HomePoliticsజిల్లా అధ్యక్షుల పదవులే వాళ్లకు శాపంగా మారాయా..?

జిల్లా అధ్యక్షుల పదవులే వాళ్లకు శాపంగా మారాయా..?

పదవులు వచ్చినప్పటి నుంచి జిల్లా రాజకీయాలు వాళ్లకు తలనొప్పి అయ్యాయా? ప్రశాంతంగా ఉన్న పాలిటిక్స్ లో పదవులు చిచ్చు పెట్టాయా అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. పదవుల పంచాయితీ కథేంటో .. అసలు విషయం తెలియాలంటే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులపై ఓ లుక్కేయాల్సిందేనట.

వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. టార్గెట్ 2023 దిశగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ పైన రాజకీయ యుద్దం ప్రకటించిన కేసీఆర్.. ఇక, రాష్ట్రంలో ముందుగా సొంత పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఒకే సారి 33 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు.

జిల్లా అధ్యక్షులుగా 19 మంది ఎమ్మెల్యేలు… ముగ్గురు ఎంపీలు.. ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మన్లు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారపార్టీగా ఉంది. ఆ అధికార పార్టీలో జిల్లా అధ్యక్షులు అంటే అసామాషీ కాదు. కానీ ఆ సంతోషమే లేకుండా పోయిందట బిఅర్ఎస్ జిల్లా అధ్యక్షులకు.

అప్పటివరకు ప్రశాంతంగా వాళ్ళ నియోజకవర్గాలకె పరిమితం అయిన నాయకులకు జిల్లాను అప్పగించారు పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్. నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాస్ అయితే, జిల్లాకు జిల్లా ప్రెసిడెంటే బాస్. దీంతో జిల్లా అంతటా చక్రం తిప్పుదామనుకున్న నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. దీని దెబ్బకు తెలంగాణలో ఏ ఒక్క బిఅర్ఎస్ జిల్లా నాయకుడి మొఖంలో ఆ సంతోషం కనిపించడం లేదు.

పదవి పొందిన వారంతా జిల్లా అధ్యక్షులుగా రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో ఏ పదవి అయినా, పార్టీ ఆదేశించిన ఏ కార్యక్రమం అయినా పూర్తి బాధ్యత జిల్లా అధ్యక్షులదే అన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తద్వారా .. జిల్లా అధ్యక్షుడి పేరుతో అంతర్గతంగా సాగుతోన్న రచ్చకు బ్రేక్ వేయాలని అధిష్టానం భావించింది. ఈ నిర్ణయం సహేతుకమే అయినా .. ఇప్పటికే వర్గపోరుతో మునిగిపోయిన జిల్లా రాజకీయాలు .. వీరి నియామకానికి ఏమాత్రం స్పందిస్తాయన్న చర్చ విశ్లేషకుల్లో వెల్లువెత్తుతోంది.

పదవులు అలంకార ప్రాయంగా మారుతున్నాయని, పార్టీ పని చేయడంలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో వీరికి తలనెప్పులు తప్పడం లేదని తెలుస్తోంది. పదవుల పంపకాలు పక్కన పెడితే పార్టీ ఏదైనా ఆందోళనకు పిలుపునిస్తే జిల్లా నాయకులను ఏకం చేయడం ఆ జిల్లా అధ్యక్షుడికి తలపానం తోకలోకి వచ్చినంత పనవుతోంది. ఎవరి దారి వారిదే అన్నట్లు నేతలు వ్యవహరిస్తుండడంతో, వీరందరినీ ఒకే వేదిక మీదకు తీసుకురావడం అధ్యక్షులకు కత్తి మీద సాములా మారింది. గ్రేటర్ సిటీతో పాటు రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపిస్తున్నాయి.

మొన్నటి వరకు తాండూరు పైలెట్ వర్సెస్ మహేందర్ విబేధాలు జిల్లా అధ్యక్షులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకున్నా సర్దుబాటు కాకపోవడంతో ఏకంగా కేటీఆర్, కేసీఆర్ వరకు వెళ్ళింది ఆ పంచాయితీ. అయినా ఇప్పటికీ వాళ్ళ మధ్య గొడవలు చల్లారలేదు. ఇక మేడ్చెల్ జిల్లా అధ్యక్షుడు శాంబిపూర్ రాజు, జిల్లా మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఏకంగా ఆ జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి నిరసనగా సమావేశం పెట్టి బాహాటంగానే విమర్శించారు.

ఇక నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి .. రూటే సపరేటు. జీవన్ రెడ్డికి జిల్లా కంటే ముందే పియూసీ చైర్మన్ పదవి ఉంది. ఇక దానికి తోడు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంకేం ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో సహా నిజామాబాద్ అంతా ఆయన చెప్పినట్లే నడవాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ చెప్పుకొస్తోంది. మొన్న రైతు ధర్నాకు మంత్రితో పాటు ఎమ్మెల్యే కవిత వస్తారని ముందురోజే చెప్పారు.. కానీ ధర్నా స్థలిలో మాత్రం వాళ్ళు కనిపించలేదు. దానికి కారణం జీవన్ రెడ్డే అంటున్నారు క్యాడర్.

