ఏకంగా సీపీఎం కార్యాలయానికే వెళ్లి, అక్కడి నేతలపై రుబాబు చేయడం చర్చనీయాంశమవుతోందా..? ఇంతకీ షర్మిల వ్యాఖ్యలపై విమర్శలు ఎదురవుతున్నాయా..?
మొన్నామధ్యనే రాజకీయ పార్టీ పెట్టుకుని.. నాయకురాలి అవతారం ఎత్తిన వైఎస్ షర్మిల రాజకీయంగా పరిపక్వత సాధించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తున్నది. మీడియా సమావేశాల్లోనో లేదా బహిరంగ సభలోనో చేసినట్టు ఎక్కడైనా విమర్శలు చేసేయవచ్చన్నట్టు షర్మిల వ్యవహరిస్తున్న తీరు.. పిల్లలాటలా కనిపిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తానేమి చేసినా ఎవరూ పట్టించుకోవకపోవడంతో షర్మిల రాజకీయంగా ఏకాకి అయ్యారు. దీంతో ప్రతిపక్షాలను కలుపుకొని సంయుక్త కార్యాచరణకు దిగేందుకు షర్మిల సమాయాత్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి.. నిరుద్యోగ సమస్యపై తన ప్రతిపాదన తెలిపారు.
సంయుక్తంగా ప్రగతి భవన్ మార్చ్‌కు పిలునిద్దామని కూడా చెప్పారు. బండి ఓకే అన్నారు. రేవంత్‌రెడ్డి పార్టీలో మాట్లాడి చెబుతామన్నారు. ఇదిలా
ఉంటే.. వామపక్ష నాయకులను కూడా కలవాలనుకున్న షర్మిల.. సీపీఎం నేతలకు ఫోన్ చేసి.. ఆఫీసుకు వస్తానని అడిగారు. వారు రమ్మనడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి షర్మిల చేరుకున్నారు. పలకరింపులు, ఫొటోలు ముగిసిన తర్వాత సంయుక్త కార్యాచరణపై లేఖను తమ్మినేనికి అందించారు. కానీ.. సీపీఎం కార్యాలయానికి వెళ్లిన షర్మిల.. తాము బీజేపీకి బీ టీమ్‌లా వ్యవహరించడం లేదని చెబుతూ.. వామపక్షాలే బీఆర్‌ఎస్‌కు బీ టీమ్‌లా మారాయని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టులు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వంపై పోరాటంలో కలిసి రావాలని తనను ఎప్పుడైనా కోరారా? కనీసం ఫోన్ చేసి పిలిచారా? అని తమ్మినేని అక్కడే నిలదీశారు. అయినా తాను సీపీఎం కార్యాలయానికి వచ్చి లేఖ ఇచ్చానని చెప్పారు. బీజేపీని నిలదీసిన ఏకైక పార్టీ తమదేనని చెప్పారు. లెటర్ ఇచ్చేందుకు ఆఫీసుకు వస్తామని అడిగి, వచ్చిన తర్వాత విమర్శలకు దిగిన షర్మిల తీరుపై సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమెకు తాము ఇచ్చిన మర్యాదను షర్మిల నిలుపుకోలేదని మెత్తగానే చురకలంటించారు. తమ కార్యాలయానికి వచ్చి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. రాజకీయ వైఖరులు ఉంటాయని, తమ వైఖరి తమకు ఉన్నదని చెప్పారు.
మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. తాము అది చాటుగా చేయలేదని బాహాటంగానే చేశామని స్పష్టం చేశారు. తమ ఆఫీసుకు వచ్చి తాము ఎవరికో బీటీమ్‌గా ఉన్నామని విమర్శించేందుకు సాహసం చేయడం మంచిది కాదని హితవు పలికారు. తమ ఆఫీసుకు వచ్చి షర్మిల మాట్లాడినట్టు తాను మాట్లాడలేనని, తనకు విజ్ఞత ఉన్నదని చెప్పారు. షర్మిల నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి చేసిన ప్రతిపాదన మంచిదేనన్న తమ్మినేని.. ఇటీవలి తమ జన చైతన్య యాత్రల్లో పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని పార్టీలు కలిసి చేయాలనే ప్రతిపాదన బాగానే ఉంది కానీ.. అందులో బీజేపీని కలుపుకొని చేయడం సరికాదన్నారు. బీజేపీ ఇంతకంటే పాపిష్టిపార్టీ అని అన్నారు.
ముందుగా నిర్ణయాలు తీసుకుని, మద్దతు కోరడం సరికాదన్నారు. ఒక కార్యాచరణపై ప్రతిపాదన వచ్చినప్పడు అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తమపై చేసిన వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో ఈ అంశంపై చర్చించిన సమయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బీజేపీకి బీ టీం అని విమర్శించారు. ఈ విమర్శలపై షర్మిల మండిపడ్డారు. తాము
బీజేపీని మత తత్వ పార్టీ అని విమర్శిస్తున్నామని తాము ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులే బీఆర్ఎస్ బీ టీంగా మారారారని విమర్సించారు. నిజానికి షర్మిల వచ్చి కలవక ముందే తమ్మినేని వీరభద్రం షర్మిల తీరుపై విమర్శలు గుప్పించారు.
