Homeజాతీయంతెల్లారి లేస్తే.. దాయాది దేశం కుట్రలు..

తెల్లారి లేస్తే.. దాయాది దేశం కుట్రలు..

మనకు తెల్లవారి లేస్తే చాలు అటు దాయాది దేశం కుట్రలు, ఇటు పొరుగు దేశం చైనా గురించిన అంశాలు తెరపైకి వస్తుంటాయి. నిజానికి అవి మన సరిహద్దు దేశాలు కావడంతో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే ప్రతీ ఘటన, సంఘటనలు మన దేశంపై ప్రభావం చూపే విధంగా ఉంటాయి. అందుకే మన దేశం వీటిని నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. జనం కూడా వాటిపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా పాకిస్తాన్ ఆర్థిక చక్రబంధంలో ఇరుక్కుని నానా ఇబ్బందులు పడతున్న విషయాలను మనం చూస్తున్నాం..అవి చాలవన్నట్టు దాయాది దేశం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆడియో లీకులు ఆయన హుంకారాలు, ఘర్జనలు వినిపిస్తుంటాయి. అయితే ప్రస్తుతం పాలనలో ఉన్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ను అణచివేసేందుకు అన్ని మార్గాలలో ప్రయత్నిస్తోంది. తాజాగా ఇమ్రాన్ ఖాన్ సీక్రెట్ డాటర్ వ్యవహారం బయటపెట్టింది.

దాంతో ఆయన రాజకీయ జీవితం మరోసారి చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే..పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన నామినేషన్ పత్రంలో కొడుకుల పేర్లు ప్రస్తావించారు గానీ, తనకు ‘టైరియన్ వైట్’ అనే కూతురు కూడా ఉందన్న సంగతిని రహస్యంగా దాచిపెట్టారని ఇస్లామాబాద్ హైకోర్టులో సాజిద్ మహ్మూద్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జనవరి 27 లోగా ఇమ్రాన్ ఖాన్ సమాధానం ఇవ్వాలని గత గురువారం కోర్టు ఆదేశించింది. ఈ జవాబు కాపీని పిటిషనర్‌కు కూడా ఇవ్వాలని ఇమ్రాన్‌ఖాన్‌ తరపు న్యాయవాది సల్మాన్‌ అక్రమ్‌ రజాకు తెలిపింది. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా మరొక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ మాజీ అటార్నీ జనరల్ సల్మాన్ అస్లాం బట్ మొదటిసారి పిటిషనర్ తరపున న్యాయవాదిగా కోర్టుకు హాజరయ్యారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హయాంలో సల్మాన్ అస్లాం బట్ అటార్నీ జనరల్‌గా ఉన్నారు.

గతంలో పలు కేసుల్లో షరీఫ్ కుటుంబం తరపున న్యాయవాదిగా వ్యవహరించారు. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని ఇమ్రాన్ ఖాన్ మొదట సమాధానం ఇచ్చారు. అయితే ఆ పత్రాలపై ఆయన వేలిముద్ర లేదని ఇస్లామాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం గురువారం విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. తన క్లయింట్‌కు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదని, అందుకే వేలిముద్ర తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఇమ్రాన్‌ ఖాన్‌ తరపు న్యాయవాది సల్మాన్‌ అక్రమ్‌రాజా కోర్టుకు తెలిపారు. దానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ నవ్వుతూ, “వేలిముద్ర తీసుకోవడానికి టైం పడుతుందా? ఈరోజుల్లో ప్రతిదానికీ బయోమెట్రిక్స్ తీసుకుంటున్నారు. మొబైల్ దుకాణంలో కూడా బయోమెట్రిక్స్ ఉంటాయి.