ఇక మహబూబాబాద్ జిల్లాలో మాలోతు కవిత, శంకర్ నాయక్ మధ్య మహా యుద్ధమే నడుస్తోంది. మాలోతు కవిత చేతిలోంచి మైక్ లాక్కోని మరీ శంకర్ నాయక్ ఎదురుతిరిగారు. ఇదంతా మంత్రి సత్యవతి రాథోడ్ ముందే జరిగింది. ఆ సమయంలో కవిత సౌమ్యంగా ఉండటంతో ఆ సమయంలో సర్దుమణిగినా తరువాత కవిత .. శంకర్ నాయక్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

కవిత ఫిర్యాదుతో కేటీఆర్, కేసీఆర్, శంకర్ నాయకు కు గట్టిగానే హెచ్చరించినట్లు సమాచారం. అయినా శంకర్ నాయక్ ప్రవర్తనలో మార్పు రాలేదని క్యాడర్ చెప్పుకుంటున్నారు. ఇక నల్గొండ జిల్లాలో రవీంద్ర కుమార్ అధ్యక్షుడు అయినా జిల్లా రాజకీయాలను ఏలుతోంది జగదీష్ రెడ్డినే. పదవులైనా, పంచాయితీ
అయినా, ఎన్నిక అయినా, జగదీష్ రెడ్డినే ఏకచక్రాధిపత్యంగా నడుపుతున్నారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

దీంతో జిల్లా అధ్యక్షుడు అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నారని, ఆయనతో నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ఎవరు లేరని, ఎవరి దారి వారిదేనని సొంతపార్టీ నాయకులే గుసగుసలాడుతున్నారు. ఇక మహబూబ్ నగర్ లో లక్ష్మారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయినా ఎమ్మెల్యేలు ఎవరూ ఆయనకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. దీంతో పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు చేసేటప్పుడు ఇబ్బంది అవుతోందని సమాచారం. ఇలా ఒక్కటి రెండు కాదు ప్రతి జిల్లాలో పదవుల పంచాయితీ నడుస్తూనే ఉంది.

పార్టీ ఆదేశించిన రైతు ధర్నాకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఎక్కడా పాల్గొనలేదు..

నిన్న పార్టీ ఆదేశించిన రైతు ధర్నాకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఎక్కడా పాల్గొనలేదు. ఇక జిల్లా అధ్యక్షులకు మద్దతుగా కనీసం ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా సహకరించలేదు. దీంతో జిల్లా అధ్యక్షులు, పార్టీ క్యాడర్ మాత్రమే ఆందోళనలు చేసింది. ఇలా జరగడం మొదటిసారి కాదని, పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికైనా జిల్లా అధ్యక్షులకు ఎమ్మెల్యేల సహకారం లేదని లోలోపల కుమిలిపోతున్నారు బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు.

అధ్యక్షులుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కాక .. పార్టీలో గ్రూపులకు మరికొందరు ప్రయత్నిస్తుండడం కూడా అంతర్గతంగా చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో వీరి నియామకం పార్టీకి మేలా, నష్టమా అన్న చర్చ కూడా సర్వత్రా వెల్లువెత్తుతోంది. ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ జిల్లా కమిటీలను నియమించలేదు. కేవలం ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులే ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు.

పార్టీ కమిటీని పవర్ సెంటర్‌గా ఏర్పాటు చేయాలని భావించిన అధిష్టానం జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. త్వరలోనే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన, జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం, పార్టీ గ్రామ, మండల, పట్టణ, నియోజకవర్గాల కమిటీలకు శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి జిల్లా బాధ్యుడు లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని అధిష్ఠానం భావించింది.

దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికలు సైతం ఏడాదిన్నరలో వస్తుండటంతో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా కమిటీలకు అధ్యక్షుడి నియామకాలు చేపట్టారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించినా పార్టీ జిల్లా కార్యాలయాల బాధ్యతను వారే చూసుకోవాల్సి ఉంటుంది. పార్టీ అధ్యక్షుడే పవర్, అటెండర్లు, సమావేశాల నిర్వహణ ఖర్చు, టెలిఫోన్, రవాణా ఖర్చులు ఇలా అన్ని ఖర్చులను ఎన్నికల వరకు వారే చూసుకోవాల్సిందే.

దీంతో పదవుల్లో ఉన్నవారికే పార్టీ బాధ్యతలు అప్పగిస్తే నిర్వహణ పరంగానూ ఎలాంటి సమస్య రాదన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇన్ని సమాలోచనల తర్వాతే ఎక్కువ జిల్లాలకు ఎమ్మెల్యేలనే పార్టీ అధ్యక్షులుగా నిర్ణయించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అనుకున్నదొక్కటి .. అయినది మరొకటి అన్న చందంగా పరిస్థితులు ఉన్నాయి.

ఎక్కడైతే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాకుండా ఇతరులు జిల్లా అధ్యక్ష పీఠం పొందారో .. అక్కడ మాత్రం వర్గపోరు ఓ రేంజ్ లో సాగుతోంది. దీంతో వీరంతా పదవి పొందినా కంటినిండా కునుకు లేకుండా పోయిందని వాపోతున్నారు. ఈ అంశంపై వీరంతా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ విన్నపాలను వింటారా లేదా అనేది చూడాలి.

Must Read

spot_img