Homeజాతీయంతుపాకీ సంస్కృతి..వినడానికి విడ్డూరంగా ఉంది కదా.. !

తుపాకీ సంస్కృతి..వినడానికి విడ్డూరంగా ఉంది కదా.. !

అమెరికాలోని వర్జీనియా నగరంలోని ఒక ఎలిమెంటరీ స్కూల్‌లో ఆరేళ్ల కుర్రాడు చేసిన పనికి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఎంత విడ్డూరమైన విషయం అంటే తనకు చదువు చెప్పే లేడీ టీచర్ షటప్ అని గద్దించినందుకు వెంటనే జేబులోంచి పిస్లల్ తీసి ఫైర్ చేసాడు. అచ్చం వీడియో గేంలో కాల్చేసినట్టుగా ఫీలయ్యాడు. అంతే ఆ టీచర్ రక్తమోడుతూ కుప్పకూలిపోయింది. రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌ ఒకటో తరగతి గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే ఇక్కడ జరిగిన కాల్పుల్లో విద్యార్థులెవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. వార్తా సంస్థ ఏపీ చెబుతున్న దాని ప్రకారం 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఉపాధ్యాయురాలు కాల్పుల్లో గాయపడింది. అదృష్టవశాత్తూ, ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఆమె పరిస్థితిలో కొంత మెరుగుదల ఉందని అంటున్నారు. తరగతి గదిలో చిన్నారి చేతిలో తుపాకీ ఉందని పోలీసులు గుర్తించి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

కాల్పుల తర్వాత, ఫైరింగ్ జరిగిన తరగతి గదిలో గందరగోళం ఏర్పడి, పిల్లలు అందరూ ఏడుపు ప్రారంభించారు. న్యూపోర్ట్ న్యూస్ పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ మాట్లాడుతూ, 30 ఏళ్ల ఉపాధ్యాయురాలు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిందని, అయితే మధ్యాహ్నానికి ఆమె పరిస్థితిలో స్వల్ప మెరుగుదల కనిపించిందని అన్నారు.

అయితే ఈ షూటింగ్ సంఘటన ప్రమాదవశాత్తు జరగలేదని, విద్యార్థి, ఉపాధ్యాయురాలు ఒకరికొకరు తెలుసునని, ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని అన్నారు. దీంతో ఆరేళ్ల బుడతడు ఉపాధ్యాయురాలిపై నేరుగా కాల్పులు జరిపాడు. తరగతి గదిలోకి చిన్నారి ఆయుధాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. US పాఠశాలల్లో కాల్పుల ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి.

అమెరికాను కలవరపెడుతున్న గన్ కల్చర్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచానికి పెద్దన్న. అగ్రరాజ్యం అనే బిరుదు. అభివృద్ధి చెందిన దేశంగా ఖ్యాతి. ఇవన్నీ అమెరికా గొప్పదనాన్ని చాటి చెప్పేవే.

కానీ అక్కడి ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఉండలేరు. పని మీద బయటకు వెళ్లినా, విహార యాత్రలు చేసినా మళ్లీ ఇంటికి చేరేవరకు బిక్కుబిక్కుమంటూనే గడుపుతారు. ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారో తెలియక అనునిత్యం భయపడుతూనే ఉంటారు. అక్కడి గన్‌ కల్చర్‌ వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో వరుసగా అమెరికాలో కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

టెక్సాస్‌లోని ఉల్వేడ్‌లో ఓ ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థులపై ఓ 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరపటం సంచలనం స్రుష్టించింది. ఆ ఘటనలో మొత్తం 21 మంది చనిపోగా అందులో 19 మంది పిల్లలే. అంతకు ముందు షాపింగ్‌ మాల్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ మెడికల్ కాలేజ్‌లోనూ ఇదే తరహా ఘటన జరగ్గా..నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటికే అమెరికాలో గన్ కల్చర్ ను అరికట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.

కానీ అమెరికాలోని రెండు పార్టీల మధ్య నెలకొన్న రాజకీయాలు చట్టాలను కఠినంగా అమలుపరిచేలా చేయలేకపోతున్నాయి. నిజానికి 1775 నుంచే ఆయుధాలు అమెరికా సంస్కృతిలో భాగమైపోయాయి. తుపాకులతో ఆఫ్రికన్ అమెరికన్లను బానిసలుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో అమెరికన్లు తుపాకులు వినియోగించటం అప్పట్లో మొదలు పెట్టారు. రానురాను తుపాకి అనేది అమెరికా జాతి చిహ్నంగా మారిపోయింది. ఇక్కడే మరో అంశమూ ప్రస్తావించాలి.

1776లో ఇంగ్లాండ్‌తో పోరాటం చేసి స్వాతంత్య్రం సంపాదించుకుంది అమెరికా. ఆ సమయంలో అమెరికన్లు తమ భద్రత కోసం తుపాకులు పట్టుకుని తిరిగేవారు. అప్పటికి అది అవసరం..కానీ అది అలవాటుగా మారిపోయి “స్వీయరక్షణ” అనే కారణంతో ఇప్పటికీ చాలా మంది లైసెన్స్‌డ్ గన్స్ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇవి ఎంతగా పెరిగిపోయాయంటే..కేవలం రెండు దశాబ్దాల్లో అమెరికాలో సుమారు 20 కోట్ల తుపాకులు అమ్ముడైనట్టు అంచనా.

