Homeఅంతర్జాతీయంఇస్రో స్పేస్ టూరిజంపైనా దృష్టి పెట్టిందా..?

ఇస్రో స్పేస్ టూరిజంపైనా దృష్టి పెట్టిందా..?

  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అడుగులు..పర్యాటకం దిశగా పడుతున్నాయా..?
  • ఇప్పటివరకు ప్రయోగాలకే పరిమితమైన ఇస్రో..ఇక స్పేస్ టూరిజంపైనా దృష్టి పెట్టిందా..?
  • అసలేమిటీ స్పేస్ టూరిజం..దీనిపై కుబేరులు ఎందుకు దృష్టి సారిస్తున్నారు..?
  • అసలు..స్పేస్ టూరిజం వల్ల..ఒనగూరే ఫలితాలేమిటన్నవే..సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
  • వీకెండ్ టూర్లుగా ..ఇక స్పేస్ టూర్లు రానున్నాయా..?
  • అయితే..ఇవి..అందరికీ చేరువ కావాలంటే మాత్రం..కొన్నేళ్లు ఆగక తప్పదంటోంది..ఇస్రో..అంతరిక్ష పర్యటనలకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్న వేళ .. భారత్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాయా..?
  • ఇంతకీ స్పేస్ టూర్లు..ఏ ఏ సంస్థలు చేపడుతున్నాయి..దీనిపై ఇస్రో..ఏవిధంగా ప్రయత్నిస్తోందన్నదే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో రికార్డును సృష్టించడానికి సన్నద్ధమౌతోంది. కమర్షియల్ బాట పట్టిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో మరో ముందడుగు వేయనుంది. ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది ఇస్రో. అవన్నీ వన్ వెబ్ ఇంటర్నెట్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు. బ్రాడ్ బ్యాండ్ సేవలను మరింత మెరుగుపర్చడానికి జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్‌ వర్క్‌ శాటిలైట్లను ప్రయోగించడానికి ఇస్రో సహకారాన్ని తీసుకోనుంది వన్ వెబ్ ఇంటర్నెట్. ఇది- బ్రిటన్ కు చెందిన కంపెనీ. ఇదివరకు కూడా ఇదే కంపెనీకి చెందిన శాటిలైట్లను ప్రయోగించింది ఇస్రో.

లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా వాటన్నింటినీ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. ఈ శాటిలైట్లను ప్రయోగించడానికి లాంచ్ వెహికల్ మార్క్-3ని ఉపయోగించనుంది ఇస్రో. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆయా ఉపగ్రహాలను ప్రయోగించనుంది ఇస్రో. ఈ ప్రయోగం ఎప్పుడు ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ నెలాఖరులో ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. నిజానికి- ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో రష్యా సహాయాన్ని కోరింది వన్ వెబ్ సంస్థ. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో- అంతరిక్ష కార్యకలాపాలు, సోయుజ్ రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసింది.

దీనితో ఇస్రో సహకారాన్ని తీసుకుంటోంది. గ్లోబల్ బ్రాడ్‌ బ్యాండ్ కవరేజీని మరింత మెరుగుపర్చడానికి 588 ఉపగ్రహాల ప్రారంభించాలంటూ వన్ వెబ్ సంస్థ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. ఉక్రెయిన్ తో సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా తన అంతరిక్ష ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల కొంత మేర జాప్యం ఏర్పడింది.

దీంతో వన్ వెబ్ కంపెనీ- ఇస్రోతో పాటు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇప్పుడంతా అంతరిక్ష పర్యాటకానిదే హవా. నాసా, స్పేస్‌ ఎక్స్‌, అమెజాన్‌ సహా పలు సంస్థలు రోదసిలోకి ఔత్సాహికులను పంపుతుండగా, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. 2030 నాటికి స్పేస్‌ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకొంటోందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. ఇందుకు ఒక్కో పర్యాటకుడి నుంచి ఇస్రో రూ.6 కోట్లు వసూలు చేయనుంది.

