ముస్లిం దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా వంటి వాటితో మోడీ దోస్తీ .. ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ముస్లిం వ్యతిరేకిగా,హిందూత్వనినాదానికి బ్రాండ్ అంబాసిడరైన మోడీ .. ఆ దేశాలతో దోస్తీ విషయంలో ఏవిధంగా సక్సెస్ అవుతున్నారు..?
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటన తరువాత మోదీకి ముస్లిం వ్యతిరేకిగా పేరొచ్చింది. ఈ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. 2005లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యూఎస్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం యాక్ట్ 1998 కింద అమెరికా ఆయన వీసాను నిషేధించింది.
అమెరికా సంస్థ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం సిఫార్సుపై ఈ నిషేధాన్ని విధించింది. 2002 అల్లర్లలో నరేంద్ర మోదీ పాత్రను ఈ కమిషన్ విమర్శించింది. 2014లో మోదీ భారత ప్రధానమంత్రి అయిన తరువాత అమెరికా ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే 2002 అలర్ల తరువాత మోదీకి వచ్చిన
యాంటీ ముస్లిం ఇమేజ్ ఇస్లామిక్ దేశాలతో సంబంధాలకు ఎందుకు అడ్డంకి కాలేదు? అన్నదే చర్చనీయాంశంగా మారింది. గత నెలలో, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ .. 2014 నుంచి మేం ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌లతో స్నేహ సంబంధాలను బలోపేతం చేశాం. ఈ దేశాల సిలబస్‌లో యోగాను చేర్చారు.
అబుదాబి, బహ్రెయిన్‌లలో హిందువుల కోసం దేవాలయాలు నిర్మిస్తున్నారని అన్నారు. మోదీ ప్రధాని అయిన తరువాత గల్ఫ్ దేశాలతో సంబంధాలపై కసరత్తు చేశారు. గత ఎనిమిదేళ్లలో నాలుగుసార్లు యూఏఈ పర్యటనకు వెళ్లారు. 2015 ఆగస్టులో తొలిసారి సందర్శించారు. 1981లో ఇందిరా గాంధీ యూఏఈ పర్యటన తరువాత, ఏ భారత ప్రధానీ అక్కడకు వెళ్లలేదు. 34 ఏళ్ల తరువాత 2015లో మోదీ యూఏఈలో పర్యటించారు. ఆతరువాత, 2018 ఫిబ్రవరిలో, 2019
ఆగస్టులో, చివరిగా 2022 జూన్‌లో పర్యటించారు.
2022 జూన్ 28న ప్రధాని మోదీ అబుదాబి విమానాశ్రయంలో దిగినప్పుడు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు స్వాగతం పలికేందుకు రిసెప్షన్ వద్ద వేచి ఉన్నారు. ఇది అక్కడి ప్రోటోకాల్‌కు విరుద్ధం. కానీ, మోదీ విషయంలో అల్ నహ్యాన్ దానిని ఉల్లంఘించారు. దీని గురించి పాకిస్తాన్‌లో కూడా చాలా చర్చ జరిగింది. భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ అంశంపై స్పందిస్తూ, మే నెలలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూఏఈని సందర్శించినప్పుడు, ఒక జూనియర్ స్థాయి మంత్రి ఆయనకు స్వాగతం పలికారని, గల్ఫ్ దేశాలు భారత్‌కు ఇస్తున్న ఈ ప్రత్యేక గౌరవం కలవరపెడుతోందని అన్నారు.
షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, నరేంద్ర మోదీల మధ్య అపూర్వమైన స్నేహం కుదిరిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2017లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రభుత్వం మహమ్మద్ బిన్ జాయెద్ అల్న హ్యాన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అప్పుటికి మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడు కాలేదు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌గా ఉన్నారు. భారత్‌లో గణతంత్ర వేడుకలకు ఒక దేశ ప్రధాని లేదా అధ్యక్షుడి హోదాలో ఉన్నవారినే ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీ.కానీ, 2017లో రిపబ్లిక్ డేకి అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా వచ్చారు. మోదీ వ్యవహారికమైన రాజకీయ విధానం, బలమైన నాయకుడిగా ఆయన శైలి సౌదీ, యూఏఈ యువరాజులను ఆకర్షించిందని అంతర్జాతీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మోదీ 2016, 2019లలో సౌదీ అరేబియాలో పర్యటించారు. 2016లో ఖతార్, 2018లో ఒమన్, జోర్డాన్, పాలస్తీనా భూభాగాలు, 2019లో బహ్రెయిన్ దేశాలను
సందర్శించారు. 2015లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును, 2018లో ఒమన్ సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శించారు. సౌదీ అరేబియా, యూఏఈ,
బహ్రెయిన్‌లు నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించాయి కూడా. మోదీ హిందుత్వ జాతీయవాదం అరబ్ దేశాలతో సంబంధాలను కొనసాగించడానికి అడ్డుపడుతుందని మొదట్లో అనిపించింది. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత మోదీ ఇంటర్నేషనల్ ఇమేజ్ కూడా దెబ్బతింది. ఈ అల్లర్లలో వందలాది ముస్లింలు చనిపోయారు. కానీ, గల్ఫ్ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ మోదీని ఆ దృష్టితో చూడలేదు.
