Home తెలంగాణ అద్దెలు బారెడు… ఆదాయం జానెడు..!

అద్దెలు బారెడు… ఆదాయం జానెడు..!

*అవస్థులు పడుతున్న నగర వాసులు
*అమాంతం రేట్లు పెంచిన ఇంటి యజమానులు
*బాడుగ ఇళ్లలో బలహీన బతుకులు

హైదరాబాద్ పేరులోనే బాదుడు ఉంది. ఎలా అంటారా…? పొట్ట చేత పట్టుకుని ఉద్యోగం కోసం ఉన్న పుట్టిన ఊరుని, కన్న తల్లిదండ్రులను, స్నేహితులని వదిలి బతుకు దేరువు కోసం భాగ్యనగరానికి వస్తారు. మామూలు రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో ఉపాధి పొందుతున్న వారి కష్టాలు అంతాఇంతా కాదు. ఒకటో తారీఖు వచ్చిందంటే ఇంటి అద్దె, నిత్యావసర సరుకులకోసం సామాన్యుడి జీతం వెంటనే ఖర్చయిపోతుంది. సోషల్ మీడియా సాక్షీగా నగరంలో ఇళ్ల అద్దె చెల్లించడానికి మా జేబులు ఖాళీ అవుతున్నాయని కామెంట్ సెక్షన్‌లో తమ కష్టాలు చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు, బ్యాచిలర్ల బాదలు వర్ణనాతీతం. దీంతో పాటు దేశ నలుమూలల నుంచి జాబ్‌ నిమిత్తం ఎందరో హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ పెరుగుతున్న అద్దెలపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది.

అయితే.. ప్రస్తుతం సామాన్య మద్యతరగతి కుటుంబాలు అద్దె ఇంటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గతంలో కరోనా కాలంలో చాలా మంది అద్దె ఇళ్లను వదిలి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పలు ఐటి కంపెనీలు, పలు వ్యాపార సంస్థలు నూతనంగా ఆన్ లైన్ ఉద్యోగానికి నాంది పలికారు. దీంతో చాలా మంది ఇంటి వద్దనే ఉంటూ ‘ వర్కు ఫ్రం హోం ’ చేశారు. అప్పడు హైదరాబాద్ లో చాలా వరకు ఖాళీ చేశారు. గత రెండు మూడేళ్లు బాగానే ఉన్నా…ఈ ఏడాది అన్ని కంపెనీలు ఉద్యోగస్థులను ఇంటిని వదిలి ఆఫీసులకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో అందరూ మళ్లీ ఇంటిని వదిలి సిటీ బాట పట్టారు.

అద్దె ఇంటితో పడరాని పాట్లు…

ప్రస్తుతం అందరూ ఇక్కడకు చేరడంతో ఇంటి యజమానులు అద్దెలు అమాంతం పెంచేశారు. దీంతో నగరంలో సగటు జీవి బ్రతుకు కన్నీటి సాగరం అవుతుంది. రోజంత కష్టపడితే వచ్చిన కష్టం కనీస అవసరాలకే సరిపోగా, పొదుపు అనే మాట చూర్లో పొగలా మారింది. సొంత ఇంటి యజమానులకు అద్దె కష్టాలు తెలియవు అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా కొంత మంది నగర వలస వాసులు ఇంటి అద్దెలు సాప్ట్వేర్ ఉద్యోగుల వల్లే పెరిగాయాంటూ పోస్ట్ లు పెడుతున్నారు. గతంలో సింగిల్ బెడ్ రూం ఇంటి అద్దె సగటున రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ఉండేది..కానీ ప్రస్తుతం అదే ఇంటి బాడుగ దాదాపు 20శాతం నుంచి 40 శాతం వరకు పెంచారు. దీంతో సింగిల్ బెడ్ రూం ఇంటి అద్దెలు సగటున రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు పెరిగాయి. ఇదీ ఇలా ఉంటే డబుల్ బెడ్ రూం అద్దెలు రూ.20 వేల పై మాటే. వచ్చే జీతంలో అద్దెలకే సగం జీతం ఖర్చు పెడితే మిగతా అవసరాల పరిస్థితేంటని పలువురు భయపడి పోతున్నారు.

