భూమి మీద మానవులు చంద్రుడిపై దండయాత్ర ప్రకటించారు. వరుసగా ఆ చిన్ని గ్రహాన్ని ఆక్రమించుకునేందుకు ఒక దేశం తరువాత మరో దేశం ప్రయత్నాలు జరుపుతున్నారు. అందులో భాగంగా నిత్యం రాకెట్ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. మొన్నటి ఆర్టెమిస్1 ప్రయోగం తరువాత ఇప్పుడు జపాన్, యూఏఈ దేశాలకు చెందిన కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ చంద్రుడివైపు దూసుకుపోయాయి.. ఇందుకు అమెరికాలోని కేప్ కనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ వేదికైంది..
చంద్రుడిపైకి జపాన్, యూఏఈ దేశాలకు చెందిన వ్యోమనౌకలు ప్రయోగించాయి. అంతరిక్ష ప్రయోగాలలో నూతన శకం వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో జపాన్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఆ దేశానికి చెందిన ఐస్పేస్ అనే అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్. చంద్రుడిపైకి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా పంపించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో హాకుమో-ఆర్‌ఎం1 అనే వ్యోమనౌకను పంపింది.
చంద్రుడిపైకి వాణిజ్య వ్యోమనౌకను పంపిన తొలి ప్రైవేట్ సంస్థగా ఐస్పేస్ రికార్డు సృష్టించింది.
ఇందులో జపాన్‌కు చెందిన ఒక ప్రైవేటు ల్యాండర్, యూఏఈ కు చెందిన తొలి రోవర్ ఉన్నాయి. జపాన్ ల్యాండర్ పేరు హకుటో. అది చంద్రుడిని చేరడానికి దాదాపు ఐదు నెలలు పడుతుంది.
ఇంధనాన్ని పొదుపుగా వాడుకొని ప్రయాణాన్ని సాగించేలా దీన్ని రూపొందించారు. తద్వారా డబ్బు ఆదా కావడంతోపాటు ఎక్కువ సైన్స్ ఉపకరణాలను తీసుకెళ్లడానికి వీలైంది. ఇది భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్లు పయనించి.. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరుకు చందమామను చేరుతుంది. అయితే దీనికి భిన్నంగా అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఇటీవల ప్రయోగించిన ఒరాయన్ క్యాప్సూల్ కేవలం ఐదు రోజుల్లోనే జాబిల్లికి చేరువైంది. హకుటో ల్యాండర్‌ను ఐస్పేస్ అనే సంస్థ రూపొందించింది. అది చంద్రుడిపైనున్న ‘అట్లాస్ క్రేటర్’లో దిగుతుంది. ఈ ల్యాండర్ ఎత్తు ఏడు అడుగులుగా ఉంది. దీనికితోడు జపాన్ అంతరిక్ష సంస్థకు చెందిన ఒక బుల్లి రోబోను కూడా స్పేస్‌ఎక్స్ రాకెట్ మోసుకెళ్లింది.
ఇది కమలా పండు ఆకృతిలో ఉంటుంది. చంద్రుడి మీదకు వెళ్లాక చక్రాలతో కూడిన రోబోలా మారిపోతుంది. అయితే యూఏఈ పంపిన రోవర్ పేరు రషీద్ అని వ్యవహరిస్తున్నారు. దీని బరువు 10 కిలోలు. అది చందమామ ఉపరితలంపై 10 రోజుల పాటు సేవలు అందిస్తుంది. వీటికి తోడు నాసాకు చెందిన ఒక లేజర్ సాధనాన్ని కూడా స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో పంపారు.
జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద శాశ్వతంగా నీడలో ఉండిపోయే బిలాల్లో మంచు గురించిన జాడల కోసం ఇది గాలిస్తుంది. అయితే చంద్రుడి పైకి ల్యాండర్‌ను పంపించడం జపాన్ కు ఇదే మొదటిసారి. అయితే ఇప్పటికే జపాన్ అంతరిక్షప్రయోగాలు జరుపుతూ ఉంది. ఆస్టిరాయిడ్ మైనింగ్ కు సంబంధించిన ప్రయోగాలలో గణనీయమైన ప్రగతిని సాధించింది.
భవిశ్యత్తులో అంతరిక్షంలో సుదూర తీరాల నుంచి వచ్చిపడే గ్రహశకాలలను గుర్తించి వాటిపై ఉండే అరుదైన ఖనిజాలను మైనింగ్ చేసే ఉద్దేశ్యంలో ప్రయోగాలు చేస్తోంది.
టోక్యోలోని కేప్ కనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆదివారం జరిగిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రతిష్టాత్మక స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనే రాకెట్ సాయంతో ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగంతో ప్రపంచవ్యాప్తంగా చంద్రుడి మీదకు కమర్షియల్ వ్యోమనౌకను పంపిన తొలి ప్రైవేట్ సంస్థగా ఐస్పేస్ కు గుర్తింపు లభించింది. ఈ నౌక చంద్రుడి పైకి వెళ్లిన రెండు రోబోటిక్ రోవర్లు, జపాన్ అంతరిక్ష సంస్థ జక్సాకు చెందిన బేస్‌బాల్ సైజులో ఉన్న రెండు చక్రాల పరికరాలను, సౌదీ అరేబియాకు చెందిన నాలుగు చక్రాల రషీద్ ఎక్స్‌ప్లోరర్ ల ద్వారా చంద్రుడిని గురించిన అనేక కొత్త విషయాలు ప్రపంచానికి తెలియనున్నాయి.
నిజానికి ఈ ప్రయోగాన్ని ముందుగానే నిర్వహించాలని అనుకుంది జపాన్ కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఆదివారం విజయవంతంగా లాంచ్ చేయడం జరిగింది. భారీ సైజులో ఉండే ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లగానే స్పేస్ సెంటర్‌లోని వంద మంది చప్పట్లు కొడుతూ అభినందించుకున్నారు. వచ్చే ఏడాది కూడా జపాన్ జాబిల్లి మీదకు ల్యాండర్‌ను పంపే అవకాశం ఉంది. స్పేస్ ఎక్స్ ద్వారా 8మంది వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపించే కార్యక్రమం కూడా జపాన్ దేశానికి సంబంధించిన కుబేరుడు తలపెట్టారు. యుసక్ మెజావా అనే ఈ సంపన్నుడు అన్ని రంగాలలో నిష్ణాతులైన ఏడుగురు సామాన్యులను తన వెంట తీసుకుపోనున్నారు.