Homeజాతీయంగుడివాడలో కొడాలి వర్సెస్ వంగవీటి .. రచ్చ షురూ అయిందా..?

గుడివాడలో కొడాలి వర్సెస్ వంగవీటి .. రచ్చ షురూ అయిందా..?

రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో యాక్టివ్ రోల్ పోషించే చాలామంది నాయకులకు ప్రత్యర్థి పార్టీల్లో సైతం స్నేహితులు ఉంటారు. అటువంటి వారు పార్టీల తరుపునవినిపిస్తూనే.. తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. బంధుత్వాల విషయానికి వచ్చేసరికి కూడా అలానే కొనసాగుతున్న సందర్భాలు తెలుగు రాజకీయాల్లో కనిపిస్తుంటాయి. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణలు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.

నాడు వైసీపీ ఆవిర్భావం తరువాత తొలుత జగన్ వెంట రాధాకృష్ణ నడిచారు. తరువాత స్నేహితుడు నానిని వైసీపీలోకి తీసుకొచ్చారు. అయితే రాధా కంటే నానికే వైసీపీలో బాగా వర్కవుట్ అయ్యింది. రాధాను పొమ్మనలేక పొగ పెట్టేశారు. దీంతో ఆయన టీడీపీ గూటికి చేరిపోయారు. అయితే టీడీపీ అన్నా.. ఆ పార్టీ నాయకులు అన్నా ఇంత ఎత్తుకు ఎగసిపడే నాని రాధాకృష్ణ స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పటికీ మంచి స్నేహం వారి మధ్య ఉంది.

అయితే ఆ స్నేహాన్ని కొడాలి నాని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న టాక్ ఉంది. అయితే ఇక నుంచి అది కుదరకపోవచ్చన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఆ దిశగా స్కెచ్ వేశారని తెలుస్తోంది. గుడివాడలో కాపుల మెజార్టీ మద్దతు కొడాలి నాని దక్కించుకుంటున్నారు. దీనికి కారణం వంగవీటి రాధాతో ఉన్న స్నేహమే. గుడివాడలో కమ్మ సామాజికవర్గంతో పాటు కాపులు అధికం.

ఆ రెండు సామాజికవర్గాల మద్దతుతో కొడాలి నాని వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. అయితే కాపుల మద్దతు మాత్రం వంగవీటి రాధాకృష్ణ స్నేహం కారణంగా లభిస్తోంది. నియోజకవర్గంలోని కాపు సామాజికవర్గంలో ఏ చిన్నకార్యక్రమానికైనా రాధా అటెండ్ అవుతుంటారు. వివాహాలు, శుభకార్యాలకు వస్తుంటారు. అయితే రాధా వచ్చే సమయానికి నాని చేరిపోతుంటారు. ఆయనతో కలివిడిగా ఉంటారు. ఫ్రెండ్ షిప్ మాటున ముచ్చట్లు చెబుతుంటారు. వాటికే మీడియాకు లీకులిచ్చి స్నేహం అంటే ఇదేరా అన్న తరహాలో బిల్డప్ ఇస్తుంటారు. తన స్నేహాన్ని కొడాలి నాని వాడుకుంటున్నారని తెలిసినా రాధా హుందాగా వ్యవహరిస్తుంటారు.

గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి అనూహ్యంగా టీడీపీలో చేరిన రాధా ఆ పార్టీ క్యాంపయినర్ బాధ్యతలే తీసుకున్నారు. కోస్తాలోని నాలుగు జిల్లాల ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆ సమయంలో గుడివాడ నియోజకవర్గం జోలికి వెళ్లలేదు. దీనికి కొడాలి నానితో ఉన్న స్నేహం ఒక కారణమైతే.. అక్కడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలో ఉండడం మరో కారణం. అయితే ఈసారి మాత్రం వంగవీటి రాధాకృష్ణ గుడివాడలో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసే చాన్సే అధికం.

ఒకానొక దశలో రాధాయే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఎవరు దిగుతారన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఇన్ చార్జిగా ఉన్నారు. మరో ఎన్ఆర్ఐ ఒకరు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబసభ్యుల్లో ఒకర్ని బరిలో దింపే చాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ అందరి కంటే రావి వెంకటేశ్వరరావు పోటీచేసేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యన రావి వెంకటేశ్వరరావు తన అనుచరుతో వంగవీటి రాధాకృష్ణను కలుసుకుని, మద్దతును అభ్యర్థించారు.

మీతో ఉన్న స్నేహాన్ని కొడాలి నాని క్యాష్ చేసుకుంటున్నారని గుర్తుచేశారు. స్నేహం కొనసాగింపు అనేది వ్యక్తిగతంగా ఉన్నా.. పార్టీ అభ్యర్థిగా మాత్రం తనకు సహకరించాలని కోరారు. దీనికి రాధాకృష్ణ సైతం హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ బరిలో ఉండడం వల్లే కలుగజేసుకోలేదని.. ఈసారి పార్టీకి మద్దతిస్తానని రాధా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు సైతం రాధా ద్వారా కాపు
సామాజికవర్గాన్ని కొడాలి నాని నుంచి దూరం చేయాలన్న ప్లాన్ తో ఉన్నారు. దీంతో ఈసారి కొడాలి నానికి వంగవీటి రాధాకృష్ణ ఫ్రెండ్ షిప్ పెద్దగా వర్కవుట్ అయ్యే చాన్స్ లేదని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ కాపునేత, దివంగత వంగవీటి రంగా తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంగవీటి రాధాకృష్ణ..

ప్రస్తుతం టీడీపీలో ఉన్నా, తన పాత స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని వంటి వారిని వదులుకోలేదు. సందర్భానుసారంగా వారితో కలిసి ప్రైవేటు కార్యక్రమాలకు హాజరుకావడం, రహస్య భేటీలు నిర్వహించడం చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా గుడివాడలో వరుస పర్యటనలు చేస్తున్న రాధా ఇప్పుడు అక్కడి రాజకీయాల్ని కీలక మలుపు తిప్పేందుకు సిద్దమవుతున్నారు. గుడివాడ పాలిటిక్స్ గుడివాడలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన కొడాలి నానిని ఎలాగైనా ఓడించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాటు ఎన్నారై వెనిగండ్ల రామును ప్రోత్సహిస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే కొడాలికి వ్యతిరేకంగా జనంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే ఈ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని వంగవీటి రాధా ఈ మధ్య గుడివాడలోనే కనిపిస్తున్నారు. స్ధానిక కాపు నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. మధ్యలో తన పాత స్నేహితుల్ని సైతం కలుస్తున్నారు. ఇప్పుడు ఈ రాజకీయం క్లైమాక్స్ కు వచ్చేసింది. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వంగవీటి రాధా అక్కడ కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు. తన సొంత సామాజికవర్గం కాపుల్ని ఏకం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు.

అక్కడా వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చివరికి వారు బహిరంగంగానే రాధా సొంత పార్టీ టీడీపీని తిడుతున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై టీడీపీలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినా కాపు సామాజికవర్గంలో ఎదుగుతున్న రాధాను ఇప్పటికిప్పుడు దూరం చేసుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఇలాంటి నేపథ్యంలో గుడివాడలో టీడీపీ అభ్యర్ధిగా మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్న రావి వెంకటేశ్వరరావుతో వంగవీటి రాధా తాజా స్నేహం ఆసక్తి రేపుతోంది. గుడివాడలో వరుస పర్యటనలు చేస్తూ కాపు సామాజిక వర్గ నేతలతో భేటీలు నిర్వహించిన వంగవీటి రాధా చివరికి అక్కడి టీడీపీ ఇన్ ఛార్జ్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలుమార్లు రావితో భేటీ అయిన రాధా.. రాధా-రావి యూత్ ఏర్పాటుకు కారణమయ్యారు. దీంతో గుడివాడలో కొడాలికి ఎదురుగాలి తప్పదన్న టాక్ వెల్లువెత్తుతోంది. వచ్చే ఎన్నికల్లో కొడాలిని ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకున్న చంద్రబాబు .. అందుకు .. వంగవీటి రాథానే పావుగా ప్రయోగిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు ఈ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతోన్న రావి సైతం వంగవీటితో దోస్తీకి ముందడుగు వేయడం .. స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపుతుందని చర్చలు వినిపిస్తున్నాయి. దీంతో 2024 ఎన్నికల్లో కొడాలి ఓటమి తథ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తున్నారు. పార్టీ ఆదేశానుసారం .. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి వంగవీటి రాథా .. మద్ధతు లభించనుండడంతో, టీడీపీ గెలుపు సులువుని తెలుస్తోంది. మరోవైపు జనసేనతో పొత్తు సైతం కలిసిరానుందని అంచనా వేస్తున్నారు. దీంతో .. ఈదఫా కొడాలి నానికి గెలుపు .. లభిస్తుందా.. లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరి కొడాలి వర్సెస్ వంగవీటి ఎఫెక్ట్ తో .. గుడివాడలో గెలుపు ఎవరిది అన్నదే చర్చనీయాంశమవుతోంది.

Must Read

spot_img