HomePoliticsరాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అ సంతృప్తి జ్వాలలు జిల్లాలకు పాకిందా..

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అ సంతృప్తి జ్వాలలు జిల్లాలకు పాకిందా..

పాలమూరులో కీలక నేతగా ఉన్న చల్లా బిఆర్ఎస్ పార్టీలో చేరడంతో వనపర్తి లో మరోసారి రాజకీయం చిత్రం మారనుందన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లుగా తనకు పదవి వద్దన్న చిన్నారెడ్డి …మరోసారి పదవికి ఆశపడుతున్నారన్న వార్తలతో అసలు వనపర్తి కాంగ్రెస్ లో ఏం జరుగుతోందన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ఇటీవల రాష్ట్ర కమిటి, జిల్లా కమిటీలను ప్రకటించిన వెంటనే సీనియర్లలో అసంతృప్తి మంట రాజుకుంది. ఈ అగ్గి చివరకు కేంద్ర అధినాయకత్వం వరకు వెళ్ళింది. అసంతృప్తి జ్వాలలు క్రమేణా తారా స్థాయికి చేరాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసంతృప్తి రాగాలు మరోసారి వెలుగుచూడనున్నాయా..

ఓ వైపు రాష్ట్ర సీనియర్ నేతలు సైతం అలకపూని అసంతృప్త వర్గంగా ఏర్పడగా… అదే తరహాలో జిల్లాల్లోని కాంగ్రెస సీనియర్ నేతలపై కిందిస్థాయి నేతలు తిరుగుబాటు జండా ఎగరవేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా వనపర్తి జిల్లాలో వెలుగు చూసిన సంఘటనలేనని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.


వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డికి వ్యతిరేకంగా ఓ వర్గం .. చిన్నారెడ్డి హటావో, వనపర్తి కాంగ్రెస్ బచావో… అనే నినాదంతో చిన్నారెడ్డిపై పోరు బావుటాను ఎగరవేశారు అసంతృప్త కాంగ్రెస్ నేతలు.

రానున్న ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇష్టం లేదట. మామూలు సమయంలో చిన్నారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను అంతగా పట్టించుకోరని, ప్రతిసారి ఎన్నికల్లో ఇదే నా చివరి ఎన్నకలని చెప్పి మళ్ళి ఎన్నికల సమయంలో బరిలో ఉంటూ వస్తున్నారని, దాని వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్సీ నియర్ నేతలు ఆరోపిస్తున్నారు.

అంతే కాకుండా బలమైన నాయకుడైన, అధికార పార్టీ నేత మంత్రి నిరంజన్ రెడ్డిని ఢీకొట్టే సత్తా చిన్నారెడ్డికి లేదన్న భావనతో ఉన్న వనపర్తి జిల్లా కాంగ్రెస్ క్యాడర్, కొత్తవారి రాకకోసం ఎదురుచూస్తుందట. ఐతే కొత్తవారి రాకను అడ్డుకుంటూ, పార్టీని బలహీన పరుస్తున్నాడని చిన్నారెడ్డి వ్యతిరేక వర్గం ఆరోపిస్తుంది.

అంతే కాకుండా వనపర్తి జిల్లా అద్యక్షుడి పదవిని తనకు అనుకూలమైన వ్యక్తికే కట్టబెట్టారని గుర్రుగా ఉన్న నేతలు, చిన్నారెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపించాలని, లేదా తామే పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో స్థానికంగా పార్టీ కేడర్ లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది.

సీనియర్లను హటావో కాంగ్రెస్ బచావో నినాదం ప్రతి జిల్లాకు పాకనుందా… ఈ కోవలోనే మాజీ మంత్రికి అసమ్మతి సెగ తగిలిందా…

అంతేగాక అల్లంపూర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటరామిరెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి తాను బరిలో ఉండనని చెప్పుకుంటూ వచ్చిన చిన్నారెడ్డి చెల్లా టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో మరోసారి తనకే అవకాశం ఉంటుందని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతోనే పార్టీలో అసమ్మతి రాగం మొదలైందని ప్రచారం కొనసాగుతోంది.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల అసంతృప్తి సెగలు మొదలవగానే, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేకెత్తాయి. మాజీ మంత్రి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి కి వ్యతిరేకంగా ఓ వర్గం సిద్ధమైందని టాక్ ఇప్పుడు సెగ్మెంట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్ళు లోలోపలే ఉన్న ఈ వర్గపోరు కాస్తా… బయటకి పొక్కడం, ఏకంగా సీనియర్ నాయకుడుపై పోరాటానికి సిద్దమవడంతో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు అయోమయానికి లోనవుతున్నారు.

