Homeజాతీయంహిమాచల్ ప్రదేశ్ లో జోషిమఠ్ .. పరిస్థితి .. ఇతర జిల్లాల్లోనూ తలెత్తనుందా..?

హిమాచల్ ప్రదేశ్ లో జోషిమఠ్ .. పరిస్థితి .. ఇతర జిల్లాల్లోనూ తలెత్తనుందా..?

భూ ప్రకంపనలతో జోషిమఠ్ తరహాలోనే పలు జిల్లాలు .. కుంగుబాటుకు గురి కానున్నాయా..? ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలే తీవ్ర సమస్యల్ని తెచ్చి పెడుతున్నాయా..?

జోషిమఠ్ పట్టణం బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారంగా ఉండగా.. అక్కడ నిర్మాణాలు పెరగడం, రోడ్డు విస్తరణ, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆ ప్రాంతాన్ని అస్థిరంగా మారుస్తున్నాయి. దీనికి తోడు హిమాలయాల నుంచి వచ్చే నదీ ప్రవాహాలతో నేల కోతకు గురవుతోంది. ప్రస్తుతం జోషిమఠ్‌లో ఉన్న పరిస్థితులు ఇక్కడికే పరిమితం కాదని, రానున్న రోజుల్లో నైనిటాల్, ఉత్తరకాశీలకు కూడా ప్రమాదం పొంచి
ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హిమాలయాల దిగువన ఉన్న అనేక పట్టణాలు కూడా నేలలో కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. భూమి స్వభావంతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో హిమాలయ పట్టణాల్లో విపరీతంగా ఇళ్ల నిర్మాణాలు పెరిగిపోయాయి.ప్రకృతి పరిణామాలు, వాతావరణం కూడా ఈ పట్టణాల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా అక్కడ బలహీనమైన భూమి కోతకు గురవుతోంది. ఈ ప్రాంతంలో భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉండడం,ఇండియన్ టెక్టానిక్‌ ప్లేట్, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్‌ను ప్రతీ ఏడాది ఒక సెంటీమీటర్ ముందుకు నెడుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

లక్షల ఏళ్ల క్రితం ఈ టెక్టానిక్ ప్లేట్ల యాక్టివిటీ కారణంగానే ఇప్పుడున్న హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోనే ఉత్తరాఖండ్ లోని పలు పట్టణాలు ఉన్నాయి. మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ కారణంగా భూమి అస్థిరంగా ఉంది. భూమి, ప్రకృతితో పోరాడి గెలవలేరని పలువురు జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రసిద్ధ వేసవి విడిది నైనిటాల్ కూడా జోషిమఠ్ లాగే ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పట్టణం కుమౌన్ లెస్సర్ హిమాలయాల్లో ఉంది. 2016 నివేదిక ప్రకారం ఈ పట్టణంలోని కొన్ని ప్రాంతాలు కొండచరియలు విరిగిపడిన శిథిలాలపై నిర్మితమై ఉంది.

నైనిటాల్ పట్టణం, షెల్, స్లేట్‌లతో కూడిన సున్నపురాయిని కలిగి ఉన్నాయి. ఈ రాళ్లు తక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు జోషిమఠ్‌లో మనం చూస్తున్నదే నైనిటాల్, ఉత్తరకాశీ, చంపావల్‌లో జరిగే ఆస్కారం ఉందని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ అండ్‌ గ్రాఫిక్ ఎరా హిల్ యూనివర్శిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఉత్తరాఖండ్‌ జోషీమఠ్‌ దృశ్యాలు ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో కూడా ఆవిష్కృతమవుతున్నాయి. మూడు గ్రామాల్లోని భూమి, ఇళ్లు కుంగిపోతున్నాయి.

మనాలీ హైవే పనుల్లో కొండల్ని పిండి చేయడం వల్లనే ఇళ్లు బీటలు వారుతున్నాయని అక్కడి వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కుంగిపోతుండటంతో ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. హిమాచల్‌లోని మండీ జిల్లాలో కూడా జోషిమఠ్ తరహా పరిస్థితి ఏర్పడింది. మండీ జిల్లాలోని 3 గ్రామాల భూములు, ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. మండీలోని ఆటో తహసీల్‌లోని థాలౌట్ పంచాయతీలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం కోసం లెక్కలేకుండా కొండరాళ్లను పగటగొట్టడం వల్ల భౌగోళిక పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడి ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి.

