Homeజాతీయంమహారాష్ట్రలో అతిపెద్ద పార్టీ శివసేన .. ఎవరిది...

మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీ శివసేన .. ఎవరిది…

మహారాష్ట్రలో లో శివసేన ఎవరిదన్న చర్చ తెరపైకి వస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు .. ఠాక్రే, షిండే వర్గాల వ్యాజ్యాలపై విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ పార్టీపైనా, పార్టీ గుర్తులపైనా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

మహారాష్ట్ర్రలో అతిపెద్ద పార్టీ శివసేన .. ఎవరిది బాలాసాహెబ్ వారసులైన ఉద్ధవ్ వర్గానిదా..? లేక ఏక్ నాథ్ షిండే వర్గానిదా .. అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని శివసేనలో నెలకొన్న సంక్షోభం పర్యవసానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలైన శివసేన ఎవరిదనే విషయం నుంచి, పార్టీ జెండా,పార్టీ గుర్తు ఎవరికి చెందుతాయనే విషయం వరకు ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

శివసేనలో ఉద్ధవ్ థాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు వర్గాలు శివసేన మాదంటే మాదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం తేల్చేందుకు అత్యున్నత న్యాయస్ధానం సిద్ధమవుతోంది. ఈ వాజ్యాల్ని విచారించేందుకు గడువు నిర్ణయించింది. థాక్రే, షిండే వర్గాలు పరస్పరం అభియోగాలతో దాఖలు చేసుకున్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎంఆర్ షాకృష్ణ మురారి, హిమా కోహ్లి, పిఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం దీనిపై వచ్చే నెల 14న వాలెంటైన్స్ డే రోజున విచారిస్తామని ప్రకటించింది. థాక్రే వర్గం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్..

ఐదుగురు సభ్యులు కాకుండా ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ పిటిషన్లను బదిలీ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఫిబ్రవరి 14న జరిగే విచారణలో ఎంతమంది సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించాలన్నది నిర్ణయిస్తామని తెలిపింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందించిన థాక్రే వర్గం నేత సంజయ్ రౌత్.. ప్రేమికుల రోజున తిరిగి ప్రారంభమయ్యే ఈ విచారణ ప్రేమతో జరుగుతుందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తమ వాజ్యాల విచారణ కోసం ఏడుగురు జడ్డీల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న వినతిపై సానుకూల స్పందన వస్తుందని థాక్రే వర్గం భావిస్తోంది.

మరోవైపు శివసేన సభ్యులపై జారీ చేసిన కొత్త అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్ కుసుప్రీంకోర్టు సూచించింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం, ఇతర సాంకేతిక సమస్యలపై ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాలు దాఖలు చేసిన పిటిషన్‌లపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా శివసేనపై హక్కుకి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు ఈరోజు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోవడానికి ఇది ఎనిమిది ప్రశ్నలను రూపొందించింది.

మరోవైపు, ఠాక్రే, షిండే శిబిరాల మధ్య పార్టీ గుర్తు వివాదంపై గురువారం వరకు చర్య తీసుకోవద్దని కూడా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని జాబితా చేయండి. ఎలక్షన్ కమిషన్‌ ప్రొసీడింగ్స్ కు సంబంధించిన శివసేన పార్టీ గుర్తుని తొలుత బెంచ్ నిర్ణయిస్తుందని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉంటే, సుప్రీంకోర్టు తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌ షిండే వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి ధర్మాసనం అనుమతినిచ్చింది.

ఠాక్రే, షిండే వర్గాల్లో అసలైన శివసేన ఎవరిదనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర శివసేనలో ఏక్‌నాథ్‌ షిండేతిరుగుబాటు చేయడంతో అప్పటివరకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ మద్దతుతో షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం తమదే అసలైన శివసేన అంటూషిండే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.

పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు విల్లు-బాణం తమకే కేటాయించాలని కోరడాన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన పలు వ్యవహారాల అంశాలపై సుప్రీంలో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, తర్వాతి చర్యలు తీసుకోకూడదంటూ ఠాక్రే ఈసీని కోరారు. అయితే ఠాక్రే అభ్యర్థనను ఈసీ పక్కన పెట్టింది. విల్లు-బాణం గుర్తు మీదే అనడానికి పత్రాలు సమర్పించాలని రెండు వర్గాలను ఈసీ ఆదేశించింది. శాసనసభా పక్షంతో పాటు పార్టీ సంస్థాగత విభాగ సభ్యుల మద్దతు లేఖలు కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఠాక్రే వర్గం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

ఈసీ ప్రక్రియపై కోర్టు స్టే విధించింది. తాజాగా వచ్చిన తీర్పుతో ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఉత్కంఠకు గురిచేస్తోంది. శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిందిసుప్రీంకోర్టు. ఈ వ్యవహారంపై మొత్తం 8 ప్రశ్నలను రూపొందించింది. థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించి అసలైన శివసేన ఎవరిదో ఎన్నికల సంఘమే నిర్ణయించేందుకు అనుమతించాలని షిండే గతనెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

శివసేన మెజార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని, పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవద్దని కోరారు.మరోవైపు థాక్రే వర్గం కూడా శివసేన తమదే అని వాదిస్తోంది. పార్టీ విప్‌ను ధిక్కరించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో పేర్కొంది. ఇదిలా ఉంటే, శివసేన పార్టీ చీలిక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పార్టీ పేర్లు కేటాయించింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి ‘కాగడా’ గుర్తును కేటాయిస్తూ ప్రకటన వెలువరించింది. ‘శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే’ పేరును థాక్రే వర్గానికి కేటాయించింది.

మరోవైపు, ‘బాలాసాహెబంచి శివసేన’ అన్న పేరును మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించింది ఈసీ. తొలుత కొత్త ఎన్నికల గుర్తుఎంచుకోవాలని ఆ వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. ఇరువర్గాలు కోరినట్లు ‘త్రిశూలం’, ‘గద’ గుర్తులను కేటాయించేందుకు ఈసీ నిరాకరించింది. ఇవి
మతపరమైన గుర్తులను ప్రతిబింభిస్తున్న నేపథ్యంలో వాటిని పక్కనబెట్టినట్లు స్పష్టం చేసింది. ‘శివసేన’ పేరు, ఆ పార్టీ గుర్తు అయిన ధనస్సు-బాణంను ఎన్నికల సంఘం స్తంభింప చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇరువర్గాలు కొత్త పేర్లు, పార్టీకి గుర్తులకు సంబంధించి ఐచ్ఛికాలు సమర్పించాలని ఇది వరకే ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఇరు పార్టీ ఇరువర్గాలు తమకు కేటాయించాల్సిన గుర్తులపై ఐచ్ఛికాలను ఈసీకి సమర్పించాయి. త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం కోరింది. ఇక షిండే వర్గం కూడా తమ ఐచ్ఛికాలను సమర్పించినట్లు ఈసీ అధికారులు తెలిపారు. పార్టీ గుర్తుగా ‘గద’ను కేటాయించాలని షిండే వర్గం కోరినట్లు.. తాజా ఈసీ ప్రకటనను బట్టి అర్థమవుతోంది.

త్రిశూలం, గదను కేటాయించకపోవడంతో మరిన్ని ఐచ్ఛికాలను సూచించాలని షిండే వర్గం ఈసీని కోరింది. ఇది ఇలావుండగా, శివసేన పేరు, గుర్తును స్తంభింపజేయడాన్ని సవాల్​ చేస్తూ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ గుర్తు, పేరును నిలిపివేస్తూ ఈసీ అక్టోబర్ 8న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. పార్టీల వాదనలు వినకుండానే చట్టవిరుద్ధంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని ఉద్ధవ్ థాక్రే వర్గం వాదించింది. ఈ పిటిషన్‌​లో ఎన్నికల సంఘం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ ​నాథ్ షిండేలను ప్రతివాదులుగా చేర్చింది.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా.. ఈ అంశం కొలిక్కి వస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img