టర్కీలో భయానక భూకంపంతో ప్రపంచం ఉలిక్కిపడింది.. వరుస భూకంపాల ధాటికి మృతుల సంఖ్య 4వేలు దాటింది.. బాధితులను చూసి ప్రపంచ దేశాలు సైతం కన్నీరు పెట్టుకుంటున్నాయి. ఇంతకూ ఈ తరహా భూకంపాలకు కారణం ఏంటి..?
- ప్రపంచంలోని ఏయే దేశాలలో తరచుగా భూకంపాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి..
- భూకంపం ఏర్పడినప్పుడు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడానికి గల కారణం ఏంటి..?
- ఎక్కువగా భూకంపాలతో అతలాకుతలం అవుతున్న దేశాలేంటి..?
టర్కీలో భయానక భూకంపంతో ప్రపంచం ఉలిక్కిపడింది. వరుస భూకంపాల ధాటికి మృతుల సంఖ్య 4వేలు దాటింది!అక్కడి ప్రజల బాధను చూసి ప్రపంచ దేశాలు కన్నీరు పెట్టుకుంటున్నాయి. అయితే.. అత్యంత భయంకరమైన భూకంపాల ఘటనలకు ప్రపంచం ఇప్పటికే సాక్ష్యంగా నిలిచింది.భూకంపం ఏర్పడినప్పుడు భూమి ఉపరితలం నందు ప్రకంపనలే కాకుండా కొన్ని సందర్భములలో భూమి బీటలు వారుతుంది.
దీంతో ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తాయి. భూ ఫలకాల కదలికలే భూకంపం రావడానికి ప్రధాన కారణం. ఇదే భూకంపం సముద్రం లోపల వస్తే అది సునామీగా మారే అవకాశం ఉంది. ఈ భూకంపాలను రిక్టర్ స్కేలుతో కొలుస్తారు. భూకంపాలు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో అధికంగా సంభవిస్తాయి. దీంతో ఇక్కడ ఉండే దేశాలు తరుచుగా భూకంపాలకు గురవుతాయి.
ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే టాప్-5 దేశాలలో జపాన్ ఒకటి..జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. అందుకే ఈ దేశం తరుచూ భూకంపాలకు, సునామీలకు గురవుతుంది. దీంతో భూకంపాలను గుర్తించే టెక్నాలజీని ఈ దేశం అభివృద్ధి చేసింది. భూకంపం రాబోతుందని ముందుగానే చెప్పే హెచ్చరిక వ్యవస్థ కూడా జపాన్ దగ్గర ఉంది.
భూకంపం లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ప్రపంచంలో అత్యధిక భూకంపాలకు గురయ్యే దేశాలలో ఇండోనేషియా కూడా ఒకటి. ఇండోనేషియా దాదాపు ప్రతి సంవత్సరం 6.0 తీవ్రత కంటే పెద్ద భూకంపాలను చవిచూస్తుంది. ఈ విపత్తు వల్ల ఈ దేశం వేలాది మంది ప్రాణాలు కోల్పోయింది.
ఇక.. తరచుగా భారీ భూకంపాలను ఎదుర్కొన్న దేశాల్లో చైనా ఒకటి. 2008లో సిచువాన్ ప్రావిన్స్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 87,000 మంది మరణించారు. ఈ దేశం టెక్టోనిక్ పలకాల పైన ఉండటం వల్ల తరుచూ భూకంపాలకు గురవుతుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటి. అందుకే ఈ దేశం కూడా తరుచూ భూకంపాలకు గురవుతుంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడటం, టైఫూన్లు, ఉష్ణమండల తుఫానులు సర్వసాధారణం. ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కోనేందుకు ఇక్కడి ప్రభుత్వం పలు విధానాలను అవలంభిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో ఇరాన్ ఒకటి.
కొన్ని సంవత్సరాలుగా వేలాది మందిని బలిగొన్న వినాశకరమైన భూకంపాల చరిత్ర ఉంది. ఇరాన్‌ను తాకిన అత్యంత ఘోరమైన భూకంపాలలో గిలాన్ ప్రావిన్స్‌లో ఒకటి. 1990లో సంభవించిన ఈ భూకంపం ధాటికి 40,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశాలతో పాటు ఎక్కువగా భూకంపాలకు గురయ్యే దేశాల జాబితాలో తుర్కియే, ఈక్వెడార్, పెరూ, యూఎస్ఏ, మెక్సికో, ఇటలీ తదితర దేశాలు ఉన్నాయి.
