విశ్వం ఎలా పుట్టింది..నక్షత్రాలు ఎలా ఆవిర్భవించాయి లాంటి ప్రశ్నలు అందరినీ వేదిస్తుంటాయి. అయితే ఈ సీక్రెట్ భూమిలోపలే దాగి ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. భూమిలోంచి వెలువడే న్యూట్రినోల వల్లే ఏదో జరుగుతోందన్న విషయాన్ని తేల్చుకునేందుకు జపాన్ లో ప్రయోగం జరుగుతోంది. దానినే సూపర్ కామియోకాండే ఎక్స్ పెరిమెంట్ అని అంటున్నారు.
నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు, మన దైనందిన జీవితానికి కారణమైన ప్రతిదీ న్యూట్రినోల వల్ల ఏర్పడ్డాయి. వాటి ఉత్పత్తి చాలా సూక్ష్మంగా కంటికి కనిపించనంతగా ఉంటుంది. అవి నిత్యం వెలువడుతూండటం వల్లే పదార్థం ఏర్పడింది. న్యూట్రినో అంటే మరేమీ కాదు. పరమాణువులోన ఉండే నిత్యం చలించే కణం. అది బయటకు వచ్చినప్పుడు జరిగే అనంతమైన విస్తరణ కారణంగా పదార్థం ఏర్పడుతోంది. విశ్వ రహస్యాన్ని దాచుకున్న ఈ న్యూట్రినోల రహస్యాన్ని ఛేదించేందుకు జపాన్ నడుం బిగించింది. ఓ కొండ కింద కిలోమీటరు లోతులో ఓ కేంద్రాన్ని నిర్మించి అందులో ప్రయోగాలు నిర్వహిస్తోంది. దానినే సూపర్ కామియోకాండే ఎక్స్ పెరిమెంట్ అని అంటున్నారు.
జపాన్‌లో చేస్తున్న ప్రయోగ ఫలితాలు విజ్ఞాన శాస్త్ర అతిపెద్ద రహస్యాల్లో ఒకటైన దీన్నిఛేదించడానికి దోహదపడుతున్నాయి. పదార్థ, ప్రతిపదార్థ కణాల వైఖరీ భేదం ఆధారంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. మనకు తెలిసిన ప్రపంచంలో రోజువారీ మనం చూసే ప్రతి వస్తువు సహా మనం తాకగలిగే వస్తువులన్నీ న్యూట్రినోల వల్ల ఏర్పడినవే. అసలు విశ్వరహస్యం పాతాళంలో ఉందని జపాన్ శాస్త్రవేత్లలు చెబుతున్నారు.
భూమి ఎక్కడిది? ఈ సూర్యుడు ఎక్కడివాడు? సౌర మండలం ఎలా ఏర్పడింది? కోట్లాది పాలపుంతలు, అంతకుమించిన నక్షత్రాలు, కృష్ణబిలాలు, అనంత శూన్యం..ఎలా పుట్టింది?
అన్న ప్రశ్నలు శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. నిత్యం ఆ విషయంలో క్లారిటీ కోసం నిరంతరం పరిశోధనలు సాగుతున్నాయి.విశ్వం గుట్టును తెలుసుకోవాలన్న సంకల్పంతో శాస్త్రవేత్తలు బృహత్తర ప్రాజెక్టుకు కార్యరూపం ఇచ్చారు. అదే.. సూపర్-కామియోకాండే లేదా సూపర్-కే అని వ్యవహరిస్తున్నారు. జపాన్‌లోని హిడా నగరానికి దగ్గరలో ఐకెనో పర్వతం కింద 1 కిలోమీటర్ లోతులో సూపర్-కే ట్యాంక్‌ను నిర్మించారు. దీని ద్వారా న్యూట్రినోల గుణాన్ని తెలుసుకోనున్నారు. పరమాణువులోని ఎలాంటి విద్యుదావేశం లేని కణమే న్యూట్రినో. ఇది ఇతర పరమాణువులతో అతి తక్కువగా ప్రతిస్పందిస్తుంది.
విద్యుదావేశం లేకపోవటం వల్ల ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కిరణాలకు చలించదు. రేడియో ధార్మికత, పరమాణు ప్రతి చర్య వల్ల ఏర్పడుతాయి. అందుకే ఇవి సూర్యుడి ఉపరితలం, అణు పరిశోధనలు జరిగేచోట, కాస్మిక్ కిరణాలు అణువులను తాకినపుడు ఉద్భవిస్తాయి.
వీటి కోసం వెతకటం కష్టంతో కూడుకొన్న పని. ఎందుకంటే ఇవి ఎలాంటి పదార్థం నుండైనా ప్రయాణించగలవు. అదీ ఎలాంటి హాని చేయకుండా. ఈ న్యూట్రినో గుణాన్ని తెలుసుకొంటే విశ్వం గుట్టును తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. న్యూట్రినోలు చాలా వేగంగా, దేన్నుంచైనా ప్రయాణిస్తాయి. ఆ ప్రయాణ సమయంలో తరంగాలను ఉత్పత్తి చేస్తాయి.
ఆ తరంగాలను ట్యాంకులో ఉండే వేల లైట్ సెన్సిటివ్ ఫొటో మల్టిప్లయర్ ట్యూబ్‌లు బంధిస్తాయి. అయితే, న్యూట్రినోల గుణాన్ని తెలుసుకోవాలంటే కచ్చితంగా నీరు అత్యంత స్వచ్ఛతను కలిగి ఉండాలి. దానికోసం నీటిని పలు దశల్లో శుద్ధి చేస్తారు. బ్యాక్టీరియా లాంటివి ఉంటే యూవీ కిరణాలను ప్రసరింపజేసి, ఆల్కలైన్ నీటిగా మార్చేస్తారు.
సూపర్ కే కంటే 20 రెట్లు పెద్దదైన హైపర్ కే నిర్మాణానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.
2026 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. సూపర్ కేలో 11 వేల లైట్ డిటెక్టర్స్ ఉండగా, హైపర్ కేలో 99వేల లైట్ డిటెక్టర్స్‌ను ఏర్పాటుచేయనున్నారు. కాస్మిక్ కిరణాలు, ఇతర అణువుల ప్రభావం పడకుండా, కేవలం న్యూట్రినోల గుణాన్ని తెలుసుకొనేందుకు సూపర్-కేను 1000 మీటర్ల లోతులో, రూ.5 వేల కోట్లతో 1983లో నిర్మించారు. 16 మీటర్ల పొడవు, 15.6 మీటర్ల వెడల్పు ట్యాంక్‌ను కలిగి ఉంటుంది.
ఈ ట్యాంక్‌లో 11 వేల లైట్ సెన్సిటివ్ ఫొటో మల్టిప్లయర్ ట్యూబ్‌లు ఉంటాయి. 50 వేల టన్నుల అతి స్వచ్ఛమైన నీటిని కలిగి ఉంటుంది. ఈ పరిశోధనలు పూర్తయితే విశ్వానికి సంబంధించిన అనేక రహస్యాల గుట్టు వీడనుంది