HomePoliticsఏపీ సీఎం జగన్ రూటు మార్చారా..?

ఏపీ సీఎం జగన్ రూటు మార్చారా..?

ఇప్పటివరకు సమీక్షలు ఓ ఎత్తు.. తాజా సమీక్ష మరో ఎత్తు అని విశ్లేషకులు అంటున్నారా..? ఇంతకీ సమీక్ష వేళ జగన్ వ్యూహం ఇప్పుడెందుకు చర్చనీయాంశమవుతోంది..?

ఎమ్మెల్యేల్లో విశ్వాసం పెంచేలాగా సీఎం జగన్ మాట్లాడారు, ఇటీవలి కాలంలో లేని విధంగా ఆత్మీయంగా పలకరించారని కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వారి మాటల్లో జగన్ లో స్పష్టమైన మార్పు కనిపించిందన్న అభిప్రాయం నేరుగానే కనిపిస్తోంది. అయితే ఆ మార్పు స్వతహాగా రాలేదని తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష జరగడానికి ఒక్క రోజు ముందు వరకూ జగన్ … గ్రాఫ్ పడిపోయిన ఎమ్మెల్యేల సంగతి తేల్చేయనున్నారన్న ప్రచారం జరిగింది. మంత్రివర్గాన్ని మార్చేస్తున్నారని చెప్పుకున్నారు. కానీ ఒక్కరోజు ముందు సీన్ మారిపోయింది. పేర్ని నాని .. అలాంటివేమీ ఉండవని.. ఇది రొటీన్‌గా జరిగే సమావేశం మాత్రమే అనిచెప్పడమే కాక .. మంత్రి వర్గ మార్పు చేర్పులు ఉండవని కూడా ప్రకటించారు. పై స్థాయి నుంచి అలా చెప్పారని, ఆయనకు సూచనలు రాకపోతే.. మీడియా ముందు అలా చెప్పే ధైర్యం పేర్ని నాని చేయరు. ఆయనకు కూడా ఎందుకింత హఠాత్తుగా మార్పు అనే సందేహం వచ్చే ఉంటుంది. సీఎం జగన్ కనీసం యాభై మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్ట్రెయిట్ ఫార్వాడ్ గా ఉన్నారు.

తన వెంట ఎంత కాలం నుంచి ఉన్నారు.. పార్టీకి ఎంత విధేయులు అన్నది తాను పట్టించుకోనని.. గెలుపు గుర్రాలు అనుకుంటేనే టిక్కెట్లు ఇస్తానని చెబుతున్నారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న రోజున తనను కలిసిన ఎమ్మెల్యేలతోనూ అదే చెప్పారని అంటున్నారు. అంత స్ట్రెయిట్ గా ఉన్న సీఎం .. ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షలో మాత్రం పూర్తిగా రివర్స్‌లో వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఎమ్మెల్యేను.. ఒక్క కార్యకర్తను కూడా వదులుకోనని, అందర్నీ గెలిపించుకుంటానని చెప్పారు. టిక్కెట్లు రావేమోనని ఆందోళన చెందుతున్న వారికి భరోసా ఇచ్చారు. తాను ఎలాంటి లిస్ట్ ప్రిపేర్ చేయలేదని.. సోషల్ మీడియాలో జరుగుతోందన్న దుష్ప్రచారం అని చెప్పారు. సీరియస్‌గా తీసుకుని ఆగస్టు వరకూ గడపగడపకూ నిర్వహించాలని సూచించారు. గతంలో గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష ఎప్పుడు జరిగినా గ్రాఫ్ తగ్గిన వారి పేర్లు నేరుగానే ప్రకటించేవారు.వారిని అక్కడే నిలదీసేవారు.

కానీ ఈసారి ఆయన గ్రాఫ్‌లు బయట పెట్టి నేరుగా కించపర్చడం.. నిలదీయడం వంటివి చేయలేదు. పైగా చాలా సాఫ్ట్ గా మాట్లాడారు. సీఎం జగన్‌లో వచ్చిన ఈ మార్పుకు కారణం ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న ఆందోళనేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కేబినెట్ మార్పులు చేయడం కూడా అంత మంచిది కాదన్న నిర్ణయానికి జగన్ వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తాము పదేళ్లుగా ఎన్నో అష్టకష్టాలు పడి జగన్ వెంట నడిస్తే అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రయోజనం లేకపోగా, ప్రత్యర్థులకు .. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి మెజార్టీ ఎమ్మెల్యేల్లో ఉందంటున్నారు. ఏడాది కిందట వరకూ సీఎం జగన్ ఏది చెబితే అది శాసనం. కానీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేసిన తర్వాత సీన్ మారిపోయింది. ఆయన పై ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాటలను కూడా వినిపించుకోలేదు. ఎమ్మెల్యేలపై సీఎం జగన్‌కు పూర్తి స్థాయి పట్టు ఉందని అనుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీని ధిక్కరించి ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడం అంటే చిన్న విషయం కాదు. అదీ కూడా ఏడాదిపైగా అధికారం ఉన్న సమయంలో. అధికార పార్టీకి విపక్ష సభ్యులు మద్దతిస్తే అందులో ఓ లాజిక్ ఉంటుంది.