వర్ణనాతీతంగా బ్యాచిలర్ల బతుకులు

హైదరాబాద్ లో బ్యాచిలర్ల బతుకులు అస్తవ్యప్తంగా ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి చదువు, ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన బ్యాచిలర్స్‌ అద్దె ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తారు. మరి కొందరు పెళ్లైన వారు కూడా ఉద్యోగ రీత్యా భార్య భర్తలు వేర్వేరు ప్రాంతాలలో ఉండాల్సి రావడంతో వారిని కూడా బ్యాచిలర్స్ గానే బావిస్తూన్నారు. ఫ్యామిలీతో కలిసి ఉండకపోతే చాలు బ్యాచిలర్ ముద్ర పడినట్లే. వారు
సాఫ్ట్‌వేర్ ఇంజనీరైతే ఏంటి, హర్డ్‌వేర్ ఇంజనీరైతే ఏంటి. అందరివి ఒకటే కష్టం. డబ్బుల కష్టం.పెరిగిన ధరలు,ఇబ్బంది పెట్టే ఇంటి రెంట్లు. ఇవన్ని మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. అద్దె ఇంటి కోసం వెతికేవారికి బ్యాచిలర్స్‌కు, ఫ్యామిలీకి డివైడ్ చేసి రెంట్లు చెప్తున్నారు. ఇంటి సామార్థ్యంతో పనిలేకుండా బ్యాచిలర్లకు ఇంట్లో ఉండే సంఖ్యను బట్టి అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇక కొంత మంది వీరికి ఇండ్లు అద్దెకు ఇచ్చి దీనినే ప్రధాన వ్యాపారంగా మార్చుకున్నారు.

ఆఫీసు ఏరియాలో అద్దెలకు పుల్ డిమాండ్..!

ఇంకా రెంట్లు కాస్త తక్కువగా వున్న ఏరియల్లో అద్దెకు తీసుకుందామంటే ఆఫీస్‌కు చాల దూరం అవుతుంది. ఈ ట్రాఫిక్‌లో అంత దూరం ప్రయాణం చేసేటంత రిస్క్ తీసు కోవడం లేదు కొందరు. నగరంలో ఉన్న ప్రధాన ఏరియల్లో రెంట్ల సంగతి చెప్పవలసిన అవసరంలేదు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం రెంట్ల విషయంలో ఎంతగానో వ్యత్యాసం కనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న నగరంలో అద్దెకష్టాలు అంతాఇంతా కావు. ఇక కుకట్‌పల్లి, మాదాపూర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి, హైటెక్‌సిటి, వంటి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు, మల్టీఫ్లెక్స్‌లు, నాన్ బ్యాంకింగ్ తదితర కంపెనీలతో పాటుగా ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఫార్మా కేంద్రాలు వున్నాయి. అందుకే జాబ్‌కు అందుబాటులో రూం అద్దెకు తీసుకుంటే హయిగా, ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా టైంకి ఆఫీస్ కు వెళ్లిరావచ్చనే ఆలోచన చాలా మంది రెంట్లు ఎక్కువ చెల్లించి ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో వీరి అవసరాలు ఆసరగా చేసుకొని ఇంటి యజమానులు అద్దె గదులకు విపరీతమైన రేట్లు పెంచారు. అద్దెల విషయంలో పలువురు పోటీలు పడి చెల్లించడంతో డిమాండ్ ఉన్న ఏరియాలతో పాటు మిగతా ప్రాంతాలలో ఉన్న వారు కూడా అద్దెలు పెంచారు. గతంలో పదివేల నుంచి పదిహేను వేల రూపాయాల అద్దె ఉన్న ఇండ్లు ప్రస్తుతం ఇరవై ఐదు వేల నుంచి డిమాండ్ ను బట్టి నలబైవేల రూపాయల వరకు ఉన్నట్లు తెలుస్తుంది.

మరో పక్కా సర్కారీ దోపిడీ..

ధరలతో ప్రజలు పడే అవస్థలకు తోడు ప్రభుత్వం కూడా ట్రాఫిక్‌ నిబంధనల పేరిట నిలువుదోపిడి చేస్తోంది. పెరుగుతున్న ధరలతో సతమతమౌతుంటే మరోపక్క ట్రాఫిక్ రూల్స్ కూడా సామాన్యుడిపై పెను బారం మోపుతుంది. గతంలో వాహానదారులు చిన్న చిన్న పొరపాట్లు చేసిన ట్రాఫిక్ పోలీసులు సూచి చూడనట్లు వదిలేసేవారు. కానీ ఇప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు వాహానాల రాకపోకల క్రమబద్ధీకరణ వదిలేసి.. కెమెరాలు చేత పట్టుకొని కాపు కాస్తున్నారు! ద్విచక్రవాహనంపై ఇద్దరు పిల్లలను పెట్టుకుని భార్య, భర్త వెళ్తుంటే.. పిల్లలకు, భార్యకు హెల్మెట్‌ లేదంటూ జరిమానాల మోత మోగిస్తున్నారు. దీంతో నెలాకురు వచ్చే సరికి సామాన్య మద్యతరగతి వ్యక్తులకు పెను భారం అవుతుంది.