HomePoliticsజీఓ నెం.1 పై ఏపీ సర్కార్ కు హైకోర్టు షాకిచ్చిందా..?

జీఓ నెం.1 పై ఏపీ సర్కార్ కు హైకోర్టు షాకిచ్చిందా..?

  • ప్రజా హక్కులకు విరుద్ధంగా ఉందని జీఓను సస్పెండ్ చేసిందా..?
  • అసలు జీవో వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటి..?
  • దీనిపై విపక్షాలు చెబుతున్నదేమిటి..?

ఏపీ సర్కార్ ఇటీవల జారీ చేసిన జీవో నెం.1ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 23 వరకు జీవోను కోర్టు సస్పెండ్ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. జీవో నెంబర్ 1 నిబంధనలకు విరుద్దంగా ఉంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవోకు వ్యతిరేకంగా సిపిఐ కార్యదర్శి రామకృష్ణ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

కోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ కు షాక్ తగిలినట్లయింది. రాష్ట్రంలో జగన్ సర్కార్ జనవరి 2న తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై రగడ కొనసాగుతుంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ కారణంగా సర్కార్ రోడ్లపై రోడ్డు షోలు, సభలు, సమావేశాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే మేము రోడ్లపైకి రావొద్దని, ప్రజలను కలవొద్దనే ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిందని టీడీపీ, జనసేన ఆరోపించింది. ఈ క్రమంలో జీవోను వ్యతిరేకిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు జీవో నెం.1ను సస్పెండ్ చేసింది. రామకృష్ణ లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేయగా ఈ పిటీషన్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలనీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ పిల్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్షాలను ఆడుకోడానికి సర్కార్ ఈ జీవోను తీసుకొచ్చిందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇవన్నీ రాజకీయ పరమైన వాదనలే అని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. సభలు, సమావేశాలను నిషేధించలేదని, నిబంధనల మేర సమావేశాలు నిర్వహించుకోవాలని జీవోలో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏపీలోని రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1‌ను తీసుకొచ్చింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. జీవో నెంబర్ 1 నిబంధనలకు విరుద్దంగా ఉందని పేర్కొంది.

తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఇక, ఈ పిటిషన్‌పై విచారణ సందర్బంగా రామకృష్ణ తరఫున వాదనలు వినిపించిన లాయర్ అశ్వినీ కుమార్.. ప్రజల భావప్రకటన స్వేచ్చ, ప్రాథమిక హక్కులను కాలరాసేలా జీవో ఉందన్నారు.

జీవో నెంబర్ 1ను కొట్టి వేయాలని కోరారు. మరోవైపు హైకోర్టు వెకేషన్ బెంచిలో ఈ పిటిషన్ విచారణకు రావడంపై అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన అంశం రోస్టర్‍లో రావడానికి ఆస్కారం లేదని.. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాలకు సంబంధించిన కేసులను విచారించకూడదని వాదనలు వినిపించారు.

ఇక, ఇటీవల కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలతో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వంహెచ్చరించింది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్ల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. అయితే ప్రజల మేలు కోసమే తాము ఈ జీవో తీసుకోచ్చామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ జీవోపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం జీవో నెంబర్‌ 1ను కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే
తీసుకొచ్చిందని మండిపడుతున్నాయి. మరోవైపు ఏపీలో రోడ్లపై ర్యాలీలు, సభలను నిషేధిస్తూ జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిజంగా జగన్‌ తీసుకున్న ఈనిర్ణయం వారి రాకను అడ్డుకునేందుకేనా.. ఈ నిషేధం వెనక ఉన్న రాజకీయ కోణం ఇదేనా అన్న చర్చ మొదలైంది. ఎప్పుడూ లేనిది ఈసారి టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన ర్యాలీలు, సభలు ప్రాణాలు తీస్తున్నాయి. గతంలోనూ ఆయన ఎన్నోసార్లు ప్రజల మధ్యకు వచ్చారు. భారీ సభలు, సమావేశాలు పెట్టారు.

అయితే ఇంతకుముందు ఇలా జరగలేదు. ఈసారి మాత్రం ఊహించని విధంగా టిడిపి నిర్వహించిన సభలు, ర్యాలీలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయన్న అపవాదుని మోయాల్సి వచ్చింది. కందుకూరు, గుంటూరుల్లో జరిగిన తొక్కిసలాటతో 11మందికి పైగా చనిపోవడంతో రాజకీయ దుమారం మొదలైంది.

  • జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విపక్షాలు..!

జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని నేతలు ఆరోపించారు. అయితే ఈ వాదనను ప్రభుత్వం ఖండిస్తోంది. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. అంతేకాదు ప్రత్యేక కారణాలతో పోలీస్‌ శాఖ నుంచి అనుమతి తీసుకొని సభలు, ర్యాలీలు చేసుకోవచ్చని కూడా స్పష్టం చేస్తోంది.

అయితే విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వ నిర్ణయం వెనక రాజకీయ కుట్ర ఉందా అన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. త్వరలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీన్ని అడ్డుకోవడానికే జగన్‌ సర్కార్‌ ఈనిర్ణయం తీసుకుందని టిడిపి శ్రేణులు, ఆపార్టీ సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా వారాహి వాహనంలో యాత్రకి సిద్ధమవుతున్నారు.

ముందస్తు ఎన్నికలన్న వార్తల నేపథ్యంలో విపక్షాలు యాక్టివ్‌ అయ్యాయి. ప్రజాసమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు టిడిపి పాదయాత్రలు, జనసేన రథయాత్రలతో ప్రజల్లో ఉండేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం అత్యవసరంగా ఈ జోవోని తీసుకువచ్చిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇంతకుముందు ప్రజాసమస్యలపై గళమెత్తితే దాడులు చేయడం, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిందని ఇప్పుడు ప్రజల మధ్యన ఉండేందుకు ప్రయత్నిస్తుంటే ర్యాలీలు, సభలపై నిషేధం విధించి ప్రతిపక్షాల ఊసు లేకుండా చేయాలన్న కక్షతో జగన్‌ ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇంకా ఎన్నికలకు దాదాపు రెండేళ్ల టైమ్‌ ఉంది. అయితే ప్రతిపక్షాలన్నీ ముందస్తుగానే ఎన్నికల ప్రచారంలోకి దిగడంతో ఏ జిల్లా చూసినా..ఏ సెంటర్‌ చూసినా పార్టీల సభలు, ర్యాలీలు సమావేశాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ప్రజలతోపాటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం మంచిదేనన్న టాక్‌ వైసీపీ సానుభూతిపరులది.

అయితే హైకోర్టు మాత్రం ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. దీంతో జీఓ సస్పెన్షన్ పై అధికార పక్షం ఏం చేయనుందన్నదే ఆసక్తికరంగా మారింది. మరోవైపు యువగళం, వారాహి యాత్రలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లేనని టాక్ వినిపిస్తోంది. అయితే 20న మళ్లీ విచారణ ఉండడంతో, హైకోర్టుకు ఏపీ సర్కార్ ఏవిధంగా కౌంటర్ దాఖలు చేస్తుందన్నదే చర్చనీయాంశమవుతోంది.

మరి దీనిపై వైసీపీ సర్కార్ నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img