కానీ పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు ఉన్నట్లుగా భావిస్తున్న జగన్ పార్టీలో ఇలా జరగడం మాత్రం ఆశ్చర్యమే కాదు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం జరగడమూ ఇబ్బందికరమే. వీరిలో పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి ఉంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇలాంటి వారిని కంట్రోల్ చేయడం కష్టమే. ప్రస్తుతం పదవుల్ని కోల్పోయే మంత్రులు కూడా అసహనానికి గురవుతారు. తమను పనికి రాని వాళ్లుగా తేల్చి తీసేస్తున్నారని వారు ఫీలయితే మొదటికే మోసం వస్తుంది. అందుకే సీఎం జగన్ కసరత్తు చేసి కూడా వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా సీఎం జగన్… ఎప్పట్లా స్ట్రాంగ్‌గా తాను అనుకున్న విధంగా వ్యవహరించలేకపోయారు. ఎమ్మెల్యేల ముందు కాస్త తగ్గి వ్యవహరించాల్సి వచ్చింది. దీన్ని అసంతృప్త ఎమ్మెల్యేలు అడ్వాంటేజ్‌గా తీసుకుంటే మాత్రం వైసీపీలో మరో రకమైన రాజకీయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే కాలంలో ఏంచేసినా చెల్లుబాటు అవుతుంది. అదే ప్రతికూలత ఎదురైనప్పుడు ఏ పనిచేసినా అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఆ సమయంలో నిలదొక్కుకుంటేనే మనకు మనం రాటుదేలగలం.

అయితే కలిసొచ్చిన కాలంలో విర్రవీగితే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కు అదే ఎదురైంది.

ఏకంగా పార్టీ ఎమ్మెల్యేలనే హెచ్చరించారు. మారకుంటే మార్చేస్తానని సంకేతాలిచ్చారు. గ్రాఫ్ పడిపోయిందంటూ వారిని చులకన చేసి మాట్లాడారు. ప్రజలు నన్ను చూసి ఓట్లు వేస్తారు తప్ప మిమ్నల్ని చూసి కాదంటూ హేళన చేశారు. జస్ట్ మీరు భగవంతుడికి, భక్తుడికి మధ్య పూజారి పాత్ర పోషించండంటూ సెలవిచ్చారు.

అయితే ఇదంతా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముందు. ఇప్పుడేమో పూర్తిగా సీన్ మారిపోయింది. ఏ ఎమ్మెల్యేను, కార్యకర్తనూ వదులుకోలేను. మరీ కాదు కూడదు తప్పదంటే, మార్పు అనివార్యమైతే ఎమ్మెల్సీతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తానని చెప్పుకొస్తున్నారు. నాటి హెచ్చరికలు బదులు బుజ్జగింపులకు దిగడం చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. రాజకీయం తెలిసిన వారు కావడంతో.. మనవాడికి భయం పట్టుకుంది అంటూ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవడం మొదలుపెట్టారు. టన్నుల్లో భయం కనిపిస్తోందని.. జగన్ ఆత్మరక్షణలో పడిపోయారంటూ ప్రత్యర్థులు ఒక అంచనాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వపరంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. మీ పనితీరుకు అదే కొలమానమని.. దాని ప్రాతిపదికగా తీసుకొని మార్కులు వేస్తానని తేల్చిచెప్పారు. వర్కుషాపు నిర్వహించి మదింపు చేస్తానని ప్రకటించారు.

అయితే గత డిసెంబరు 16న నిర్వహించిన వర్కుషాపులో 67 మంది ఎమ్మెల్యేలకు ఫెయిల్ మార్కులిచ్చారు. మరో అవకాశమిస్తున్నానని..మారండి అంటూ పేర్లు పెట్టి మరీ హెచ్చరించారు. ఫిబ్రవరి 13న మరో వర్క్ షాపు పెట్టారు. అందులో ఓ 64 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పారు. కానీ 30 మంది పేర్లు చదవి వినిపించారు. మారండని గట్టి హెచ్చరికలే పంపారు. ఇప్పుడు తాజా వర్కుషాపులో మాత్రం పేర్లు చదవడాలు, హెచ్చరికలకు కాస్తా మినహాయింపు ఇచ్చారు. బుజ్జగింపులకే అధిక సమయం కేటాయించారు. ఏది జరిగినా మన మంచికేనంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తెగ ఖుషీ అవుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తమకు రూట్ క్లీయర్ చేసిందని ఆనందపడుతున్నారు. ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షలో మాత్రం పూర్తిగా రివర్స్‌లో వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఎమ్మెల్యేను.. ఒక్క కార్యకర్తను కూడా వదులుకోనని అందర్నీ గెలిపించుకుంటానని చెప్పారు.

దీంతో జగన్‌లో భయం కనిపించిందని కొంత మంది ఎమ్మెల్యేలు సెటైర్లు వేసుకుంటున్నారు. భయం నుంచి పూర్తి విముక్తి అయినట్టు మాట్లాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ తేనె తుట్టను జగన్ కదిలించదలచుకోలేదు. ఇప్పటికే చేసిన మార్పులతో చేతులు కాల్చుకున్నారు. మళ్లీ అదే పనిచేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాస్తవాన్ని గుర్తించారు. గతంలోలా జగన్ ఏది చెబితే అదే రైట్ అనే పరిస్థితి మారడంతో .. పార్టీ అధినేతగా ఆలోచించి ఆయన రియలైజ్ అయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మరి జగన్ రివర్స్ టాక్ ప్లస్సా .. మైనస్సా అన్నదే హాట్ టాపిక్‌గా మారింది.

Must Read

spot_img