బయోమెట్రిక్స్ మిషన్ నుంచి రసీదు తీసుకుని దాన్ని సమాధాన పత్రానికి జత చేసి ఇవ్వండి. మీకు, మీ క్లయింట్‌కు ఉన్న బలంతో బయోమెట్రిక్స్ మిషన్‌నే మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు” అన్నారు. ఇమ్రాన్ ఖాన్ కూతురు టైరియన్ వైట్ వ్యవహారంలో ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది కాబట్టి, ఆ పిటిషన్ విచారణ యోగ్యం కాదని సల్మాన్ అక్రమ్ రజా గురువారం కోర్టులో వాదించారు. తన క్లయింట్ ప్రస్తుతం జాతీయ అసెంబ్లీ సభ్యుడు కారు, ఏ పదవిలోనూ లేరు కాబట్టి ఈ పిటిషన ఆమోదయోగ్యం కాదని అన్నారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ అసెంబ్లీలో లేకపోయినా, ఆయన ఒక రాజకీయ పార్టీకి అధినేత అన్నది పిటిషనర్ సాజిద్ మహ్మూద్ తరపు న్యాయవాది వాదన. ఇమ్రాన్ ఖన్ దీనిపై మధ్యంతర జవాబు ఇవ్వాలనుకుంటున్నారని అక్రమ్ రజా కోర్టును కోరగా, జనవరి 27 వరకు కోర్టు గడువు ఇచ్చింది. అలాగే జవాబు కాపీని పిటిషనర్ తరపు న్యాయవాదికి కూడా అందించాలని ఆదేశించింది. గతంలో ఇమ్రాన్ ఖాన్‌పై ఇలాంటి పిటిషన్ ఒకటి దాఖలైంది. ఇస్లామాబాద్ హైకోర్టులోని ఇద్దరు న్యాయముర్తుల ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపితే, దాని ప్రభావం ఆ అమ్మాయి హక్కుల మీద పడుతుందని అప్పటి ప్రధాన న్యాయమూర్తి అత్‌హర్ మినల్లా అన్నారు. విచారణ సమయంలో పలు ఇస్లామిక్ అంశాలు తెరపైకి రావచ్చు. దీనికి సంబంధించి మీడియాలో రిపోర్టులు వస్తాయి. అదంతా ఆ అమ్మాయి హక్కులపై ప్రభావం చూపే అవకాశం ఉందని జడ్జి అన్నారు. టెరియన్ వైట్ స్వయంగా వచ్చి అర్జీ పెట్టుకుంటే కోర్టు విచారణ జరుపుతుందని చెప్పారు. అయితే, ప్రస్తుత పిటిషన్‌పై గత కొన్ని నెలలుగా విచారణ వేగవంతం చేయడాన్ని చూస్తుంటే ఇస్లామాబాద్ హైకోర్టు ఈ విషయాన్ని వీలైనంత త్వరగా ముగించాలని చూస్తున్నట్టు అనిపిస్తోందని న్యాయ నిపుణుడు, పాకిస్తాన్ బార్ కౌన్సిల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్జద్ షా అనారు. ఈ పిటిషన్ వల్ల రానున్న రోజుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు సమస్యలు ఉత్పన్నమవుతాయని అమ్జద్ షా అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాల నేపథ్యంలో, ఈ అంశాన్ని కొత్తగా మళ్లీ ఎందుకు లేవనెత్తారన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో న్యాయపరమైన చిక్కులు తక్కువగా, రాజకీయపరమైన చిక్కులు ఎక్కువగా ఉన్నాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అబిద్ సాకీ అంటున్నారు. “దురదృష్టవశాత్తు చట్టం ముసుగులో రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునే ప్రయత్నం జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి కేసులు కోర్టు వరకు రాకూడదని, వ్యక్తిగత విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఇలాంటి దరఖాస్తులపై విచారణ చేయడం న్యాయస్థానాలకు మంచిది కాదని అబిద్ సాకీ అన్నారు. “దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్‌ను అనర్హుడిగా ప్రకటించవచ్చు, కానీ ఆయన రాజకీయ జీవితాన్ని ముగించలేరని విశ్లేషకులు చెబుతున్నారు. “కొందరికి కొన్ని రాజకీయ ప్రయోజనాలు చేకూరవచ్చు. కానీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం ఈ నిర్ణయాన్ని ఎప్పటికీ అంగీకరించే అవకాశం లేదు.

మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై కూడా అనర్హత వేటు వేశారని, అయితే పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ మద్దతుదారులు దాన్ని ఈనాటికీ అంగీకరించలేదు. ఇందులో న్యాయ వ్యవస్థ పాత్ర కూడా వివాదాస్పదంగా ఉంది. రాజకీయ నాయకులు పరస్పర విరోధంతో, రాజకీయ ప్రయోజానాల కోసం న్యాయస్థానం మెట్లు ఎక్కకుండా పార్లమెంటులో చట్టం తీసుకురావాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయినప్పటి నుంచి ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు ఎదుర్కుంటూనే ఉన్నారని, ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలకు తెలుసునని ఆయన ప్రత్యర్థులు వాదిస్తున్నారు. నిజానికి ఇమ్రాన్ ఖాన్‌పై పిటిషన్ వేసిన సాజిద్ మహ్మూద్ ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు.

పిటిషనర్ తరపు న్యాయవాది జనరల్ సల్మాన్ అస్లాం బట్ ఈ అంశంపై స్పందిస్తూ, తాను పిటిషనర్‌కు ప్రతినిధిగా న్యాయస్థానంలో వాదిస్తున్నందున, పిటిషనర్ కోర్టు గదిలో ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు. తాను మొదటిసారి ఈ కేసులో న్యాయవాదిగా వ్యహరిస్తున్నందున, పిటిషనర్ గురించి ఎక్కువ వివరాలు తెలుపలేనని అన్నారు. పిటిషనర్‌కు కోర్టు సమన్లు ​​పంపినప్పుడు కోర్టుకు హాజరవుతానని చెప్పారు. పిటిషనర్ ఎవరో తమ పార్టీకి తెలియాల్సిన అవసరం లేదని, పిటిషనర్ పట్ల తమకు ఆసక్తి లేదని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేతలు అంటున్నారు.

ఇలాంటి పిటిషన్లు అనేకం ఫైల్ అవుతాయి. కానీ, పిటిషనర్లు ఎవరూ ముందుకు రారు. వీటి ఉద్దేశం పార్టీలపై బురద జల్లడమే అంటూ ఇమ్రాన్ ఖాన్ పై కేసు వేయడాన్ని కొట్టి పడేశారు. అయితే విమర్షకులు మాత్రం ఇమ్రాన్ ఖాన్ టైరియన్‌ను తన కుమార్తెగా అంగీకరించకపోవడం విచారకరమని అంటున్నారు. “ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారి గురించి సమాచారం తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుంది. వారి వీశ్వసనీయతను సవాలు చేసే హక్కు వారికి ఉంటుంది. 2004లో 43 ఏళ్ల బ్రిటిష్ పౌరురాలు సీతా వైట్ అమెరికాలో మరణించినప్పుడు బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది మిర్రర్’, అమెరికా వార్తాపత్రిక ‘ది న్యూయార్క్ పోస్ట్’ ఆమె గురించి రాస్తూ, ఆమె పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రియురాలు అని వెల్లడించాయి. ఆ కథనాల ప్రకారం, సీత ఒక పాపకు జన్మనిచ్చారు. ఆమె పేరు టైరియన్ వైట్. ఆమె ఇమ్రాన్ ఖాన్ కూతురని అంటున్నారు.

Must Read

spot_img