ఇదిలా ఉంటే, అంతరిక్ష పర్యాటకానికి సంబంధించి జరుగుతున్న పరిశోధనల్లో కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. అంతరిక్షాన్ని టూరిజం స్పాట్‌గా
మార్చేయాలన్నది స్పేస్‌ ఎక్స్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతరిక్షంలోకి స్పేస్‌ క్రాఫ్ట్‌లు వెళ్ళడం, తిరిగి అవి భూమ్మీదకు క్షేమంగా రావడం, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరగడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే. పూర్తి ప్రమాద రహితంగా రూపొందించబడిన క్యాప్స్యూల్స్‌ ద్వారా ఇకపై ప్రైవేటు అంతరిక్ష యాత్రలు జరిగేందుకు ప్రయోగాలు సాగుతున్నాయి. అయితే స్పేస్ టూర్ లో భాగంగా ఇలా వెళ్లి అలా తిరిగొస్తున్నారు.

కానీ ఈ గ్యాప్‌లో కోట్ల రూపాయలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా బ్లూ ఆరిజన్ స్పేస్‌ ఫ్లైట్ ఎగరడానికి నిమిషానికి ఎన్ని కోట్లు ఖర్చయ్యాయో తెలుసా..? జస్ట్ 60 సెకన్లకి 4,100 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 11 నిమిషాలకు 4,5100 కోట్లు ఖర్చయ్యాయి. అంటే మన రాష్ట్ర బడ్జెట్‌లో సగం ఖర్చన్నమాట. అమెరికాలో అక్కడి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ముగ్గురు వ్యాపార వేత్తలు స్పేస్ టూరిజాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. కానీ మన దేశంలో అది సాధ్యమేనా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

  • స్పేస్ టూరిజం అత్యంత వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలు..

అమెరికా కుబేరుల మ‌ధ్య ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన స్పేస్ వార్ న‌డుస్తోంది. అంత‌రిక్షంలో అడుగుపెట్ట‌డానికి వ‌ర్జిన్ గెలాక్టిక్ ఓన‌ర్ రిచర్డ్ బ్రాన్స‌న్‌, అమెజాన్ ఫౌండ‌ర్ జెఫ్ బెజోస్ పోటీ ప‌డుతున్నారు. అటు స్పేస్ఎక్స్ సీఈవో ఎలోన్ మ‌స్క్ అయితే ఇప్ప‌టికే నాసా ఆస్ట్రోనాట్ల‌ను స్పేస్‌స్టేష‌న్‌కు పంపించారు. భూమిపై వివిధ రంగాల్లో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌పంచ కుబేరులుగా ఎదిగిన వీళ్లు.. ఇప్పుడు స్పేస్ టూరిజంతో అంత‌రిక్షంలో నువ్వా నేనా అంటూ పోటీకి సిద్ధ‌మ‌య్యారు. బెజోస్‌, బ్రాన్స‌న్‌..ఇద్ద‌రూ ఇప్ప‌టికే త‌మ సంప‌ద‌లో పెద్ద మొత్తాన్ని త‌మ ప్రైవేట్ స్పేస్ కంపెనీల‌పై ఖ‌ర్చు చేశారు.

ఐదేళ్ల వ‌య‌సు నుంచే స్పేస్‌లోకి వెళ్లాల‌ని తాను క‌లలు కంటున్న‌ట్లు బెజోస్ చాలాసార్లు చెప్పారు. ఆ ల‌క్ష్యంతోనే 2000లో బ్లూ ఆరిజిన్ సంస్థ‌ను ప్రారంభించారు. అంతేకాదు ప్ర‌తి ఏటా 100 కోట్ల డాల‌ర్ల విలువైన అమెజాన్ స్టాక్‌ను అమ్మి ఈ బ్లూ ఆరిజిన్‌లో పెట్టుబ‌డి పెడుతున్న‌ట్లు 2017లో బెజోస్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు బ్రాన్స‌న్ కూడా త‌న స్పేస్ కంపెనీ వ‌ర్జిన్ గెలాక్టిక్‌ను 2004లోనే ప్రారంభించారు. ప్ర‌యాణికుల‌ను స్పేస్‌లోకి తీసుకెళ్ల‌డానికి అప్పుడే ప్లాన్ చేశారు. అంతేకాదు టికెట్ ధ‌ర‌ను 2 ల‌క్ష‌ల డాల‌ర్లుగా నిర్ణ‌యించి..ఇప్ప‌టికే వాటిని విక్ర‌యించడం విశేషం.

