ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్ లోని ‘ఛాంగి’ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. కరోనా ప్రభావం కారణంగా రెండేళ్ల తర్వాత ఖతార్ ను వెనక్కి నెట్టి మళ్లీ తన స్థానాన్ని తిరిగి సాధించుకుంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ విదేశీ విమానాల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధించింది. అయితే పరిస్తితులు చక్కబడటంతో రెండేళ్ల క్రితం చేజారిన తన స్థానాన్ని సింగపూర్ చేజిక్కించుకుంది..
విమాన ప్రయాణం చేసిన తర్వాత ప్రయాణికులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా స్కైట్రాక్స్ అనే సంస్థ ప్రతి ఏటా ఉత్తమ విమానాశ్రయాల గురించిన సర్వే నిర్వహిస్తోంది. ఈసారి జరిగిన ఎంపికలో మొదటి స్థానం సింగపూర్ దేశానికి దక్కింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ఇరవై ఉత్తమ విమానాశ్రయాలను ఎంపిక చేసింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ పేరిట ఉత్తమ ఎయిర్ పోర్టులను యధారీతిన సత్కరిస్తోంది. అయితే, ఉత్తమ ఎయిర్‌పోర్టులుగా నిలిచిన వాటిలో తొలి 10 స్థానాల్లో అమెరికాకు చెందిన ఒక్క విమానాశ్రయం కూడా లేకపోవడం గమనించాల్సిన విషయంగా చెబుతున్నారు నిపుణులు.
అయితే ప్రపంచవ్యాప్తంగా అందరూ వెళ్లాలనుకునే ఎయిర్ వేస్ గురించి చూస్తే.. అది ‘ఖతార్ ఎయిర్ వేస్’ అని తేలింది. ఈ చిన్ని గల్ఫ్ దేశం ఎయిర్ వేస్ లో ప్రయాణం చాలా లగ్జరీ అని పేరుంది. అయితే అందులో ఒక్కసారైనా ప్రయాణించాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఇందులో ప్రయాణించాలంటే అంత ఆశామాషీ కాదు.. లక్షలు వెచ్చించి మరీ ఈ ఖరీదైన విమానాల్లో వెళుతుంటారు.ఇక బడాబాబులంతా ఈ విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తారు. ఇక ఖతార్ ఎయిర్ వేస్ మాత్రమే కాదు..ఇన్నాళ్లు ఖతార్ ఎయిర్ పోర్ట్ కూడా ప్రపంచంలోనే లగ్జరీ తో అత్యుత్తమ ఎయిర్ వేస్ గా ఉండేది.
కానీ ఇప్పుడు దాని స్థానం గల్లంతైంది. కొత్తగా మరోసారి ఎంట్రీ ఇచ్చిన సింగపూర్ చాంగీ విమానాశ్రయం ఖతార్ ను దాటేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్ లోని ‘ఛాంగి’ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. రెండేళ్ల తర్వాత ఖతార్ ను వెనక్కి నెట్టి మళ్లీ తన స్థానాన్ని తిరిగి సాధించుకుంది. నిజానికి కోవిడ్19 కారణంగా తలెత్తిన పరిస్థితులే అందుకు కారణం అని తేలింది.
కరోనా మహమ్మారి కారణంగా సింగపూర్ విదేశీ విమానాల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో రెండేళ్ల క్రితం సింగపూర్ స్థానాన్ని ఖతార్ చేజిక్కించుకుంది.అయితే కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో రాకపోకలపై సింగపూర్ ఆంక్షలు ఎత్తివేసింది. దీంతో సింగపూర్ లోని చాంగి విమానాశ్రయం స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2023లో మరోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా కిరీటాన్ని పొందింది. కాగా దోహాలోని హమద్ విమానాశ్రయం రెండో స్థానంలో నిలవగా టోక్యోలోని హనేడా విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది.
ముఖ్యంగా ఈసారి ఏ అమెరికా విమానాశ్రయానికీ టాప్ 10లో చోటు దక్కలేదు. పారిస్ లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం యూరోప్ లోని అత్యుత్తమ విమానాశ్రయంగా జాబితాలో చోటు దక్కించుకుంది. ఈసారి ఒక స్థానం ఎగబాకి ఐదవ స్థానానికి చేరుకుంది. అమెరికా విషయానికి వస్తే సీటెల్-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం అత్యున్నత స్థానంలో ఉంది. అది ఇప్పుడు 27వ స్థానం నుండి 18వ స్థానానికి చేరుకుని మెరుగుపడిందని సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇతర ముఖ్యమైన విమానాశ్రయాలను చూస్తే న్యూయార్క్ జేఎఫ్.కే మూడు స్థానాలు పడిపోయి 88వ స్థానానికి చేరుకుంది.
చైనాకు చెందిన షెన్జెన్ 31వ స్థానంలో సర్దుకుంది. మెల్బోర్న్ ఆస్ట్రేలియన్ విమానాశ్రయం 19వ స్థానంలో ఉండగా లండన్ లోని బిజీ బిజీ హీత్రూ విమానాశ్రయం తొమ్మిది స్థానాలు దిగజారి 22వ స్థానానికి పడిపోయింది. ఇందుకు యూకేలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభమే కారణమని అంటున్నారు. నిజానికి స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ పోర్టుల అవార్డులు కస్టమర్ల సంతృప్తి ఆధారంగానే ఇస్తారు.
చాంగి ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1గా నిలిచింది. సింగపూర్ ఎయిర్ పోర్టు ఈ ఘనత సాధించినందుకు ఆ ఎయిర్ పోర్ట్ సీఈవో లీ సియో హియాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రపంచంలోని టాప్ 10 విమానాశ్రయాల వివరాలను చూస్తే.. సింగపూరుకు చెందిన ఛాంగి నెంబర్ వన్ కాగా వరుసగా, ఖతారు దోహా లోని హమద్ ఎయిర్ పోర్టు.. టోక్యోజపాన్ లోని హనీదా ఎయిర్ పోర్టు, దక్షిణ కొరియాకు చెందిన సియోల్ ఇన్చెయాన్ ఎయిర్ పోర్ట్, ప్రాన్స్ లోని పారిస్ కు చెందిన చార్లెస్ డిగాల్ ఎయిర్ పోర్టు, టర్కీలోని ఇస్తాంబుల్, జర్మనీ దేశానికి చెందిన మ్యూనిచ్ ఎయిర్ పోర్టు, స్విట్జర్లాండుకు చెందిన జ్యూరిచ్ ఎయిర్ పోర్టు, టోక్యో లోని నరీతా ఎయిర్ పోర్టు, స్పెయిన్ లోని మాడ్రిడ్ నగరపు బరాజస్ ఎయిర్ పోర్టులు వరుసగా పది స్థానాలలో సర్దుకున్నాయి.