Homeఅంతర్జాతీయంవందే భారత్ బాటలో హైడ్రోజన్ రైలు..

వందే భారత్ బాటలో హైడ్రోజన్ రైలు..

వందే భారత్ బాటలో .. రైల్వేలు .. మరో ముందడుగు వేయనున్నాయి. ఈ ఏడాది చివరిలోగా హైడ్రోజన్ రైలును తీసుకురానున్నాయి. ఇప్పటికే
దీనిపై కసరత్తు మొదలెట్టామని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నారు. దీంతో ప్రపంచంలోనే హైడ్రోజన్ రైలును తీసుకువచ్చిన ఆసియా దేశాల్లో
రెండోస్థానంలో భారత్ నిలవనుంది.

బొగ్గు బండి స్థానంలో .. విద్యుత్ రైళ్లు వచ్చాయి.. వాటి స్థానంలో హైస్పీడ్ రైళ్లు వస్తున్నా… ఇప్పుడు ఏకంగా హైడ్రోజన్ రైలుకు సర్వం సిద్ధమైందట.. ఇంతకీ ఏమిటా హైడ్రోజన్ రైలు .. దీన్ని ఎలా నడుపుతారు.. దీనివల్ల ఒనగూరే ఫలితాలేమిటి..? దీంతో .. ప్రజలకు వచ్చే లాభం ఏమిటి .. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందట.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైల్వేల అభివృద్ధి కోసం 2.41 లక్షల కోట్లను కేటాయించారు. అయితే రైల్వేలలోనూ
హైడ్రోజన్ ఇంధన వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి హైడ్రోజన్ ఆధారిత రైళ్లను
తయారు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే గత ఆగస్టులో జర్మనీ, డిసెంబరులో చైనా వీటిని అందుబాటులోకి తీసుకురాగా.. ఆసియాలో ఈ తరహా
రైళ్లను ప్రవేశపెట్టనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. గ్రీన్ ఎనర్జీపై ఈ బడ్జెట్‌ ప్రత్యేక దృష్టి పెట్టిందని అశ్విని వైష్ణవ్ అన్నారు.

అందులో భాగంగా హైడ్రోజన్ రైలు తయారు చేసేందుకు నిర్ణయించామన్నారు. మొదటగా కల్కా-సిమ్లా వంటి వారసత్వ ప్రాముఖ్యత ఉన్న రూట్ లో దీనిని ప్రవేశపెట్టి, క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. గురుకృపా వంటి కొత్త రూట్లను ఈ జాబితాలో చేర్చడం ద్వారా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చూపించాలనే ప్రధాని మోడీ ఆశయం కూడా నెరవేర్చినట్లవుతుందని వెల్లడించారు.

పూర్తిగా స్వదేశంలోనే రూపొందించి, ఇక్కడే హైడ్రోజన్ రైలు తయారు చేస్తామని చెప్పారు. ఉత్తర రైల్వే వర్క్‌షాప్‌లో హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు నమూనాను అభివృద్ధి చేస్తున్నామని గత నెలలోనే ఆయన ప్రకటించారు. అనంతరం హర్యానాలోని సోనిపట్-జింద్ సెక్షన్‌లో పరీక్షిస్తామన్నారు.

2023 బడ్జెట్‌ దేశానికి గ్రోత్ ఇంజిన్‌లా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సారి రైల్వేల కోసం కేటాయించిన 2.41 లక్షల కోట్లతో ప్రయాణీకుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పెద్ద మార్పులు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. వందే భారత్ రైలు విజయవంతమవడంతో ఇప్పుడు రైల్వేశాఖ 2024-25 నాటికి వందే మెట్రో రైలును కూడా ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. నగరాల్లో 50-60 కి.మీ దూరం ప్రయాణించేలా వందే మెట్రో రైలును త్వరలో తీసుకురానున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాదిప్రొడక్షన్, డిజైన్ వర్క్ పూర్తి చేసి.. వచ్చే ఏడాది నుంచి దీన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. వందే మెట్రో 125 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని, దీని డిజైన్ ముంబై సబ్-అర్బన్ తరహాలో ఉంటుందని అన్నారు. అయితే వందే మెట్రోలో టాయిలెట్ సౌకర్యం ఉండదు. వందే మెట్రో రైలు 1950, 1960 నాటి రైళ్ల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు.