భూమి కూడా కుంగిపోవడంతో తహసీల్ ఆటోలోని తహులా ప్రాంతంలోని స్థానిక నివాసితుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మనాలీ హైవే ప్రాజెక్టుపనులు చేపట్టకపోయి ఉంటే బహుశా ఇంత ప్రమాదం ఉండేది కాదని ప్రజలు అంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తగు రీతిన చర్యలు తీసుకోని తమను ఆదుకోవాలని ఈ మూడు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మండీ జిల్లాలోని సెరాజ్ లోయలోని నగాని, థాలౌట్, ఫాగు అనే మూడు గ్రామాల్లో భూమి కుంగిపోయి కనిపించింది. జోషీమఠ్‌ మాదిరిగా ఇళ్ళలో పగుళ్లు రావడం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ మూడు గ్రామాల్లో కనీసం 32 ఇళ్లు, మూడు ఆలయాలకు ప్రమాదం పొంచి ఉంది. పలువురు భయంతో ఇళ్లను ఖాళీ చేసి ఇతర గ్రామాలకు వలస వెళ్లారు. ఇదిలా ఉండగా, 2018లోనే ఇలాంటి ప్రమాదం తలెత్తిందని, సర్వే కూడా నిర్వహించామని అధికారులు చెబుతున్నారు. 2018-19 నుంచి ఈ గ్రామాల్లో కొండలు విరిగిపడటంతో ఇళ్లకు పగుళ్లు వచ్చాయని, 10 గ్రామాల్లో చేసిన సర్వే నివేదిక అందాల్సి ఉందని అంటున్నారు.ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలోని హిమాయాల ఏటవాలు ప్రాంతంలో కట్టిన గ్రామం జోషి మఠ్ తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడటం కలవరపాటుకు గురి చేస్తోంది.

జోషిమఠ్ నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలాంగ్ గ్రామం పరిస్థితి కూడా దాదాపు జోషి మఠ్ లాగానే ఉంది. సెలాంగ్ గ్రామంలోనూ పలు ఇళ్లు, భూమిలో పగుళ్లు రావడం మొదలైంది. జోషిమఠ్ లోని పరిస్థితులను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా గ్రామంలో పగుళ్లు రావడం, కుంగిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిపై ఉన్న సెలాంగ్ గ్రామస్తులు జోషి మఠ్ తరువాత తమ ప్రాంతం అలాగే అవుతుందని తాము భయపడ్డామని చెప్పారు.

జోషిమఠ్ సంక్షోభం వారి భయాన్ని మరింత పెంచినట్లు కనిపిస్తోంది. తమ దుస్థితికి ఎన్‌టీపీసీ తపోవన్‌- విష్ణుగర్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టులే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన సొరంగాలు గ్రామం కింద నుంచి నిర్మించారని.. ఈ సొరంగాలలో ఒకదాని ముఖద్వారం సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఒక హోటల్ జూలై 2021లో కూలిపోయిందని తెలిపారు. దాని సమీపంలోని పెట్రోల్ పంపు కూడా పాక్షికంగా దెబ్బతింది. పగుళ్లు రావడంతో ఇప్పుడు దీని ప్రభావం ఇళ్లపై కనిపిస్తోంది.

సెలాంగ్ గ్రామం కింద ఎన్‌టీపీసీకి చెందిన తొమ్మిది సొరంగాలు నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. ఈ సొరంగాల నిర్మాణంలో చాలా పేలుడు పదార్థాలను సైతం ఉపయోగించారు. వీటి కారణంగా గ్రామంలో పునాదులు అంత గట్టిగా లేవు. గ్రామంలో సుమారు 15 ఇళ్లకు పగుళ్లు వచ్చాయని సమాచారం. గ్రామంలోని ప్రధాన నివాసానికి 100 మీటర్ల దిగువన డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కొన్ని మీటర్ల దూరంలో కూడా గ్రామం వైపు పగుళ్లు రావడం ప్రారంభించాయి.

ఇదిలాఉంటే భూమిలో ఏర్పడిన మార్పులతో వస్తున్న పగుళ్లతో జోషిమఠ్ లో మాత్రమే కాకుండా మరో ప్రాంతంలోనూ ఇళ్లకు పగుళ్లు, నేల నెర్రెలు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. జోషిమఠ్ ఉన్న చోమోలీ జిల్లాలోని కర్ణ ప్రయాగ్‌లోనూ ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. ఈ ప్రాంతం జోషిమఠ్‌కు 80 కిలో మీటర్ల దూరం ఉంది. ఇక్కడ 50 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఈ నగరంలో మొత్తం 50వేల మందికిపైగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని ఇళ్లకు పగుళ్లు రావడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జోషిమఠ్ తరహాలోనే ఇతర గ్రామాల్లోనూ ఈ సమస్య తలెత్తుతుందని, ప్రభుత్వ పరంగా స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నివిధాల చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

భూమి పొరల్లో సంభవిస్తున్న మార్పులే దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.భూమి కుంగిపోవడం వల్ల ఇప్పటివరకు దాదాపు 570 ఇండ్లకు పగుళ్లు వచ్చి కూలిపోయే స్థితికి చేరాయి. పగుళ్లు ఏర్పడినప్పుడల్లా ప్రజలే వాటిని పూడుస్తున్నారు. దాదాపుగా మూడు వేల మంది ప్రజలు ప్రాణాలకు తెగించి పగుళ్లు వచ్చిన ఇండ్లలోనే కాలం గడుపుతున్నారు. కొన్ని కుటుంబాలు జోషీమఠ్‌ను వదిలివెళ్తున్నాయి. మరికొందరిని అధికారులే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Must Read

spot_img