నిరుద్యోగుల భవిష్యత్తు కోసం కలిసి పని చేద్దామని షర్మిల తనకు కూడా ఫోన్చే సిందని.. అది వాస్తవమేనని అన్నారు. ఆమెతో కలిసి పని చేయడానికి తాము కూడా సిద్ధమే అని చెప్పుకొచ్చారు. కానీ షర్మిలకు ఆదాని, మోడీల దోపిడీ ఎందుకు గుర్తుకు రావడం లేదని తమ్మినేని మండిపడ్డారు. మైనారిటీల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. కానీ, వీటి మీద ఆమెకు నోట మాటరావడం లేదు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిల ఇలాంటి రాజకీయ నాటకాలను మానుకోవాలని హితవు పలికారు. ఉద్యమాల్లో కలిసి రమ్మని ఎన్నోసార్లు మేము పిలిచాం.. కానీ ఆమె ఒక్క రోజు కూడా రాలేదు. ఇప్పుడు కలిసి పని చేద్దాం అంటూ ఫోన్ చేశారంటూ మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల .. పేపర్ లీకేజీలపై అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేయాలని అనుకుంటున్నారు.
బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేశారు. ఇతర పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీల మధ్య ఐక్యత తీసుకొచ్చేందుకు షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఆదిలోనే బెడిసి కొట్టేలా కనిపించాయి. తెలంగాణలో వామపక్షాలు అధికార బిఆర్‌ఎస్ పార్టీకి బి టీమ్‌ల వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు కలకలం రేపాయి. సిపిఎం కార్యాలయంలో నిరుద్యోగ సమస్యపై పోరాడేందుకు కలిసి రావాలని ఆహ్వానించేందుకు వెళ్లిన షర్మిల కమ్యూనిస్టులపై విమర్శలు గుప్పించారు. దీంతో మండిపడ్డ తమ్మినేని .. దేశాన్ని దెబ్బతీసే ఘటనలపై షర్మిలకు చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు. హింసాత్మకమైన రాజకీయాలపై మౌనంగా ఉండి, ఆమెకు నచ్చిన వాటిపై పోరాటాలు చేయడానికి కలిసి రావాలంటే ఎలా అని ప్రశ్నించారు. తమ ఆఫీసుకు వచ్చి తమను విమర్శించడాన్ని సిపిఎం కార్యదర్శి తమ్మినేని తప్పు పట్టారు. ప్రతిపక్షాల మద్దతు అంటూ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తొక్కని గడప లేదు.. సంప్రదించని నేత లేరు.
అయితే అంతటితో సామరస్యంగా మాట్లాడుకుంటే అయిపోయేదానికి సీపీఎం ఆఫీసుకెళ్లి మరీ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంనే తిట్టిపోసింది. ఇలా ఎవరైనా చేస్తారా? కేవలం షర్మిలకు మాత్రమే ఆ ఘనత దక్కుతుందని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. షర్మిల రాజకీయాల్లో దూకుడుగా ఉండడంలో తప్పులేదు. కేసీఆర్ ను గద్దెదించాలన్న ఆమె ప్రయత్నంలోనూ తప్పు లేదు. కానీ ప్రతిపక్ష నేతలకు తమ సిద్ధాంతాలు ఉంటాయని.. వారి వ్యూహం ప్రకారం వారు వెళతారన్న కనీస సృహను షర్మిల తెలుసుకోవాలి. అవేవీ ఆలోచించకుండా తనతో కలిసిరావడం లేదని సీపీఎం నేత తమ్మినేనిని ఆయన ఆఫీసులోనే తిట్టడం ఎంత వరకూ కరెక్ట్ అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అఫ్ కోర్స్ షర్మిల ముందే తమ్మినేని కూడా ఇలానే ప్రశ్నించి చురకలు వేశారు. రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న మర్యాదతో షర్మిలను కలుస్తామనగానే అంగీకరించామని.. అయితే ఇచ్చిన మర్యాదను షర్మిల నిలబెట్టుకోలేదని.. అన్నారు. షర్మిల ఏకంగా సీపీఎం పార్టీ ఆఫీసుకు వెళ్లి మరీ ఆ పార్టీ నేత తమ్మినేనిపై మాటల దాడి చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇలాంటి ధోరణి సరికాదంటూ చాలామంది హితవు పలుకుతున్నారు.
షర్మిల నెక్ట్స్ ఏం చేయనుందన్నదే హాట్ టాపిక్‌గా మారింది.