చైనా తన మిలటరీ బలోపేతంపై దృష్టి సారించిందా…?
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక ఆదేశాలిచ్చారు. దేశ సైన్యాన్ని నవీకరించుకోవాలంటూ పిలుపునిచ్చారు. గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్ లా శక్తిమంతం అవ్వాలని అన్నారు. అమెరికాతో వివాదం ముదురుతున్న నేపథ్యంలో జిన్ పింగ్ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ పరంగా దేశం పవర్ ఫుల్ అవ్వాలని తేల్చి చెప్పారు జిన్‌పింగ్. పార్లమెంట్ సమావేశాల ముగింపు సమయంలో మాట్లాడిన జిన్ పింగ్… మిలిటరీని నవీకరించుకోవాలంటూ ఆదేశాలిచ్చారు. జాతీయ భద్రతకు, పౌరుల రక్షణకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని వెల్లడించారు. దేశ భద్రతే అభివృద్ధికి కీలకమని అన్నారు. దశాబ్ద కాలం తరువాత కేబినెట్‌లో చాలా మార్పులు చేశారు జిన్‌పింగ్. సెక్యూరిటీ విభాగంలోని ప్రస్తుత అధికారులను తొలగించి… తనకు సన్నిహితంగా ఉండే వాళ్లను నియమించారు. సైన్స్ అండ్టె క్నాలజీ విషయంలోనూ చైనా నంబర్ వన్‌గా నిలవాలని లక్ష్యం నిర్దేశించారు. సెల్ఫ్ రిలయెన్స్‌తో దూసుకుపోవాలని తేల్చి చెప్పారు. చైనా నుంచి వచ్చే చిప్‌లపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తైవాన్ అంశాన్నీ ప్రస్తావించిన జిన్ పింగ్…అంతర్గత వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేసుకోవడాన్ని కచ్చితంగా వ్యతిరేకించాల్సిందేనని అన్నారు.దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం తమ బలగాలను ‘గ్రేట్ వాట్ ఆఫ్ స్టీల్’ గా తీర్చిదిద్దుతామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రకటించారు. అంతర్జాతీయ వ్యవహారాలతో పాటు ప్రపంచ పాలనా వ్యవస్థ సంస్కరణలు, అభివృద్ధిలో తమ దేశం క్రియాశీల పాత్ర పోషిస్తోందని అన్నారు. తన నేతృత్వంలోని పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నాయకత్వాన్ని నిలబెట్టాలని దేశానికి పిలుపు నిచ్చారు. 2050 నాటికి చైనాను ఒక గొప్ప ఆధునిక సామ్యవాద దేశంగా నిర్మించేందుకు గాను.. జాతీయ పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉందని దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పారు జిన్ పింగ్..
చైనా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికయ్యారు జిన్‌పింగ్. అప్పటి నుంచి ప్రభుత్వంలో మార్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే లీ జియాంగ్ కు ప్రధాని పదవి అప్పగించింది చైనా. ఝెజియాంగ్‌కు గవర్నర్‌గా, షాంఘైలో పార్టీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన లీ జియాంగ్… అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయనకు ప్రధాని పదవి కట్టబెట్టారు. గతేడాది అక్టోబర్‌లో వారం రోజుల పాటు పార్టీ సమావేశం జరిగింది. అప్పుడే లీ జియాంగ్‌కు ప్రధాని పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. దాదాపు పదేళ్లుగా లీ కెకియాంగ్ ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పుడాయనను పక్కన పెట్టి తన
సన్నిహితుడికి నెంబర్.2 ఛైర్‌ను కేటాయించారు జిన్‌పింగ్. మరోవైపు.. యుఎస్‌పై ఎక్కువ ఆధాపడకుండా ఉండేలా.. R&D వ్యయాన్ని 2023లో 328 బిలియన్ యువాన్లకు పెంచాలని చైనా ప్రభుత్వం ప్రతిపాదించింది.
దేశ సైన్యాన్ని నవీకరించుకోవాలని జిన్ పింగ్ ఆదేశాలు జారీ చేయడం వెనక ఉన్న వ్యూహం ఏంటి…?
జిన్‌పింగ్ ఇప్పటికే రికార్డు సృష్టించారు. మావో జెడాంగ్ రెండు సార్లు చైనాకు అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించగా…ఆ రికార్డుని బద్దలుకొట్టి మూడోసారి ఆ పదవిని చేపట్టారు. మరో ఐదేళ్ల పాటు జిన్పిం గ్ కే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ… చైనా పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిన్ పింగ్ ఎన్నికకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఎన్నికతో చైనాకు ఇకపై జీవిత కాల అధ్యక్షుడిగా కొనసాగనున్నారు జిన్‌పింగ్.