వనపర్తి జిల్లాకు చెందిన దాదాపు వందమంది కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా షాద్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో సమావేశమై
చిన్నారెడ్డీపై సమరం ప్రకటించారు. వనపర్తి జిల్లాలోని అసంతృప్త కాంగ్రెస్ నేతలంతా మాజీ మంత్రి చిన్నారెడ్డిని పార్టీ నుంచి తప్పించాలని ఒక్కతాటిపైకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం జిల్లాలో చర్చకు దారితీసింది. ఈ సమావేశానికి అసంతృప్తి వర్గ నేతలు షాద్ నగర్ లో సమావేశమై, చిన్నారెడ్డిని పార్టీలో నుంచి బయటకు పంపాలని ఒక్కతాటిపైకి వచ్చి ప్రమాణం చేశారని సమాచారం.

రేవంత్ రెడ్డీ సన్నిహితుడైన చిన్నారెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు కిందిస్థాయి కార్యకర్తలు సమరభేరి మ్రోగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి వనపర్తి లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరో తలనెప్పిగా మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో దీనిపై అధిష్టానం ఏం చేయనుందన్న ఆసక్తి సెగ్మెంట్ వ్యాప్తంగా వెల్లువెత్తుతోంది.

ఇక వనపర్తిలో డీసీసీలకు కొత్త అధ్యక్షుల ఎంపిక విషయంలో తలెత్తిన విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లంతా మాజీ మంత్రి చిన్నారెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఆయన ఒంటెత్తు పోకడలు పార్టీకి నష్టం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న వారికే మళ్లీ పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు.మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాము పనిచేయమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వద్ద ఇటీవలమొర పెట్టుకున్నారు.

వనపర్తి నియోజక వర్గం మొదటి నుంచీ కాంగ్రెస్ కు కంచుకోట.

ఇక్కడి నుంచి చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఆయన మంత్రి పదవి కూడా నిర్వహించారు. మొదటి నుంచి చిన్నారెడ్డి పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారంటూ ఆయన పట్ల నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది.

తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిన సమయంలోనూ 2014 లో ఇక్కడి కార్యకర్తలు ప్రజలు చిన్నారెడ్డి నే ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. దీనిని
అలుసుగా భావిస్తూ వచ్చిన ఆయన 2018 లో జరిగిన ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకుల ఆగ్రహానికి గురై టీఆర్ఎస్ చేతిలో ఘోర పరాభవం చవిచూశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి చేతిలో 50వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆ తర్వాత ఇక రాజకీయాల్లో తాను ఉండలేనని, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేనని అసహనం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో పార్టీ లోని సీనియర్లు తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ పార్టీ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. లేని పక్షంలో చిన్నారెడ్డిని తప్పించి నియోజకవర్గంలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది కాలంగా మాజీ మంత్రి చిన్నారెడ్డికి సీనియర్ కార్యకర్తల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.

వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎన్నికల్లో కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా చిన్నారెడ్డి వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లా కేంద్రానికి చెందినవారికి కాకుండా బీసీసెల్ రాష్ట్ర కమిటీలో ఉన్న రాజేంద్రప్రసాద్ ను నియమించి పార్టీ నిబంధనలను ఆయన ఉల్లంఘించారని మాజీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్ తో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు కు చెందిన సీనియర్ నాయకులు అక్కి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్లంతా ఇతర పార్టీలోకి వెళ్లినా చిన్నారెడ్డి తీరు మారడం లేదని విమర్శిస్తున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బి లక్ష్మయ్య, వైస్ చైర్మన్లోక్ నాథ్ రెడ్డి మరో పార్టీలో చేరారు. వీరంతా చిన్నారెడ్డి వేధింపులు తాళలేకే పార్టీ వీడి మరో పార్టీలో చేరి జిల్లాస్థాయి పదవులను పొందారని
గుర్తుచేస్తున్నారు. ఇటీవల కార్యకర్తల సమావేశంలోనూ తనకు సీనియర్లతో పనేం లేదని అనడంపై కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వనపర్తిలో
గ్రూప్ తగాదాలు రోడ్డుకెక్కి, సర్వత్రా చర్చనీయంశంగా మారాయి.

మరి భవిష్యత్తులో వనపర్తి కాంగ్రెస్ పార్టీలో ఏం జరగనుందో వేచి చూద్దాం…

Must Read

spot_img