Homeఅంతర్జాతీయంగ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి నడుం బిగించింది..

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి నడుం బిగించింది..

శిలాజ ఇంథనాల స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ .. కీలక ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. దీంతో భారత్ 2030 నాటికి ఐదు మిలియన్ల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి నడుం బిగించింది.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగపడుతుందని, దీన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కేంద్రం చెబుతోంది. మరి ఈ గ్రీన్ హైడ్రోజన్ తయారీ, ఉపయోగాలేమిటో..

మానవ ఆవిష్కరణల్లో అత్యుత్తమమైనదిగా చెప్పుకునే పెట్రోల్.. ప్రపంచ గతిరీతుల్ని అనూహ్యంగా మార్చేసింది. కానీ పెట్రోల్ కనుక్కున్న వందల ఏళ్ల తర్వాత కూడా దాని ప్రత్యామ్నాయం గురించి పెద్దగా ఆలోచనలు చెయ్యలేదు. అయితే ఇప్పుడు కాలుష్యం, ఇంధన ధరలు, ఇతర అంశాలు..మనల్ని ప్రత్యామ్నాయాల వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. శిలాజ ఇంధనాలకు బదులుగా ఏం వాడొచ్చనే ప్రశ్నకు సమాధానంగా కనిపిస్తోంది క్లీన్ హైడ్రోజన్.

భారత్‌ను గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చేందుకు 22వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2030 నాటికి కనీసం ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది పది మిలియన్ టన్నులకు చేరుకుంటే ఎగుమతులు కూడా చేయవచ్చు. 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడం ఈ మిషన్ లక్ష్యం.

గ్రీన్ హైడ్రోజన్ స్వచ్ఛమైన శక్తి. సోలార్ పవర్ వంటి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడం ద్వారా దీనిని ఉత్పత్తి చెయ్యవచ్చు. నీటి ద్వారా విద్యుత్‌ను పంపినప్పుడు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హైడ్రోజన్ అనేక సందర్భాలలో శక్తిగా పని చేస్తుంది. హైడ్రోజన్‌ను తయారు చేయడానికి ఉపయోగించే విద్యుత్తు పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా కాలుష్య రహితం.

అందుకే దీనిని గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు. చమురు శుద్ధి, ఎరువులు, ఉక్కు, సిమెంట్ వంటి కార్బన్ రహిత భారీ పరిశ్రమలకు ఇది సహాయపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ మిషన్ ద్వారా ఉత్పత్తి చేసే కర్బన రహిత హైడ్రోజన్‌ను వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు.

  • హైడ్రోజన్‌ను వెలికి తీయడానికి అనేక మార్గాలున్నాయి..!

ఆ విధానాన్ని బట్టి ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్‌ను గ్రే, బ్లూ లేదా గ్రీన్‌ హైడ్రోజన్‌గా వర్గీకరిస్తారు. WEC ప్రకారం 2019 నాటికి 96 శాతం హైడ్రోజన్‌ శిలాజ ఇంధనాల ద్వారా కార్బన్‌ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రక్రియ ద్వారా వచ్చే హైడ్రోజన్‌ను గ్రే హైడ్రోజన్‌ అంటారు. ఇతర విధానాలతో పోల్చితే ఈ ప్రక్రియ ఖర్చు తక్కువ. కానీ పెద్ద మొత్తంలో కార్బన్‌ డైయాక్సైడ్‌ విడుదలవుతుంది.

ఈ గ్రే హైడ్రోజన్‌ ఉత్పత్తి సమయంలో విడుదలయ్యే CO2ను కార్బన్‌ క్యాప్చర్‌ అండ్‌ స్టోరేజ్‌ (CCS) ప్రక్రియ ద్వారా బంధిస్తే.. గ్రే హైడ్రోజన్‌ బ్లూ హైడ్రోజన్‌ అవుతుంది. ఈ ప్రక్రియలో CO2 విడుదల తగ్గుతుంది. కానీ ఇది చాలా ఖరీదైనది. ఒకే ప్రక్రియ ద్వారా గ్రే, బ్లూ హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతాయి. బ్లూ హైడ్రోజన్‌ ఉత్పత్తిలో CO2ను వేరు చేయవచ్చు. కానీ ప్రభుత్వం గ్రీన్‌ హైడ్రోజన్‌పై దృష్టి సారించింది.

పరిశుభ్రమైన ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ ఇది. పునర్‌ ఉత్పాదక వనరుల నుంచి ఎలక్ట్రోలైసిస్‌ ప్రక్రియ ద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌ విడుదలవుతుంది. దీని ద్వారా C02 ఉద్గారాల విడుదల ఉండదు. కానీ ఇప్పటి వరకు ఇది వాణిజ్యపరంగా గిట్టుబాటు కాలేదు. 2050 నాటికి ఉద్గారాలను సున్నాకు తీసుకురావాలన్న ప్రపంచ దేశాల ప్రయత్నాల్లో ఇది కీలక భూమిక పోషిస్తుంది.

గ్రీన్ హైడ్రోజన్‌ ఉత్పత్తికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరిచేందుకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అయినప్పటికీ తరిగిపోతున్న పునర్‌ ఉత్పాదక వనరులు, పడిపోతున్న ఫ్యూయల్‌ సెల్‌ ధరలు, కఠినమైన వాతావరణ మార్పు అవసరాల రీత్యా ఇందులో పెట్టుబడులు వేగం పుంజుకున్నాయి.

2030 నాటికి 125 గిగా వాట్స్‌ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్‌ లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం కేటాయించిన 22వేల కోట్ల రూపాయల్లో ఎక్కువ భాగం అంటే. 17,490 కోట్ల రూపాయలు స్ట్రాటజిక్ ఇన్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్- సైట్ కోసమే ఖర్చు చేయనున్నారు. పైలట్‌ ప్రాజెక్టుల కోసం 1446 కోట్లు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు 400 కోట్లు, ఇతర విభాగాల కోసం 388 కోట్లరూపాయలు కేటాయించారు.

ప్రాజెక్టు అమలుకు సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ జారీ చేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, వీటి ద్వారా 6 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా. దీనివల్ల లక్ష కోట్ల రూపాయల విలువైన చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని, 50 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను అదుపు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

క్రూడ్ ధరలు బ్యారెల్‌కు $ 130.7 చేరుకున్న నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ దిశగా భారత్ యత్నాలు మరింతగా ముమ్మరమయ్యాయి. భారత్… తన ఉత్పత్తిని పెంచేందుకు, శిలాజ ఇంధనాలు, ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే యత్నాల్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ విధానానికి సంబంధించి తొలి దశను ప్రకటించింది.

రష్యా-ఉక్రెయిన్ వివాదం, పెరిగిన ఇంధన ధరలు తదితర పరిస్థితులు ‘ఇంధన భద్రత’అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ ఇంధన భద్రత, స్వయంసమృద్ధిని సాధించడానికి గ్రీన్ హైడ్రోజన్ విధానం మరింత తేలికగా రూపొందిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2021 డిసెంబరు వరకు తొమ్మిది నెలల్లో ముడిచమురు దిగుమతుల కోసం $ 82.4 బిలియన్లు చెల్లించింది.

  • కేంద్ర మద్ధతుతో భారత్ ..

కాగా… 2020 లో అదే కాలంలో చెల్లించిన $ 39.6 బిలియన్ల కంటే 108 శాతం పెరిగింది. దేశం ప్రస్తుతం దాని ముడిచమురులో సుమారు 80 శాతం మేర దిగుమతి చేసుకుంటోంది. సీఓ2 ఉద్గారాలను తగ్గించడం ద్వారా భారత్ కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని కూడా ఈ విధానం భావిస్తోంది. అయితే పాలసీ ఫ్రేంవర్క్‌ని విజయవంతంగా అమలు చేయడం లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం, గ్రీన్ హైడ్రోజన్ తయారీ ధర కిలోకు దాదాపు $ 6 వరకు ఉంటోంది. ఇది ఏ వాణిజ్య వినియోగానికీ సాధ్యపడదని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. గ్యాస్ క్రాకింగ్‌ను ఉపయోగించి హైడ్రోజన్‌ను తయారు చేయడంతో పోటీ పడాలంటే, దీనిని 50 శాతం కంటే ఎక్కువ $ 2-3 కిలోలకు తగ్గించాలని చెబుతున్నారు. సోలార్ ప్యానెల్స్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రోలైజర్స్, ఫ్యూయల్ సెల్స్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ మెగా-ప్రొడక్షన్ ఫెసిలిటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రానున్న దశాబ్ద కాలంలో… కిలో హైడ్రోజన్ ధరను ఒక డాలరుకే చేర్చాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యత్నిస్తోంది.

మరోవైపు కేంద్రం కొనుగోలుదారులు, ఉత్పత్తిదారులను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను అభివృద్ధి చేయనుంది. దేశంలో ఎలక్ట్రోలైజర్ తయారీకి కూడా ఐదేళ్లపాటు ప్రోత్సాహక మొత్తాన్ని అందజేయనుంది. ప్రధానమంత్రి గతి శక్తి యోజన కింద మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ మిషన్‌ను ఉపయోగించనున్నట్లు పేర్కొంది. హైడ్రోజన్ తయారీకి ప్రపంచ కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి
సారిస్తున్నామని ప్రధాని మోడీ సైతం ప్రకటించారు.

కేంద్ర మద్ధతుతో భారత్ .. ప్రపంచ హైడ్రోజన్ తయారీ కేంద్రంగా నిలవనుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Must Read

spot_img