  • ప్రెస్టేజ్ సింబల్‌గా తుపాకి..

మొదట్లో భద్రత కోసం తుపాకి ఉంటే మంచిదని భావించిన అమెరికన్ల సంఖ్య కాస్త తక్కువగానే ఉండేది. రానురాను ఇది ప్రెస్టేజ్ సింబల్‌గా మారింది. చేతిలో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండటాన్ని హోదాగా భావించే ధోరణి పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొనుగోలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకునే వారి సంఖ్య పెరగటం వల్ల క్రమంగా గన్‌ కల్చర్‌ దారి తప్పింది.

ప్రస్తుతం అమెరికాలో గన్ కల్చర్ 2.0 నడుస్తోందని అంతా అంటున్నారు. జంతువులు, దొంగల నుంచి తమని తాము రక్షించుకోటానికి తుపాకులు వినియోగించటంలో తప్పేమీ లేదని అక్కడి రాజ్యాంగమే చెబుతోంది. కానీ చాలా సందర్భాల్లో ఇవి దుర్వినియోగమవుతున్నాయి. అందుకు వరసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. అమెరికా జనాభా 33 కోట్లు. కానీ అక్కడ ఉన్న తుపాకుల సంఖ్య మాత్రం 39 కోట్లని గణాంకాలు చెబుతున్నాయి.

అంటే ఏ స్థాయిలో ఇక్కడ తుపాకులు వినియోగిస్తున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. గన్ కల్చర్ వల్ల చెలరేగుతున్న హింసతో అగ్రరాజ్యానికి ఏటా దాదాపు 22 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా. ఇలాంటి ఘటనల్లో నష్టపోతున్న కుటుంబాలు మెడికల్ బిల్స్ కోసం ఏటా 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏమీ చేయటం లేదా అన్న అనుమానం రాక మానదు.

నిజానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం తుపాకుల వినియోగించటాన్నీ హక్కుగానే భావిస్తారు. అయితే అక్కడి సుప్రీం కోర్టు మాత్రం “స్వీయరక్షణ కోసం తుపాకులు ఇళ్లలోనే ఉంచుకోవాలి” అని అప్పట్లో వ్యాఖ్యానించింది. కానీ అక్కడి ప్రజలు బాహాటంగా వాటిని బయటకు తీసుకొస్తున్నారు. మరో సమస్య ఏంటంటే..తుపాకుల వినియోగానికి సంబంధించి రాష్ట్రాల వారీగా నియమ నిబంధనలు మారిపోతున్నాయి.

ఏ రాష్ట్రానికా రాష్ట్రం ప్రత్యేకంగా రూల్స్ తయారు చేసుకోవటం వల్ల గన్‌ కల్చర్‌ని నిర్మూలించటం సాధ్యం కావటం లేదు. 2020లో అమెరికాలో కాల్పుల కారణంగా 45 వేల 222 మంది మృతి చెందారు. ఆ ఏడాదిలో రోజుకు 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 2000-2020 మధ్య కాలంలోనే ఈ తరహా ఘటనలు పెరిగినట్టు ఎఫ్‌బీఐ వెల్లడించింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్-NRA ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గన్‌ లైసెన్స్‌లు అందిస్తారు.

ఈ ఎన్‌ఆర్ఏ కోసం కాంగ్రెస్ ప్రత్యేకంగా ఏటా 19 వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తుంది. ఎవ్రీ టౌన్ ఫర్ గన్‌ సేఫ్టీ సంస్థ గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ట్రంప్ హయాంలో తుపాకుల వినియోగానికి సంబంధించిన రూల్స్‌ని కఠినతరం చేయాలని భావించినా అవి ఆలోచనలకే పరిమితమయ్యాయి. గన్ కల్చర్ కు చెక్ పెట్టేలా అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కానీ అది ఎంత వరకు పనిచేస్తుందన్నది సందేహంగానే ఉంది.

ఇది పక్కా సినిమాటిక్ గా ఉందని విమర్షకులు చెబుతున్నారు. అదేమిటంటే.. కాల్పులకు తెగబడే నేరగాళ్లను శిక్షించేందుకు రోబో పోలీసులను ప్రవేశపెట్టబోతున్నారు శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు. రోజు రోజుకీ గన్ కల్చర్ తో విచ్చలవిడి కాల్పులకు పాల్పడుతున్న నిందితులకు చెక్ పెట్టేలా అగ్రరాజ్యం అమెరికా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేరగాళ్లను చంపటానికి రోబో పోలీసులను ఉపయోగించాలని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన ముసాయిదా ప్రణాళికను సిద్దం చేశారు. ఈ కొత్త పాలసీ ప్రతిపాదనపై శాన్ ఫ్రాన్సిస్కో బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్స్ రూల్స్ కమిటీ వచ్చే వారం చర్చించనుంది. ఇప్పటికే.. ముసాయిదా విధానాన్ని పర్యవేక్షకులు ఆరోన్ పెస్కిన్, రాఫెల్ మాండెల్‌మాన్ కమిటీలో సభ్యులుగా ఉన్న కొన్నీ చాన్ పరిశీలించారు. కానీ ఇదేమంత ప్రభావం చూపించదగిన పరిష్కారం కాదని పెదవి విరుస్తున్నారు విష్లేషకులు.

Must Read

spot_img