పొలిటికల్ ఇస్లాం పరిష్కారంలో మోదీ దృష్టికోణం ఆ దేశ పాలకుల అభిప్రాయాలతో సరిపోయింది. 2019 ఫిబ్రవరిలో న్యూ దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ నరేంద్ర మోదీని ‘పెద్దన్నయ్య’ అంటూ సంభోదించారు. గత 70 సంవత్సరాలుగా భారత ప్రజలు మాకు స్నేహితులు. సౌదీ అరేబియా నిర్మాణంలో భాగస్వాములని అన్నారు. 2002 అల్లర్ల సమయంలో దిల్లీలోని గల్ఫ్ దేశాల రాయబార కార్యాలయాలు, భారత విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి వివరణ కోరలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం సాధించినప్పుడు గల్ఫ్ దేశాలు పెద్దగా స్పందించలేదు. భారతదేశంలో వచ్చిన రాజకీయ మార్పును స్వాగతించడంలో ఆతృత, ఆవశ్యకత కనబర్చలేదు.
కానీ, నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. మోదీ అలీన విధానానికి దూరం జరిగారు. గతంలో గల్ఫ్ యుద్ధంలో భారతదేశం సద్దాం హుస్సేన్‌కు మద్దతు ఇచ్చింది. కానీ, 2014 తరువాత మోదీ గల్ఫ్ దేశాలతో సంబంధాలను ప్రభావంతంగా పునరుద్ధరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీపై ఉన్న ముస్లిం వ్యతిరేక ఇమేజ్‌ను బద్దలు కొట్టడానికి ఆయన గల్ఫ్ దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని భావిస్తున్నారు.
2022లో బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు ఇస్లామిక్ దేశాలు ఆగ్రహించాయి. ఆ సమయంలో అప్పటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ పర్యటనలో రాజకీయ విందును ఖతార్ రద్దు చేసిందని వార్తలు వచ్చాయి. అయితే, అరబ్ ప్రపంచంతో భారత్‌కు చారిత్రక సంబంధం ఉంది. భారతదేశంలోని ఇస్లామిక్ వారసత్వం మన ఉమ్మడి సంస్కృతిలో భాగం. సుమారు 90 లక్షల భారతీయులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారు. కష్టించి పని చేస్తారని, నిజాయితీగా ఉంటారని మంచి పేరు తెచ్చుకున్నారు.
వారి కష్టాన్ని పాడు చేసే విధానాలు మన రాజకీయాల్లో ఉండకూడదు. అరబ్ దేశాలతో సంబంధాలను మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం చాలా కృషి
చేసింది. సౌదీ అరేబియా, యూఏఈలు ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత గౌరవాన్ని అందించాయి. గల్ఫ్ దేశాలలోని అనేక ముఖ్య రంగాలలో భారత్ సహకారం అందిస్తోంది. ఇంధన, భద్రతా రంగాలలో భారత్ గల్ఫ్ దేశాలతో కలిసి పనిచేస్తోంది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ) 2018లో భారత్‌తో ఏడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్‌కు కావాల్సిన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను నింపే బాధ్యత ఈ సంస్థ తీసుకుంది. దీని కింద మంగళూరులోని ఒక నిల్వలో 50.860 లక్షల బ్యారెళ్ల ముడి చమురు నింపాల్సి ఉంది.
ఏడీఎన్ఓసీ, సౌదీ అరేబియా ఆయిన్ కంపెనీ అరాంకో కలిసి మహారాష్ట్రలో 12 లక్షల బ్యారెల్ రిఫైనరీని నిర్మించాలని యోచిస్తున్నాయి. దీనికి 44 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. మరోవైపు, యూఏఈతో భారతదేశ భద్రతా సహకారం అనేక స్థాయిలలో పెరిగింది. మహ్మద్ బిన్ జాయెద్ ప్రభుత్వం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తీక్షణంగా వ్యతిరేకించింది.
మోడీ రాకతో .. యూఏఈ దేశాలతో అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు .. పుంజుకున్నాయని అంతర్జాతీయ పరిశీలకులు సైతం చెబుతున్నారు.