అంతరిక్ష పర్యాటకం అందరిలోనూ ఆసక్తి రేపుతున్నప్పటికీ, రానున్న కొన్నేండ్లపాటు కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. నాసా, ఇస్రో వంటి ప్రభుత్వ పరిశోధన సంస్థలే కార్యకలాపాలు నిర్వహించే అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీలు అడుగిడటమే కాదు, పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. అంతరిక్ష రంగంపై ఇటీవల కాలంలో పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి.

అంత‌రిక్షంలోకి వెళ్లాల‌న్న త‌న క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి అమెజాన్ ఫౌండ‌ర్ జెఫ్ బెజోస్‌.. త‌న బ్లూ ఆరిజిన్ సంస్థ‌కు భారీగా నిధుల‌ను మ‌ళ్లిస్తున్న‌ట్లే బ్రాన్స‌న్ కూడా వ‌ర్జిన్ గెలాక్టిక్‌లో భారీ పెట్టుబ‌డులు పెట్టారు. 2009లోనే ఇందులో 10 కోట్ల డాల‌ర్ల‌ను ఇన్వెస్ట్ చేసిన బ్రాన్స‌న్‌.. త‌ర్వాత బ‌య‌టి ఇన్వెస్ట‌ర్ల‌ను తీసుకొచ్చారు. త‌న‌తోపాటు బెజోస్ కూడా భూమిపై మ‌నుషుల మ‌నుగ‌డ‌కు ఉప‌యోగ‌ప‌డేలా స్పేస్ టెక్నాల‌జీని అభివృద్ధి చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు బ్రాన్స‌న్ చెప్పారు. స్పేస్ టెక్నాల‌జీల‌ని అభివృద్ధి చేయ‌డం ఈ భూమికి, భ‌విష్య‌త్తు త‌రాల‌కు చాలా ముఖ్య‌మ‌ని బెజోస్ అన్నారు.

మ‌రోవైపు స్పేస్ఎక్స్ మాత్రం ఇప్ప‌టికే ఆస్ట్రోనాట్ల‌ను భూక‌క్ష్య‌లోకే తీసుకెళ్లి, తిరిగి భూమిపైకి తీసుకొచ్చింది. ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్‌కు కూడా నాసా ఆస్ట్రోనాట్ల‌ను తీసుకెళ్లింది. వ‌ర్జిన్ గెలాక్టిక్ ఇప్ప‌టికే మూడుసార్లు విజ‌య‌వంతంగా స్పేస్ ఫ్లైట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. దీంతో వాణిజ్య స్పేస్ ఫ్లైట్స్‌ను న‌డ‌ప‌డానికి వ‌ర్జిన్ గెలాక్టిక్‌కు ఇప్ప‌టికే ఫెడ‌ర‌ల్ ఏవియేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ నుంచి అనుమ‌తి ల‌భించింది. అంతర్జాతీయ కుబేరులైన జెఫ్ బోజెస్, బ్రాన్సన్, ఎలన్ మస్క్ లు .. అంత‌రిక్షంపై ఈ స్థాయిలో దృష్టి సారించ‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది.

2030 వ‌ర‌క‌ల్లా ఈ స్పేస్ టూరిజం విలువ 300 కోట్ల డాల‌ర్లు అంటే సుమారు రూ.23 వేల కోట్లకు చేర‌నుంద‌ని అంచ‌నా. భూమి ఉప‌క‌క్ష్య‌లోకి ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్లే టూరిజం విలువ 2028 క‌ల్లా 280 కోట్ల డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని ఈ మ‌ధ్యే స్పేస్ ఇండ‌స్ట్రీ క‌న్స‌ల్టెన్సీ నార్త‌ర్న్ స్కై రీసెర్చ్ అంచ‌నా వేసింది. ఆ త‌ర్వాతి ప‌దేళ్ల‌లో ఈ టూరిజం నుంచి వెయ్యి కోట్ల డాల‌ర్ల ఆదాయం స‌మ‌కూరనుంద‌ని వెల్ల‌డించింది. ఇదే వ్యూహంతో భారత అంతరిక్ష సంస్థ సైతం అడుగులు వేస్తోందని అంచనాలు వినిపిస్తున్నాయి.

రానున్న కాలంలో స్పేస్ టూరిజం..మార్కెట్ అత్యంత వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే.. భారత్ సైతం ఇస్రోను ఆ దిశగా అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది. మరి ఇస్రో ఏమేరకు పట్టు సాధిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..



Must Read

spot_img