గతేడాది అక్టోబర్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు జరిగాయి. అప్పుడే పార్టీ రాజ్యాంగంలో సవరణలు కూడా చేశారు. ఇదంతా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మూడోసారీ అదే పదవిలో కొనసాగేలా చేసేందుకే. నిజానికి…ఆ వారం రోజుల కాంగ్రెస్ ఉద్దేశం కూడా అదే. జిన్‌పింగ్‌కు మరికొన్ని అధికారాలు కట్టబెట్టి… ఆయననే మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగించేలా తీర్మానం చేస్తారని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే సెంట్రల్ కమిటీలోని 370 మంది సీనియర్ లీడర్స్ కొన్ని కీలక తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ రాజ్యాంగంలోనూ సవరణలు చేశారు. జిన్‌పింగ్‌కి సర్వాధికారాలు కట్టబెట్టే సవరణలు ఇవి.
ముందస్తు వ్యూహంలో బాగంగానే డ్రాగన్ కంట్రీ చైనా.. రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచింది. ఈ ఏడాది 1.55 ట్రిలియన్ యువాన్ల ను కేటాయించేందుకు సిద్దమైంది. సైనిక వ్యయాన్ని పెంచడం వరుసగా ఇది ఎనిమిదోసారి. గతేడాది రక్షణ బడ్జెట్‌కు 1.45 ట్రిలియన్స్ యువాన్లు కేటాయించింది. ఈ ఏడాది వ్యయాన్ని 1.55 ట్రిలియన్ యువాన్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే 7.1శాతం పెరుగుదల నమోదైంది. అయితే, యువాన్ తో పోలిస్తే డాలర్ విలువ పెరిగిన దృష్ట్యా… డ్రాగన్ దేశం ఈ ఏడాది రక్షణ వ్యయాన్ని 224 బిలియన్ డాలర్లకు పెంచినట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే, చైనా ఆర్థిక వృద్ధిరేటు కంటే రక్షణ రంగం బడ్జెట్ అధికంగా ఉండడం విస్మయానికి గురిచేస్తోంది.. 2027 పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లక్ష్యాలపై దృష్టి సారించిన చైనా.. సాయుధ దళాలు, సైనిక కార్యకలాపాలను నిర్వహించేందుకు, సంసిద్ధతను పెంచేందుకు, సైనిక సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పని చేయాలని నిర్ణయించింది.. సాయుధ దళాలు బోర్డు అంతటా సైనిక శిక్షణ, సంసిద్ధతను తీవ్రతరం చేయాలని, కొత్త సైనిక వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అభివృద్ధి చేయాలని, పోరాట పరిస్థితులలో శిక్షణ కోసం ఎక్కువ శక్తిని వెచ్చించాలని భావిస్తోంది..
తమదేశ సైన్యాన్ని గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్లా శక్తివంతంగా తయారు చేసేందుకు జిన్ పింగ్ ప్రణాళికను రచించారా..?
అమెరికా తర్వాత రక్షణ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న రెండో దేశంగా చైనా నిలిచింది. 2023లో అమెరికా రక్షణ రంగానికి 816 బిలియన్లు కేటాయించగా.. చైనా 224 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నది. భారతదేశాని కంటే దాదాపు మూడు రెట్లు రక్షణకు చైనా నిధులు కేటాయిస్తోంది.. ఎప్పటికప్పుడు బడ్జెట్‌ను పెంచుకుంటూ వస్తున్న చైనా.. ప్రపంచంలోనే అత్యధికంగా సైనికులు కలిగిన దేశంగా నిలిచింది. దాదాపు రెండు మిలియన్ల పీఎల్‌ఏ, ఆర్మీ, నేవీ, వైమానిక దళ బలగాలున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు విస్తరించడంతో పాటు ఆధునికీకరిస్తూ శక్తివంతమైన దేశంగా నిలుస్తున్నది. పీపుల్స్ లిబరేషన్ హైకమాండ్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ నాయకత్వం వహిస్తున్నారు. జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా సైన్యం రాబోయే కొద్ది సంవత్సరాల్లో అమెరికా సాయుధ దళాలతో సమానంగా ఉండాలనే లక్ష్యంతో భారీగా సైనిక ఆధునికీకరణను ప్రారంభించింది. తాజాగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్ పింగ్ మిలిటరీని నవీకరించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడం ఇందులో భాగమే.. అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాను ఢీ కొట్టేందుకు తగిన శక్తి సామర్ధ్యాలతో కూడిన సైన్యాన్ని తయారుచేసుకునే పనిలో నిమగ్నమైంది చైనా..
చైనాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి అధ్యక్షుడు జిన్ పింగ్ చర్యలు వేగవంతం చేశాడు. దేశ సైన్యాన్ని నవీకరించుకోవాలంటూ పిలుపునిచ్చిన్ జిన్ పింగ్…గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్ లా శక్తిమంతం అవ్వాలని సూచించడం హాట్ టాపిక్ గా మారింది..