధికార పార్టీ ఉన్నా.. లేదా టీడీపీ ఉన్నా ఏదైనా సరే తాను బరిలోకి దిగడం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.
ఆయనకు పవన్క ళ్యాణ్ అభిమానుల మద్దతుతో పాటు బలిజ సామాజిక వర్గం సహకరించే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా అధికార పార్టీపై ఎవరూ చేయనంత ధైర్యంగా విమర్శలు చేస్తున్నారు. ధర్మవరంలో ఎమ్మెల్యే దగ్గర నుంచి సీఎం జగన్ వరకు ఎవరినైనా ధైర్యంగా విమర్శిస్తూ ఫోకస్ అవుతున్నారు. ఇకరెండో స్థానంలో భవానీ రవికుమార్ నిలుస్తున్నారు. జిల్లాలో స్వీట్స్ వ్యాపార రంగంతోపాటు బలిజ సామాజిక వర్గంలో పేరున్న కుటుంబం నుంచి
వచ్చిన నేత. సౌమ్యునిగా చాలా మందికి చేరువలో ఉంటారు.
అన్నిటి కన్నా బలమైన ఫిల్లర్.. ఆయన చిరంజీవి యువత అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పవన్ అభిమానులతో పాటు చిరు అభిమానులంతా ఆయన వెంట ఉన్నారు.
ఓ రకంగా చెప్పాలంటే మెగా అభిమానులను ఓన్ చేసుకున్న నేత. పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. చిరంజీవిని కానీ పవన్క ల్యాణ్ పై కానీ చిన్న విమర్శ వచ్చినా ముందుగా స్పందించేది భవానీ రవికుమార్. ఆయన అభిమానులకి పెద్దగా పరిచయం అక్కర్లేకపోయినా జనంలోకి మాత్రం ఇంకా విస్తృతంగా వెళ్లాల్సిన అవసరముందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే భవానీ అనంతపురం నుంచి రంగంలోకి దిగితే బలిజలు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి ఆయన అందర్నీ కలుపుకుని పోయే నేత.
ఆపదలో ఉన్న వారిని అక్కున. చేర్చుకుని ఆదరించడంతో పాటు నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు.
ఈసారి భవానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తే కచ్చితంగా ప్రధాన పార్టీలకు ధీటుగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదని టాక్ వినిపిస్తోంది. ఇక మూడో అతి ముఖ్యమైన వ్యక్తి టీసీ వరుణ్. ప్రస్తుతం జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలను బలంగా తీసుకెళ్తున్నారు. వరుణ్ కు వ్యక్తిగత ఇమేజ్ కన్నా పార్టీ బలంగా ఉంది. అందునా బలిజ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో బలిజలు ఉండగా ఉన్నారు. కానీ 2019 ఎన్నికల్లో అనంతపురంలో
మెజార్టీ స్థాయిలో ఉన్న బలిజలను తన వైపు తిప్పుకోవడం విఫలమయ్యారు. దీనికి తోడు వైసీపీ వేవ్ లో నిలవలేకపోయారు.
కానీ ఈ సారి జిల్లా అంతటా పార్టీకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అన్నిప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన అడుగులు ఉంటాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇక నాల్గో అతి ముఖ్యమైన వ్యక్తి.. పెండ్యాల శ్రీలత. రాయలసీమ
మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు. జనసేనలో ఎంతో మంది నాయకులు అభిమానులు ఉన్నారు. వారిలో మహిళా అభిమానులుకూడా ఉన్నారు. కానీ మహిళా నాయకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో పెండ్యాల శ్రీలత చాలా కీలకమైన వ్యక్తి. ఇప్పటికే సేవా కార్యక్రమాలతో పెండ్యాల కుటుంబం ఇటు అనంతపురం, రాప్తాడు, శింగనమలతో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రజలకు చాలా దగ్గరగా ఉంది. మహిళలు స్వయం ఉపాధి పొందే విధంగా నిత్యం శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నారు. ఇవన్నీ పార్టీలకు అతీతంగా సాగుతున్నాయి.
స్టేట్ లో ఎవరికీ లేని విధంగా మహిళా విభాగానికి ఒక కార్పొరేట్ ఆఫీస్ తరహాలో కార్యాలయాన్ని ప్రారంభించారు.
మహిళలకు ఏ సమస్య వచ్చినా శ్రీలత వేగంగా స్పందిస్తున్నారు. అంతే కాదు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాల మీద ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆమెకు మంచి పేరు ఉంది. మరోవైపు పార్టీ కార్యక్రమాలను జిల్లా నేతలకు ధీటుగా నిర్వహిస్తున్నారు. సొంత ఖర్చులతో ఇటు పార్టీకార్యక్రమాలు, అటు సేవా కార్యక్రమాలు రెండు చేస్తున్నారు. పార్టీ సభ్యత్వంలో స్టేట్ లో అందరి కన్నా ముందున్నారు. ఇతర పార్టీల నుంచి చాలా మంది నేతలను జనసేన వైపు తీసుకొచ్చారు. రాయలసీమలో శ్రీలత కన్నా బెటర్ గా పార్టీ కోసం పని చేసే మహిళా నేతలు ఎవరూ లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక జనసేన జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్న కుంటిమద్ది జయరామిరెడ్డి కూడా ఇటీవల బాగా ఫోకస్ అయ్యారు. న్యాయవాదిగా ఎంతో బిజీగా ఉన్నా.. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇంటింటా జనసేన కార్యక్రమాన్ని చాలా బలంగా తీసుకెళ్తున్నారు.
పార్టీ సభ్యత్వాలు విస్తృతంగా చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ను విమర్శించే నాయకులకు ధీటుగా బదులిస్తూ ప్రజలకు తానేంటో తెలిసేలా చేసుకున్నారు. అయితే ఆయన కేవలం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఆధారంగా ఫోకస్ అవుతున్నారు.. ఇక ఆయన కూడా జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. జనసేనకు బలమైన అభిమాన గణం ఉన్నా.. వారిని యూజ్ చేసుకోవడంలో గతంలో విఫలమయ్యారు.
కానీ ఈసారి అలా కాకుండా అభిమానులను ఓటు బ్యాంక్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరిలో భవానీ రవికుమార్, పెండ్యాల శ్రీలత కాస్త ముందు
వరుసలో ఉన్నారు. వీరంతా అధినేత గనుక ఆదేశిస్తే, ఎక్కడి నుంచైనా ఎవరి పై అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే
గెలుపు మాటెలా ఉన్నా, వీరంతా బరిలోకి దిగితే, ప్రధాన పార్టీల ఓటు బ్యాంక్ పై కచ్చితంగా ప్రభావం చూపించగలరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరి పోటీలోకి దిగితేనే, సత్తా తేలనుందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.