- 2022 జూన్ 22న అఫ్గానిస్థాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 1,100 మందికి పైగా ప్రజలు మరణించారు..
2021 ఆగస్ట్ 14న 7.2 తీవ్రతతో హైతీలో భూమి కంపించింది. ఆ ఘటనలో 2,200 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు… 2018 సెప్టెంబర్ 28న 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఇండోనేషియాలో మృతుల సంఖ్య 4,300 దాటింది. 2016 ఆగస్ట్ 24న 6.2 తీవ్రతతో మధ్య ఇటలీలో భూకంపం సంభవించింది. 300మంది బలయ్యారు. 2015 ఏప్రిల్ 25న నేపాల్‌లో 7.8 తీవ్రతతో భూమి కంపించడంతో… 8,800మందికి పైగా ప్రజలు మరణించారు.
2003 మే 21న అల్గేరియాలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2,200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002 మార్చ్ 25న అఫ్గానిస్థాన్‌లో 6.1 తీవ్రతతో
నమోదైన భూకంపం ధాటికి 1000 మంది బలయ్యారు . 2001 జనవరి 26న ఇండియా గుజరాత్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. 20వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2014 ఆగస్ట్ 3న చైనాలో 6.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. 700మంది ప్రాణలు కోల్పోయారు.
2013 సెప్టెంబర్ 24న పాకిస్థాన్‌లో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. 800 మందికి పైగా ప్రజలు మృతిచెందారు. 2011 మార్చ్ 11న 9.0 తీవ్రతో జపాన్‌లో సంభవించిన భూకంపం ధాటికి సునామీ సైతం వచ్చింది. ఈ ఘటనలో 20వేల మంది మరణించారు. 2010 ఫిబ్రవరి 27న చిలీలో 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 524 మంది బలయ్యారు. 2010 జనవరి 12న హైతీలో 7.0 తీవ్రతతో భూమి కంపించింది. 3,16,000 మంది మరణించారు.. 2009 సెప్టెంబర్ 30న 7.5 తీవ్రతతో దక్షిణ సుమాత్ర, ఇండోనేషియాలో వచ్చిన భూకంపం ధాటికి 1,100 మందికి పైగా ప్రజలు మృతి చెందారు.
2009 ఏప్రిల్ 6న ఇటలీలో 6.3 తీవ్రతతో భూమి కంపించింది. 300మంది మరణించారు. 2008 మే 12న చైనాను 7.9 తీవ్రతతో భూకంపం గడగడలాడించింది. 87,500 మంది బలయ్యారు. 2007 ఆగస్ట్ 15న మధ్య పెరూలో 8.0 తీవ్రతతో భూమి కంపించింది. 500 మంది మరణించారు. 2006 మే 26న జావా, ఇండోనేషియాలో సంభవించిన భూకంపంలో 5,700 మంది బలయ్యారు. రిక్టార్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదైంది.
2005 అక్టోబర్ 8న పాకిస్థాన్ లో భూకంపం సంభవించగా.. 7.6 తీవ్రత నమోదైంది. 80వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2005 మార్చ్ 28న ఇండోనేషియా ఈశాన్య సుమాత్రాలో 8.6 తీవ్రతతో భూమి కంపించింది. 1300 మంది మరణించారు. 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలో 9.1 తీవ్రతతో భూమి కంపించింది. ఫలితంగా హిందూ మహా సముద్రంలో భారీ సునామీ ఏర్పడింది. వివిధ దేశాల్లో 2,30,000 మంది మృతి చెందారు. 2003 డిసెంబర్ 26న నైరుతు ఇరాన్లో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. 50వేల మంది మరణించారు.
ప్రపంచంలో ఎక్కువగా భూకంపం సంభవించే దేశాల్లో జపాన్, ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్, ఇరాన్ లు ఉన్నాయి.. తీవ్ర స్థాయిలో భూకంపాలు సంభవించినప్పుడు వేలాది మంది బలైపోతున్నారు.. అంతేకాదు.. ఆస్తినష్టం తీవ్రస్థాయిలో జరగడంతో ఆయా దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది..