Homeఅంతర్జాతీయంగ్రీన్ కామెట్ తోకచుక్క చరిత్ర? 

గ్రీన్ కామెట్ తోకచుక్క చరిత్ర? 

  • గ్రీన్ కామెట్ తోకచుక్క చరిత్ర ఏంటి…? ఈ తోకచుక్క ఎక్కడ కనిపిస్తుంది…?
  • గ్రీన్ కామెట్ కు ఆ పేరు ఎలా వచ్చింది..?
  • తోకచుక్కల అధ్యయనం ద్వారా విశ్వంలోని అనేక రహస్యాలను తెలుసుకోవచ్చా…?

గ్రీన్ కామెట్‌ గా పిలిచే తోకచుక్క ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 50 వేల సంవత్సరాల తర్వాత C/2022 E3 అనే ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వచ్చింది.ఇది అంతకు ముందు వచ్చినపుడు భూమిపై నియాండర్తల్‌లు నివసించేవారు. ఈ తోకచుక్క ఒక చుట్టు తిరిగి వచ్చేసరికి ఆధునిక మానవ జాతి అవతరించింది. అందుకే దీనిని చాలా మంది ప్రత్యేకంగా భావిస్తారు.అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా వివరణ ప్రకారం తోకచుక్కలు సౌర వ్యవస్థ అవశేషాల నుంచి ఏర్పడతాయి.ఇవి తరచుగా సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలలో కదులుతాయి.కక్ష్యలో సూర్యుడిని సమీపిస్తున్నప్పుడు వాటి తోకలు కనిపిస్తాయి. సూర్యుని వేడికి తోకచుక్కలోని మంచు కరిగిపోయి తోక ఏర్పడుతుంది.

2020లో ఉత్తర అర్ధగోళంలో చాలా చోట్ల కనిపించిన నియోవైజ్ కామెట్ తోకను కంటితో చూడగలిగారు.కొన్ని తోకచుక్కలు చిన్న కక్ష్యలను కలిగి ఉంటాయి.. మరికొన్ని చాలా పెద్దవిగా ఉంటాయి. అవి సూర్యుని చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయడానికి వేల సంవత్సరాలు పడుతుంది.ఇలాంటి తోకచుక్కలను ‘లాంగ్ పీరియడ్ తోకచుక్కలు’ అంటారు.’లాంగ్ పీరియడ్ తోకచుక్కలు’ సూర్యుని చుట్టూ 306 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచు మేఘం నుంచి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సూర్యుని చుట్టూ ఉండే ఈ మేఘం మంచుతో నిండిన శకలాలతో తయారైన మాంటిల్ లేదా షెల్. దీనిని ఊర్ట్ క్లౌడ్ అని పిలుస్తారు.తోకచుక్క C/2022 E3 కూడా ఈ ఊర్ట్ క్లౌడ్‌లోనే పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.గ్రీన్ కామెట్ ను 2022 మార్చిలో గుర్తించారు. అంటే ఇది గురు గ్రహాన్ని చేరుకునే వరకు గమనించలేదు.ఈ తోకచుక్క శాస్త్రీయ నామం C/2022 E3. దీనికి మరో పేరు లేదు, కానీ దాని ఆకుపచ్చ రంగు కారణంగా గ్రీన్ కామెట్ అని పిలుస్తున్నారు.ఈ తోకచుక్కలో డయాటోమిక్ కార్బన్ ఎక్కువగా ఉంటుంది. సూర్యుని అతినీల లోహిత కిరణాల వల్ల ఈ మూలకం ఆకుపచ్చని కాంతిని ప్రతిబింబిస్తుందని, అందుకే ఆ తోకచుక్క ఆకుపచ్చగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

2023 జనవరిలో సూర్యుడిని సమీపిస్తున్న ఈ తోకచుక్క ఫొటోను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ విడుదల చేసింది.. ఇది లద్ధాఖ్‌లోని హన్లే గ్రామం నుంచి హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ద్వారా తీసిన ఫొటోల సెట్. ఈ తోకచుక్క ఆకుపచ్చ రంగులో ఉన్నట్లు కనిపిస్తుంది.ఫిబ్రవరి 2న ఈ తోకచుక్క భూమికి అత్యంత సమీపంలో ఉంటుందని, ఫిబ్రవరి 10 నుంచి 12 మధ్య అంగారక గ్రహానికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అందువల్ల దీనిని ఉత్తరార్ధ గోళం నుంచి చూడవచ్చు.

“ఈ తోకచుక్క భూమి నుంచి దాదాపు 4.2 కోట్ల కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ఇది సూర్యుని నుంచి బుధుడికి మధ్య గల దూరానికి సమానమైంది.ప్రస్తుతం ఇది ఉత్తర హోరైజాన్ దగ్గర రాత్రి 10 గంటల ప్రాంతంలో డెవలప్ అవుతోంది. 11-12 గంటల పాటు కనిపిస్తుంది. మీరు ఈ తోకచుక్కను బైనాక్యులర్‌ ద్వారా చూడవచ్చు.” అని ముంబైలోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ అరవింద్ పరంజిపే అన్నారు.

కానీ… ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే ఈ తోకచుక్కను తమ కంటితో చూడగలిగారని, ఇది అనుకున్నంత ప్రకాశవంతంగా లేకపోవడమే కారణమని పరంజిపే వెల్లడించారు..తోకచుక్కలు పిల్లుల లాంటివని శాస్త్రవేత్తలు చెబుతారు. అవి ఎలా ప్రవర్తిస్తాయో మీకు తెలియదు. నగరంలో కాంతి కాలుష్యం కారణంగా ఈ తోకచుక్కను చూసే అవకాశం లేదు. అయితే చీకటి ప్రదేశంలో నివసిస్తుంటే చూడటానికి ప్రయత్నించవచ్చు.” అని పరంజిపే తెలిపారు..

తోకచుక్కలు మన సౌర వ్యవస్థ ప్రారంభం నుంచి ఉన్నాయి. తోకచుక్కల అధ్యయనం ద్వారా సౌర వ్యవస్థ ఏర్పడటానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. విశ్వంలోని అనేక రహస్యాలు దాని నుంచి తెలుసుకోవచ్చు. తోకచుక్కల తోక అవశేషాలు కొన్నిసార్లు విడుదలవుతాయి. భూమి ఈ అవశేషాల గుండా వెళుతున్నప్పుడు ఒక ఉల్కాపాతం కనిపిస్తుంది.

తోకచుక్క గ్రహాన్ని లేదా భూమిని ఢీకొంటుందా అనే సమాచారాన్ని కూడా కామెట్ కక్ష్య అధ్యయనం అందిస్తుంది. అందుకే తోకచుక్కలపై అధ్యయనం అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.6.5 మిలియన్ సంవత్సరాల కిందట మెక్సికోలోని చిక్సులబ్ ప్రాంతంలో ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలైంది. అది సృష్టించిన పెద్ద బిలం ఇప్పటికీ ఉనికిలో ఉంది. ఒక సిద్ధాంతం ప్రకారం ఈ పేలుడు డైనోసార్ల అంతానికి దారితీసింది. దీన్నిభూమిపై పడిన రాక్షస శిల ఉల్క లేదా తోకచుక్క అని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

కొందరైతే తోకచుక్కల కారణంగానే నీరు భూమికి చేరుకుందని, తరువాత దాని నుంచి జీవం పుట్టిందని అంటుంటారు.. వార్తల్లో నిలిచిన తోకచుక్కలు హేలీ తోకచుక్క… ప్రతి 76 సంవత్సరాలకు వస్తున్న ఈ తోకచుక్క మానవ చరిత్రలో అనేక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. ఇది కంటికి కనిపిస్తుంది. షూమేకర్-లెవీ.. 1994 జూలైలో ఈ తోకచుక్క గురుగ్రహాన్ని ఢీకొట్టింది. అనంతరం ధ్వంసమైంది. హెలీ-బాప్… 1997లో ఈ తోకచుక్క ఎక్కువగా వార్తల్లో నిలిచింది.టెంపుల్ – టటిల్… ఈ తోకచుక్క భారీగా శిథిలాలు వదిలిపెడుతోంది. ప్రతి 33 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేస్తుంది. ఈ తోకచుక్క కారణంగా ప్రతి నవంబర్‌ లో భూమిపై ఉల్కల వర్షం కురుస్తుంది.

గ్రీన్ కామెట్‌ గా పిలిచే తోకచుక్క ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 50 వేల సంవత్సరాల తర్వాత ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వచ్చింది. తోకచుక్కులపై అధ్యయనం అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు..

Must Read

spot_img