దీనిలోని ఇంజిన్ పూర్తిగా హైడ్రోజన్ ఆధారితంగా ఉంటుంది. దీని వల్ల కాలుష్య ఉదార్గాలు ఏమీ ఉండవు. వందే భారత్ రైలు మాదిరిగానే ఈ రైలులో కూడా ఆధునిక బ్రేక్ సిస్టమ్, రెడ్ సిగ్నల్ బ్రేకింగ్ నిరోధించడానికి కవాచ్ సేఫ్టీ సిస్టమ్, ఆటోమేటిక్ డోర్, ఫైర్ సెన్సార్, జీపీఎస్, ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఛార్జీలు అందుబాటులో ఉండేలా దీనిని తీసుకురానున్నారు. ఈ ఏడాది చివరికల్లా తొలి హైడ్రోజన్‌ రైలు అందుబాటులోకి వస్తుందని అంచనా.

దీన్ని దేశీయంగా తయారు చేస్తున్నామని, ముందుగా దీనిని హెరిటేజ్‌ సర్క్యూట్‌లో నడుపుతామని.. తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామని అశ్విని
వైష్ణవ్ చెప్పారు. ఇండియాలో ఈ ఏడాది చివరికల్లా హైడ్రోజన్ రైళ్లు ప్రవేశపెడతామని ప్రకటించారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ సహాయంతో రూపొందించే లోకోమోటివ్‌లను ఉపయోగించి రైళ్లను నడిపిస్తారు. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ద్వారా మోటార్లను నడిపిస్తారు. హైడ్రోజన్, ఆక్సిజన్‌ను కన్వర్ట్ చేయడం ద్వారా ఫ్యూయల్ సెల్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ రైళ్లు ఏ మాత్రం కాలుష్యాన్ని వెదజల్లవు.

  • ఇవి పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయి. అందుకే డీజిల్ బదులు హైడ్రోజన్ ఇంజన్లను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. నీటిలోని హైడ్రోజన్,ఆక్సిజన్‌ను వేరు చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు.

నీటిలో రెండు హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సిజన్ అణువు ఉంటుందనే విషయం తెలిసిందే. పునరుత్పాదక శక్తి గాలి, సోలార్, హైడ్రో పవర్‌ను ఉపయోగించి హైడ్రోజన్‌ను తయారు చేయవచ్చు. అయితే హైడ్రోజన్ ఫ్యూయల్‌ను విస్తృతంగా వాడాలంటే కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ కేజీ రూ.492గా ఉంది. ఇంత ధర పెట్టి కొని ఉపయోగిస్తే అది డీజిల్ ఖర్చు కంటే 27 శాతం అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఫ్యూయల్ సెల్స్ కొనుగోలు, హైడ్రోజన్ నిల్వకు అదనంగా ఖర్చ చేయాలి. జర్మనీలో తొలి సారిగా 2018లో హైడ్రోజన్ పవర్డ్ ట్రెయిన్‌ను నడిపించారు.

