Homeతెలంగాణసుప్రీంకోర్టు ను తాకిన గవర్నర్ VS గవర్నమెంట్ హవా..

సుప్రీంకోర్టు ను తాకిన గవర్నర్ VS గవర్నమెంట్ హవా..

  • తెలంగాణలో ప్రగతి భవన్ కు, రాజ్ భవన్ కు టగ్ ఆఫ్ వార్..మళ్లీ షురూ అయిందా..?
  • ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైన..ఈ పోరు..ఇప్పుడు సుప్రీం దగ్గరకు చేరిందా..?
  • ఇంతకీ..ఈ అంశంపై టీ సర్కార్ చెబుతున్నదేమిటి..?

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు పూర్తి స్థాయిలో సామరస్యంగా మారలేదని మరోసారి స్పష్టమైంది. అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లులపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై గతంలో తెలంగాణ మంత్రులు విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. గవర్నర్ బిల్లులను ఆమోదించడంలేదని.. వెంటనే నిర్ణయం తీసుకునేలా గవర్నర్ ను ఆదేశించాలని కోరింది. మొత్తం పది బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.

గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క బిల్లును మాత్రమే ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ తమిళి సై మరో మూడు బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పది బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బడ్జెట్‌ సమావేశాల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టుకెు వెళ్లింది.

హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది, రాజ్‌భవన్‌ తరఫున న్యాయవాది చర్చలు జరిపారు. ఇరువురి మధ్య సఖ్యత కుదరడంతో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు ఇక కొలిక్కి వచ్చినట్లేనని, కొన్నినెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులకు కూడా ఆమోద ముద్ర పడుతుందని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటికీ గవర్నర్‌ ఆమోదం తెలుపలేదు. పైగా మరో మూడు బిల్లులపైనా నిర్ణయం తీసుకోలేదు.

విశ్వవిద్యాలయాల్లో నియామకాల కోసం తెచ్చిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు బిల్లు, సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ తెచ్చిన బిల్లు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ ఇలా ఏడు బిల్లులను ప్రభుత్వం తెచ్చింది.

తాజాగా ఉభయ సభలు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులు ఆమోదం తెలిపాయి. వీటికి గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. బడ్జెట్‌కు సంబంధించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. గత సమావేశాల్లోని 7, తాజాగా 3 కలిపి మొత్తం పది బిల్లులపై గవర్నర్‌ ఆమోదించలేదు. వీటి కోసం సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ వెళ్లింది. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. రాష్ట్ర క్యాబినెట్‌ సిఫార్సు చేసిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను న్యాయసలహా మేరకే నిర్వహిస్తానని గవర్నర్ మంకుపట్టు పట్టారు.

దీనిపై పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్‌ రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని స్పష్టం చేసింది. క్యాబినెట్‌ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సిఫారసు చేసినప్పుడు.. గవర్నర్‌ దానికి కట్టుబడి ఉండాలని క్యాబినెట్‌ సలహాలను స్పష్టంగా పాటించాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం చురుకుగా ఆలోచించి.. వెంటనే తెలంగాణ గవర్నర్ వ్యవహారశైలి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని.. పిటిషన్ వేసింది. పంజాబ్ గవర్నర్ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దాఖలైన పిటిషన్‌లో విచారణలో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలు వినిపించడం ఆలస్యం కేసీఆర్ వెంటనే స్పందించారు.

ఇబ్బంది పెడుతున్న గవర్నర్ తమిళిసైను సుప్రీంకోర్టుకు లాక్కెళ్లిపోతున్నారు. గవర్నర్ తమిళిసైను ప్రతివాదిగా చేర్చి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు మొత్తం పది రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉన్నాయని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయడం లేదని.. తెలంగాణ సర్కార్ ఆరోపణ. ఈ విషయంలో గవర్నర్ కు తక్షణం ఆదేశాలివ్వాలని తెలంగాణ సర్కార్ కోరుతోంది. ఇటీవల బడ్జెట్ సమవేశాలకు ముందు బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టుకెు వెళ్లింది.

చివరికి తానే వెనక్కి తగ్గి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. ప్రసంగంలోనూ ఎలాంటి వివాదం ఏర్పడకపోవడంతో ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు ఇక కొలిక్కి వచ్చినట్లేనని అనుకున్నారు. కానీ తమిళిసై మాత్రం బిల్లులను ఇంకా ఆమోదించలేదు.

  • ఈ పెండింగ్ బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో..?

ముందస్తు ఆలోచనలతో ఎంతో కీలకమైన బిల్లులు అందులో ఉన్నాయని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఆమోదం కోసం చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు విషయం చేరింది. సాధారణంగా బిల్లుల ఆమోదం అనంతరం మరుసటి రోజున నిబంధనల మేరకు రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్‌ వాటిని పరిశీలించి ఆమోదించాక..గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. అప్పుడు అవి చట్టరూపం పొంది అమల్లోకి వస్తాయి. సాధారణంగా వారం, పది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్‌ ఆమోదం లభించింది.

మిగిలిన బిల్లులకు ఆమె నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఈ ఫైల్స్ అన్ని ప్రస్తుతం రాజ్ భవన్ పెండింగ్ లోనే ఉన్నాయి. రాజ్‌భవన్‌లో పెండింగులో ఉన్న బిల్లుల్లో కీలకమైనది వర్శిటీల్లో నియమాకాలకు సంబంధించనది. 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం..ఉమ్మడి నియామక బోర్డు ద్వారా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదముద్ర వేస్తే, సంబంధిత ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది.

అయితే అనూహ్యంగా గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయలేదు. పైగా ఈ బిల్లుకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని, క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రికి లేఖ రాశారు. ఈ పరిణామాలపై అధికార బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. కీలకమైన నియమాకాలకు సంబంధించిన బిల్లును ఆపడమేంటని ప్రశ్నిస్తోంది. కావాలనే గవర్నర్ ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే వీటిపై గవర్నర్ కూడా స్పందించారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒక్కో బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికీ ఆ బిల్లుల సంగతి అలాగే ఉంది. ఈ విషయంలో గవర్నర్ వ్యవహరిస్తోన్న తీరుపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా పెండింగ్ బిల్లుల అంశంతోనే అటు రాజ్ భవన్ కు ఇటు ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరిగింది.

ఇక అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగంతో దూరం తగ్గిందనుకున్న క్రమంలో ప్రభుత్వం పెండింగ్ బిల్లుల అంశాన్ని లేవనెత్తి సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. అయితే గతంలో పెండింగ్ బిల్లులపై గవర్నర్ స్పందించారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఒక్కో బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు.

మరి ఈ పెండింగ్ బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే..

Must Read

spot_img