ఇక 2022 ఆగస్టులో కేవలం హైడ్రోజన్ ట్రెయిన్లు నడిచే ట్రాక్‌ను సిద్ధం చేశారు. రాబోయే రోజుల్లో జర్మనీ 15 హైడ్రోజన్ పవర్డ్ ఇంజన్లను డీజిల్ ఇంజన్ స్థానంలో రిప్లేస్ చేసి నడపాలని భావిస్తోంది. ఇంకా శైశవ దశలోనే ఉన్న ఈ టెక్నాలజీని ఇండియన్ రైల్వేస్ ఇంత త్వరగా అడాప్ట్ చేసుకోవడం వల్ల.. ఈ టెక్నాలజీని అందిస్తున్న సంస్థలు మన దేశానికి క్యూ కట్టే అవకాశం ఉంటుంది. ఇండియాలో వందే మెట్రో పేరుతో నిర్వహించే ఈ హైడ్రోజన్ ట్రైన్లను తొలుత నారో గేజ్ రూట్లలో నడపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం డార్జిలింగ్, హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, ది కాల్కా సిమ్లా రైల్వే, ది మాథేరన్ హిల్ రైల్వే, ది కాంగ్రా వ్యాలీ, ది బిల్మోరా వాఘాయ్, మార్వార్-దేవ్‌ఘర్ మాడ్రియా లైన్‌లో డీజిల్ ఇంజన్లలో నేరో గేజ్ రైళ్లను నడిపిస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోంది. కొండల ప్రాంతంలో ఉండటంతో గేజ్ పెంచి, ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి కూడా ఆటంకాలు ఉన్నాయి.

ఇలాంటి ప్రాంతాల్లో హైడ్రోజన్ ఫ్యూయల్ రైళ్లను ప్రవేశపెడితే మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ
కలుగకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి స్థాయి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దగ్గరి ప్రాంతాలకు వందే మెట్రోను నడిపే
అవకాశం కూడా ఉంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి.. పెట్రో ఇందనాల వాడకం తగ్గించేందుకు మరో అద్భుతానికి శ్రీకారం చుడుతోంది మోదీ
ప్రభుత్వం. ఎలాంటి కాలుష్య ప్రభావం ఉండకుండా.. ప్రకృతికి మేలు చేసేలా ఇండియన్ రైల్వేశాఖ సరికొత్త ప్రణాళికను మొదలు పెట్టింది.

పూర్తి భారతీయ, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి హైడ్రోజన్‌ రైలును కొత్త సంవత్సరంలో.. అంటే 2023లో పట్టాలు ఎక్కించనుంది. కాలుష్యకారక
డీజిల్‌ ఇంజిన్ల స్థానంలోనే ఈ హైడ్రోజన్ రైలు ఇంజన్లను తీసుకొస్తోంది. భూమిపై హైడ్రోజన్‌ ఇందనానికి కొరత అస్సలు లేదు. సముద్ర నీటి నుంచి
దీన్ని ఉత్పత్తి చేయవచ్చు. కేవలం 20 నిమిషాల్లోపే ఇంధనాన్ని నింపవచ్చు. హైడ్రోజన్‌ ఇందనం వల్ల ప్రతి ఏటా సుమారు 16లక్షల లీటర్ల డీజిల్‌
ఆదా అవుతుంది. దీంతో సంవత్సరానికి 4వేల టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌ విడుదలకు చెక్ పెట్టవచ్చు.

అయితే ఇందులో ఒక్కసారి ఇంధనం ఫిల్ చేస్తే ఆ రైళ్లు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ విషయంలో డీజిల్‌ ఇంజిన్లకు ప్రత్యామ్నాయం ఇదే అని చెప్పవచ్చు. హైడ్రోజన్‌ రైళ్లు వేగాన్ని వాయువేగం అని చెప్పవచ్చు. ఇది గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని మొదటి సెకనులోనే అందుకోగలదు. ప్రస్తుతం ఆ రూట్‌లో నడుస్తున్న రైళ్లు 80-120 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకుంటున్నాయి. హైడ్రోజన్ నిండిన ట్యాంక్‌తో రైలు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. హైడ్రోజన్‌ రైళ్ల కోసం మార్పిడి చేసిన కంబషన్‌ ఇంజిన్లను వాడే వీలుంది.

కాలుష్య నివారణలో భాగంగా .. కేంద్రం హైడ్రోజన్ రైలు దిశగా వేగంగా పావులు కదుపుతోంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే, వ్యయం తగ్గడమే కాక.. ప్రయాణీకులకు అత్యల్ప ధరకు ప్రయాణించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా త్వరలో హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టనుందని తెలుస్తోంది.

Must Read

spot_img